మంగళవారం, ఆగస్టు 09, 2011

ఏవీ, సినిమాలు?

సమస్యలు రెండు రకాలు. ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ రావడం, మునుపు వచ్చింది కాక యేవో కొత్త సమస్యలు చుట్టుముట్టడం. నాకిప్పుడు వచ్చింది ఒకటోరకం సమస్య. చూడడానికి సినిమాలేవీ లేవు, థియేటర్లలో. అంటే బొత్తిగా లేకుండా పోలేదు కానీ, నాకు చూడాలి అనిపించే సినిమాలు లేవు. విక్రమ్-అనుష్కల 'నాన్న' తర్వాత మరో సినిమా చూడలేదు. నిజానికి ఆ సినిమానే మళ్ళీ చూద్దామా అనుకుని, విరమించుకున్నా. ఇలా చూసేందుకు సినిమాలు లేకపోవడం అనే సమస్య గతంలోనూ వచ్చిందే కాబట్టి దీనిని ఒకటోరకం సమస్యల జాబితాలో వేశానన్న మాట.

చిన్నప్పుడు విన్న ఏడు చేపల కథని గుర్తు చేసుకుని వేట మొదలు పెడితే, సినిమా.. సినిమా.. ఎందుకు రావడం లేదూ? అని అడగాలి. దక్షిణాదిలో అతి పెద్ద సినిమా పరిశ్రమ, బాలీవుడ్ తర్వాత దేశంలోనే అతిపెద్ద మొత్తాన్ని సినిమా నిర్మాణం మీద వెచ్చించే పరిశ్రమ, ఎలాంటి కఠిన నిబంధనలూ లేకుండా ఏ భాషా సినిమానైనా నేరుగానో, డబ్బింగ్ చేసో ప్రదర్శించుకోగలిగే అవకాశం ఇస్తున్న పరిశ్రమా అయిన తెలుగు సినిమా రంగంలో సినిమాలకి కరువు రావడం అన్నది నమ్మలేని నిజమే అయినా, ఇదిప్పుడు నమ్మాల్సిన విషయమే.

ఎందుకంటే, రెగ్యులర్గా సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల సినిమా థియేటర్లు మూత పడడమో, కల్యాణ మండపాలుగా మారిపోతూ ఉండడమో జరుగుతోందని మొన్నామధ్యన ఎక్కడో చదివాను. చిన్న చిన్న పట్టణాలకి కూడా విస్తరిస్తున్న మల్టి ప్లెక్స్లు, టీవీ చానళ్ళ కారణంగా పాత సినిమాలకి రీ-రన్ లేకపోవడం లాంటి సమస్యలు కూడా థియేటర్ల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయిట. ఉన్న సమస్యలు చాలనట్టుగా టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది. అయినప్పటికీ కూడా చాలా థియేటర్లు ఈ రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయిట.

జాగ్రత్తగా గమనిస్తే, సిని నిర్మాణంలో ఓ చిత్రమైన ట్రెండ్ వచ్చేసింది. చిన్న సినిమాల నిర్మాణం తగ్గిపోయింది. అదే సమయంలో పెద్ద సినిమాల నిర్మాణమూ భారీ ఎత్తునేమీ జరగడం లేదు. దీనివల్ల ఈ మధ్యన చాలా శుక్రవారాలు డబ్బింగ్ సినిమాలే మారుతున్నాయి, థియేటర్లలో. మొన్నామధ్య వరకూ చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం లేదనీ, ఇతరత్రా చాలా సమస్యలున్నాయనీ గొడవ చేసిన వాళ్ళు సైతం ఇప్పుడేమీ పెదవి విప్పడం లేదు. చూడబోతే ఇప్పుడు భారీ సినిమాలకీ, డబ్బింగ్ సినిమాలకీ మధ్య పోటీ నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది.

పోనీ అందుకుందామంటే, భారీ సినిమాల పరిస్థితీ ఏమంత బాగాలేదు. సక్సెస్ రేటు బాగా పడిపోయింది. పరిస్థితి ఎలా ఉందంటే, మొన్న ఉగాదికి విడుదలై ఫ్లాపైన ఓ కుర్ర హీరో భారీ సినిమా అతి త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కాబోతోంది. మరి కొన్ని సినిమాలు కూడా అదే వరుసలో ఉన్నాయి. హీరోలందరూ సినిమాల మీద కన్నా వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్ల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు ఉన్నారు. ఈ పెద్ద సినిమాలన్నీ అయితే ఒకేసారిగా విడుదలవ్వడం, లేకపొతే రిలీజన్నదే లేకుండా పోవడం జరుగుతోంది చాలా కాలంగా.

ఈ అతివృష్టి, అనావృష్టి వల్ల జరుగుతున్నది ఏమంటే అటు థియేటర్లకీ ఇటు ప్రేక్షకులకీ కూడా ఉంటే వరుసగా ఊపిరి సలపనన్ని సినిమాలు, లేకపొతే ఒక్కసారిగా బోలెడంత ఖాళీ. ప్రేక్షకులు టీవీ చూసన్నా కాలక్షేపం చేస్తారు కానీ, థియేటర్ల వాళ్లకి అలా కుదరదు కదా. థియేటర్ మీద ఆధారపడి బతికే ఉద్యోగులకి జీతాలివ్వాలి, ఇతరత్రా ఖర్చులుంటాయి. ఇవన్నీ గడవాలంటే సినిమా ఆడాలి, జనం రావాలి. సినిమా ఆడాలంటే ముందుగా సినిమా రిలీజవ్వాలి. అలా జరగాలంటే, మన హీరోలు మిగిలిన పనులు ఏం చేసినా, చేయకపోయినా వాళ్ళ వాళ్ళ సినిమాలని జనం మీదకి గుంపులుగా వదలకుండా ఒక్కొక్కటిగా వదిలితే బాగుంటుందేమో.. హిట్టయితే సరే, ఒక వేళ ఫ్లాపైతే మరో సినిమా ఏదీ లేని కారణానికైనా మరోవారం ఆడే అవకాశం ఉంటుంది కదా..

13 కామెంట్‌లు:

  1. మురళిగారు, మీకు తెలిసి అన్నారో తెలియక అన్నారో కాని (తెలిసే అని ఉంటారులెండి) ఈ మాట 'చిన్నప్పుడు విన్న ఏడు చేపల కథని గుర్తు చేసుకుని వేట మొదలు పెడితే'; నిజంగా చేపల కధకు 'మూల కారణ విశ్లేషణకు' (root cause analysis) కు సంబంధం ఉంది. అదేంటంటే మూల కారణ ఫలితాలను విశ్లేషించడానికి ఉపయోగించే 'ఇషికవ' చిత్రాలను 'ఫిష్-బోన్ డయాగ్రం' అని కూడా అంటారు. http://en.wikipedia.org/wiki/Ishikawa_diagram

    ఇక సినిమాల విషయానికి వస్తే..మీరన్నది నిజం, అందుకే ముందుజాగ్రత్తగా కొంతమంది నటులు వేరే దృశ్య మాధ్యమాలను ఎంచుకుంటున్నారలే ఉంది.

    రిప్లయితొలగించండి
  2. నా పరిస్థితి కూడా డిటో.. డిటో..

    "నాన్న" సినిమా తర్వాత, నేనొక్కడ్నే అప్పుడెప్పుడో చూసేసినా కూడా వేరే దారి(సినిమా) లేక "రంగం" రెండోసారి చూసేసా, శ్రీమతితో కలిసి.

    మరి ఎప్పటికి తీరేనో ఈ కరువు?

    రిప్లయితొలగించండి
  3. "వాళ్ళ సినిమాలని జనం మీదకి గుంపులుగా వదలకుండా ఒక్కొక్కటిగా వదిలితే బాగుంటుందేమో.." :))

    రిప్లయితొలగించండి
  4. తమిళ అనువాదాలు ఏ విభాగం చూసినా చాలా ఎక్కువ నాణ్యతతో ఉన్నాయి. మనవాళ్ళు దాన్నైనా అందుకోవాలి లేదా వాళ్లు తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్, కొందరు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్లను పెట్టి నేటివిటీకి తగ్గ ద్విభాషా చిత్రాలు చేసే ట్రెండు ప్రారంభించేస్తారు. ఇప్పటికే కార్తీ, విక్రం, సూర్య లాంటి హీరోలు డైరెక్టు తెలుగు సినిమాలు చేస్తామని బెదిరించేస్తున్నారు.
    ఇదే అంశం పైన నా బ్లాగులో విశ్లేషణ ఇది
    http://pakkintabbayi.blogspot.com/2011/08/blog-post.html

    రిప్లయితొలగించండి
  5. నిజమే మీరు చెప్పేది. మన సినిమాల పరిస్థితి దారుణం గా ఉంది. అందులోకి తమిళ సినిమాలతఒ కంపేర్ చేసుకుంటే ఇంకాను. అసలు ఈ యేడాది చూడదగ్గ సినిమా ఒక్కటన్నా ఉందా? "అల అమొదలయింది" కొంతలో కొంత నయం. అంతకుమించి మరొక్క సినిమా చెప్పండి? కానీ తమిళ్ లో కనీసం పది సినిమాలు చూపించొచ్చు అద్భుతంగా ఉన్నవి.

    మనకి ఒక విప్లవం రావాలండీ లాభం లేదు! ఎన్నాళ్ళని చూసినదే చూస్తాం చెప్పండి. ప్రేమ కథలు లేకుంటే నరుక్కోవడాలు ఇవేనా? ప్రాణం విసిగిస్తున్నారు. అటువైపు ఆ తమిళ్ సినిమాలు చూడండి ఎంత బ్రహ్మాండం గా ఉన్నాయో. ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం వస్తున్న వాటిలో కనీసం 60% సినిమాలు కొత్తగా బావుంటున్నాయి. ఈ మధ్య నేను చూసినవన్నీ అలాగే ఉన్నాయి. దైవతిరుమగళ్, కో, ఆడుగలం, కావలన్, యుద్ధం సెయ్, కాంచన...అన్నీ బావున్నాయి.

    తెలుగు సినిమా ఎప్పటికి ఎదుగుతుందో ఏమో!

    ఆ మధ్య వచ్చిన గమ్యం, వేదం, ప్రస్థానం, గగనం లాంటి సినిమాలు తప్పా, వైవిధ్యం ఏది? ఏదో అల్లరి నరేష్ సినిమాలు కొన్ని టైం పాస్ గా ఉంటున్నాయి హాస్యం వల్ల...అంతే తప్ప....లాభం లేదు ఏదో ఒకటి జరగాలి. థియేటర్లు ఖాళీ లేకుండా సినిమాలు ఆడాలి. ఆరోజు ఎప్పుడొస్తుందో!

    రిప్లయితొలగించండి
  6. చూడ్డానికి సినిమాలు లేవని మీరు రాశారు. నాకయితే ఇదో శుభవార్తలా అనిపిస్తుంది. మన " గొప్ప " హీరోల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవటం ఆనందదాయకం. సమీప భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  7. రాకపోవటం నయం.... వచ్చినా ఆడకపోవటం ఇంకా నయం. ఎన్నాళ్లు భరిస్తామండీ ఈ వారసత్వాల్ని ? తాతలని చూసి తండ్రులని భరించాము, ఇప్పుడు మనవళ్లని కూడా మన నెత్తిన రుద్దుతామంటే ఎలా ? డాన్సుల్లో చూపిస్తున్న ఇంట్రెస్టు నటనలో/వైవిధ్యంలో చూపిస్తే గాని ప్రేక్షకులు సినిమా హాళ్లకి రారు అని వీళ్లకి తెలిసేదెన్నడో ? విక్రం, సూర్య లాంటి వాళ్లు తెలుగు లో రికార్డులు నెలకొల్పినా ఆశ్చర్యం ఎమీ లేదు.

    రిప్లయితొలగించండి
  8. @శ్రీ: నిజంగా తెలియకే అన్నానండీ.. ఏడు చేపల వెనకాల ఇంత కథ ఉందని మీరు చెప్పే వరకూ తెలియలేదు.. ధన్యవాదాలు.
    @రవికిరణ్: కొంచం మంచి సినిమాలు వస్తే బాగుండునండీ.. ధన్యవాదాలు.
    @హరిచందన: :-) :-) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. @పక్కింటబ్బాయి: చాలా యాదృచ్చికంగా, నా టపా పోస్ట్ చేసిన వెంటనే మీ టపా చదివానండీ.. బాగా రాశారు.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: భారీ బడ్జెట్లకి అలవాటు పడిపోవడం వల్ల చిన్న సినిమాలు తీయలేక పోతున్నారండీ.. ఆ భారీ సినిమాలు తేడా చేస్తే పరిణామాలు కూడా భారీగానే ఉంటున్నాయి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @యరమణ: ఒకరకంగా శుభవార్తేనండీ.. కానైతే అప్పుడప్పుడూ చూడడానికైనా సినిమాలు ఉండాలి కదా.. అలా అలవాటైపోయింది :( ..ధన్యవాదాలు.
    @మయూఖ: నిజం.. మీరు చెప్పిన పరిస్థితి దగ్గరలోనే ఉందనిపిస్తోంది నాక్కూడా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కొరత తెలుగులోనే కాదు మురళి గారు. హిందీ (గత రెండు నెలలూ కాకుండా), ఇంగ్లీష్ సినిమాలలో లో కూడా ఉంది. మంచి ఇంగ్లీష్ సినిమా చూసి మూడు నెలలైంది.

    రిప్లయితొలగించండి
  12. @వాసు: అవునండీ.. గమనిస్తున్నాను. ఎక్కడా కనిపించడంలేదు సినిమాలు.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. Murali garu mee vivarana nu nenu poorthi ga angeekarinchaleka pothunnanu karanam emitante cinimalu choosevalla batte teestoo untaru. Choosevallu ante prekshakulu pandha marali

    రిప్లయితొలగించండి