మంగళవారం, జనవరి 22, 2013

రత్తాలు-రాంబాబు

కొన్ని రచనలు చదువుతున్నప్పుడు నవ్వు ఆపుకోడం మన వల్ల కాదు. మరికొన్ని ఇందుకు భిన్నంగా, చదువుతున్నంత సేపూ ఒకలాంటి విషాదంలో ముంచెత్తుతాయి. ఓ తెలుగు రచన చదువుతున్నంత సేపూ పాఠకులకి నవ్వునీ, దుఃఖాన్నీ ఏకకాలంలో అనుభవంలోకి తెచ్చిందీ అంటే నిస్సందేహంగా అది రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనే అవుతుంది. సాహితీలోకం 'రావిశాస్త్రి' అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ఉత్తరాంధ్ర ప్లీడరు గారు, జీవితాలని చదివి పుస్తకాలు రాశారు. వేశ్యా వృత్తిని ఇతివృత్తంగా తీసుకుని రావిశాస్త్రి రాసిన నవల 'రత్తాలు-రాంబాబు.'

అనగనగా ఓ రత్తాలు. శృంగవరపు కోట పక్కనున్న ఓ పల్లెటూళ్ళో ఉండే పెళ్ళికాని పిల్ల. తల్లీ తండ్రీ చనిపోతే, పెద్దమ్మ జాగ్రత్తగా పెంచుకు వచ్చింది. గురజాడ వారి 'కన్యాశుల్కం' నాటకం లో బుచ్చమ్మ లాగా బొత్తిగా అమాయకురాలు. అందగత్తె రత్తాలు కి ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. కారణం చెప్పీ, చెప్పకుండానూ వాటిని తిరగ్గొట్టేస్తూ ఉంటుంది పెద్దమ్మ. తన ఈడు వాళ్ళు అప్పుడే పిల్లలని ఎత్తుతూ ఉండడంతో తనకింక పెళ్లి కాదేమో అన్న బెంగ మొదలవుతుంది రత్తాలుకి. అప్పుడు వస్తాడు, పట్నం నుంచి వాళ్ళ దూరపు బంధువు సింహాచలం. మాంచి నిఖార్సైన పూలరంగడు. రత్తాలుని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. పెద్దమ్మ ఉలకదు పలకదు. కార్యసాధకుడు సింహాచలం. రత్తాలుతో స్నేహం చేసి, పట్నంలో తనెంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడో, పెళ్ళాం పిల్లల్ని ఎంత బాగా చూసుకోగలడో వర్ణించి చెప్పి, ఓ రాత్రి వేళ రత్తాలుని లేవదీసుకు పోతాడు, అచ్చం గిరీశం లాగానే.

అయితే, సింహాచలం గిరీశం అంత మంచివాడు కాదు. అందగత్తె రత్తాలుని పట్నంలో పేరుమోసిన నరసమ్మ కంపెనీకి వెయ్యి రూపాయలకి అమ్మేస్తాడు. తను అమ్ముడుపోయిన విషయం రత్తాలు కి తెలియదు. అది సింహాచలం బంధువుల ఇల్లు అనుకుంటుంది. దానికితోడు, నరసమ్మ కూడా రత్తాలు మీద ఎంతో ఆదరం చూపిస్తుంది. నరసమ్మ కంపెనీలో ఉండే అమ్మాయిల్లో చురుకైనదీ, తెలివైనదీ ముత్యాలు. 'అప్పా' అంటూ మాట కలిపి రత్తాలుకి దగ్గర అవుతుంది. రత్తాలు చెడి నరసమ్మ ఇంటికి రాలేదనీ, మోసపోయి వచ్చిందనీ గ్రహిస్తుంది. 'కన్యాశుల్కం' మధురవాణి లాగానే మంచి మనసు ముత్యాలుది. నరసమ్మకి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేసి, రత్తాలుని ఆ రొంపి నుంచి బయటికి పంపాలి అనుకుంటుంది. కానీ అదంత సులువైన పని కాదు. నరసమ్మ ఒకప్పుడు పోలీసుల మనిషి. ఓ ఎస్సై గారి ఇలాకా. ఆ ఎస్సై గారు కాలం చేశాక కూడా పోలీసులతో సంబంధాలు కొనసాగిస్తోంది. 'గంగరాజెడ్డు' (హెడ్ కానిస్టేబుల్ గంగరాజు) కి నరసమ్మ మీద తగని మక్కువ. కౌన్సిలర్లు, ప్లీడర్లు, ఆఫీసర్లు ఇలా అందరితోనూ సత్సంబంధాలు నెరపుతూ కంపెనీని నడుపుకు వస్తూ ఉంటుంది నరసమ్మ.


అనగనగా ఓ రాంబాబు. మాంచి తెలివైన వాడు. అతనికి ఉన్నలోపం అల్లా ఒక్కటే, తండ్రి లేకపోవడం. తండ్రి, తల్లిని మోసం చేశాడు. ఆమె గర్భవతి అయ్యాక తెలియదు పొమ్మన్నాడు. ఆవిడ కోర్టుకెక్కి కేసు ఓడిపోయింది. స్కూల్ మేస్టారు ఉద్యోగం చేస్తూ కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఎమ్మే పాసైన రాంబాబుకి ఇన్కంటాక్స్ కమిషనర్ గారబ్బాయి కృష్ణతో స్నేహం. ఐఏఎస్ పరీక్షలకి వెడుతున్న కృష్ణ, రాంబాబు చేత కూడా ఆ పరీక్ష రాయిస్తాడు. రాంబాబుకి తనకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకం కృష్ణకి. క్లాస్మేట్ వసంతని ప్రేమించిన రాంబాబు, ఆమెని చూడడం కోసం కృష్ణ ఊరు వస్తాడు. ఆ ఊళ్లోనే నరసమ్మ కంపెనీ ఉంది. రత్తాలు ని పట్నం తీసుకు రాక మునుపే, సింహాచలం ఏం చేశాడంటే - బంగారప్ప కంపెనీ నుంచి ఐదొందలు 'అడ్మాన్సు' తీసేసుకుని, జల్సా చేసేశాడు. ఇప్పుడు, తెచ్చిన 'సరుకు' తనది అన్నది బంగారప్ప వాదన. రత్తాలుకి అనారోగ్యం చేస్తే, ఆమెని రిక్షాలో ఆస్పత్రికి తీసుకెడుతుంది ముత్యాలు. బంగారప్ప రౌడీలు దారికాసి, రత్తాలు ని ఎత్తుకు పోబోతూ ఉండగా రాంబాబు ఆమెని రక్షిస్తాడు. రౌడీలని తప్పించుకుని ఆస్పత్రికి వెడతారు రత్తాలు, ముత్యాలు.

అదే రాత్రి, 'చిన్మా' నుంచి తిరిగి వస్తున్న ముత్యాలు, రత్తాలు ల కంట పడతాడు రాంబాబు. నడిరోడ్డుమీద జ్వరంతో అపస్మారకంలో పడి ఉంటాడు. అతన్ని కంపెనీకి, అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్ళి సేవలు చేస్తారు ముత్యాలు, రత్తాలు. తనకి తెలియకుండానే రాంబాబు తో ప్రేమలో పడిపోతుంది రత్తాలు. గాలి మేడలు కట్టుకోవద్దని అప్పని హెచ్చరిస్తూ ఉంటుంది ముత్యాలు. కోటీశ్వరుడు 'పిచ్చి' జోగులుకి ముత్యాలు అంటే పిచ్చి. ఆమెకి నెలజీతం ఇస్తూ ఉంటాడు. మరోపక్క, యువకుడైన 'రిక్షా' జోగులు ముత్యాలుని ప్రేమిస్తాడు. ఎప్పటికైనా ఆమె నరసమ్మ చెరనుంచి బయటికి రాగలిగితే, ఆమెని పెళ్లి చేసుకోవాలి అన్నది అతని కల. రిక్షా జోగులు అంటే ముత్యాలుకీ ఇష్టమే. వీళ్ళందరి కథలూ ఏ తీరం చేరాయన్నదే 'రత్తాలు-రాంబాబు' అసంపూర్ణ నవల. నిజానికి 554 పేజీల ఈ నవల అసంపూర్ణం అన్నభావన కలగలేదు నాకు. మార్క్సిజాన్ని అమితంగా ఇష్టపడే రావిశాస్త్రి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో (1975-77) జైలు జీవితం గడుపుతూ రాశారు ఈ నవలని.

రావిశాస్త్రి ఎప్పుడూ పేదల పక్షమే. పేదవాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో చెప్పి ఆగిపోలేదు, అలా ఉండడానికి కారణం ఏమిటో కూడా విశదంగా చెప్పారు ఈ నవలలో. ఉన్నత, పేద, మధ్యతరగతి మనస్తత్వాలని చిత్రించిన ఒక సన్నివేశాన్ని మర్చిపోలేం. తన ఊరికి వెళ్ళిన రాంబాబు, రత్తాలు పట్ల కృతజ్ఞతగా ఆమెని నరసమ్మ చెర నుంచి విడిపించాలి అనుకుంటాడు. ఇది మధ్యతరగతి మనస్తత్వం. వెయ్యి రూపాయలు అప్పు చేసి, ఆ డబ్బుని కృష్ణకి పంపుతాడు. "మందులకి అయిన ఖర్చు అప్పుడే ఇచ్చేశాడు కదా.. మళ్ళీ ఇది ఎందుకు?" అనుకుంటాడు కృష్ణ, కోటీశ్వరుడు. తనకి డబ్బు వద్దనీ, డబ్బుకోసం తను రాంబాబుకి సేవ చేయలేదనీ తిరస్కరిస్తుంది రత్తాలు, కూటికి మాత్రమే పేద. 'కన్యాశుల్కం' లో ఉన్నట్టే, ఇందులోనూ ఒక 'మంచం' సన్నివేశం ఉంది. గంగరాజెడ్డు మంచం మీద నరసమ్మ తో సరసం నెరుపుతూ ఉండగా, మంచం కింద చిక్కుకున్న సింహాచలం పడ్డ పాట్లని చదవాల్సిందే.

రష్యన్ రచయిత చెహోవ్ కథ 'మిజరీ' ని తెలుగులోకి అనువదించడం ద్వారా తన పద్దెనిమిదో ఏట రెండో కథ రాసిన రావిశాస్త్రి, చెహోవ్ మరో కథ 'ది కెమీలెయన్' ఆధారంగా రాసిన ఓ సన్నివేశం, పోలీసు వ్యవస్థ పనితీరుని కళ్ళముందు ఉంచుతుంది. ఆయన సమాజాన్ని ఎంతగా పరిశీలించి రచనలు చేస్తారు అన్నది, ఈ నవల చదివిన వాళ్లకి సులువుగా బోధ పడుతుంది.రావిశాస్త్రి రచనలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. 'మనసు' ఫౌండేషన్ ద్వారా త్వరలో మార్కెట్లోకి రాబోతున్నట్టు భోగట్టా.

9 కామెంట్‌లు:

  1. "..మనసు' ఫౌండేషన్ ద్వారా త్వరలో మార్కెట్లోకి రాబోతున్నట్టు భోగట్టా...."

    రా వి శాస్త్రి గారి రచనా సర్వస్వం ఒక్కటే పెద్ద వాల్యూముగా మనసు ఫౌండేషన్ వారు ప్రచురించి చాలా కాలం అవటం ఆ పుస్తకాలు అమ్ముడయిపోవటం జరిగిపోయింది. వివరాలకు వారి వెబ్ సైట్ చూడండి.
    http://www.manasufoundation.com/
    http://www.manasufoundation.com/works/works-done/books/books-complete-works/

    రిప్లయితొలగించండి
  2. అడుగడుగునా కన్యాశుల్కం!! రావిశాస్త్రిగారికి ఆ ఆలోచన ఉండే రాసారో, కాకతాళీయమో కానీ, మీరు పోల్చుకున్న తీరు చూస్తే మహముచ్చటగా ఉందండీ! సమీక్ష ఎప్పటిలానే పుస్తకం దొరకబుచ్చుకుని చదవాలనిపించేలా ఉంది. ధన్యవాదాలు!

    మా ఉత్తరాంధ్ర ప్రజ మాత్రమే కాదు సాహిత్యాభిమానులందరూ కూడా మనసు ఫౌండేషన్ వారిని ఎంత అభినందించినా తక్కువే!!

    రిప్లయితొలగించండి
  3. చదువుతున్నంత సేపూ గుండెల నిండా గుబులే. రత్తాలు రాంబాబూ ఒకటవడం అసాధ్యమే అని అర్ధమవుతున్నా... తెలుగు సినిమాలోలా they lived happily ever after అన్న కంక్లూజన్ ఇస్తే బాగుండన్న దురూహ. ముత్యాలు వ్యక్తిత్వం ముందు మిగతా పాత్రలన్నీ మరుగుజ్జులైపోయిన భావన. ఇంకో ఆరేడు వందల పేజీలున్నా... పూర్తంటూ అయితే బాగుండేదన్న కోరిక. రావిశాస్త్రి జాతికి మోసం చేసిపోడం ఈ ఒక్కs నవల విషయంలోనే కాదనుకుంటా కదా. గుండెని మరోసారి కెలికేశారు మాస్టారూ.

    రిప్లయితొలగించండి
  4. మొన్నటి పుస్తక ప్రదర్శనలో రావిశాస్త్రి రచనల కోసం ఎంతగా వెతికానో! ఆ పబ్లిషింగ్ ఏదో త్వరగా జరిగాలని కోరుకుంటున్నా.

    రిప్లయితొలగించండి
  5. pl. also review raavi shaastri gaari 'sommalu ponaayandi' and 'moodu kathala bangaaram' too.
    review mee kalam dwaaraa choodaalani oka durooha! nijam chestaru kadoo..!!
    bhaskar.k

    రిప్లయితొలగించండి
  6. @శివరామ ప్రసాదు కప్పగంతు: మొన్ననే పతంజలి సాహిత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటే తెలిసిన కబురండీ, మరో ప్రింట్ వేస్తారని.. ధన్యవాదాలు

    @కొత్తావకాయ: సింహాచలం తన ఉద్యోగం గురించి గొప్పలు చెప్పే దగ్గర గిరీశం, బుచ్చమ్మ గుర్తొచ్చారండీ.. 'యద్భావం..తద్భావతి' కదండీ మరి.. ధన్యవాదాలు

    @పురాణపండ ఫణి: అవునండీ... రత్తాలు పాత్ర చిత్రణ...కొన్ని సన్నివేశాలు...మరీ ముఖ్యంగా రాంబాబుకి మందులు అవసరమైన రాత్రి సన్నివేశం..మరీ మరీ వెంటాడేస్తుంది. నాకైతే శాస్త్రి గారు నవల ఆపిన చోటే ముగింపు తీసుకోవచ్చు అనిపిస్తుంది.. మీరన్న అన్యాయం అయితే 'రాజు-మహిషి' విషయం లోనూ చేశారు ఆయన. ...ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  7. @నాగార్జున: ఒకసారి లిమిటెడ్ ఎడిషన్ ప్రచురించడం, కాపీలు అయిపోవడం జరిగిందండీ.. మరోసారి వేస్తారని వినికిడి... ధన్యవాదాలు

    @భాస్కర్: తప్పకుండానండీ... ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. రావి శాస్త్రి అన్ని రచనలూ ఒకటే పెద్ద పుస్తకంగా 1375 పేజీలు ఇక్కడ దొరకచ్చు ప్రయత్నించండి. వెల 400/- అప్పటి ధర.

    కాళీపట్నం రామారావు,
    సూర్య నగర్ ఎక్స్టెంషన్,
    విశాఖా బేంక్ కాలనీ,
    శ్రీకాకుళం-౫౩౨౦౦౧
    ఫోన్ 9440578506,0892 220069

    రిప్లయితొలగించండి
  9. @కష్టే ఫలే : కాపీలు అయిపోయాయి అన్నారండీ.. మళ్ళీ రావడం కోసం ఎదురు చూడాలి ఇక... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి