మంగళవారం, జనవరి 10, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-4

"ఇవాళ మనం సింహాచలం చూడబోతున్నాం. అంటే రోజూ చూసే సింహాచలం కాదు. ఇది మహా పుణ్యక్షేత్రం," ఉదయాన్నే ప్రకటించాన్నేను. మా ఎదురింటి వాళ్ళ పనిమనిషి పేరు సింహాచలం. ఆవిడంటే మా వీధి వీధంతటికీ హడల్. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తల స్నానాల హడావిడి. "సూది పిన్నీసు కావా"లంటూ వచ్చింది ఇల్లాలు. "మంగళసూత్రంలో లేదా?" ప్రశ్న నోటి చివరివరకూ వచ్చి ఆగిపోయింది. "గుడి దగ్గర దిగగానే అమ్మేవాళ్ళు ఎదురొస్తార్లే," అన్నాను, ఆరేళ్ళనాటి సింహాచలాన్ని గుర్తు చేసుకుంటూ.

కారు నగరం దాటి, సింహాచలంలో అడుగు పెట్టడంతోనే కారు అద్దాలు దించాను, సంపెంగల పరిమళాలని ఆఘ్రాణించడం కోసం. సింహాచలం వెళ్ళినప్పుడల్లా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మరీ సంపెంగలు తెచ్చిచ్చే మిత్రులున్నారు నాకు. ఘాట్ రోడ్డు సగానికి పైగా కరిగిపోయింది, ఎక్కడా సంపెంగల జాడ లేదు. అంతేనా? కొండ పైకి వెళ్ళగానే కలిగిన మొదటి సందేహం, 'వచ్చింది సింహాచలానికేనా?' అని. అంతగా మారిపోయింది గుడి, ఆవరణ, అంతా. గుడిముందు విశాలమైన ఖాళీ స్థలం, కుడివైపున ప్రసాదం కౌంటర్లు మరియు గోకులం, ఎడమ వైపున అన్నసత్రం లాంటి నిర్మాణాలు.

సూది పిన్నీసులే కాదు, సంపెంగలు అమ్మేవాళ్ళూ కనిపించలేదు. ఒకే ఒక్క చల్ల బుట్ట మాత్రం కనిపించింది. 'ఏమైపోయారు వీళ్ళంతా?' సందేహం తొలిచేసింది నన్ను. ఊహించనంత రద్దీగా లేదు ఆలయం. కళ్యాణం జరుగుతోంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. క్యూలో కదులుతుంటే, కల్యాణ మండపం దగ్గర తిరునామాలు పెట్టుకున్న ఒకాయన ఎవరితోనో నవ్వుతూ మాటాడుతున్నారు. ఆ మందహాసం ఎంతగా నచ్చిందంటే, "ఎవరండీ ఆయన?" అని అక్కడే ఉన్న ఓ ఆచార్యులని అడిగాను. "వారు స్థానాచార్యుల వారు," అన్నారాయన. అర్చన చేయించుకుని, కప్ప స్తంభాన్ని కౌగలించుకుని, ఆలయం నుంచి బయటికి వస్తుండగా, అక్కడ కనిపించాయి సంపెంగలు, కేవలం ఒకే ఒక్క బుట్టలో. ఇంకా సీజన్ మొదలవలేదట.

చిన్న చిన్న దుకాణాలన్నింటినీ గుడికి ఎదురుగా కొంచం దూరానికి తరలించారు. మాలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళెవరో "అచ్చం తిరుపతిలాగా చేసేశారు కదూ" అనుకోవడం వినిపించింది. 'తిరుపతి ఒక్కటీ తిరుపతి లాగా ఉంటే చాలు కదా, సింహాచలాన్ని కూడా ఎందుకలా మార్చేయడం?' అనిపించింది కాసేపు. కనకమాలక్ష్మి గుడైతే అస్సలు ఆనవాలు పట్టలేని విధంగా మారిపోయింది. గుడి మొత్తం స్టీలు బారికేడ్ల మయం. గుడి పక్కనే కట్టిన ఓ బిల్డింగులోనుంచి మొదలుపెట్టారు క్యూని. అందులో చొచ్చుకుని వెళ్ళగా, వెళ్ళగా ఒక్క క్షణం దర్శనం. బయట పడ్డాక గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను.


భోజనానంతరం కైలాసగిరి ప్రయాణం. "కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల?" ప్రశ్న గుర్తొచ్చింది దారిపొడవునా. ఈ పార్కుని చూడాలని నేనెప్పుడూ అనుకోలేదు. పెద్దగా అంచనాలేవీ లేకుండానే బయలుదేరాను. కానైతే, వెళ్ళాక నచ్చడం మొదలుపెట్టింది. మొదట్లో చూసిన వ్యూ పాయింటే బాగా ఆకర్షించేసింది. ఆ కొండ మీద నుంచి సముద్రాన్నీ, నగరాన్నీ చూడడం చక్కని అనుభూతి. పార్కు నిర్వహణ కూడా చాలా చక్కగా ఉంది. బహుశా నిత్యం రద్దీ గానే ఉంటుందేమో. నెమ్మదిగా పార్కంతా చుట్టి వచ్చేసరికి కనుచీకటి పడింది. అప్పుడు చూశాం పార్కులో ఉన్న రైలుని.

ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమంటే, పదిహేను టిక్కెట్లు అమ్మగానే రైలు బయలుదేరుతుందిట. పార్కు చుట్టూ ఇరవై నిమిషాల్లో ఓ ప్రదిక్షణ చేస్తుందిట. రైల్లో ప్రయాణించే వారు పార్కుని కాక, నగరాన్ని చూడొచ్చుట. 'ఏం చూస్తాం' మొదలు 'చూసొద్దాం' వరకూ ఆలోచనలు సాగాయి. మేము రైలెక్కాక, మరో గ్రూపు కూడా వచ్చింది. కదిలిన రైల్లోనుంచి ఆకాశంలోకి చూస్తే, మబ్బు పట్టినట్టు ఉంది. ఒక్క నక్షత్రమూ కనిపించలేదు. తల దించితే వందల వేల నక్షత్రాలు. దీపాల వెలుగులో నగరమంతా నక్షత్రాలమయంగా కనిపించింది. కనిపించే దీపాలని బట్టి ఆ ప్రదేశం దై ఉంటుందో ఊహించుకోవడం. ఇరవై నిమిషాలు ఇట్టే గడిచిపోయాయి.

తిరిగి వస్తుండగా విశాఖని పరికించి చూశాను. మామూలు నగరం నుంచి మహా నగరంగా అతి త్వరగా మారిపోతోంది. ఎక్కడ చూసినా జనం జనం.. జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, పోలీస్ బరాక్స్.. ప్రాంతం ఏదైనా షాపులన్నీ జనంలో కిటకిటలాడుతున్నాయి. జనం ఎవరి కొనుగోలు శక్తి మేరకి వాళ్ళు తగిన మార్కెట్లలో బేరసారాలు చేస్తున్నారు. నగరంలో ఎక్కడా కూడా పార్కింగ్ ఫీజు సంస్కృతికి కనిపించలేదు నాకు. అంతటా ఫ్రీ పార్కింగే. హైదరాబాద్ తో పోల్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలూ తక్కువే. కాస్టాఫ్ లివింగ్ వేగంగా పెరిగిపోతోందన్న ఫిర్యాదు మాత్రం చాలామంది నుంచే విన్నాను.

సాంస్కృతిక మార్పు కూడా వేగవంతంగానే జరుగుతోన్నట్టుంది. ఎక్కడో తప్ప ఉత్తరాంధ్ర నుడికారం వినిపించలేదు. దీనిని అభివృద్ధి అనాలా లేక అస్తిత్వం మనుగడకి సవాల్ అనాలా అనే సందేహం కలిగింది నాకు. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను కానీ, ఆరాత్రి కలత నిద్రే పట్టింది నాకు. అవును, తెల్లవారు జామునే లేచి, మావాళ్ళని సిద్ధం చేసి ఆరుగంటలకల్లా రైల్వే స్టేషన్ చేరుకోకపోతే, అరకు వెళ్ళే కిరండొల్ పాసింజర్ రైలుని మిస్సైపోమూ మరి? (ఇంకా ఉంది).

7 కామెంట్‌లు:

  1. BAAVUNDANDI MEE YAATRA. NENU CHADUVUKUNNA VIZAG NU MEE TAPAA DWARAA MALLI GURTU CHESUKUNTUNNANU. SIMHACHALAM LO SAMPENGA LA TARUVAATA BAGAA DORIKEVI PANASA KAAYALU.

    NEXT ARAKU VELLARA? AITHE CHAAPARAYI BORRA CAVES GURINCHI CHEPPANDI :)

    రిప్లయితొలగించండి
  2. "ఆరేళ్ళ క్రిందటి సింహాచలం.."
    హ్మ్.. ఆరేళ్ళ తరువాత ఏడాదిన్నర క్రితం చూసినప్పుడు నాది ఇదే పరిస్థితి. మార్పు సహజం.. అనివార్యం. కానీ కొన్ని విషయాల్లో మార్పుని అంగీకరించలేం. :(

    రిప్లయితొలగించండి
  3. "కైలాస శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల?"
    awesome
    మీరింతగా సాహిత్యాన్ని జీవితంతో పెనవేసుకుంటారా? అద్భుతం

    రిప్లయితొలగించండి
  4. బాగుందండీ... పార్కింగ్ కి ఎక్కడా డబ్బులు అడగ లేదా? ఆశ్చర్యం..
    ఎక్కడ పార్క్ చేసినా పరిగెత్తుకు వచ్చేస్తారు ;);)

    రిప్లయితొలగించండి
  5. Murali garu i am vizag i became your fan by seeing this detailed description regarding vizag.

    రిప్లయితొలగించండి
  6. @శ్రీ: సంపెంగలు కొన్నైనా కనిపించాయి కానీ పనసకాయలు అస్సలు కనిపించలేదండీ :( ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: తట్టుకోడానికి సమయం పట్టిందండీ నాక్కూడా.. ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: ఆ ప్రదేశాన్ని చూడగానే అప్రయత్నంగా గుర్తొచ్చిందండీ.. అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @రాజ్ కుమార్: నిజమండీ.. నాకూ చాలా ఆశ్చర్యం.. ధన్యవాదాలు.
    @వర ప్రసాద్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి