సోమవారం, జనవరి 21, 2013

పెళ్లి బేరాలు

ఇది నేను హైస్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతున్నప్పుడు జరిగిన సంగతి. ఆడపిల్లల మీద కొంచం ఎక్కువ శ్రద్ధ చూపించే కేవీబీ మేష్టారు హాజరు పట్టీ తీసుకుని ఒక్కో పేరూ చదువుతూ, రాని వాళ్ళు ఎందుకు రాలేదో కనుక్కుంటున్నారు. ఓ అమ్మాయి వంతు వచ్చేసరికి, ఆ ఊరి అమ్మాయిలందరినీ నిలబెట్టి నిలదీయడం మొదలు పెట్టారు. మేష్టారి ప్రశ్నలు తట్టుకోలేక వాళ్ళలో ఓ అమ్మాయి "ఆయమ్మికి పెళ్లి బేరాలండి," అని చెప్పెయ్యగానే, క్షణం ఆలస్యం లేకుండా క్లాసంతా గొల్లుమంది. మేష్టారు కూడా పాఠం పక్కన పెట్టి, పెళ్లి బేరాలని గురించి కొంచం రుచికరమైన ప్రసంగం చేశారు.

ఎందుకో తెలియదు కానీ, ఈ 'పెళ్లి బేరాలు' అనే మాట నాకు బాగా గుర్తుండి పోయింది. కించిత్తు జ్ఞానం కలిగాక, "ఎంత చక్కని మాట!! ఏ ముసుగులూ వేయకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది కదా ఆ అమ్మాయి" అనుకున్నాను కూడా. ఉన్నట్టుండి ఇది ఎందుకు గుర్తు వచ్చిందీ అంటే, ఆదివారం పూటా నా ఇంట్లో నేను టీవీ చూసుకోడానికీ, పుస్తకం చదువుకోడానికీ, చివరికి ఫోన్ మాట్లాడుకోడానికి కూడా వీలు లేకుండా మా వీధిలో 'వధూ వర పరిచయ వేదిక' ఏర్పాటు చేసేశారు. పేరులో మాత్రమే వధూవరులు కానీ, వచ్చిన వాళ్ళంతా పెద్దలే. తల్లి దండ్రులు, బంధువులు, మధ్యవర్తులు అని ముద్దుగా పిలవబడే 'పెళ్ళిళ్ళ బ్రోకర్లూ'ను.

అరుదైన కంఠ స్వరాలు కొన్నే ఉంటాయి. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి సినిమా ప్రకటనలు చదివే స్త్రీమూర్తి కంఠం అలాంటి వాటిలో ఒకటి. మా అదృష్టం ఏమిటంటే, అచ్చం అదేమాదిరి గొంతు కలిగిన ఓ స్త్రీమూర్తి మైకు అందుకుని వధూ వరుల వివరాలు మైకు అక్కర్లేని విధంగా చదవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల నాలుగు వీధుల్లో ఏ ఇంట్లోనూ కూడా ఒకరి మాటలు ఒకరికి వినిపించి ఉండవు, ఆ కార్యక్రమం అవుతున్నంత సేపూ. మధ్యమధ్యలో నిర్వాహకులు మైక్ అందుకుని ఆవిడకీ మాకూ కూడా విశ్రాంతి ప్రసాదించారు.

సేల్స్ ప్రమోటర్ల మొదలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వరకూ రక రకాల హోదాల్లో, రకరకాల నేపధ్యాలతో, దాదాపు ఒకేలాంటి కోరికలు కోరే వరులు. టీచర్లు, బ్యాంకు ఉద్యోగినులు, అక్కడక్కడా సాఫ్ట్వేర్ నిపుణులూ అయిన వధువులు. దాదాపుగా వరులందరి ఏకైకకోరిక "ఫామిలీ గర్ల్" అయితే, వధువుల కోరికలు "సాఫ్ట్వేర్ ఉద్యోగి అయి ఉండవలెను. నాలుగు సంవత్సరములకి మించి వయోభేదం ఉండరాదు." అదృష్టవ శాత్తూ, తల్లిదండ్రుల కోరికల జాబితా మైకులో చదవలేదు. సాఫ్ట్వేర్ కాక ఇతరత్రా ఉద్యోగాలు చేసే బ్రహ్మచారుల పరిస్థితి ఏమిటా అన్న ఆలోచన కలిగింది కాసేపు. సాఫ్ట్వేర్ రంగం, మిగిలిన మార్కెట్లతో పాటు మేరేజ్ మార్కెట్ మీదా బాగానే ప్రభావాన్ని చూపిస్తోంది అన్నమాట అనుకున్నాను.

నిర్బంధపు శ్రోతల యెడల దయ తలచి, యాంకరీ శిరోమణి గారికి బ్రేకు ఇచ్చిన ప్రతిసారీ నిర్వాహకులు చెప్పిన మాట ఒక్కటే. వాళ్ళందరూ చాలా కష్టపడి (మాలాంటి ఎందరినో కష్టపెట్టి) పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నా తగినన్ని పెళ్లి సంబంధాలు కుదరడం లేదట. అటు వరులకీ ఇటు వధువులకీ కూడా ఓ పట్టాన సంబంధాలు నచ్చడం లేదట. ఏళ్ళ తరబడి ఆ తల్లిదండ్రులే అన్ని వేదికలలోనూ కనిపిస్తున్నారుట. 'వీళ్ళ పని ఇలా వేదికలు ఏర్పాటు చేయడం వరకే కదా.. ఈ ఆవేదనలు ఎందుకూ?' అనిపించింది కానీ, వీళ్ళు మైకు వదిలితే ఆవిడ మైకు అందుకుంటారు అని గుర్తొచ్చి వీళ్ళ వేదన వినడమే మంచింది లెమ్మనిపించింది.

ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లినంత కాలం ఇలాంటి పెళ్లి సంతల అవసరం లేకపోయింది. వీలైనంత వరకూ ఆడపిల్ల పుట్టగానే ఉయ్యాలలోనే నిశ్చితార్ధం చేసేవాళ్ళు, మేనమామతోనో మేనబావతోనో. కానిపక్షంలో, వేలువిడిచిన బంధువో, కాలు విడిచిన చుట్టమో ఏదో సంబంధం పట్టుకొస్తే, చూసి ముడి పెట్టేసేవారు. ఉమ్మడి కుటుంబాలు నెమ్మదిగా అంతరించడం, మధ్యతరగతి ఆదాయం లోనూ, జీవిత విధానంలోనూ ఒక్కసారిగా మార్పు తోసుకుని రావడం దాదాపు ఒకేసారి జరిగింది. ఫలితమే, పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఏళ్ళ తరబడి తిరగడం. ఈ అవసరాన్ని తీర్చడం కోసం కార్పోరేట్ స్థాయిలో మాట్రిమొనీ సంస్థలు మొలకెత్తి, మొగ్గ తొడిగి పాతుకు పోవడమూను. చూడబోతే భవిష్యత్తు వీళ్ళది లాగే కనిపిస్తోంది.

10 కామెంట్‌లు:

  1. బావుందండీ. రోజురోజంతా (చిన్నచిన్న విరామాలతో) శ్రీలక్ష్మీగణపతీ ఫిలింస్ స్త్రీమూర్తి కంఠస్వరం లాంటి స్వరం వింటూ గడిపిన మీ ఓపికకి జోహార్లు. :)

    "రుచికరమైన ప్రసంగం" ఈమధ్యే తిరగేసానేమో.. ఓ కాలాతీతవ్యక్తి గుర్తొచ్చాడు. :)

    రిప్లయితొలగించండి
  2. పరిచయవేదికలంటే ఇట్లా రోడ్డుమీద జాతరలాగా ఉంటాయా మురళిగారు? నేనేదో ఒక క్లోజ్డ్ హాల్లో ఏర్పాటు చేస్తారు అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  3. పెళ్లి సంతలు ..పెళ్లి బేరాలు ..హ హ హ

    రిప్లయితొలగించండి
  4. ఎప్పటి మార్పులు అప్పుడు స్వాగాతిస్తున్నాము కాని
    వల్ల వెనుక ఉన్న లూప్ హోల్స్ ఇంతకూ ముందు బంధువులు చెప్పేవారు.ఇప్పుడు చెప్పే వాళ్ళు లేరు.అదే కొంచెం కష్టం

    రిప్లయితొలగించండి
  5. @శిశిర: అలా నవ్వి వెళ్ళిపోతే ఎలా అండీ? అది మందహాసమా? దరహాసమా లేక వికటాట్టహాసమా?? చెప్పండి కొంచం :-) ..ధన్యవాదాలు

    @కొత్తావకాయ: బావుందంటారా? నాకు మాత్రం ఆ రోజు ఏమీ బాలేదండీ :( ఇక పొతే, కాలాతీత వ్యక్తి ఇందిర తండ్రే కదూ? పాడ్కాస్ట్ షేర్ చేస్తే మేము కూడా వింటామండీ మీ రేడియో ప్రోగ్రాం.. ...ధన్యవాదాలు.

    @శ్రీ.దు: ఏమోనండీ.. మాకు మాత్రం మూడు నెలలకో, ఆరు నెలలకో ఓసారి ఇలా వీధిలో జరుగుతూ ఉంటాయి.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. @నవజీవన్: ఆవేళ జరిగిన కార్యక్రమం చూస్తె అలాగే అనిపించిందండీ మరి.. ధన్యవాదాలు

    @పురాణపండ ఫణి: మీకూ అదే ప్రశ్న.. అది అది మందహాసమా? దరహాసమా లేక వికటాట్టహాసమా?? చెప్పండి కొంచం :-) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  7. @శశి కళ : అవునండీ... నిజానికి ఎవరు ఏం చెప్పినా, చెప్పకపోయినా అదంతా ఓ లాటరీ వ్యవహారం :-) ధన్యవాదాలు

    @జీవన పయనం - అనికేత్ : ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి