తొట్టతొలి ఆంధ్ర పాలకులుగా చెప్పబడే శాతవాహనుల కాలం వాణిజ్యానికి
మాత్రమే కాదు, సాహిత్యానికీ స్వర్ణ యుగమే. ప్రాకృత భాషలో రెండు ప్రసిద్ధ
కావ్యాలు 'బృహత్కథ' 'గాథా సప్తశతి' వీరికాలంలో వెలుగు చూసినవే. హాల
చక్రవర్తి పేరుమీద చలామణిలో ఉన్న 'గాథా సప్తశతి' సుమారు మూడువందల మంది
కవులూ, కవయిత్రులూ రాసిన గాథల సంకలనం అంటున్నారు పరిశోధకులు. తెలుగుతో
పాటు, సంస్కృతం, ప్రాకృతం, ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో పండితులైన
మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఎంపిక చేసిన నూరు గాథలతో రూపొందించిన
సంకలనమే 'ప్రాచీనాంధ్ర గాథలు.'
భాషా చరిత్రల అధ్యయనానికి
తన జీవితాన్ని అంకితం చేసి, తనని తాను భాషా సేవకునిగా అభివర్ణించుకున్న
రామచంద్ర శతజయంతిని పురస్కరించుకుని, రెండేళ్ళ క్రితం ఈ 'ప్రాచీనాంధ్ర గాథలు' పుస్తకాన్ని ప్రచురించింది ఎమెస్కో సంస్థ.
అడవి బాపిరాజు 'హిమబిందు' నవలద్వారా పరిచయమైన శాతవాహనుల కాలానికి
సంబంధించిన మరో పార్శ్వాన్ని చూపించే గాథలివి. బాపిరాజు నవల రాచరికాన్ని
గురించి ఎక్కువగా చెబుతూ సామాన్యులని రేఖామాత్రంగా ప్రస్తావిస్తే, ఈ గాథలు
కేవలం జానపదుల జీవితాలని మాత్రమే కళ్ళముందు ఉంచుతాయి. ఎందుకంటే ఈ గాథలకి
ఆద్యులైన అజ్ఞాత కవులూ, కవయిత్రులందరూ జానపదులే.
ప్రేమ, విరహం ప్రధానాంశాలుగా కనిపించే ఈ గాథలలో
గ్రామీణ జీవితపు అమాయకత్వం, చిలిపిదనం, ఆనాటి సంఘపు కట్టుబాట్లు, ఎవరేం
అంటారో అన్న బెరుకూ స్పష్టంగా కనిపిస్తాయి. అధికభాగం గాథలు విరహంతో ఉన్న
స్త్రీ, పురుషులు రాసినవే. కలిసి గడిపిన సమయాన్నీ, ఏకాంతపు ఘడియలనీ గుర్తు చేసుకున్నవి కావడంవల్ల శృంగారం పాళ్ళు ఎక్కువ. ప్రేయసీ ప్రియుల మధ్య జరిగే సరస సంభాషణలు,
పడకింటి కబుర్లు బాగానే దొర్లాయీ గాథల్లో. దేశాంతరం వెళ్లిన భర్తలు తమ
భార్యలని తలచుకొంటూ చేసే తిరుగు ప్రయాణాలు, భర్తల కోసం ఇళ్ళ దగ్గర భార్యల
నిరీక్షణ చుట్టూ అల్లుకున్న గాథలివి.
'గాథా సప్తశతి' ని
సంకలనం చేసిన హాల చక్రవర్తి కాలమైన క్రీస్తుశకం 25-30 సంవత్సరాల్లోకి
పాఠకులని అలవోకగా తీసుకుపోయే ఈ గాథల్లో శ్రీకృష్ణుడు మినహా మిగిలిన పురాణ
పాత్రలేవీ కనిపించవు. చదువుతుంటే ప్రధానంగా ఆకర్షించేవి వర్ణనలు, పోలికలు.
'నిజంగా మగువలు మరువమూ, దవనమూ వంటివారు. ఆపాదమస్తకమూ అందమే. ఏం చేసినా
చూడాలనిపిస్తుంది' తో మొదలు పెట్టి, 'ఈ ప్రేమలనేవి దోసతీగ లేత కొడులలాగ
చాలా సున్నితమైనవి. పక్కన ఉన్నవాటిని పెనవేసుకుంటాయి. వాటిని గట్టిగా
పట్టుకుని లాగామా పుటుక్కున విరిగిపోతాయి' వరకూ ఎన్నెన్నో.
గాథలన్నీ
చిట్టిపొట్టివే. నిడివిలో రెండు-మూడు పేజీలకి మించినవి లేవు. శీర్షికలతోనే
సగం ఆసక్తిని పెంచేస్తారు తిరుమల రామచంద్ర. 'పత్తికాయ నవ్వింది!'
'బుగ్గమీది మసి' 'ఏడుస్తున్న దుప్పటి' 'గాజుల గలగల' 'వసంత విలాసం'
'కొండమల్లెల అట్టహాసం' ..ఇవి ఒకరకమైతే, 'ముర్రుపాలు తాగిన గేదె దూడ'
''నీకేమిటి ఎరువు?' 'పేదరాలి వేవిళ్ళు' 'వ్యాధ సుందరి' ఇవి మరో రకం. 'జాణ'
'వగలాడి' 'పాపం! ఇంకా పసివాడేనట' ఈ మూడూ శ్రీకృష్ణుడి రాసలీలలకి సంబంధించిన
గాథలు. శరత్కాలపు వర్ణనలు చాలాచోట్లే కనిపిస్తాయి.
'గాథాసప్తశతిలో తెలుగుపదాలు'
పేరిట పుస్తకాన్ని రాసిన తిరుమల రామచంద్ర ఈ అనువాదాన్ని ఎంతో ఇష్టంగా చేసి
ఉంటారు అనిపించింది చదువుతూ ఉంటే. సప్తశతిలో గాథలని తీసుకుని అల్లిన కథలు
కావడంచేత కేవలం అనువాదంతో సరిపుచ్చారు అనుకోలేం. మూలం నుంచి భావాన్ని
గ్రహించి, పూర్వాపరాలు ఊహించి ఓ పరిపుష్ట రూపాన్ని కల్పించారని చెప్పాలి.
సాహిత్యంలో శృంగారం అనేది రానురానూ నిషిద్ధ వస్తువు అయిందే తప్ప, ఆదినుంచీ
కాదన్న నిజాన్ని మరోమారు ఋజువు చేసే రచన ఇది. (పేజీలు 152, వెల రూ. 90,
అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
చదివానండీ. ఆర్ద్రత, సారస్యం మృగ్యమైపోతున్న ఉరుకుల పరుగుల కాలంలో.. అలిసిన వేళో, ముసురుపట్టిన పొద్దో చదువుకోవాల్సిన కథలు. "పిల్లడు కొరికిన రేగు పండు" , "లావణ్య నిధులు" మళ్ళీ మళ్ళీ చదువుకునేంత నచ్చాయి నాకు..
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: సారస్యానికి ఏమాత్రం లోటు లేని రచన అండీ.. రామచంద్ర గారి ప్రతిభ అడుగడుగునా కనిపించింది నాకు.. ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి