మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

రాలూ-రప్పలూ

"మా ఇంటి పేరు బండి వారో బండారు వారోనట. మా పూర్వులు ఆ రోజులలో మిలిటరీ లో సిపాయిలుగా ఉండేవారు. మూడు నాలుగు తరాలుగా ఆ వంశంలో ఒక్క కొడుకుకు మించి సంతానముండేది కాదుట. మా నాన్నగారి తాతగారు లక్ష్మయ్య. మిలిటరీ నుంచి తిరిగి వచ్చో లేక మిలిటరీకి పోకుండానో తాపీ పనిలో ప్రవేశించారట. దానిట్లో చక్కగా పనిపాట్లు చేసుకుంటూ కొంత పేరు సంపాదించారట. తాపీ లక్ష్మయ్య అన్న వాడుక ఊరిలో కలిగింది. చదువులో వేసినప్పుడు మా నాన్నగారి పేరు తాపీ లక్ష్మయ్య మనుమడు కాబట్టి, తాపీ అప్పన్న అని వ్రాశారు. అది మొదలు మేము తాపీ వారమయ్యాము."

ఆంద్ర దేశంలో ఒక్కో ఇంటి పేరు వెనుకా ఒక్కో కథ ఉంటుంది. తొలితరం సినీ రచయితగానే కాక, 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' 'దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?' లాంటి విలక్షణ పుస్తకాల ద్వారా నేటితరం పాఠకులకీ సుపరిచితులైన తాపీ ధర్మారావు నాయుడు గారి ఇంటిపేరు వెనుక కథ ఇది. ఒక్క ఇంటి పేరు మాత్రమే కాదు, ఈ 'తాతాజీ' జీవితం నిండా  ఎన్నెన్ని విశేషాలో. వాటన్నింటినీ అక్షరబద్ధం చేస్తూ, తన ఆత్మకథ 'రాలూ-రప్పలూ' రాయడం ఆరంభించిన ధర్మారావు, కేవలం కొద్ది భాగాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు.

బరంపురంలో 1887, సెప్టెంబర్ 19న జన్మించిన ధర్మారావు విద్యాభ్యాసం శ్రీకాకుళం, విజయనగరం, మద్రాసులలో విద్యాభ్యాసం చేశారు. తండ్రిగారు వృత్తిరీత్యా వైద్యులు. అయితేనేం, ఆ కుటుంబలో ఒక్కరు కూడా 'బీయే' లు లేరు. ఎలా అయినా బీయే పూర్తి చేయాలన్నది తాపీ వారి చిన్ననాటి ఆశయం. చిన్నప్పుడు ఆటపాటల మీద ఎక్కువగానూ, చదువు మీద తక్కువగానూ శ్రద్ధ పెట్టిన ధర్మారావు, తన తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ ఒకటి అనుకోకుండా చెవినబడడంతో చదువులో తనని తను నిరూపించుకోవాలన్న దీక్ష బూనారు. అలాగని, ఆటపాటలని ఏమాత్రం దూరం పెట్టలేదు.


అన్నగారు, స్నేహితులతో కలిసి ఇంటిని థియేటర్ గా మార్చేసి నాటకాలు ఆడారు, టిక్కెట్టు పెట్టి మరీ. ఆ నాటకాలకి రచన మొదలు రంగాలంకరణ వరకూ ప్రతిచోటా తన ముద్ర ఉండాల్సిందే. కొన్నాళ్ళ పాటు సర్కస్, గార్డెనింగ్. మరికొన్నాళ్ళ పాటు రాత్రీ పగలూ లెక్కలతో ఆటలు. ముక్కుసూటిదనం, నలుగురిలో తను ప్రత్యేకంగా కనిపించాలనే కాంక్ష తాపీ వారి బాల్యంలో బాగా కనిపిస్తాయి. అవే లక్షణాలు తర్వాతి జీవితమంతా కొనసాగాయి. నలుగురూ అవునన్న దాన్ని కాదనడం కూడా చిన్ననాటి అలవాటే అని సరదాగా చెప్పారు తన ఆత్మకథలో.

ఓపక్క హైస్కూలు చదువు అవుతూ ఉండగానే పదిహేనేళ్ళ వయసులో అన్నపూర్ణతో బాల్య వివాహం. అది కూడా, అస్సలు అనుకోకుండా కుదిరిన సంబంధం. పెళ్లవుతూనే ఎఫ్యే చదువు కోసం పర్లాఖిమిడి ప్రయాణం. అక్కడ అధ్యాపకులు మరెవరో కాదు, గిడుగు రామమూర్తి పంతులు. విద్యార్ధి నాయకత్వం ధర్మారావుదే. అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల మొదటిరోజునే తరగతిలో తన పట్ల గిడుగు వారికి కలిగిన వ్యతిరేక భావం, దాన్ని పోగొట్టుకోడానికి తను కృషి చేసిన వైనం ఎంత ఉత్సాహంతో చెప్పారో ఈ పుస్తకంలో. ఎఫ్యే తర్వాత కొంతకాలం ఉద్యోగం, అటుపై మద్రాసులో బీయే చదువుతో ఆగిపోయింది ఆత్మకథ.

పుస్తకం పూర్తి చేయగానే కలిగే భావం ఒక్కటే. మొత్తం ఆత్మకథ రాసి ఉంటే ఓ గొప్ప గ్రంధం అయి ఉండేది అని. ఇప్పుడు కూడా, గొప్పదనానికి లోపం లేదు. కాకపొతే, 'టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్' ని మాత్రమే చూసిన భావన. తాపీ వారి మూర్తి, వ్యక్తిత్వం అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. తన విషయాలు రాసేప్పుడూ, తనవాళ్ళ సంగతులు రాసేప్పుడూ కూడా ఎక్కడా మొహమాటం కనిపించదు. కానీ, చిన్నతనంలో ఆయన చాలా మొహమాటి అట! ఈ మొహమాటం వల్లే, విజయనగరంలోనే ఉంటున్నా గురజాడ అప్పారావుని కలిసి మాట్లాడలేదట ఎప్పుడూ. కేవలం 97 పేజీలు మాత్రమే ఉన్న 'రాలూ-రప్పలూ' మళ్ళీ మళ్ళీ చదివించే పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 35)

4 కామెంట్‌లు:

  1. చాలా ఏళ్ళ క్రితం నా చిన్నప్పుడు చదివాను ఈ పుస్తకం.
    నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే, ముందుమాటకి ఊతకర్ర అని పేరు పెట్టారు. రాలూ - రప్పలూ లోనికి వెళ్ళడానికట.

    రిప్లయితొలగించండి
  2. @బోనగిరి: అవునండీ.. 'ఊతకర్ర!' ఏటుకూరి ప్రసాద్ రాశారు ముందుమాటని.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నా వరకూ ఆత్మకథలు చదవడంలో రుచిని మరింతగా పెంచిన రెండో పుస్తకం. పైగా మా ఊరబ్బాయ్ కథ! 'టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్..' నిజం!!

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: మీ ఊరబ్బాయి.. అవునండీ నిజమే.. గురజాడని కలవలేకపోయా అని రాసుకున్నారు.. శ్రీపాద వారి 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' చదివారా మీరు? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి