శనివారం, సెప్టెంబర్ 27, 2014

నిక్వాణం-2

(మొదటిభాగం తరువాత...)

జనార్దన శాస్త్రి ఇంట్లో ఉండే సమయమే తక్కువ. భోజనం, నిద్ర తప్ప తక్కిన సమయం అంతా జానకిరామరాజు ఇంట్లోనే. అక్కడే సాధన, చర్చలు, అన్నీను. గిటారు, సితారు, గోటు వాద్యాలని వీణ మీదే పలికించేస్తున్నాడు. అటు శాస్త్రీయం, ఇటు లలిత సంగీతం.. వీణపై అతని వేళ్ళు పలికించని గమకం లేదు. జనార్దనం వీణతో జుగల్బందీ చేయడం హిందూస్తానీ సంగీత కళాకారులందరికీ ఓ సరదా. 

కచేరీల ఏర్పాటు అంతా జానకిరామరాజు చేతిమీదుగానే జరుగుతూ వస్తోంది అప్పటివరకూ. క్లబ్బులో పరిచయమైన కొత్త స్నేహితుల ద్వారా కచేరీల ఏర్పాటు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు నరసింహశాస్త్రి. ఇటు మీనాక్షి కూడా "కచేరీకి ఏమాత్రం ఇస్తారండీ మీ అబ్బాయికి?" అంటూ మహిళామండలి స్నేహితులు అడిగే ప్రశ్నలకి తన దగ్గర జవాబు లేకపోవడం ఇబ్బందిగా ఉంది.

"మన కుర్రాడి కచ్చేరీ మనం కాకుండా ఇంకెవరో ఏర్పాటు చేయడం ఏవిటండీ?" అంది భర్త దగ్గర. మొదటిసారిగా, నరసింహశాస్త్రి ఓ కార్యక్రమ నిర్వాహకుల దగ్గర అడ్వాన్సు పుచ్చుకున్నాడు. పుచ్చుకుని, ఫలానీ రోజున, ఫలానీ చోట కచేరీ చేయాలని చెప్పాడు కొడుక్కి. 

తండ్రి చెప్పిన సంగతి గురువుగారి చెవిన వేశాడు జనార్దనం. జనార్దనానికి అర్ధం కాని విషయం, జానకిరామరాజుకి అర్ధమయ్యింది. వచ్చే నవ్వుని గుబురు మీసాలు కప్పేశాయి. నరసింహశాస్త్రి ద్వారా ఏర్పాటైన కచేరీ విజయవంతంగా ముగిసింది.  కొడుక్కి సంగీతం తప్ప వయసుకి తగ్గ లోకజ్ఞానం బొత్తిగా లేదని బాగా తెలుసు మీనాక్షికి. నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టింది. 

"నాన్నా.. మీ తాతగారు గొప్ప వైణికులు. ఆయన వీణ వాయిస్తుంటే నారదుడే స్వయంగా వచ్చి వింటాడేమో అనిపించేదిట. నీకంతా ఆయన పోలికే వచ్చింది అంటూ ఉంటారు మీ నాన్నగారు.." మొదట్లో ఏమీ లేకపోయినా, రాన్రానూ ఈ మాటలు పనిచేయడం మొదలయ్యాయి జనార్దనం మీద. 

ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్యూలో మొదటిసారిగా "మై గురు.. జానకిరామరాజు" అన్న ప్రస్తావన తేలేదు జనార్దనం. అలా తేలేదన్న విషయం, ఆ ఇంటర్యూ అచ్చులో చూసుకున్నప్పుడు తప్ప అర్ధం కాలేదు అతనికి. ఏమీ జరగనట్టే ఊరుకున్నాడు జానకిరామరాజు.

ఇప్పుడిప్పుడు జనార్దనానికి కచేరీ మధ్యలో వెన్ను నిమరాల్సిన అవసరం రావడం లేదు. శిష్యుడి వెన్ను ముదురుతోన్నందుకు మనస్పూర్తిగా సంతోషించాడాయన. కచేరీలలో జానకిరామరాజు స్థానం వేదిక మీద నుంచి, ముందు వరుస  ప్రేక్షకుల్లోకి మారింది నెమ్మదిగా. చిన్నకొడుకు కూడా 'బాలమేధావి' అవుతాడన్న నరసింహశాస్త్రి ఆశ అడియాసే అయ్యింది. 'జనార్దన శాస్త్రి తమ్ముడు' అనే పేరైతే ఉంది కానీ, అతని ప్రతిభ ప్రేక్షకుల అంచనాలని అందుకొక పోవడంతో అన్నగారి వాద్య బృందంలో ఒకడిగా ఉండిపోయాడు.

నిరంతరం సాధన, కచేరీలతో ఊపిరి సలపకుండా ఉన్న విఖ్యాత వైణికుడు జనార్దన శాస్త్రికి పెళ్లీడు వచ్చింది. సంబంధం స్థిరపరచాలి. నరసింహశాస్త్రికీ, మీనాక్షికీ ఊపిరి సలపడంలేదు. బంధువులు కంటికి  ఆనడం ఎప్పుడో మానేశారు. సమాన స్థాయిలో సంబంధం దొరకడం కష్టం కాబట్టి ఓ మెట్టు దిగక తప్పదనే చెబుతున్నారు అందరికీ. 

"ఆడపిల్లని తక్కువ నుంచి తెచ్చుకోమనే చెబుతోంది శాస్త్రం" అంటూ సన్నాయి నొక్కులు ఆరంభించింది మీనాక్షి.  ఇవేవీ పట్టడం లేదు పెళ్లికొడుక్కి. వీణ ఒక్కటే ప్రపంచంలో అత్యద్భుతమైన విషయం అతనికి. ఎంత సాధన చేసినా తనివి తీరదు. ఇంకా ఏవేవో కొత్తరాగాలు పలికించాలన్న తహతహ రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. తన చుట్టూ జరుగున్నవాటితో నిమిత్తం దాదాపుగా లేదతనికి.

ప్రభుత్వంలో ఉన్నతాధికారి ఒకాయన జనార్దనానికి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్నాడు. ముందుగా హంగుదార్లని పంపి తన గురించి చెప్పించాడు. తర్వాత తనే స్వయంగా రంగంలో దిగి, ప్రవర చెప్పుకుని పిల్లనిస్తానన్నాడు. పెద్దగా శ్రమ పడకుండానే ఆయన ఎత్తు ఫలించింది. అధికారి గారి ఏకైక పుత్రిక గాయత్రి ఆ యింటి కోడలయ్యింది. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళికి జానకిరామరాజు వచ్చాడో, లేదో తెలుసుకునే తీరిక ఎవ్వరికీ లేకపోయింది.

పెళ్ళైన మూడో రోజు ఉదయాన్నే చెదిరిన జుట్టు సరిచేసుకుంటూ "నేనేమీ వీణని కాదు తెలుసా.." గోముగా అంది గాయత్రి. సిగ్గుపడిపోయాడు జనార్దనం. పదహార్రోజుల పండుగకన్నా ముందే ప్రభుత్వం  పెద్ద పురస్కారాన్ని ప్రకటించింది జనార్దన శాస్త్రికి. 

"అమ్మాయి అడుగుపెట్టిన వేళ" అని నలుగురూ అంటూ ఉంటే విని  మూతి ముడిచింది మీనాక్షి. అత్తవారింటి పరిస్థితులు ఇట్టే ఆకళింపు చేసుకున్న గాయత్రి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నెల్లాళ్ళపాటు జనార్దనం  కచేరీలు ఏర్పాటు చేయించి, కూడా తనూ వెళ్ళింది. నరసింహశాస్త్రి, మీనాక్షి ఎంతమాత్రం ఊహించని పరిణామం ఇది.


శాన్ ఫ్రాన్సిస్కో లో కచేరీ అవుతుండగా ఇండియా నుంచి ఫోన్, జానకిరామరాజు కాలం చేశారని. ఇంకా రెండు వారాలున్నాయి కచేరీలు. ఆ వార్త జనార్దనాన్ని చేరకుండా కట్టడి  చేసింది గాయత్రి. వాద్యకళాకారులందరినీ ఒకటికి పదిసార్లు హెచ్చరించింది. మాధవశాస్త్రిని తీసుకురాకుండా మంచిపని చేశాననుకుంది. 

జనార్దనం మితభాషి. అభిమానులం అంటూ ఎవరన్నా వచ్చినా వాళ్ళు చెప్పేది నవ్వుతూ వింటాడు, ఫోటోలు దిగుతాడు తప్ప పెదవి విప్పి పెద్దగా మాట్లాడడు. జానకిరామరాజు విషయం ప్రేక్షకుల ద్వారా జనార్దనానికి తెలిసిపోతుందేమో అన్న భయం లేకపోలేదు గాయత్రికి. అందుకే, అతన్ని క్షణమైనా  విడిచి పెట్టకుండా నీడలా తిరిగింది. అందర్లోనూ కలివిడిగా కలిసిపోతూ, ఇంగ్లీషు గలగలా మాట్లాడేస్తున్న భార్యని చూసుకుని గర్వపడ్డాడు జనార్దనం.

ఇండియాలో అడుగుపెడుతూనే గురువుగారి మరణవార్త చెవిన పడింది జనార్దనానికి. తెలిసిన క్షణం గాయత్రివైపు సూటిగా చూశాడు. ఒక్కసారి భయం కలిగిందామెకి. అయితే, పెదవి విప్పి ఏమీ మాట్లాడలేదు. అతను అడిగినప్పుడు చూద్దాం అనుకుంది. అడగలేదు జనార్దనం. 

ఇంటికి వస్తూనే తను సాధన చేసుకునే గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. వీణా నిక్వాణం నిర్విరామంగా వినిపిస్తూనే ఉంది గదిలోంచి. ఎప్పటికో బయటికి వచ్చిన జనార్దనం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. జానకిరామరాజు శిష్యులు కొందరు జనార్దనాన్ని కలిసి, గురువు గారి  స్మారకంగా ఏదన్నా సంగీత కార్యక్రమం చేస్తే బావుంటుందన్నారు. "మీరు చెయ్యండి," అనేసి  ఊరుకున్నాడతను. ఆవేళ, సంగీత ప్రపంచంలో జనార్దనాన్ని తిట్టని నోరులేదు. 

భర్త వైఖరి చూసి ధైర్యం చిక్కింది గాయత్రికి. విదేశాల్లో కార్యక్రమాల ఏర్పాటు మీద శ్రద్ధ చూపించడం మొదలుపెట్టింది. కోడలి ధోరణి బొత్తిగా కొరుకుడు పడలేదు నరసింహశాస్త్రికి. కొడుకు చెయ్యి జారిపోతాడేమో అని భయపడుతున్న మీనాక్షికి, కోడలు వట్టి మనిషి కాదన్న కబురు అగ్నికి ఆజ్యంలా జతపడింది.

జనార్దనం తల్లిదండ్రులకీ, భార్యకీ మధ్య మొదలైన యుద్ధం 'వైణిక' పుట్టేనాటికి పతాక స్థాయికి చేరుకుంది. పసిపిల్లని చూసుకున్న సంబరంలో జరుగుతున్న గొడవల్ని మర్చిపోయాడు జనార్దనం. వీణ తర్వాత రోజులో ఎక్కువ సమయం పసిబిడ్డ తోనే గడుపుతున్నాడు. అవును, వీణ తర్వాతే వైణిక. అయితే, అటు తల్లిదండ్రులు ఇటు భార్యా కూడా అతని రోజుల్ని ప్రశాంతంగా గడవనివ్వడం లేదు. 

ఆరునెలల క్రితమే గాయత్రి స్థిరపరిచిన సింగపూర్ టూర్, ట్రావెన్కోర్ సంస్థానంలో తండ్రి ద్వారా ఏర్పాటైన కచేరీ.. రెంటిలో ఏదో ఒకటి వదులుకోక తప్పని  పరిస్థితి ఎదురయ్యింది జనార్దనానికి. చాలా గొడవల తర్వాత సింగపూర్ టూర్ని రద్దు చేసుకున్నాడు. ఏనుగెక్కినంత సంబరపడ్డారు తల్లీతండ్రీ. 

ఒక్కసారిగా భగ్గుమంది గాయత్రి. వైణికని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. బిడ్డ కోసం అతడు రాకతప్పదన్న ధీమా ఆమెది. భార్య తనని అర్ధం చేసుకుంటుంది అనుకున్నాడే తప్ప, అలా చేస్తుందని ఊహించలేదు జనార్దనం. వైణిక లేని ఇంట్లో మొదటిసారిగా తన గురించి తను ఆలోచించుకోవడం మొదలు పెట్టాడు.

చుట్టూ ఉన్నవాళ్ళలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ఎవరిని దగ్గరికి రానివ్వాలి? ఎవరిని దూరం పెట్టాలి? ప్రతి ఒక్కరి మీదా అనుమానమే.. అందరినీ నమ్మేస్తే? ఎవరినీ నమ్మకపోతే?? ఇవన్నీ శేషప్రశ్నలుగా మిగిలిపోయాయి జనార్దనానికి. 

మనసుకి  దగ్గరివాళ్ళంటూ ఎవరున్నారు? ఎవరూ లేరు. తన ఈడు వాళ్ళ కన్నా తను ఎప్పుడూ పెద్దవాడే. పెద్దవాళ్ళ  ముందు ఎప్పటికీ చిన్నవాడే. చుట్టూ మహా శూన్యం.. ఏకాంతం.. పిచ్చెక్కించే ఏకాంతం.. మనశ్శాంతిని ఎక్కడ వెతుక్కోవాలో తెలియక, దొరికిన ప్రతి మార్గాన్నీ ప్రయత్నిస్తున్నాడు జనార్దనం.

రోజులు గడిచేకొద్దీ కచేరీ చేస్తుంటే వీణ తీగెలమీద యాంత్రికంగా వేళ్ళు కదులుతున్నాయే తప్ప మనసు పలకడం లేదు. ఎన్నో ఏళ్లుగా అతన్ని చూస్తున్న పక్క వాద్యగాళ్ళు గమనించారీ విషయాన్ని. ఎలా అతన్ని మామూలు చేయడం? అతనికి కచేరీలు ఉన్నన్నాళ్ళే వాళ్ళకీ వెలుగు. యాంత్రికంగా వీణ మీటడం తన వల్ల కావడం లేదు జనార్దనానికి. 

"కొన్నాళ్ళపాటు కచేరీలకి దూరంగా ఉంటే?" అన్న ఆలోచన వచ్చింది. ఆలోచించగా అదే మంచిది అనిపించింది కూడా. కానీ, తల్లిదండ్రులు ఒప్పుకోరు. అడ్వాన్సుగా బుక్ చేసుకున్న నిర్వాహకులు ఇబ్బంది పడతారు.. ఒకటి కాదు.. ఎన్నో సమస్యలు. "ఇంత చేస్తున్న నాకు మిగులుగున్నది ఏమిటి?" ఉన్నట్టుండి ప్రశ్నించుకున్నాడు.   

ఆవేళ, వీణని ముట్టుకోలేదు జనార్దనం. ఆ గదిని దాటుకుని పడకగదిలోకి వెళ్లి, ఫోటో ఆల్బమ్స్ అన్నీ చుట్టూ పెట్టుకుని కూర్చున్నాడు. తొలి కచేరీతో మొదలు పెట్టి, వరుసగా ఒక్కో సంవత్సరం ఫోటోలూ చూస్తూ నడిచి వచ్చిన దారిని నెమరువేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి గుండెల్లో సన్నగా మొదలైంది వణుకు.. వెన్ను నిమరడానికి గురువుగారు లేకనో ఏమో.. క్షణాల్లో అది పెరిగి పెద్దదయ్యింది.. ఒళ్ళంతా చెమటలు. భార్యా, బిడ్డతో తన ఫోటో.. బిడ్డ ముఖంలో బోసి నవ్వు.. కళ్ళు మసకబారుతున్నాయి.. ఒళ్ళు తిరుగుతోంది.. ఉన్నట్టుండి వాలిపోయాడు.

"అయ్యయ్యో.. ఏకాండీ వీణ తీగె తెగిపోయిందండీ.. వెంటనే బాగు చేయించాలి..." తల్లి గొంతు జనార్దన శాస్త్రికి వినిపించే వీలులేదు. 

(అయిపోయింది)

10 కామెంట్‌లు:

  1. మీరు ఈకథ రాసేటప్పుడు మాడొలిన్ శ్రీనివాస్ గారిని మనసులో పెట్టుకుని రాశారేమో అనిపిస్తోంది

    రిప్లయితొలగించండి
  2. అయ్యయ్యో... ఇదేం అపశ్రుతి... ఇలా, ఇప్పుడే ముగించేశారే... ఏదేమైనా... మహత్తరం. (ఇంతకీ, ఎవరిదైనా నిజజీవిత కథా?)

    రిప్లయితొలగించండి
  3. పాపం! జనార్ధనం స్వరాభిషేకం లో అన్నని వదులుకున్న తమ్ముడి లాగే అయ్యాడు.
    జానకిరామరాజు శిష్యులతో 'మీరే చెయ్యండి' అని జనార్ధనం అన్నప్పుడు ఇంక వీణావాణిని వదిలేస్తాడేమో అనిపించింది.
    కథనం చాలా చాలా బాగుంది మురళి గారు.

    రిప్లయితొలగించండి
  4. ఒక కళాకారుని జీవితాన్ని సంక్షిప్తచిత్ర రూపంలో చూసినట్లు ఉందండీ. కథనం చాలా బాగుంది, అలాగే రెండు పోస్టులకూ మీరు చిత్రాలు ఎన్నుకున్న తీరు బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. @నాగశ్రీనివాస: మాండొలిన్ శ్రీనివాస్ తో పాటు, మరికొందరు కళాకారుల గురించి నేను విన్న కొన్ని విషయాల ఆధారంగా అల్లుకున్న కథ అండీ.. ధన్యవాదాలు.
    @పురాణపండ ఫణి: సీరియల్ కాదండీ, కథే! కొందరు కళాకారుల జీవితాల గురించి విన్న విషయాలని కథలో ఉపయోగించానండీ.. ధన్యవాదాలు.
    @ధాత్రి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @జయ: భలే కనెక్ట్ చేసుకున్నారండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: వ్యాఖ్య చూడగానే 'వాహ్' అనుకున్నానండీ.. పిక్స్ ఎంచుకున్నప్పుడు, పబ్లిష్ చేసినప్పుడూ 'ఎవరైనా గమనిస్తారా?' అనుకున్నాను.. ఇక, ఒకప్పుడు రేడియోలో వారం వారం వినిపించిన 'రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం' అన్నమాట కూడా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది :)
    కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు.
    @నారాయణస్వామి: కచేరీల గురించి రాసేప్పుడు మిమ్మల్ని తల్చుకున్నానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఒక కళాకారుడికి కావలసినదేమిటో చక్కగా చెప్పారు. కథనం అద్భుతం.

    రిప్లయితొలగించండి
  8. @జ్యోతిర్మయి: కావలసింది పొందగలిగే వాళ్ళు తక్కువండీ.. కళాకారుల్లో అయితే ఈ శాతం మరీ తక్కువేమో అనిపించింది, కొందరి గురించి విన్నప్పుడు.. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి