బుధవారం, జనవరి 18, 2012

నాన్న-నేను

తల్లి తన బిడ్డల పట్ల చూపే ప్రేమని గురించి ఎన్నో దృష్టాంతాలున్నాయి. కానైతే, ఒక తండ్రి తన కొడుకుని ఎంతగా ప్రేమించగలడో చూపే ఉదంతాలు తక్కువే. నిజానికి, బిడ్డల పట్ల ప్రేమని 'ప్రకటించే' విషయంలో నిన్నమొన్నటి వరకూ 'తండ్రి' దురదృష్టవంతుడు మన సమాజంలో. అందుకే కాబోలు గడిచిన తరాల వారికి తల్లి అనగానే ప్రేమ, తండ్రి అనగానే భయం మాత్రమే గుర్తొస్తాయి. ఈ లోకం పోకడకి భిన్నంగా, గడిచిన తరంలోనే తన కొడుకు పట్ల అవ్యాజమైన అనురాగాన్ని ప్రకటించారో తండ్రి.

ఆ తండ్రి ప్రేమ ఎంతటిదంటే, ఐదో ఏడు నిండిన కొడుక్కి అక్షరాభ్యాసం చేయడానికి బదులుగా, చంకనెత్తుకుని తన వెంట ఊళ్లు తిప్పుకునేంత! డిగ్రీలు లేకపోయినప్పటికీ, స్వయం ప్రతిభతో ఆ కొడుకు ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించుకుంటే, కేవలం అతనికి దూరంగా గడపాలనే కారణానికి ఆ ఉద్యోగానికి వెళ్ళనీయనంత!! అలాగని ఆ తండ్రి అక్షరజ్ఞానం పామరుడేమీ కాదు. విఖ్యాత కవీ, పండితుడూ అయిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆ కొడుకు, తెలుగునాట తొలితరం కార్టూనిష్టుల్లో ఒకరైన బుజ్జాయి.

బుజ్జాయి వెలువరించిన ఆత్మకథ 'నాన్న-నేను' లో అత్యంత సహజంగానే సింహభాగం విశేషాలు కృష్ణశాస్త్రిని గురించే. కవిగా, సిని గీత రచయితగా, అభ్యుదయ వాదిగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన కృష్ణశాస్త్రి లో తెలియని కోణాలెన్నింటినో ఆవిష్కరిస్తుందీ పుస్తకం. కృష్ణశాస్త్రి తల్లిగారు సీతమ్మగారు, ఆగర్భ శ్రీమంతురాలు. నగల సవ్వడిని బట్టి ఆవిడ నడచి వస్తోందని గమనించేవారట అందరూ. కొడుకంటే అపరిమితమైన ప్రేమ ఆవిడకి. భావకవిత్వం రాసి, ప్రచారం చేస్తున్న కృష్ణశాస్త్రి పట్ల ఆగ్రహించిన పిఠాపురం రాజా 'దేవిడి మన్నా' (దేవిడి నుంచి బహిష్కరణ) విధించినా, కొడుకుని పల్లెత్తు మాట అనలేదు ఆవిడ. చదువు పూర్తవుతూనే సుబ్బలక్ష్మితో వివాహం జరిగింది శాస్త్రిగారికి.

సుబ్బలక్ష్మి గారి అకాల మరణం తో వ్యాకుల పడ్డ కృష్ణశాస్త్రిని మనిషిని చేయడం కోసం 'రాజహంస' తో రెండో పెళ్ళి జరిపించారు సీతమ్మ. కృష్ణశాస్త్రి-రాజహంసల తొలి సంతానమే బుజ్జాయి. అసలు పేరు సుబ్బరాయశాస్త్రి, కృష్ణశాస్త్రి పెదనాన్నగారి పేరు. బుజ్జాయి పుట్టాక కృష్ణశాస్త్రి గారికి కొడుకు తోడిదే ప్రపంచం. "శాస్త్రి బుజ్జాయికి పాలివ్వడం తప్ప అన్నీ చేస్తున్నాడు," ఈ మాటన్నది మరెవరో కాదు, కృష్ణశాస్త్రి గురువు రఘుపతి వేంకటరత్నం నాయుడు. మేనకోడళ్ళని (వింజమూరి సీత, అనసూయ) కో-ఎడ్యుకేషన్ లో చేర్పించి మరీ చదివించిన కృష్ణశాస్త్రి, బుజ్జాయిని బళ్ళో వెయ్యకపోవడం చాలా విమర్శలకే తావిచ్చింది.

అయితే, కృష్ణశాస్త్రి ధోరణి వేరు. విమర్శలని లెక్కపెట్టలేదు. "నాతో తిరగడమే వాడికి ఎడ్యుకేషన్" అని ఊరుకున్నారు. అదీ నిజమే అయ్యింది. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, నండూరి సుబ్బారావు, పింగళి లక్ష్మీకాంతం, శ్రీరంగం శ్రీనివాసరావు... వీరంతా ప్రముఖ కవి పండితులు మాత్రమే కాదు, బుజ్జాయిని ఎత్తుకుని తిప్పిన వారు కూడా. భావకవిత్వాన్ని గురించీ, బ్రహ్మ సమాజాన్ని గురించీ తండ్రి ఊరూరూ తిరిగి ఉపన్యాసాలు ఇస్తుంటే, ప్రేక్షకుల్లో కూర్చుని కాలక్షేపం కోసం పెన్సిల్ స్కెచ్చులు వెయ్యడం మొదలు పెట్టారు బుజ్జాయి. అడివి బాపిరాజు వంటి వారి సలహాలూ, సూచనలూ తన ప్రతిభని మెరుగు పెట్టుకోడానికి ఉపయోగపడ్డాయంటారు ఆయన.

సిని రచయితగా కృష్ణశాస్త్రికి పేరు తెచ్చిన 'మల్లీశ్వరి' సినిమానే బుజ్జాయి కెరీర్నీ మలుపు తిప్పింది. కథాచర్చల సమయంలో, తండ్రి పరోక్షంలో బీఎన్ రెడ్డి తన పట్ల జాలి చూపడాన్ని విన్న బుజ్జాయి, తనకంటూ ఓ మార్గం ఏర్పరుచుకోవాలని ధృడంగా నిర్ణయించుకుని కార్టూనుల మీద దృష్టిపెట్టారు. ఇక వెనుతిరిగి చూసింది లేదు. ఓ వంక తండ్రితో పాటు "జిప్సీ" లాగా తిరుగుతూనే, కార్టూనిస్టుగా తన కెరీర్ని కొనసాగించి తనకంటూ పేరు తెచ్చుకున్నారు బుజ్జాయి. పిన్న వయసులోనే కార్టూన్ పుస్తకాలు ప్రచురించినా, పెద్ద పెద్ద పత్రికలకి కార్టూన్ స్ట్రిప్స్ వేసినా తనని తాను నిరూపించుకొవాలనే తపనతోనే, అది కూడా తండ్రి నీడన ఉంటూనే.

ఆనాటి సిని, సాహితీ వాతావరణం, మద్రాసు, హైదరాబాదు జీవితాలు, రాజకీయ ప్రముఖులు కవులకిచ్చిన గౌరవం వంటి వాటితో పాటు, కృష్ణశాస్త్రి గారి చిత్రమైన అలవాట్లు, చివరి వరకూ కూడా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోకపోవడం లాంటి ఆశ్చర్యకరమైన విషయాలనీ చెబుతుందీ పుస్తకం. "చదువంటే బడిలో, గురువు ముఖత సాధించే విద్య అని తెలియని ఒక వ్యక్తి చెప్పిన కథగా, గడిచిన తరం వైభవాన్ని తన నీడలాగ వెంబడించిన ఒక అదృష్టవంతుని జీవితంగా ఊపిరి తిరగనీయకుండా చదివించే ఇతివృత్తమిది. ఒకనాటి ఆంధ్రదేశపు ఔన్నత్యాన్ని ఒరుసుకు సాగిన ఒక విచిత్రమైన, విభిన్నమైన బుజ్జాయి కథ ప్రతి పేజీలోనూ మిమ్మల్ని మిరుమిట్లు గొలుపుతుంది," అన్న ప్రకాశకుల మాటలో అతిశయోక్తి కనిపించదు.

కళాతపస్వి క్రియేషన్స్ ప్రచురించిన ఈ 196 పేజీల పుస్తకంలో కృష్ణశాస్త్రి అరుదైన ఛాయాచిత్రాలూ, బుజ్జాయి బొమ్మల కథల వివరాలూ అదనపు ఆకర్షణ. బుజ్జాయి నిజాయితీ, బోళాతనం అడుగడుగునా కనిపించి, ఆశ్చర్య పరుస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకం. (వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

7 కామెంట్‌లు:

  1. Am planning to buy this book tomorrow, incidentally i read your post this night. cool intro.

    రిప్లయితొలగించండి
  2. బాగుందండి. AVKF లో ఈ పుస్తకం లేదనుకుంటా కదా? చాలా రోజుల నుండి చదవాలనుకుంటున్న పుస్తకం.

    రిప్లయితొలగించండి
  3. వీళ్లబ్బాయేననుకుంటా కృష్ణశాస్త్రి దేవులపల్లి అని ఆయనీమధ్య "Ice boys in bell bottoms"

    రిప్లయితొలగించండి
  4. యథావిధిగా బావుంది మురళిగారు. కానీ మీరు కూడా ఇలా .. "అవ్యాజ్యమైన"??

    రిప్లయితొలగించండి
  5. @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
    @పురాణపండ ఫణి: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: చదవాల్సిన పుస్తకం కూడానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @పక్కింటబ్బాయి: అవునండీ, వీళ్ళబ్బాయే.. అతగాడి గురించి కూడా ఉందీ పుస్తకంలో.. ధన్యవాదాలు.
    @నారాయణ స్వామి: సరి చేశానండీ, టైపో అని గమనింప ప్రార్ధన :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి