మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

చట్టం పని చేసింది!

'చట్టం తన పని చేసుకుపోతుంది' ..మన రాజకీయ నాయకులందరికీ బాగా ఇష్టమైన మాట ఇది. మరీ  ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళకి. వాళ్ళ పాలనలో లొసుగుల్ని ప్రశ్నిస్తూ ఎవరన్నా కోర్టుకి వెళ్ళగానే, ముఖ్యమంత్రులూ, మంత్రులూ టీవీ కెమెరాల వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పే మాట ఇది. చట్టం ఏం చేస్తుందన్నది సామాన్య జనం కన్నా వాళ్లకి బాగా తెలుసన్న భరోసా కనిపించేది ఆ నవ్వులో. ఇకపై, వాళ్ళు అంత భరోసాతోనూ ఆ మాట చెప్పగలరా?

జె. జయలలిత.. ఈ పేరు చెప్పగానే ఎన్నో దృశ్యాలు ఒక్కసారిగా కళ్ళముందు మెదులుతాయి. వెండితెర మీద పొట్టి దుస్తులతో ఆడిపాడిన కథా నాయిక మొదలు, ఎంతటి వారినైనా తన చూపుడు వేలితో శాసించే అధినాయిక వరకూ ఎన్ని పాత్రలో. 'జె అంటే జయరాం కాదు జగమొండి, జగడం' అని చమత్కరించే వాళ్ళు ఉన్నారు. అవును, సినిమా  షూటింగ్ ఫ్లోర్ మొదలు, శాసన సభా వేదిక వరకూ ఆమె జగడమాడని స్థలం లేదు. తన మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని ఆమె ఏనాడూ క్షమించలేదు. అవమానించిన వాళ్ళమీద అచ్చం సినిమా ఫక్కీలోనే ప్రతీకారం తీర్చుకోకా పోలేదు.

'ఇదీ నాకథ' పేరుతో సినీ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి రాసుకున్న ఆత్మకథ (లిమిటెడ్ ఎడిషన్) లో 'శ్రీకృష్ణ విజయం' సినిమా నిర్మాణ సమయంలో జయలలితతో పడ్డ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. రాజకీయాల్లోకి వస్తూనే, మొదట రాజకీయ గురువు ఎమ్జీ రామచంద్రన్ తో తగాదా. అయన మరణానంతరం రాజకీయ వారసత్వం కోసం రామచంద్రన్ భార్య జానకితో గొడవలు. అటుపై పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ లెక్కలేనన్ని వివాదాలు. ప్రతిపక్ష నాయిక హోదాలో, ముఖ్యమంత్రి కరుణానిధితో శాసనసభలో తలపడినప్పుడు తనకి జరిగిన అవమానం, "ముఖ్యమంత్రి హోదాలో తప్ప అసెంబ్లీ లో అడుగుపెట్టను" అన్న ప్రతిజ్ఞ చేయించింది జయలలిత చేత.

నిజానికి ముఖ్యమంత్రి హోదాలో జయలలిత చాలా మంచిపనులే చేశారు. బాలికల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోవడం అన్న సత్యాన్ని పసిగట్టి, చర్యలకి ఉపక్రమించిన మొదటి ముఖ్యమంత్రి ఆమె. మహిళల భద్రత ఆమెకి కేవలం ఉపన్యాసానికి పనికొచ్చే పడికట్టు పదం కాదు. ప్రత్యేకంగా మహిళల కోసమమే పోలీస్ స్టేషన్ల మొదలు, మహిళా పోలీసుల కోసం ప్రత్యేక  శిక్షణ కేంద్రాల వరకూ జయలలిత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎన్నో. నిన్న మొన్నటి 'అమ్మ' కేంటీన్ల విజయం, అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  కూడా స్పూర్తినిచ్చింది.


అయితే మాత్రం? జయలలిత అనగానే రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న పెంపుడు కొడుకు పెళ్లి వేడుక, 'నడిచే నగల దుకాణం' అనే ముద్దుపేరున్న ప్రియసఖి శశికళ, వందలకొద్దీ పాదరక్షలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలూ... ఇవే మొదటగా గుర్తొస్తాయి. మొన్నటికి మొన్న, "కమల్ హాసన్ అంత భారీ బడ్జెట్ తో సినిమా తీయకుండా ఉండాల్సింది" అని నిష్కర్షగా చెప్పిన గతకాలపు సినీ నాయికే గుర్తొస్తుంది. తను చేసిన పనులేవీ దాచాలనుకోలేదు జయలలిత. అందుకే తన సంపదని దాచే ప్రయత్నం చేయలేదు. తనని తనుగా ప్రజలు అంగీకరించాలని భావించి ఉండొచ్చు బహుశా.

జయలలిత మీదున్న అవినీతి ఆరోపణలు చిన్నాచితకవి కాదు. కేసులూ కాసిని కూసినీ కాదు. ఆమె నామినేషన్ తిరస్కరించబడింది 2001 ఎన్నికల్లో. ఆమె పార్టీ ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో, అనుంగు శిష్యుడు పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించి, తను సుప్రీం కోర్టుకి వెళ్లి మరీ అధికారంలోకి వచ్చారు. తాజాగా, పద్దెనిమిదేళ్ళ నాటి 'ఆదాయానికి మించిన ఆస్తుల' కేసులో కర్ణాటక కోర్టు తీర్పు తర్వాత పదవిని కోల్పోయిన జయలలిత, అదే పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు.

కన్నడ నాట పుట్టిన జయలలిత, తమిళ ప్రజల ఆదరాన్ని ఎంతగా చూరగొన్నారు అన్నదానికి గత రెండు మూడు రోజులుగా తమిళనాట జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం. అభిమానాన్ని కలిగిఉండడంలోనూ, దాన్ని ప్రకటించడం లోనూ తమిళులది ప్రత్యేకమైన ధోరణి. వారి అభిమానం ఉన్నంత మాత్రాన, జయలలిత తప్పులు ఒప్పులైపోవు. తనను తాను 'పురచ్చి తలైవి' గా అభివర్ణించుకునే ఈ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి పోరాటం కొత్తకాదు, నిజానికి ఆమె జీవితంలో ఒక భాగం. ఇప్పుడు కూడా ఆమె నిశ్శబ్దంగా తనకు విధించిన శిక్షని అనుభవిస్తుంది అనుకోడం పొరపాటు. అలా చేయడం ఆమె స్వభావం కానేకాదు.

'చట్టం తనపని తను చేసుకుపోతుంది' అని జయలలిత చాలాసార్లే చెప్పారు. ఆలస్యంగానే అయినా, చట్టం తన పని తను చేసింది. దేశంలో కోర్టు తీర్పు కారణంగా పదవి కోల్పోయిన తొలి ముఖ్యమంత్రి జయలలిత. చట్టాన్ని గురించి ఇదే మాటని మన రాజకీయ నాయకులు చాలామందే చెబుతున్నారు. వాళ్ళలో చాలామంది మీద కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయి. వాళ్ళందరి విషయంలోనూ కూడా చట్టం తనపని తను చేసుకుపోయే రోజు త్వరలోనే రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, వ్యవస్థ మీద ఆ వ్యవస్థలో ఉన్న ప్రజలకి నమ్మకం, గౌరవం పెరగడానికైనా ఇలా జరగడం తక్షణావసరం.

3 కామెంట్‌లు:

  1. As usual very informative..

    కానీ ఆమె మీద శాసనసభ సాక్షిగా కరుణానిధి & కో. చేసిన దాడి గురించి మరింత సమాచారం రాయాల్సింది. ప్రజాస్వామ్యంలో అత్యంత ఘోరమైన ఆ సంఘటన గురించి ఇంకొంచెం విపులంగా రాసి ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  2. 'Justice delayed is justice denied' is what we hear from the geniuses. If 18 years is not enough-delayed as per the Indian standards, seriously, there is something wrong with our perception of justice.

    If J.J. had claimed divinity, would our system-of-law have DARED to prosecute her? When I hear about the people that support her, I couldn't help but entire matter with religious personalities.

    రిప్లయితొలగించండి

  3. @కార్తీక్: తనకి ఎదురైన అనుభవాలని ఆమె ఏవిధంగా తీసుకుంది అన్నది చెప్పడం మీద దృష్టి పెట్టానండీ.. ..ధన్యవాదాలు.
    @Iconoclast: సాక్షాత్తూ దేశ ప్రధానిని ఆమె అంగరక్షకులే పట్టపగలు కాల్చి చంపేస్తే, నిందితుల్ని శిక్షించడానికి నాలుగేళ్ళు తీసుకుందండీ న్యాయస్థానం! 'వందమంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధీ శిక్షింపబడకూడదు' అన్న సూత్రం ఆధారంగా పనిచేస్తున్న వ్యవస్థ కావడం వల్ల, ఇక్కడ 'డిలే' తప్పదు. ఈ పరిస్థితిని అపరాధులెందరో వెసులుబాటుగా తీసుకుంటున్నారన్నది నిజం. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి