శనివారం, జనవరి 19, 2013

పొత్తూరి 'ప్రేమలేఖ'

ఉషా కిరణ్ మూవీస్ వారి తొలి సినిమా 'శ్రీవారికి ప్రేమలేఖ' చూడని వాళ్ళు అరుదు. చిన్న కథకి చక్కటి హాస్యాన్నీ, ఇంచక్కటి సంగీతాన్నీ జోడించి తీసిన ఈ సినిమా కథని దర్శకుడు జంధ్యాలే రాశాడు అనుకుంటారు చాలామంది. కథ తను రాసుకోకపోవడమే కాదు, పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'ప్రేమలేఖ' నవలని యధాతధంగా తీసుకుని, సినిమాకి అవసరమైన అదనపు సన్నివేశాల్నీ, పాటలనీ మాత్రమే జోడించారన్న విషయం అర్ధం కాడానికి, సదరు నవలని చదవాలి.

ఆమధ్య ఎప్పుడో పుస్తకాల షాపులో డిస్ప్లే లో కనిపించిన 'ప్రేమలేఖ' నవలని కొని పట్టుకొచ్చి, తెలిసిన కథే కదా చదవొచ్చు లెమ్మని, చదవాల్సిన పుస్తకాల్లో జాగ్రత్త చేశాను. "లైట్ రీడింగ్ కోసం ఏదన్నా పుస్తకం" అనుకున్నప్పుడు, చెయ్యి మొదట వెళ్ళింది ఈ పుస్తకం మీదకే. అందరికీ తెలిసిన కథే అయినా, రెండు లైన్లలో చెప్పుకోవాలి అంటే, స్వర్ణలత అనే ఓ అమ్మాయి మనసు పెట్టి ఓ ప్రేమలేఖ రాసి, సోనీ అని సంతకం చేసి,కొంచం ఆకతాయి తనంగా దానిని చేతికొచ్చిన అడ్రస్ రాసి పోస్టు చేసేస్తుంది. ఆ ఉత్తరం చేతులు మారి మారి ఆనందరావు అనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి చేతిలో పడడమూ, ఉత్తరం చదివి అతగాడు సోనీతో పీకల్లోతు ప్రేమలో పడిపోవడమూ మిగిలిన కథ.

ప్రధాన పాత్రలవే కాదు, మిగిలిన ఏ ఒక్క పాత్రకీ కూడా పేరునీ, మేనరిజాన్నీ మార్చలేదు జంధ్యాల. ఆనందరావు తండ్రి పరంధామయ్య ముక్కోపి. తల్లి మాణిక్యాంబ పరమ సాత్వికురాలు. అన్నగారు బాబీగా పిలవబడే భాస్కర రావుకి పేకాట పిచ్చి. అతని భార్య అన్నపూర్ణ కి సినిమాలు చూడడం ఎంత ఇష్టమో, వాటిని శ్రీకారం నుంచి శుభం కార్డువరకూ భర్తకి వర్ణించి వర్ణించి చెప్పడం అంతకన్నా ఇష్టం. ఆనందరావు అక్క కామేశ్వరి, మేనమామ సూర్యంగా పిలవబడే సూర్య నారాయణ మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పుట్టింటి వాళ్ళు తన భర్తకి అల్లుడి మర్యాదలు సరిగ్గా చేయడం లేదన్నది ఆవిడ ఫిర్యాదు.


ఇక, కథానాయిక స్వర్ణలత ని వాళ్ళ నాన్నగారు బాగా చదువు చెప్పించి ఇందిరాగాంధీ అంతటి దాన్ని చేద్దాం అనుకుంటారు. కూతుర్ని కనీసం జిల్లా కలక్టర్ గా అయినా చూడాలి అన్నది ఆయన కోరిక. చదువుకోడం అన్నది స్వర్ణ కి బొత్తిగా సరిపడని వ్యవహారం. సినిమాలన్నా, నవలలన్నా ప్రాణం. కాబోయే వాడికోసం కలలు కంటూ ఉంటుంది. "నాన్నారూ, మీరింక సంబంధాలు చూడ్డం మొదలు పెట్టచ్చండీ! నాకు చదువు మీద ఇంట్రస్టు తగ్గిపోయింది" అని చెబుదాం అనుకుంటుంది కానీ, సిగ్గు మొహమాటం అడ్డొస్తాయి. "అసలు దానికి చదువు మీద దృష్టి లేదు. ఎంతసేపూ నవలలు చదవడం, సినిమాలు చూడ్డం, మంచం మీద బోర్లా పడుకుని గాడిదలాగా కబుర్లు చెప్పడం. ఏమన్నా అంటే నోరు పెట్టుకు పడిపోతుంది. వినయం విధేయత బొత్తిగా లేవు," ఇది వాళ్ళమ్మ గారి గోడు.

సోనీ ప్రేమలో మునిగితేలుతున్న ఆనందరావు పెళ్ళిచూపులకి వెళ్ళడానికి ఇష్ట పడక పోవడంతో, సూర్యం, కామేశ్వరి, బాబీ, అన్నపూర్ణ కలిసి బయలుదేరతారు, స్వర్ణని చూసి రాడానికి. బాబీని చూసిన స్వర్ణ కి 'అగ్ని పరీక్ష' నవలలో విష్ణు వర్ధన్ గుర్తొస్తాడు. సూర్యాన్ని చూసి 'అపస్వరం' నవలలో శ్యామూ లాగా ఉన్నాడని అనుకుంటుంది. ఇక అన్నపూర్ణకైతే, స్వర్ణ 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లో జయప్రద లాగా కనిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో బాబీకి ఆ సినిమా కథ మొత్తం చెప్పేస్తుంది కూడా. బాబీ స్నేహితులు 'మార్గదర్శి', 'హార్మనీ పెట్టె', 'కళ్ళజోడు' ల పేకాట ప్రహసనం సరేసరి.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కథకి కీలకమైన ప్రేమలేఖ గురించి. సినిమా కోసం వేటూరి 'శ్రీమన్మహారాజ...' అంటూ మొదలు పెట్టి అలవోకగా పాట రాసేస్తే, అచ్చంగా పదహారేళ్ళ కన్నె బంగారు లాగా జానకి పాడేస్తే వినేశాం కదా మనం. నవలలో మాత్రం ఏడున్నర పేజీల ఉత్తరం. లేత గులాబీ రంగులో 'కునేగా' పరిమళాలు వెదజల్లే కాగితాల మీద స్వర్ణ పొందికగా రాసిన లేఖ. పెళ్లి కాని కుర్రాళ్ళని ఊహల్లో తిప్పి తిప్పి అక్కడే నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చే ఉత్తరం. 'సినిమా చూసేశాం కదా... ఇంకేం చదువుతాం' అని ఏమాత్రం అనుకోనక్కర్లేని నవల ఇది. (శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురణ. పేజీలు 142, వెల రూ.80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

6 కామెంట్‌లు:

  1. ఈ నవల గురించి విన్నాను కాని చదవలేదు.
    ఈసారి దొరికినప్పుడు కొనాలి.
    ఇక సినిమా, ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు.

    రిప్లయితొలగించండి
  2. అయితే జంధ్యాల చేర్పులు, మార్పులు పెద్దగా లేవన్నమాట! ఆసక్తికరంగా ఉంది. చదవాలండీ! మంచి రివ్యూ.. ధన్యవాదాలు!

    కునేగా పరిమళం.. !! వీక్లీల మధ్య పేజీల్లో.. మరిచిపోలేని కునేగా మరికొళుందు పరిమళం.. గుర్తుంది గుర్తుంది. :)

    రిప్లయితొలగించండి
  3. @పురాణపండ ఫణి : తప్పక చదవండి, మిమ్మల్ని నిరాశ పరచదు.. 'లైట్ రీడింగ్' అని మాత్రం గుర్తు పెట్టుకోండి :-) ధన్యవాదాలు

    @బోనగిరి: నవల కూడా ఎక్కడా బోర్ కొట్టదండీ... ధన్యవాదాలు..

    @కొత్తావకాయ: 'గుర్తుకొస్తున్నాయి...' పాడేసుకున్నట్టున్నారు కదూ :-) ..ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  4. నా కంప్యూటర్లో అందుబాటులో ఉండేసినిమాల్లో ఇదీ ఒకటండీ :-) మొత్తానికి సినిమా చూసినా నవలకూడా చదివి తీరాల్సిందే అంటారు. ఈసారి ఎక్కడైనా తారసపడితే వదలనులెండి :-))

    రిప్లయితొలగించండి
  5. @వేణూ శ్రీకాంత్ : అస్సలు వదలకండి.. మీరు ఎంజాయ్ చేస్తారు పుస్తకాన్ని... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి