సాధారణంగా రచయితలు 'ఏం చెబుతున్నాం?' అన్న దానితో పాటు 'ఎలా చెబుతున్నాం?' అన్నది కూడా దృష్టిలోపెట్టుకుని కథలు, నవలలు రాస్తారు. అయితే, ఈ రెండో అంశాన్ని బొత్తిగా పట్టించుకోకుండా రావూరి భరద్వాజ రాసిన నవల 'కాదంబరి.' ఎంచుకున్న ఇతివృత్తం మంచిదే అయినప్పటికీ, కథ చెప్పే తీరులోనూ, పాత్రలని రూపు దిద్దడంలోనూ ఆయన గందరగోళ పడి, పాఠకులని గందరగోళ పరిచారు అనిపిస్తుంది, ఈ పుస్తకం చదవడం పూర్తి చేయగానే. ముప్ఫై ఐదేళ్ళ క్రితం తొలిసారి ప్రచురితమైన ఈ నవలలో చర్చించిన కొన్ని విషయాలు ఇవాల్టికీ చర్చనీయమే కావడం ఈ నవల విశేషం.
ఇది రామకృష్ణయ్య కథ. పేదరికాన్ని భరించలేక చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయిన రామకృష్ణయ్య అనేక రకాల ఉద్యోగాలు చేసి, సినిమా హాల్లో బ్లాక్ టిక్కట్లు అమ్ముతూ కోటీశ్వరుడైన చంద్రశేఖరం దృష్టిలో పడతాడు. దానితో అతని జాతకం పూర్తిగా మారిపోతుంది. జీనియస్ ఎక్కడున్నా ఇట్టే పట్టుకునే చంద్రశేఖరం రామక్రిష్ణయ్యని తన దగ్గర పెట్టుకుని తన వ్యాపారాల మెళకువలు నేర్పడం మాత్రమే కాదు, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు కూడా. పెళ్ళైన కొన్నాళ్ళకే ఆత్మాభిమానం విషయంలో బొత్తిగా రాజీ పడలేని రామకృష్ణయ్య భార్యతో కలిసి వేరు కాపురం పెట్టి, సొంతంగా కలప వ్యాపారం ప్రారంభిస్తాడు.
అంచెలంచెలుగా ఎదిగిన రామకృష్ణయ్య, ఉన్నట్టుండి ఒకరోజు తన వ్యాపారం మొత్తం కొడుక్కి అప్పగించేసి, 'మయూరాక్షి' నది మీద ప్రభుత్వం ఆనకట్ట కట్టాలంటూ పోరాటం మొదలు పెడతాడు. అధికార గణం లో ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన రామకృష్ణయ్యకి, అన్ని పార్టీల నాయకులూ స్నేహితులే. ఉన్నట్టుండి అతనీ పని ఎందుకు మొదలుపెట్టాడో ఎవరికీ తెలియకపోయినా, అతనితో పనులు ఉన్న వాళ్ళూ, అతను ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడనీ నమ్మిన వాళ్ళూ అతనితో చేతులు కలుపుతారు.
రామకృష్ణయ్యకి ఉన్న బలహీనత అతని కూతురు కౌముది. కూతురికోసం ఏమైనా చేస్తాడు ఆయన. కొడుకు మీద కూడా ఇష్టం ఉన్నా, మెజారిటీ తండ్రుల్లాగే కూతురంటే కొంచం ఎక్కువ ఇష్టం. తన తల్లితండ్రుల నుంచి తను పొందలేకపోయినది ఏమిటో బాగా తెలిసిన రామకృష్ణయ్య, పిల్లలని మాత్రం కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అంతేకాదు, కొడుకు, కూతురితో కలిసి విస్కీ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ తన సాయంత్రాలని ఆనందంగా గడపడం ఎలాగో బాగా తెలుసు. 'మయూరాక్షి' ప్రాజెక్ట్ కోసం రామకృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తుంది కౌముది. అక్షరాలా తండ్రి వెనుక నిలబడుతుంది.
అంత గొప్ప వ్యాపారస్తుడూ, పనులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వంతో విరోధం తెచ్చుకునే ఉద్యమం ఎందుకు మొదలు పెట్టాడు, ఇందులో కౌముది కి ఉన్న ఆసక్తి ఏమిటి, చివరకి ఆ తండ్రీ కూతురూ సాధించింది ఏమిటి అన్నదే 'కాదంబరి' నవల. "బాణ మహాకవి రచించిన 'కాదంబరి' సంస్కృతంలో వెలసిన తొలి వచన కావ్యం. ఈ మాటకి నానార్ధాలూ ఉన్నాయి. ఒకానొక కావ్య విశేషం, ఆడు కోయిల, గోరువంక, మద్యం, నవల మొదలైనవి. మీ నవల వచన కావ్యంలాగా ఉన్నది. ఇందులోని ప్రతి పాత్రా ఒక్కో రకమైన మాదకతతో జోగిసలాడి పోతూ ఉన్నది. పుస్తకానికి 'కాదంబరి' అన్న శీర్షిక నుంచండి అని సలహా ఇచ్చిన వారు డాక్టర్ రాఘవాచార్య గారు" అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు భరద్వాజ.
కథ మొదలైన తీరు చిత్రంగా ఉంటుంది. జగన్నాధం అనే అతను (ఇతని వృత్తి వ్యాపకాలు ఏమిటో నవలలో ఎక్కడా చెప్పలేదు) పేపర్లో వచ్చిన ఒక వార్త చూసి, అడవి మధ్యలో ఉన్న పాడుబడ్డ భవనం చూడడానికి బయలుదేరతాడు. అతని ప్రయాణం సాగుతూ ఉండగా ఉండగా అతనికి అడవి మధ్యలో ఓ పాడుబడిన కోట దగ్గర కౌముది కనిపిస్తుంది. 'ఈ కౌముది మనిషా? ఏదన్నా ఆత్మా?' అన్న సందేహంతో పేజీలు తిరుగుతూ ఉండగా, దగ్గరలోని గెస్టు హవుసులో రామకృష్ణయ్య ఏర్పాటు చేసిన పార్టీకి కౌముది కి అతిధిగా వెడతాడు జగన్నాధం. అప్పుడే పరిచయం అయిన జగన్నాదాన్ని అత్యంత ఆత్మీయుడిగా భావించిన రామకృష్ణయ్య, తన గతం మొత్తం చెప్పేస్తాడు, తను చేసిన తప్పులతో సహా.
అటు రామకృష్ణయ్య, ఇటు కౌముది జగన్నాధానికి ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తారో అర్ధం కాదు. అంతే కాదు, ఎన్నో ఎదురు దెబ్బలు తిని అటు జీవితంలోనూ, ఇటు వ్యాపారం లోనూ పైకి వచ్చిన రామకృష్ణయ్య ఇతరత్రా ప్రణాళికలు ఏమీ లేకుండానే 'మయూరాక్షి' ఉద్యమం మొదలు పెట్టడం, తన చుట్టూ జరిగే వాటిని ముందుగా ఊహించలేక కుంగిపోతూ, జగన్నాధంతో పంచుకోడవం ఇవన్నీ నాటకీయతని పరాకాష్టకి తీసుకెళ్ళాయి. రామకృష్ణయ్య పాత్రని చిత్రించిన తీరు, భరద్వాజ నవల 'పాకుడు రాళ్ళు' లో నాయిక మంజరి పాత్ర చిత్రణని జ్ఞాపకం చేసింది. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 164, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
హమ్మయ్యా, ఎట్టకేలకి నేను చదివిన ఒక పుస్తకం గురించి రాశారు! :)))
రిప్లయితొలగించండివెరీ ఇంట్రెస్టింగ్, మురళీ! నేనైతే మొత్తం కధంతా జగన్నాధం వైపు నించి చెప్పేదాన్నేమో! పుస్తకం చదివాక మీరన్నట్టే జగన్నాధానికి అసలు ప్రాధాన్యత లేదనిపించింది! ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పుస్తకం అతనితోనే మొదలై.. అతనితోనే ముగుస్తుంది! కాకపోతే, కాస్తాలోచిస్తే ఈ విచిత్రమైన పాత్రలు రామకృష్ణయ్య, కౌముది, ఆమె భర్త (పేరు గుర్తు రావడంలేదు)-- వీళ్ళని పాఠకులకి కూలంకషంగా పరిచయం చేయడానికి జగన్నాధాన్ని సృష్టించారనిపించింది! అతనో టూల్ మాత్రమే!
మారుమూల ఊరికి ప్రయాణం.. మయూరాక్షి నది.. ఆ కోట.. కౌముది పరిచయం.. ఇక్కడి వరకూ ఒక లైన్లో వెళ్లింది కానీ తర్వాత నించీ అన్ని అయోమయపు మలపులే! ఉన్నట్టుండి దఢేల్మని పాలిట్రిక్స్ గుమ్మరిస్తారు!!
ఈ పుస్తకం నచ్చిందో లేదో నేనైతే ఇప్పటికీ తేల్చుకోలేకున్నాను :))
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మీరు రామకృష్ణయ్యని మంజరితో పోల్చడం! నిజమే.. అదే స్ట్రాటెజిక్ థింకింగ్!!
బావుందండీ, మొత్తానికి నన్ను మళ్ళీ ఆ పుస్తకంలోకి నడిపించేశారు! థాంక్యూ! :)
రావూరి భరద్వాజ గారి "పాకుడు రాళ్లు " చదివాను. కానీ "కాదంబరి" చదవలేదు. మీ విశ్లేషణ బాగుంది. కాకపోతే మీ వివరణ చదివాకా ఈ నవల లో కథ సినిమాటిక్ గా ఉంది అనిపించింది ..మంచి టపా
రిప్లయితొలగించండి@నిషిగంధ: అవునండీ.. ఆ ప్రయాణం మధ్యలో కూడా ఏవో పిట్ట కథలు... రామకృష్ణయ్య తన ఫ్లాష్ బ్యాక్ మొదలు పెట్టె వరకూ అసలు కథ ఏమిటి అన్నది తెలియలేదు. కౌముది భర్త పేరు శంకరం, చిత్రమైన పాత్రే :-) ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండి@నవజీవన్ : సరిగ్గా పట్టుకున్నారు!! సినిమాటిక్ గానే ఉంది నవల... ధన్యవాదాలు..