బుధవారం, జనవరి 02, 2013

నమ్మకం

మనుషుల్లో నమ్మకం తగ్గిపోతూ ఉండడం అన్నది మొదటినుంచీ ఉన్నదేనా లేక ఈమధ్య కాలంలో వేగంగా జరుగుతున్న పరిణామమా అన్నది నన్ను చాలా రోజులుగా వెంటాడుతున్న సందేహం. సాటి మనిషి మీద నమ్మకం - ఆ మనిషి కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, పరిచయస్తుడు... ఇలా ఎవరైనప్పటికీ - బలహీన పడింది అనో, మొత్తానికి పోయింది అన్నదో ఈమధ్యన తరచూ వినిపిస్తున్న మాట. అలాగే "ఫలానా వాళ్ళు నన్ను నమ్మడం లేదు" అన్న ఫిర్యాదు కూడా. ఇచ్చిపుచ్చుకోవడం అన్నది నమ్మకానికీ వర్తిస్తుంది కాబట్టి, ఈ ఫిర్యాదు సహజమే.

ఇదివరకటి రోజుల్లో కుటుంబం మొత్తం ఇంటిపెద్ద చెప్పుచేతల్లో ఉండేది. ఆ పెద్ద ఏం చెబితే అదే చేసేవారు ఇంటిళ్ళపాదీ. ఆపూట చేయాల్సిన వంట మొదలు, ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు...ఇలా ఏ విషయమైనా ఒక్క మాట మీద జరిగిపోయేవి. 'పెద్ద వాళ్ళు మన మంచికోసమే ఆలోచిస్తారు' అన్న నమ్మకం బలంగా ఉన్న రోజులు అవి. ఒకవేళ, ఇంటిపెద్ద నిర్ణయం ఎవరికైనా నచ్చకపోయినా వెనుక మరొకరితో ఆ మాట చెప్పుకోవాల్సిందే కానీ, ముఖాముఖీ ఎదిరించడం అన్నది అరుదు.

వెనుకటి తరంలో వచ్చిన సాహిత్యం ఇప్పుడు చదువుతూ ఉంటే కొన్ని కొన్ని సంఘటనలు భలే ఆశ్చర్యంగా అనిపిస్తాయి. నాకు బాగా నచ్చిన పుస్తకం 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర' చదువుతుంటే ఆశ్చర్యమే కాదు, చాలా చోట్ల 'ఇది నిజమేనా?' ని కించిత్ అపనమ్మకం కలిగింది కూడా. ముఖ్యంగా శాస్త్రి గారు తన ఉద్యోగానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ తన గురువులకే వదిలేసి నిశ్చింతగా ఉండడం.. "ఈరోజుల్లో అయితే ఇది సాధ్యమేనా?" అని చాలాసార్లే అనిపిస్తూ ఉంటుంది.

ఈ నమ్మకం అనేది ఎందుకు తగ్గిపోతోంది? స్వార్ధం పెరిగిపోవడం, బతుకు పరుగు పందెం లో ముందు ఉండాలనో, వెనకబడిపోకూడదు అనో, ఎవరెలా పొతే మనకేమి అనే ధోరణి పెరిగిపోవడం, మనంతటి వాళ్ళం మనం..మన విషయాల్లో మరొకరి జోక్యం ఏమిటి అనో... ఇలా అనేకానేక కారణాలు కనిపిస్తాయి. వ్యక్తీ స్థాయిలో మొదలైన ఆలోచన ప్రభావం కుటుంబం మీద కనిపించడం, కుటుంబ బంధాల్లో వచ్చిన మార్పుల ప్రభావం సమాజం మీద ఉండడం అన్నది అనివార్యం. కుటుంబాలు అన్నీ కలిస్తేనే కదా సమాజం.

"మనుషుల మధ్య దూరం పెరిగిపోడంలో ప్రపంచీకరణ పాత్ర చాలా ఉంది" అంటారు మిత్రులొకరు. కలిసికట్టుగా ఉండే మనుషుల మధ్యన పోటీ మొదలయ్యిందనీ, ఈ పోటీ కారణంగానే మనుషులలో నమ్మకం తగ్గిపోతోందనీ తన వాదన. ఒకప్పుడు పల్లెటూళ్ళకి ఎవరన్నా కొత్తవాళ్ళు వెళ్ళినా చక్కని ఆతిధ్యం దొరికేదనీ, ఇప్పుడు మంచినీళ్ళు పుట్టడం కూడా కష్టం అయిపోతోందనీ చెప్పుకొచ్చారు. ఆలోచిస్తే కొంత నిజం లేకపోలేదు అనిపించింది.

మనుషుల్లో నమ్మకం అన్నది బొత్తిగా తగ్గిపోతే వైట్ కాలర్ నేరాలు ఇంతగా ఎందుకు పెరుగుతాయి? నమ్మితేనే కదా మోసం జరిగేది. నకిలీ బంగారం, మనీ సర్క్యులేషన్ స్కీములు, రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసే చిట్టీ కంపెనీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు చేసే ఏజన్సీలు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండడానికి కారణం జనంలో మిగిలిఉన్న నమ్మకమా లేక పెరుగుతున్న అత్యాశా? ఆలోచించాల్సిన విషయమే. ...మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎందరిని మనం మనస్పూర్తిగా నమ్మగలం? ఇది కొంచం కలవరపెట్టేప్రశ్న, హిపోక్రసీ కి తావులేకుండా మనకి మనమే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేసి చూద్దామా!!

6 కామెంట్‌లు:

  1. స్వార్ధం పెరగడమే కారణమేమో. రెండొవది అసూయ..ఇది మరీ ఘోరమైనది.ఆ అసూయను నియంత్రించాలిసినల్సిన బుద్ది తన పని తాను చేయకపోవడం కూడా కావచ్చు. ఆలోచించాల్సిన విషయమే.

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు మురళిగారు, ఆలోచించాల్సిన విషయమే ఇది.

    రిప్లయితొలగించండి
  3. చాలా సున్నితమైన విషయం..చాలా బాగా విశ్లేషించారు మురళిగారు.
    చాలా క్లిష్టమైన ప్రశ్నలు సంధించారు..జవాబులు దొరకడంలేదు..:((

    రిప్లయితొలగించండి
  4. 'మనంతటి వాళ్ళం మనం..'

    నిజమే!? ఎంతమంది అనుకుంటున్నారిలా?

    రిప్లయితొలగించండి
  5. @జ్యోతిర్మయి: అవునండీ... ధన్యవాదాలు

    @శ్రీ.దు.: ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి
  6. @ధాత్రి: నాకూ దొరకడం లేదండీ :( ధన్యవాదాలు

    @చాణక్య: లేకుండా అయితే లేరండీ... నెమ్మదిగా పెరుగుతున్నారు కూడా... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి