గతకాలపు రచయితలలో మనకిష్టులైన
వాళ్ళని కళ్ళారా చూసి, మనసారా మాట్లాడగలిగే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆ
అవకాశమే ఉంటే అదో అద్భుతం కదూ! వారితో ఆత్మీయంగా మసలిన చేయితిరిగిన రచయిత
తన గాథల్లో వారందరి కథలూ చెబుతూ ఉంటే ఎన్ని పేజీలైనా ఇట్టే వినేయగలం..
మళ్ళీ మళ్ళీ చదివేయగలం. అదిగో, అలాంటి కథల సమాహారమే 'గౌతమీ గాథలు,' రచయిత
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఇప్పటి నవతరానికి శాస్త్రిగారిని
పరిచయం చేయాలంటే, సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తాతగారు అని చెప్పాలి. కొంచం వెనుకవారికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తండ్రిగారు అని
చెబితే చాలు. శ్రీకాంత శర్మ తెలిసినవారందరికీ, హనుమచ్ఛాస్త్రి తప్పక తెలిసే
ఉంటారు.
విశాఖ
జిల్లా మాడుగులలో 1911 లో జన్మించిన హనుమచ్ఛాస్త్రి, తమ ఊళ్ళో తన పదకొండో
ఏట జరిగిన విదేశీ వస్త్ర దహనంలో పాల్గొని, తన ఒంటిమీద ఉన్న చొక్కాని
అగ్నికి ఆహుతిచేసి, అటుపై తండ్రిగారి ఆగ్రహానికి గురైన వైనంతో మొదలయ్యే ఈ
పుస్తకంలో మొత్తం ముప్ఫై తొమ్మిది గాథలున్నాయి. తన బాల్యంలో కొంతభాగాన్ని విద్యాభ్యాసం నిమిత్తం కోనసీమలోనూ,
యవ్వనాన్ని ఉద్యోగ నిమిత్తం రాజమండ్రి, రామచంద్రాపురం లోనూ గడిపిన
శాస్త్రిగారు ఆనాటి తన అనుభవాలని 'గౌతమీ గాథలు' పేరిట అక్షరబద్ధం చేశారు. సుతిమెత్తని హాస్యం, లలిత
శృంగారం మేళవించిన ఈ గాథల్లో చదివించే గుణం పుష్కలం.
ఇక,
నాటి సాహితీలోకం యావత్తూ 'బాపిబావ' అని ముద్దుగా పిలుచుకున్న అడవి
బాపిరాజు గురించి "బాపిరాజు అందరికీ బావ, అయితే నాకు అన్న. మేమిద్దరం ఒక
ఊరి వారి అల్లుళ్ళం," అని చమత్కరించారు. కారా కిళ్ళీతో రంగుమారిన పళ్ళకి,
భమిడిపాటి వారు 'యంత్ర దంతధావనం' చేయించుకున్న సరదా వైనంతో పాటు, విమర్శకి
ఎలా స్పందించాలో ఆయన పిలకా వారికి ఇచ్చిన సీరియస్ సలహానీ పొందుపరిచారీ
గాథల్లో. మార్గాలు వేరైనా, వాటి ప్రభావాన్ని స్నేహం మీద ఏమాత్రం పడనివ్వని
కవులూ, రచయితలూ చాలా పేజీలలోనే కనిపిస్తారు.
"కోటిపల్లి కోట
ఇంద్రగంటి వారికి కాణాచి. తెలంగాణా మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు
తాలూకా ఇంద్రగల్లు నుంచి బతుకుతెరువు వెతుక్కుంటూ కొన్ని బ్రాహ్మణ
కుటుంబాలు గోదావరి తీరానికి వచ్చి అక్కడక్కడ స్థిరపడ్డాయి. అందులో ఈ
ఇంద్రగంటి వారొకరు. ఆ ఊరిపేరే వీరి ఇంటి పేరయింది," అంటూ తమ కుటుంబ
వృత్తాంతం చెబుతూనే, "విస్సన్న చెప్పిందే వేదం. ఆ విస్సన్నే ఇంద్రగంటి
విశ్వపతి శాస్త్రి గారు. కోటిపల్లి నివాసి. మహాపండితుడు, గొప్ప ధర్మ
శాస్త్రవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయింది,"
అంటూ ఆయన కబుర్లూ చెప్పారు. ఈ విస్సన్న ప్రస్తావన 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర' లోనూ కనిపిస్తుంది.
కోనసీమ
విద్యాభ్యాసం కబుర్లలో గురుపత్ని ఔదార్యం, గురుపుత్రుడు ప్రాణభిక్ష పెట్టిన
సందర్భంతో పాటు, ఆలోచనల్లో పడేసే దక్షిణాది శాస్త్రులు, పొరుగూరి
విద్యార్ధులకి ఇంట భోజనం పెట్టే సంప్రదాయం లేని కాట్రేనికోన కాపురస్తులూ
కనిపిస్తారు పాఠకులకి. "నిజమైన ఆవకాయ సౌభాగ్యం - గోదావరి జిల్లాలో అందులోనూ
- కోనసీమలో చూడాలి. అందరికీ చిన్నా పెద్దా మామిడి తోటలుంటాయి. ప్రతి
తోటలోను ఆవకాయ చెట్టని ఒకటి విధిగా ఉంటుంది. వంశ పారంపర్యంగా తాత, ఆయన తాత
ఎంచి దాని యోగ్యత నిర్ణయించి చప్పరించి మరీ వేసిన చెట్టది!" లాంటి
ముచ్చట్లు కేవలం ఒకసారి మాత్రమే చదివేసి ఊరుకోగలమా?
వంద
ఎకరాల సుక్షేత్రమైన భూమిని జాతీయ పాఠశాల కోసం దానమిచ్చిన రామచంద్రపురం వాసి
కృత్తివెంటి పేర్రాజు పంతులు దాతృత్వం మొదలు, సాహిత్య సభలకి 'దారులు కాసి
డప్పులు బజాయించినా' పాతికమంది అయినా రాని ఆ ఊళ్ళో జనాన్ని రప్పించడం కోసం
సాహిత్యాభిమాని డాక్టర్ తోలేటి కనకరాజు గారి 'జనాకర్షక' ప్రయత్నాల వరకూ,
"అంతవరకూ గురజాడకి వర్ధంతులు గాని, జయంతులుగాని విజయనగరంలో తలపెట్టిన వారు
లేరు. ఆ గౌరవం గౌతమీ తీరానికి దక్కింది ," వంటి చారిత్రక సత్యాల మొదలు,
"రెండు గంటలపాటు సభ్యులని ఆనందంలో ఆలోచనలో ముంచెత్తే వక్తలకి వేదిక దిగాక
సోడా అడిగే దిక్కేనా ఉండదు," వంటి నిష్టుర సత్యాల వరకూ.. ఎన్నో ఎన్నెన్నో.
'విశ్వేశ్వరుడి
రేవు,' 'లంకలో లేడిపిల్ల,' 'జీవిత సత్యాలు' లాంటివి కబుర్లలాగా కాక,
కథల్లా అనిపిస్తాయి. ఆ రోజుల్లో స్కూళ్ళు, స్కూలు మేష్టారు ఉద్యోగంలో
సాధకబాధకాలు, ఇనస్పెక్షన్లు తత్ సందర్భంగా జరిగే 'ప్రతిభా ప్రదర్శనలు,'
వెన్నెల రాత్రులు గోదావరిలో బోటు షికార్లు, రామచంద్రాపురం కాలవలో టీ బోటులో
సాహిత్య చర్చలు... ఏ కొన్ని కబుర్లనో ప్రస్తావించి వదిలేయడం ఎంత కష్టం!!
ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారంతా మళ్ళీ మళ్ళీ
చదువుకునే పుస్తకం ఈ 'గౌతమీ గాథలు.' చదివిన ప్రతిసారీ "మరికాసిన్ని గాథలు
రాస్తే ఈయన సొమ్మేం పోయిందో" అనిపించడం ఈ పుస్తకం ప్రత్యేకత! ('తెలుగు
ప్రింట్' ప్రచురణ, పేజీలు 157, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల
షాపులు).
మంచి పుస్తకం. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు పరిచయం అవసరంలేని పండితులు.
రిప్లయితొలగించండిపుస్తకాల పరిచయం / వ్యక్తుల పరిచయం చేస్తున్నారు కాబట్టి, మీరు కోనసీమ వారు కాబట్టి ఒక సలహా. డొక్కా సీతమ్మ గారి గురించి కూడా ఒక టపా వ్రాస్తే బాగుంటుంది (అల్రెడీ ఇదివరకే వ్రాసుండనట్లయితే). ఆవిడ గురించి ఈ తరం వారికి తెలియవలసిన అవసరం ఉంది.
murali garu, ee pusthakam ekkada dorukutundo cheppagalaru. Me tapa chadivina ventane pustakam kosam kinige lo vethikanu. Dorakaledu. Venate chadavalani vundi
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: డొక్కా సీతమ్మ వారధిపై ప్రయాణించిన ప్రతిసారీ అనుకుంటూ ఉంటానండీ, ఆవిడ గురించి రాయాలని. ఇప్పుడు మీరు కూడా చెప్పారు.. రాస్తాను తప్పకుండా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@స్వాతి: ఇక్కడ చూడండి
http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=14906
ధన్యవాదాలండీ..
నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను..
రిప్లయితొలగించండిధన్యవాదాలు,
-కార్తీక్
మీ సానుకూల స్పందన కి సంతోషం మురళి గారూ.
రిప్లయితొలగించండి2. "డొక్కా సీతమ్మ వారధి" అని పేరు పెట్టారా? చాలా బాగుంది. మేం కోనసీమ లో ఉన్న కాలంలో (కొన్ని యుగాలయినట్లుంది !) సింపుల్గా "గన్నవరం అక్విడక్ట్" అనే వాళ్ళం. ఆవిడ పేరు పెట్టడం ఆవిడ్ని తగురీతి లో గుర్తుపెట్టుకున్నట్లు.
@కార్తిక్: వీలయితే పుస్తకం చదవండి, ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: అవునండీ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం కట్టిన కొత్త బ్రిడ్జికి ఆవిడ పేరు పెట్టారు.. విగ్రహం కూడా ఉన్నట్టు జ్ఞాపకం.. ధన్యవాదాలు.
మొదటి మూడు వాక్యాలూ.. అక్షరసత్యం!! వెంటనే చదవాలన్నమాట!
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: అవునండీ, తప్పక చదవాల్సిన పుస్తకం ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి