శనివారం, జనవరి 07, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-1

సముద్రమంటే నాకిష్టం. చిన్న ధారగా పుట్టి, సన్నగా ప్రవాహం మొదలు పెట్టి, ఉరుకులూ పరుగులెత్తి, ఎందరికో అన్నం పెట్టే మా గోదారి చివరకి కలిసేది సముద్రంలోనే కావడం ఇందుకు ఒక కారణం. అదిగో, ఆ సముద్రంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలనీ చూసిరావాలనే సంకల్పంతో కుటుంబంతో కలిసి నాలుగు రోజుల ఉత్తరాంధ్ర యాత్రకి బయలుదేరాను. ఒకటి రెండు ప్రదేశాలు మినహా చూడాలనుకున్నవన్నీ చూడగలిగాం, కారు అద్దం నుంచి. ఆరేళ్ళ విరామం తర్వాత చూస్తున్నానేమో, చాలా మార్పే కనిపించింది నాకు.

మహాకవి శ్రీశ్రీలో కవితావేశాన్ని రగిల్చిన సముద్ర కెరటాలని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.. విశాఖతో సమ చరిత్ర ఉన్న భీమిలి అన్నింటా వెనుకబడే కనిపించింది, బీచీతో సహా. ఎంతో మంది పర్యాటకులు వస్తున్నా, కనీస సదుపాయాలు కానీ, పరిశుభ్రత కానీ లేవక్కడ. కారు భీమిలి వైపు పరుగులు తీస్తుండగా, దారంతా చేతిలో ప్లాస్టిక్ కవర్లు పట్టుకున్న పల్లె పడుచులు 'బాబూ..బాబూ.. బాబూ' అని అరుస్తూ కనిపించారు. ఇద్దరు ముగ్గుర్ని దాటి ముందుకు వెళ్ళాక అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో కారాపమన్నాను డ్రైవర్ని.

ఓ ప్లాస్టిక్ సంచీలో వేయించిన జీడిపప్పు. మొత్తంగా ఓ ఇరవై పలుకులు ఉంటాయేమో. 'యాబై రూపాయలు' అంది అమ్మే ఆవిడ. తెగే బేరం కాదనిపించి, కారు పోనిమ్మన్నాను. ఆవిడ అదాటున నా చెయ్యి పట్టేసుకుని, "నలబై ఇవ్వండి బాబూ.. పోనీ ముప్పై.. బాబ్బాబ్బాబూ..." అనడం మొదలు పెట్టింది. ఊహించని 'పాణిగ్రహణా'నికి బిత్తరపోయాన్నేను. మావాళ్ళకి మాత్రం కావలసినంత వినోదం దొరికింది. నా అవస్థ గ్రహించిన వాడై, డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. తోటల్లో రాలిన కాయలు ఏరి, కాల్చి అమ్ముతారని వివరం చెప్పాడు.

భీమిలి చూడగానే చలం గుర్తొచ్చాడు అప్రయత్నంగా. అక్కడ ఉన్నంతసేపూ గుర్తొస్తూనే ఉన్నాడు. తిరిగి వస్తూ 'ఎర్రమట్టి దిబ్బలు' చూడాలన్నాను నేను. ఆశ్చర్యం! అవి ఎక్కడున్నాయో తెలీదన్నాడు డ్రైవర్. నా పోరు పడలేక ఒకరిద్దర్ని వాకబు చేసి తీసుకెళ్ళాడు. రోడ్డుకి అటు పక్క తెల్లటి ఇసుకతో మెరిసిపోతున్న బీచ్.. ఇవతలి ఒడ్డున ఎర్రటి మట్టి దిబ్బలు. ఎన్నో తుపానుల్ని తట్టుకుని మరీ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాయవి. దట్టంగా పరుచుకున్న జీడిమామిడి తోటలూ, ఠీవిగా నిలబడ్డ సర్వీ చెట్లనీ చూసుకుంటూ రుషికొండ వైపు బయలుదేరాం.

ప్రయివేటు విశ్వవిద్యాలయం 'గీతం' ఎదురుగా ఉన్న రుషికొండ బీచీలో జనం పల్చగా ఉన్నారు. నిమ్మకాయ, కారం అద్దిన అపుడే కాల్చిన, లేత మొక్కజొన్న కండె తింటూ సముద్ర కెరటాలని చూస్తుంటే 'చిన్న చిన్న ఆనందాలు' అన్న మాట అప్రయత్నంగా గుర్తొచ్చింది. ఓ నవ్వూ వచ్చింది. భీమిలి బీచ్ లో పూర్తి పల్లెటూరి వాతావరణం కనిపిస్తే, రుషికొండ బీచ్ లో అర్బన్ పోకడలు కనిపించాయి. ఇనిస్టెంట్ ఫోటో తీయించుకోమంటూ వెంట పడే ఫోటోగ్రాఫర్లనీ, గుర్రం ఎక్కమని బలవంతం చేసే కుర్రాడినీ తప్పించుకుని ఆర్కే బీచ్ చేరేసరికి కనుచీకటి పడింది.

కాస్మోపాలిటన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా ఓ సాయంత్రం ఆర్కే బీచ్ చూస్తే చాలు. క్లబ్బులకీ, డిస్కోలకీ వెళ్ళక్కర్లేదు. విశాఖ 'అభివృద్ధి' ఎంత వేగంగా జరుగుతోందో తెలుసుకోడానికి కూడా ఈ బీచ్ ని మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో. బీచ్ రోడ్డుని మాత్రం ఒకప్పటి ట్యాంక్ బండ్ తరహాలో రూపుదిద్దారు. శ్రీశ్రీ మొదలు, రావిశాస్త్రి వరకూ రచయితలూ, అల్లూరి సీతారామ రాజు వంటి త్యాగధనులు, ఘంటసాల, ద్వారం వెంకటస్వామి నాయుడు తదితర కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేశారక్కడ!! నాక్కలిగిన ఆనందాన్ని వర్ణించలేను. గతంలో చూడలేదు వాటిని.

సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో సముద్రం మరింత అందంగా ఉంటుంది. మేము సూర్యాస్తమయ వేళలో మాత్రం చూడగలిగాం సముద్రాన్ని. ఆ సాయంత్రం వేళ, కెరటాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ తీరాన్ని తాకుతున్నాయి. వాటిని చూసి, ఒక్కసారిగా చిన్నపిల్లాడినైపోయి, గవ్వలేరే ప్రయత్నం మొదలు పెట్టాను. తొలి కెరటం ఓ ప్లాస్టిక్ కవర్నీ, రెండో కెరటం ఖాళీ కోక్ టిన్నునీ ఇచ్చాయి నాకు. నిరాశ ముంచుకొచ్చి, గవ్వలేరే ప్రయత్నం విరమించుకున్నాను. (ఇంకా ఉంది).

22 కామెంట్‌లు:

  1. మురళీ గారు నమస్తే..అండీ.. రెండు మూడు రోజులుగా అనుకుంటూ ఉన్నా... నెమలికన్ను కనబడటం లేదేమిటీ..అని. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ యాత్రా విశేషాలు బాగున్నాయి.ప్రకృతి ఒడిలో.. నెలకొన్న కాలుష్యం..మనుషులు సృష్టించినదే కదా...ఎక్కడికి వెళ్ళినా . అభివృద్ధి ప్రక్కనే.. అతి పేదరికం..చూడటం సర్వ సామాన్యమైన రోజులివి. మరిన్ని విశేషాల కోసం ఎదురు చూస్తూ.

    రిప్లయితొలగించండి
  2. //సముద్రమంటే నాకిష్టం. చిన్న ధారగా పుట్టి, సన్నగా ప్రవాహం మొదలు పెట్టి, ఉరుకులూ పరుగులెత్తి, ఎందరికో అన్నం పెట్టే మా గోదారి చివరకి కలిసేది సముద్రంలోనే కావడం ఇందుకు ఒక కారణం.//

    నిజమే.
    బాగుంది సవివరంగా వ్రాస్తున్న మీ యాత్ర....

    ప్లాస్టిక్ కవర్లు, కోక్ టిన్నులే కాదు... ఇంకా దారుణమైనవీ కనిపిస్తాయండీ ఒక్కోసారి. మీ నిరాశ చూసి నాకూ అలానే అనిపించింది. ప్రసిద్ధి పొందిన ప్రాంతాల్లో అలానే ఉంటుందిగ. (మనుష్యులు ఎక్కడుంటే అక్కడ కాలుష్యం కదండీ.)

    ఎవరికీ అంతగా తెలీని ఓ బీచ్‌కి వెళ్ళాకే తెలిసింది గవ్వల కోసమో, మరికొన్ని చిన్నిచిన్ని ఆనందాలకోసమో అయితే ఇలాంటివే వెతుక్కోవాలని. లెక్కలేనన్ని గవ్వలు ఇసుకనిండా ఉన్నాయక్కడ. అక్కడున్నన్ని రోజులూ సూర్యోదయం అవకముందే బీచ్‌లో కూర్చొని ఎదురుచూసేవాళ్ళం.. ఠీవిగా వచ్చే సూర్యుడి కోసం.

    సూర్యోదయపు ఎర్రటి వెలుగులో.. అలల్తో గుంపులుగా కొట్టుకొస్తున్న నత్తగవ్వలు...! ఇంతకు ముందు చూసిఉండని రంగురంగుల, అందమైన, బతికున్న గవ్వల్ని చూడ్డం... చాలా అద్భుతంగా అనిపించేది. ఆ గవ్వల్ని అందుకోవాలని సముద్రంలోపలికి పరుగులు పెట్టేవాళ్ళం. కిందామీదా పడి ఆడుకున్నాం. తెలీకుండానే చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాం.

    మనం ఎంత పెద్దయినా ప్రకృతిముందు చాలా చాలా చిన్నవాళ్ళమేనేమో.

    రిప్లయితొలగించండి
  3. భీమ్లీ లో సౌరిస్ నివసించిన ఆశ్రమం,చలం సన్నిహితులు చిక్కాల కృష్ణారావు గారిని కలిసారా?చలం గురించి బోల్డు కవుర్లు చెపుతారాయన.విశాఖ గురించి మాకు తెలిసినా మీరు సంతోషంగా చెపుతుంటే చదవాలనిపిస్తోంది.మిగతా భాగాలు కూడా త్వరగా రాసెయ్యండి.
    మల్లీశ్వరి.

    రిప్లయితొలగించండి
  4. ఓహో ఇంతా ఎక్కడా కనపడటం లేరు అనుకున్నా ఇలా యాత్రలికి వెళ్ళరా ? బావుదండి ట్రావెలాగ్ !

    నూతన సంవత్సర శుభాకాంక్షలు కొంచెం ఆలస్యం గా !

    రిప్లయితొలగించండి
  5. చివరికి మనసు మెలిపెట్టేసారు. కెరటాలు తెచ్చిన కోక్ టిన్నూ, ప్లాస్టిక్ బేగూ కాస్త బాధ కలిగించినా మిగిలినవన్నీ చదువుతూ ఉంటే మహసంతోషంగా ఉంది. మలిభాగం గురించి ఎదురుచూస్తున్నాను. :)

    తగరపొలస బొట్టి చెయ్యొట్టేసుకున్నాదేటి బాపూ! సరిపోనాది. :p

    రిప్లయితొలగించండి
  6. మురళిగారు కళ్లకి కట్టినట్టు రాశారు. మీపోస్ట్ చదువుతుంటే మళ్ళీ మా బీచ్‌లో నడుస్తున్నట్టు అనిపించింది. I miss those days :(

    రిప్లయితొలగించండి
  7. భీమిలిలో సద్గురు కందుకూరి శివానందమూర్తి గారిని చూడలేదా? కైలాసగిరి మాటేంటి? ఆంధ్రా యూనివర్శిటీలో పరీక్షలు రాయడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ కి క్లాస్ మేట్స్ రూంలో వారం రోజులు మకాం వేసి మహారాజభోగాలు జరిపించుకున్నాను. దాని వెనుకే కైలాసగిరి వెనుకవైపుకి వెళ్లి చూస్తే కనిపిస్తుంది. ఇంతాజేసి ఒక్కసారి కూడా కైలాసగిరి వెళ్లలేదు. మిగిలినవన్నీ ఎగ్జాంస్ అయ్యాకా ఒక రోజురోజంతా తిరిగి చూశాను. కైలాసగిరి మాత్రం చూళ్లేదు. అవన్నీ గుర్తొచ్చాయి మీ పోస్టు చూస్తూంటే.
    మిమ్మల్ని ఇన్నాళ్లకి బ్లాగ్ముఖంగా కలిసినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  8. "'చిన్న చిన్న ఆనందాలు' అన్న మాట అప్రయత్నంగా గుర్తొచ్చింది."
    మురళి గారూ మీ యాత్రా విశేషాలు బాగున్నాయండీ
    మిగతా విశేషాల కోసం ఎదురు చూస్తూ..

    రిప్లయితొలగించండి
  9. చాలా రోజులయ్యింది సార్ మీ పోస్ట్ చూసి.ఈ మధ్యన కనపడలేదూ?

    రిప్లయితొలగించండి
  10. "ఊహించని 'పాణిగ్రహణా'నికి బిత్తరపోయాన్నేను" fine:)

    రిప్లయితొలగించండి
  11. మేము కూడా శ్రీకూర్మం అరసవల్లి సింహాచలం కొన్నేళ్ళ కిందట చూసాం కానీ ఏం గుర్తులేదు. హడావుడి లేకుండా మళ్ళీ చూడాలి.

    ఇంతకీ కైలాస గిరి చూడలేదా ??

    రిప్లయితొలగించండి
  12. మా ఇసాపట్నం చూశారా.. సూపరు ;)
    happy new year అండీ..

    రిప్లయితొలగించండి
  13. నూతన సంవత్సర శుభాకాంక్షలండీ! ఏమయిపోయారా ఈ మధ్యన కనిపించటం లేదు అనుకున్నా! మీ బహు చక్కని వర్ణనతో సముద్రం మరింత అందాన్ని సంతరించుకుంది!

    రిప్లయితొలగించండి
  14. మా విసాపట్నానికి స్వాగతం. కొన్నాళ్ళ క్రితం ఊర్లో ఎవరూ లేరని బాధగా ఉండేది. మా చిన్నప్పుడు కలకలం గా వుండేది. దాదాపు 50 మంది కజిన్స్ !!! ఇప్పుడు పెళ్ళిళ్ళూ, వీసాలూ, ఉద్యోగాలూ, కాలేజీలూ వాళ్ళనందర్నీ ఊర్నించీ తీసుకుపోయాయి. అందరు పెద్దవాళ్ళూ, పెద్దాళ్ళయిపోయారు. ముసలితనం లో ఎదురుచూపుల కాలాన్ని గడుపేస్తూ ! విశాఖ బీచ్ లో పొద్దున్న చేపలు పట్టే తతంగాన్ని చూడడం ఒక మరువలేని అనుభవం. ఈ సారి ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  15. యాత్రలో ఉన్నారా. మామీద అలిగారేమో ననుకున్నాను. మా యూనివర్సిటీ, సింహాచలం చూసారా? చూసే ఉంటారు లెండి.బాగున్నాయి యాత్రా విశేషాలు.

    రిప్లయితొలగించండి
  16. విశాఖ చూసారా ? భలే. విశాఖనీ, అక్కడి సముద్రాన్నీ, రుషి కొండ, కైలాస గిరి ప్రాంతాలనీ చూడాల్సింే కానీ, వాటి అందాలు చెప్పడం అంత సుళువు కాదు. ఫొటోలు పెడితే ఇంకా బావుండేదేమో.

    విశాఖ పేరెత్తితే చాలు, ఎప్పటి కయినా విశాఖ పట్నం అనే మహా కావ్య రాస్తానని ఊరించిన శ్రీ.శ్రీ గారే గుర్తకు వస్తూ ఉంటారు.

    రిప్లయితొలగించండి
  17. @వనజ వనమాలి: మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.. మీరన్నది నిజం.. అన్నీ మనం సృష్టించినవే.. ధన్యవాదాలు.
    @గీతిక బి : నిజమండీ, పెద్దగా పేరు లేని బీచీలకి వెళ్ళడమే మంచిదనిపించింది నాక్కూడా.. మీరు వర్ణించిన సూర్యోదయం యెంత బాగుందంటే, బీచ్ కి మళ్ళీ వెళ్లాలని అనిపిస్తోంది.. 'ప్రకృతి ముందు చాలా చాలా చిన్నవాళ్ళమే' సత్యం!! ..ధన్యవాదాలు.
    @మల్లి: లేదండీ.. ఎవరినీ కలవడం కుదరలేదు.. మరోసారి తాపీగా వెళ్ళాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @శ్రావ్య వట్టికూటి: మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.. ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: చేతికి తగలగానే నా పరిస్థితి కూడా అదేనండీ.. ఆయ్.. బొట్టంత పని సేత్తాదనుకోలేదండి మరి!! ..ధన్యవాదాలు.
    @చాణక్య: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. @పక్కింటబ్బాయి: వారి ఆరోగ్యం బాలేదని విని ఆదిశగా ప్రయత్నించ లేదండీ.. బాగున్నాయ్ మీ అనుభవాలు! ధన్యవాదాలు..
    @రాజి: ధన్యవాదాలండీ..
    @చందు ఎస్: అవునండీ ఊళ్ళో లేను కదా.. ఇక వరుస టపాలు!! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @చిన్ని: :-) :-) ధన్యవాదాలండీ..
    @వాసు: తప్పక చూడండి.. ధన్యవాదాలు.
    @రాజ్ కుమార్: సెం టూయూ అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @రసజ్ఞ : పెద్ద ప్రసంసండీ.. ధన్యవాదాలు.
    @సుజాత: గతంలో చూశానండీ, చేపల వేట.. హడావిడి అంతా.. ఈసారి వీలవ్వలేదు :( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @బులుసు సుబ్రహ్మణ్యం: మీమీద అలగడమా?! ఎంతమాట.. యూనివర్సిటీ చూశామండీ.. ఎక్కువసేపు గడపడం వీలవ్వలేదు :( ధన్యవాదాలు.
    @పంతుల జోగారావు: మీ ఆర్తంతా అక్షరాల్లో కనిపించిందండీ.. శ్రీశ్రీ ఆ కావ్యం రాసి ఉంటే చాలా బాగుండేది కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి