సోమవారం, ఆగస్టు 08, 2011

ఎంతో చిన్నది జీవితం

డిస్ప్లే లో ఉన్న పుస్తకాలని చూస్తుండగా తమిరిశ జానకి పేరు చూడగానే చాన్నాళ్ళ తర్వాత తారసపడ్డ ఫ్రెండ్ ని చూసిన అనుభూతి కలిగింది. 'యువ' 'జ్యోతి' చదివే రోజులనుంచీ పరిచయం ఈవిడ కథలు. ఇక పుస్తకం పేరేమో 'ఎంతో చిన్నది జీవితం' ..నచ్చకుండా ఉంటుందా? ఇటీవలి కాలంలో జానకిగారు రాసిన ఇరవైరెండు కథల సంకలనం ఇది. ఆంధ్రభూమి, నవ్య వంటి వారపత్రికలతో పాటు, సుజనరంజని లాంటి వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమైన కథలే అన్నీను.

గత నాలుగు కథాసంకలనాల్లో మెజారిటీ కథల్లాగే, ఈ ఐదో సంపుటంలోనూ అధిక శాతం కథలు మధ్యతరగతి జీవిత చిత్రణలే. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, అన్ని రంగాల్లోనూ పెరిగిపోతున్న పోటీ, చొచ్చుకుని వచ్చేస్తున్న వ్యాపార సంస్కృతికి కారణంగా మధ్యతరగతి సమాజంలోని మానవ సంబంధాలలో వచ్చి పడిపోతున్న మార్పులని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలని ఈ సంకలనంలో చేర్చారు జానకి. విలువల పతనం పట్ల రచయిత్రి ఆవేదన కనిపిస్తుంది కథల్లో.

మొదటికథ శీర్షికనే సంకలనానికీ ఇచ్చారు. 'ఎంతో చిన్నది జీవితం' కథలో నాయకుడు శ్రీధర్. పల్లెలో పుట్టినా, పట్నంలో చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. పల్లెలో తాతల నాటి ఆస్తిని తన తమ్ముడికే ఇచ్చేయాలని నిర్ణయించుకుంటాడు శ్రీధర్ తండ్రి సత్యమూర్తి. ఆ ఊళ్ళో అడుగుపెట్టే వరకూ శ్రీధర్ కీ అందుకేమీ అభ్యంతరం ఉండదు. కానీ, మారిన తన ఊరిని చూశాక, శ్రీధర్ మార్చుకున్న నిర్ణయం ఏమిటన్నది ముగింపు. కథానికా శైలిలో సాగే ఈ కథకి మానవత్వపు పరిమళాలని అద్దే ముగింపుని ఇచ్చారు రచయిత్రి.

చిన్నదే అయినా ఆలోచనలో పడేసే కథ 'రంగన్న.' మృత్యువు ఇతివృత్తంగా సాగిన కథ కావడంతో చదువుతుండగానే నచ్చేసింది. 'నది' పత్రిక నిర్వహించిన పొట్టి కథల పోటీలో ఐదువేల రూపాయలు గెలుచుకున్న ఈ కథ చదువుతుంటే 'సాయంకాలమైంది' నవలలో కొన్ని సన్నివేశాలు అప్రయత్నంగా గుర్తొచ్చాయి. ఇదే కథా వస్తువుకి మరో కోణంగా అనిపించే కథ 'శిధిలాలయంలో శివుడు లేడోయి.' పొట్టి కథల్లో 'ఏది స్వార్ధం' 'చెమ్మగిల్లిన కళ్ళు' రెండూ కూడా మనస్తత్వ చిత్రణలో రచయిత్రి ప్రతిభని పట్టి చూపించేవే.

ప్రేమించుకున్న ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య ఏర్పడ్డ ఇగో క్లాష్ ఫలితం 'మౌన ప్రవాహం' కథ. ఈ కథలో కృష్ణవేణితో పాటు 'రాగిణి' కథలో రాగిణి కూడా బాగా గుర్తుండి పోతుంది. కూతుళ్ళని మాత్రం ప్రేమించి, కొడుకుని అవసరాలకి వాడుకునే తల్లి కథ 'నిర్ణయం' చదువుతున్నంత సేపూ ఓపక్క తెలిసిన కథలాగే అనిపిస్తూ, కించిత్ నాటకీయంగా ముగుస్తుంది. ఈ నాటకీయత చాలా కథల్లోనే కనిపించింది. ముఖ్యంగా రేడియో కోసం రాసిన కథానికలలో, సందేశాన్ని బలంగా చెప్పడంకోసం ఈ నాటకీయతని ఉపయోగించుకున్నారు జానకి.

విడిచిపెట్టకుండా చదివించే శైలి, ఆశావహమైన ఆలోచనలతో కథని ముగించడం నచ్చే అంశాలు. ప్రతికథా ఎంతో కొంత ఆలోచింపజేస్తుంది. మనస్తత్వాల చిత్రణ, పాత్రల వ్యక్తిత్వం చాలా సందర్భాలలో కథలకి బలాన్నిచింది. అదే సమయంలో, కథ నడక లోనూ, సంభాషణల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపించే నాటకీయత చాలాచోట్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. పాత్రల స్వభావాల ఆధారంగా ముగింపుని అంచనా వేసేసే అవకాశం ఉండడంతో, ఊహించ గలిగే ముగింపు కొంత నిరాశకి గురిచేస్తుంది.

మరీ ముఖ్యంగా పెద్దగా చదువుకోని పాత్రల చేత పుస్తకాల భాషలో సంభాషణలు పలికించడం లాంటివి పరిహరిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. ఏమైనప్పటికీ, యాభయ్యేళ్లుగా రచనా వ్యాసంగంలో ఉన్న తమిరిశ జానకి ఆ వ్యాసంగాన్ని కొనసాగించడంతో పాటు, తన ఇలా సంకలనంగా తీసుకురావడం అభినందించాల్సిందే. (లాస్య లహరి ప్రచురణలు, పేజీలు 179, వెల రూ 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభ్యం).

3 వ్యాఖ్యలు:

rajasekhar Dasari చెప్పారు...

మురళిగారు నేను యక్షుడను మీరు ధర్మరాజు !!! నా ప్రశ్నఏమిటంటే నేను బుడుగు పుస్తకము మూడు సంవత్సరముల క్రితం కొన్నాను , కాని నా చిన్నప్పుడు ఎమెస్కో వారి బుడుగు రెండు భాగాలుగా ఉన్నది . మరి ఇప్పుడు కొన్న ఈ పుస్తకంలో ఆ రెండు ఇన్నాయా లేదా?

హరిచందన చెప్పారు...

ఈవిడ కథలంటే ఇష్టం మా అమ్మకి
బుక్ కొనాలి అయితే
థాంక్యూ

మురళి చెప్పారు...

@రాజశేఖర్ దాసరి: నేనుకూడా యక్షుడినేనండీ :)) నాదగ్గర కొత్త ప్రింట్ ఉంది కానీ, ఆ పాత ప్రింట్ లేదు.. కొత్త దాంట్లో ఏదో మిస్సైనట్టుగా అనిపిస్తోంది కానీ, ఇదమిద్దంగా తెలియడం లేదు.. మిత్రులెవరైనా చెబుతారేమో చూద్దామండి.. ధన్యవాదాలు..
@హరిచందన: తీసుకోండి తప్పకుండా.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి