బుధవారం, ఫిబ్రవరి 18, 2015

రామానాయుడు ...

తెలుగునాట  చిత్ర నిర్మాణ సంస్థ పేరు చూసి "ఈ సినిమా చూడొచ్చు" అనో "తప్పకుండా చూడాలి" అనే పేరు తెచ్చుకున్న సంస్థలు బహు తక్కువ. ఓ విజయ, ఓ వాహిని.. వరుసలో ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్. సినీరంగంలో ఉండే చాలామందికి సినిమా  వారి జీవితంలో ఓ భాగం. కానీ,  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డాక్టర్ డి. రామానాయుడికి మాత్రం సినిమానే జీవితం. అందుకే, సురేష్ సంస్థ సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖలకీ విస్తరించింది. అనేక భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించింది.

సాధారణంగా నిర్మాతలు తెరవెనుక మాత్రమే ఉంటారు. కానీ రామానాయుడు తను నిర్మించిన సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో తెరమీద తళుక్కున మెరుస్తారు. సరదాగా మొదలైన ఈ 'ప్రత్యేక అతిధి పాత్ర పోషణ' రానురానూ సెంటిమెంట్ గా మారిందేమో అనిపిస్తుంది. అసలైతే సినిమాల్లో హీరో కావాలని కారంచేడు నుంచి మదరాసు వెళ్లారట రామానాయుడు. నటన తన 'కప్ ఆఫ్ టీ' కాదని తొందరగానే గ్రహించి, నిర్మాణం వైపు వెళ్ళారు. అతిధి పాత్రలు కూడా జడ్జి, కలెక్టర్.. ఇలా కథకి కీలకమైనవీ  నాలుగైదు నిమిషాల నిడివి మాత్రమే ఉండేవీను.

"పరిశ్రమకి వచ్చిన కొత్తలో ఓ సినిమాలో డాక్టర్ వేషం వేశాను. హీరోయిన్ కి ఇంజెక్షన్ చెయ్యాలి.. ఎక్కడా, నా చెయ్యి ఒకటే వణికిపోతోంది. టేకులు తిని పూర్తిచేశాను ఆ సీన్," అంటూ ఆయనే గుర్తు చేసుకున్నారు ఓ సందర్భంలో. సినిమా నిర్మాణంలో తలపండిన వ్యక్తి కావడం వల్ల నిర్మాణం వ్యయం మీద పూర్తి అదుపు ఉంది రామానాయుడికి. అంతే కాదు, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయినీ తెరమీద చూపించడం ఎలాగో బాగా తెలుసాయనకి. అందుకే, సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల్లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాలు బాగా తక్కువ.


అందుబాటులో ఉన్న వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంస్థల్ని లాభాల్లో నడిపించవచ్చు అంటారు మానవ వనరుల అభివృద్ధి నిపుణులు. మేనేజ్మెంట్ చదువులు చదవకపోయినా, సినిమా నిర్మాణం విషయంలో ఈ సూత్రాన్ని అమలులో పెట్టి ఫలితాలు రుచి చూశారు రామానాయుడు. అరడజను మంది హీరోలు, డజను మంది హీరోయిన్లు, రెండు డజన్ల మంది దర్శకులు సురేష్ సంస్థ ద్వారా సినిమా రంగానికి పరిచయం కావడం మాత్రమే కాదు, తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని పరిశ్రమకి నిరూపించారు కూడా.

సినిమా రంగంలో సన్నిహితంగా మసిలే మిత్రులు కొందరు రామానాయుడిని "డాడీ రామానాయుడు" అని పిలుచుకుంటారు (డాక్టర్ డి). నిజంగానే ఆయన తెలుగు సినిమా పరిశ్రమకి ఫాదర్లీ ఫిగర్. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన, తనని చూడ వచ్చిన ప్రతి ఒక్కరికీ కరెన్సీ నోటు ఇచ్చి పంపడం రామానాయుడి అలవాటు. లైట్ బాయ్ మొదలు, హీరోయిన్ వరకూ అందరికీ ఒకే మొత్తం. ఎంత మొత్తం అన్నది కాదు ప్రధానం, ఏడాది మొదటి రోజున ఆయన దగ్గరినుంచి డబ్బు తీసుకుంటే ఆ ఏడాదంతా కెరీర్ 'రైజ్' లో ఉంటుందని చాలామంది నమ్మకం.

దశాబ్దాల పాటు ఓ రంగంలో కొనసాగినప్పుడు కాలానుగుణంగా తనని తాను మార్చుకోడం తప్పనిసరి. మార్పుని అంది పుచ్చుకుంటూనే, రాజీ కి సిద్ధ పడలేదు రామానాయుడు. పదిహేనేళ్ళ క్రితం, నిర్మాణ సంస్థలన్నీ 'యూత్ సినిమాల' వేవ్ లో కొట్టుకుపోతూ బూతు సినిమాలని జనం మీదకి వదిలిన సమయంలో సురేష్ సంస్థ 'ప్రేమించు' 'విజయం' లాంటి సినిమాలు నిర్మించింది. వీటిలో 'ప్రేమించు' జాతీయ స్థాయిలో అవార్డు పొందాల్సిన సినిమా. విజయవంతమైన జీవితాన్ని గడిపిన రామానాయుడి మరణం తెలుగు సినిమా పరిశ్రమకి మాత్రం తీరనిలోటు. ఇలాంటి నిర్మాతని పరిశ్రమ మళ్ళీ చూడగలదా? అన్నది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న.

2 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

గతేడాదినించి సినిమా పరిశ్రమకి గడ్డుకాలమే. మహామహులందరూ ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్నారు. రామానాయుడు భౌతికంగా లేకపోడం నిజంగా పరిశ్రమకి గొడ్డలిపెట్టే. సినిమా పరిశ్రమలోనూ తరం మారుతోంది,అంతరం పెరుగుతోంది అయినా మార్పు సహజం.

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: అవునండీ.. వస్తున్న వాళ్ళలో ఆ ఓర్పు, కమిట్మెంట్ కనిపించడం లేదు.. ..ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి