గురువారం, జనవరి 03, 2013

లోపలి మనిషి

అతను బాగా చదువుకున్న వాడు. సమాజాన్ని గురించి -మరీ ముఖ్యంగా అసమానతల గురించి - బాగా తెలిసిన వాడు. వాటిని తొలగించడం అతని కల. అతనో స్వాప్నికుడు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కలలుకన్న సోషలిస్టు సమాజమే అతని కల కూడా. ఆ కలని నెరవేర్చుకోడం లో ఉన్న అడ్డంకులు అతనికి తెలుసు. అయినప్పటికీ అతనిదగ్గర ఓ స్పష్టమైన మార్గమూ, లక్ష్య సాధనకు అవసరమైన పట్టుదలా, మొండితనమూ ఉన్నాయి. అలాగని అతని మనసులో ఏముందో పొరబాటున కూడా బయట పడనివ్వడు. ఎందుకంటే అతడు అంతర్ముఖుడు. అతడిపేరు ఆనంద్.

విదేశీ మారక నిల్వలు మొత్తం హరించుకుపోయి, మన బంగారం నిల్వలు సైతం విదేశీ బ్యాంకుల తనఖాలో ఉండిపోయి దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సరైన సమయంలో 'నూతన ఆర్ధిక సంస్కరణలు' ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకుని ఇవాల్టి రోజున భారత దేశం అగ్రగామి దేశంగా ఎదగడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆత్మకథ లాంటి నవల - ఆంగ్ల 'ది ఇన్సైడర్' కి తెలుగు అనువాదం - 'లోపలి మనిషి' లో కథా నాయకుడు ఈ ఆనంద్. ఏడువందల యాభై రెండు పేజీల బరువైన ఈ పుస్తకంలో ఏ కొన్ని పేజీలు తిరగేసినా ఆనంద్ మరెవరో కాదు, పీవీనే అన్న సంగతి సులువుగానే బోధ పడుతుంది.

దేశానికి స్వతంత్రం వచ్చినా ఇంకా పరాయి పాలనలో ఉన్న ఆఫ్రోజాబాద్ సంస్థానంలో ఓ చిన్న ఊరు ఆనంద్ ది. భూములు చాలానే ఉన్నా, నీటి వసతి తక్కువ కావడం వల్ల పెద్దగా ఆదాయం లేని కుటుంబం, మధ్య తరగతి నేపధ్యం. చురుకైన విద్యార్ధి ఆనంద్ కళాశాల విద్య పూర్తయ్యే రోజుల్లోనే ఆఫ్రోజాబాద్ విముక్తి కోసం సాయుధ పోరాటం ప్రారంభమవుతుంది. దేశ భక్తుడైన ఆనంద్ స్వయంగా ఆయుధం పట్టి పోరాటంలో పాల్గొనడమే కాదు, రహస్య జీవితాన్నీ గడుపుతాడు. ప్రధాని నెహ్రూ చొరవతో ఆఫ్రోజాబాద్ కి విముక్తి లభించగానే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతాడు ఆనంద్.

ఎమ్మెల్యే గా గెలిచిన ఆనంద్ ముఖ్యమంత్రి మహేంద్రనాథ్, అసమ్మతినేత చౌదరి లతో సమదూరం పాటిస్తాడు. కొన్ని రాజకీయ పరిణామాల అనంతరం చౌదరి ముఖ్యమంత్రి కావడం, ఆనంద్ ని కేబినేట్ లోకి తీసుకుని వివాదాస్పద భూసంస్కరణల శాఖకి మంత్రిగా నియమించడం జరిగిపోతాయి. ప్రధాని నెహ్రూ కలలుకనే సోషలిజం సాధించడానికి భూసంస్కరణలు ఓ చక్కని మార్గంగా భావించిన ఆనంద్, వాటిని అమలు పరచి తీరాలని స్థిర నిర్ణయం తీసుకుంటాడు. అయితే భూస్వామ్య వర్గాల నుంచి వచ్చిన వత్తిడి, పార్టీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో అతని కృషి ముందుకు సాగదు.


రెండుసార్లు అదే శాఖ మంత్రిగా పని చేసిన ఆనంద్, ఇందిరాగాంధీ నామినేట్ చేయడంతో చౌదరి స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు కూడా అతడి మొగ్గు భూ సంస్కరణల వైపే. శ్రమదమాదులకి ఓర్చి తన లక్ష్యాన్ని చేరుకున్న ఆనంద్, అందుకు గాను ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు అన్నది పుస్తకం ముగింపు. స్వాతంత్రం తర్వాతి నాలుగు దశాబ్దాలలో దేశంలో జరిగిన అనేక పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలని కళ్ళ ముందు నిలిపే రచన ఇది.నెహ్రూ స్వప్నాలు దార్శనికత, ప్రజాభిమానం, పంచశీల సిద్ధాంతం, చైనా యుద్ధం (1962), నెహ్రూ అస్తమయం (1964), పాకిస్తాన్ యుద్ధం (1965), తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం (1966), ఇందిరా గాంధీ ప్రధాని కావడం, బంగ్లాదేశ్ అవతరణ (1971) లాంటి పరిణామాలని తనదైన కోణంలో వివరించారు పీవీ.

అంతే కాదు, రాజకీయ క్రీడ వికృత రూపం దాల్చడం, అవినీతి వేరు పురుగులాగా వ్యవస్థలొకి జొరబడడం, ఎగువ సభలకి జరిగే ఎన్నికలు డబ్బుమయం గా మారడం, రాష్ట్రంలో అసమ్మతి రాజకీయాలు, పైచేయి కోసం వర్గాల మధ్య పోరాటం...ఇలా ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా నిశితంగా చిత్రించారు. రాష్ట్రం పేరునీ, నాయకుల పేరునీ మార్చిన రచయిత, కేంద్రంలో ముఖ్య నాయకులని మాత్రం వారి పేర్లతోనే పరిచయం చేశారు పాఠకులకి. రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి, సదరు రాష్ట్ర నేతలని పోల్చుకోవడం ఏమంత కష్టం కాదు. ఓ మహిళా నాయకురాలితో తనకి గల సాన్నిహిత్యాన్ని గురించి వినిపించిన రకరకాల కథనాలని దాచే ప్రయత్నం చేయలేదు రచయిత. అరుణ పాత్ర ద్వారా విశదంగానే చెప్పారు.

ఓ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన అరుణ, ఓ ఉన్నతోద్యోగి భార్య. వైవాహిక జీవితం సంతృప్తిగా లేకపోవడంతో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే అవుతుంది. అప్పుడే ఆనంద్ కూడా ఎమ్మెల్యే కావడంతో, పార్టీ ఆఫీసులో జరిగిన వారి పరిచయం అసెంబ్లీలో పెరిగి పెద్దదవుతుంది. తన వైవాహిక జీవితం పట్ల అసంతృప్తి తో ఉన్న ఆనంద్, అరుణకి దగ్గర అవుతాడు. వారి సాన్నిహిత్యం, తర్వాతి కాలంలో ఆనంద్ మీద అతని ప్రత్యర్ధులు (సొంత పార్టీ వారే) బురద జల్లడానికి మంచి అవకాశంగా మారుతుంది. ఎన్ని జరిగినా ఆనంద్-అరుణ ల మధ్య బంధం బలపడిందే తప్ప, తెగిపోలేదు.

పీవీ నరసింహా రావు లోతైన ఆలోచనలకి అక్షరరూపం ఈ పుస్తకం. జరుగుతున్న ప్రతి పరిణామాన్నీ లోతుగా విశ్లేషించడం ఆనంద్ అలవాటు. తనపై కుట్రలు జరిపే వారితో ముఖాముఖి తలపడే మనిషి కాదు..కానీ తానేమిటో చేతల్లో చూపిస్తాడు. ఆనంద్ కి మంత్రివర్గంలో చోటిస్తూ, చౌదరి అతనికి పెట్టిన ముద్దుపేరు 'బృహస్పతి.' అతడు నిజంగానే బుద్ధికి బృహస్పతి అని నిరూపితమయ్యే సన్నివేశాలు బోలెడు. స్వతంత్రానంతర పరిణామాలు, దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనా, ఆసక్తి ఉన్నవారిని ఏక బిగిన చదివించే పుస్తకం ఇది. ఓ అంతర్ముఖుడి ఆలోచనా స్రవంతి. నెహ్రూని దైవ స్వరూపుడి గానూ, ఇందిర ను శక్తి స్వరూపిణి గానూ చిత్రించారు రచయిత. ఇందిర హత్య, రాజీవ్ ప్రధాని కావడం, రాజీవ్ హత్యానంతర పరిణామాల్లో ఆనంద్ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలని తన భుజాలకి ఎత్తుకున్నాడన్నపేరాతో పుస్తకం ముగిసిపోవడం కించిత్ నిరాశని మిగిల్చింది. (ఎమెస్కో ప్రచురణ, వెల రూ. 350, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

(బ్లాగ్మిత్రులు ఉమాశంకర్ గారికి కృతజ్ఞతలు)

4 కామెంట్‌లు:

  1. వావ్ నాకు ఇష్టమైన పుస్తకం గురించి ఇష్టమైన బ్లాగ్ లో ఇంకొకసారి :-) కానీ ఇంకొంచెం పెద్ద పోస్టు రాయాల్సింది కదా మురళి గారు :-(
    ఈ పుస్తకం , దీని తరవాత అసలేమి జరిగింది చదివితేకాని సిలబస్ పూర్తి కాదు అనిపించింది నాకు .
    నాకు అక్కడ ముగియటం పెద్ద నిరాశ గా అనిపించలేదు కానీ , డిసెంబర్ 6th అయోధ్య ఇది కొంచెం నిరాశ మిగిల్చింది , అంటే మరి నేను ఆ హైప్ చూసి కొంచెం ఎక్కువ ఆశించానేమో తెలియదు :-)
    థాంక్స్ మురళి గారు మంచి పుస్తకం గురించి రాసినందుకు !

    రిప్లయితొలగించండి
  2. *నెహ్రూని దైవ స్వరూపుడి గానూ, ఇందిర ను శక్తి స్వరూపిణి గానూ చిత్రించారు రచయిత*

    ఈ పుస్తకాన్ని నాలుగు సం|| క్రితం చదివాను. నాకు గుర్తునంతవరకు నెహ్రు, ఇందిరాగాంధి మీద ఆపుస్తకంలో చెప్పింది ఆనంద్ అభిప్రాయలు కావు అని నేనకుంటాను. అవి పార్టిలో,ప్రజలలో తండ్రి, కూతుర్ల మీద ఉన్న అభిప్రాయం. ఆనంద్ పాత్ర ద్వారా సూక్ష్మంగా పి వి గారు తన వాదనతో నెహ్రు లోని లోపాలను ఎత్తి చూపుతాడు. ఈ పుస్తకం మొత్తం లో ప్రజల కష్ట సుఖాల పైన, వాళ్ల ప్రవర్తన పైన, మీడీయా మీద ఆనంద్ అవగాహన చాలా ఆశ్చర్యం గొలుపుతుంది.

    రిప్లయితొలగించండి
  3. ఈ పుస్తకం నేను దుబాయ్ లో ఉన్నప్పుడు తెప్పించుకుని మరీ చదివానండి,ఇదొకటి,అబ్దుల్ కలాం (వింగ్స్ ఆన్ ఫైర్ కదా) అదీనూ.ఇలాంటి పుస్తకాలు ఎన్ని చదివితే ఈ కుర్రాళ్ళకి స్పూర్తి వస్తుందో మరి.

    రిప్లయితొలగించండి


  4. @శ్రావ్య వట్టికూటి: అంత పెద్ద పుస్తకాన్ని గురించి ఎంత రాసినా తక్కువే అవుతుందేమో కదండీ.... ధన్యవాదాలు

    @యుజి శ్రీరాం: అవునండీ... చాలా లోతైన పరిశీలన.. ఆశ్చర్యం కలిగిస్తుంది... ధన్యవాదాలు

    @ శ్రీనివాస్ పప్పు: నిజమేనండీ... ముందు చదవాలి కదా... పుస్తకం సైజు చూసే భయపడతారు చాలామంది.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి