బుధవారం, ఆగస్టు 10, 2011

అసలేం జరిగిందంటే...

'చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్. అనుభవాలు... గుండె లోతుల్లోంచి' అనే ఉప శీర్షికతో ఎమెస్కో ప్రచురించిన పుస్తకం 'అసలేం జరిగిందంటే...' సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీఆర్కే ప్రసాద్ అనుభవాల సమాహారం ఇది. స్వాతి వారపత్రికలో సీరియల్ గా వచ్చిన కథనాలన్నింటినీ గుదిగుచ్చి ప్రచురించిన ఈ సంకలనాన్ని చదవడం మొదలుపెట్టాక, మొత్తం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేం. ఇవన్నీ కేవలం ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవాలు మాత్రమే కాదు, గడిచిన నలభయ్యేళ్ళ కాలంలో రాష్ట్రంలోనూ, దేశంలోనూ జరిగిన అనేక పరిణామాలకి తెర వెనుక జరిగిన సంగతులు కూడా.

ఐఏఎస్ మన దేశంలో అత్యుత్తమ సర్వీసు. ఏటా లక్షలాదిమంది కలలు కని, వేలాది మంది అహోరాత్రాలు కృషిచేస్తే, వారిలో కేవలం కొన్ని వందల మంది మాత్రమే గెలుచుకునే సర్వీసు. అలాంటి సర్వీసులో చేరిన వ్యక్తి ఉద్యోగ జీవితం ఎలా మొదలవుతుంది? ఏసీ ఆఫీసు, ఏసీ కారు, వెనుక నలుగురు అటెండర్లు, ఎస్ బాస్ అనే ఉద్యోగులు అన్నది సామాన్య భావన. కానైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రైనీ కలక్టర్ గా ప్రసాద్ ఉద్యోగ జీవితం మొదలైన క్రమం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అప్పటి కలక్టర్ సుబ్రహ్మణ్యం, తన బంగ్లా వెనుక ఉన్న సర్వెంట్ క్వార్టర్ కేటాయించారు ప్రసాద్ కి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్ లో ప్రయాణం. చాలా సార్లు అటెండర్లు కూడా వచ్చేవాళ్ళు కాదు.

ఆరునెలలు గడిస్తే కానీ అర్ధం కాలేదు, శిక్షణ అలా ఎందుకు ఉందో. ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా, అటుపై జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సొంత జిల్లా ఖమ్మం కి కలక్టర్ గా, ఈమధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి అత్యంత ఇష్టమైన సమాచార శాఖ కమిషనర్ గా, అటుపై విశాఖ పోర్ట్ చైర్మన్గా, ఆతర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన పీవీకి అంతరంగిక కార్యదర్శిగా, తిరిగి రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు పాలనలో కొన్ని కీలక బాధ్యతలనీ నిర్వహించిన ప్రసాద్ ఉద్యోగ జీవితంలో ఉత్కంఠభరితమైన సంఘటనలు ఎన్నో..ఎన్నెన్నో..

ఆర్ధిక సంస్కరణల వంటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని దేశ భవిష్యత్తుని మలుపు తిప్పిన పీవీ నరసింహారావు అంటే తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఎక్కడా దాచుకోలేదు రచయిత. అదే సమయంలో, పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన అత్యంత అభిమానించే తేళ్ళ లక్ష్మీకాంతమ్మ కారణంగా సీఎం పేషీలో పవర్ సెంటర్ ఏర్పడడం తదితర విషయాలనీ దాచలేదు. "ఈ అనుభవాల వ్యాసాల్లో నాకు తెలిసిన నిజమంతా రాశానో లేదో కానీ, రాసినవన్నీ మాత్రం నిజాలే" అంటూ రాసిన ముందుమాట ద్వారా, తను రాయకుండా వదిలేసిన విషయాలని పాఠకులు ఊహించుకునేందుకు బోలెడంత అవకాశం ఇచ్చారు. ఎవ్వరినీ దగ్గరికి చేర్చని, దూరం పెట్టని పీవీ వైఖరిని గురించి వివరిస్తూ, కేవలం ఆ వైఖరివల్లే ఆయన తన చివరి రోజుల్లో ప్లీడర్లకి ఫీజు చెల్లించడం కోసం తన ఇల్లమ్మడానికి ప్రయత్నించారని ప్రసాద్ రాసింది చదివినప్పుడు కలుక్కుమనిపించింది.

తను ముఖ్యమంత్రిగా ఉండగా సొంత జిల్లాని అభివృద్ధి చేయాలన్న జలగం కోరిక, అందుకోసం కలక్టర్ కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి కేడర్ కోపానికి గురవ్వడం లాంటివి ఆసక్తిగా అనిపిస్తాయి. "ఇది కేవలం మా ఇమేజ్ వల్ల ఏర్పడ్డ పార్టీ బ్రదర్. మా ఇమేజ్ ని మేం కాపాడుకోవాలి" అంటూ తన ఇమేజ్ నిలబెట్టుకోవడం కోసం ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు, వాటికారణంగా చుట్టూ ఉన్నవాళ్ళకి ఎదురైన ఇబ్బందులూ చదవాల్సిందే. మరీ ముఖ్యంగా కిలో రెండు రూపాయల బియ్యం పధకం కోసం 'వారుణి వాహిని' మొదలు పెట్టి, లిక్కర్ అమ్మకాలు పెంచడం లాంటివి. "అకస్మాత్తుగా ముఖ్యమంత్రి దగ్గరనుంచి కబురొచ్చింది. నాకు తెలిసిన ఒకరిద్దరు పండితుల్ని పిలవమన్నారు. సారా అమ్మకాలకి ఒక పేరు పెట్టాలని వాళ్లతో చర్చించారు. ఒక పథకం కోసం నిశితంగా సాహితీవేత్తలతో చర్చించిన ముఖ్యమంత్రిని నేను చూడలేదు," అని రాశారు 'వారుణితో రొమాన్స్' అనే చాప్టర్లో.

కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న విశాఖ పోర్ట్ ట్రస్ట్ అభివృద్ధికి అన్నీ ఆటంకాలే. కానైతే, ఒక ఉన్నత స్థాయి అధికారి తలచుకుంటే నిబంధనలని తనకి అనుకూలంగా మార్చుకుని ఏరకంగా అభివృద్ధి చేసి చూపించవచ్చో పోర్ట్ చైర్మన్ గా చేసి చూపించారు ప్రసాద్. పోర్ట్ కోసం ఏకంగా రైలింజన్నే కొనుగోలు చేసేశారు. పోర్ట్ కోసం ఇదొక్కటే కాదు ఇంకా చాలా సాహసోపేతమైన నిర్ణయాలనే తీసుకున్నారు. ఇక ప్రధాని పీవీ అంతరంగిక కార్యదర్శిగా ప్రసాద్ అనుభవాలు చదువుతుంటే ప్రతి పేజీకీ కనుబొమలు పైకి లేవడం, ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవవ్వడం తప్పదు. అంబానీలు, అమితాబ్ బచ్చన్ ప్రసాద్ ఇల్లు వెతుక్కుంటూ రావడం మొదలు, పీవీని తన వైఖరి మార్చుకొమ్మని చంద్రస్వామి ప్రసాద్ తో చెప్పించడం వరకూ అన్నీ ఆశ్చర్యార్ధకాలే. పీవీ వ్యక్తిత్వంతో పాటు కాంగ్రెస్ సంస్కృతిని మరింత బాగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే అధ్యాయాలివి.

ఇమేజ్ బిల్డింగ్ లో ఎన్టీఆర్ ది ఒక శైలి అయితే చంద్రబాబుది మరో పధ్ధతి. తను ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటర్ పేపర్లు లీకైనప్పుడు, ప్రభుత్వ ప్రతిష్టని ఇనుమడింప జేయడం కోసం ఓ ఐఏఎస్ ఆఫీసర్ మీద చర్య తీసుకోమని (అతడు బాధ్యుడు కానప్పటికీ) ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తేవడం ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే మీడియా మేనేజ్మెంట్ విషయంలో పీవీ-చంద్రబాబు ఉత్తర దక్షిణ ధ్రువాలన్న విషయం కూడా సులువుగానే అర్ధమవుతుంది. ఎక్కువగా వృత్తి జీవితాన్ని గురించే రాసినా, అక్కడక్కడా తన వ్యక్తిగత జీవితాన్ని గురించీ ప్రస్తావించారు ప్రసాద్. అయితే ఆవివరాలు కేవలం కథనానికి అవసరమైనవి మాత్రమే. ఉన్నత స్థానంలో ఉండే అధికారులకి మెదడుతో పాటు హృదయం కూడా ఉంటే వారిద్వారా ఎన్ని మంచి పనులు జరగడానికి అవకాశం ఉందో చెబుతుందీ పుస్తకం.

'నిప్పులాంటి నిజం' పుస్తకాన్ని తెనిగించిన జి.వల్లీశ్వర్ ఎడిట్ చేయడం వల్ల కాబోలు, ఈ పుస్తకంలో చాలా అధ్యాయాల్లో కథనం ఆ పుస్తకాన్ని గుర్తు చేసింది. పుస్తకం చదవడం పూర్తి చేశాక, ఓ మిత్రుడికి ఫోన్ చేసి పుస్తకాన్ని గురించి చెప్పాను. "నేను చదివాను. చాలా బాగుంటుంది పుస్తకం. రాసిన విషయాలే కాకుండా, రాయకుండా వదిలేసిన బిట్వీన్ ది లైన్స్ అర్ధం చేసుకుంటే ఇంకా బాగుంటుంది" అన్న స్పందన వినగానే, "అవునౌను" అనేశాను టక్కున. నా అనుభవం కూడా అదేమరి. ప్రతి అధ్యాయాన్నీ మొదటి నుంచి చివరి వరకూ ఊపిరి బిగపట్టి చదివించే కథనం వల్ల ఎక్కడా బోర్ కొట్టడం అన్న ప్రశ్న ఉండదు. ఇంత పెద్ద పుస్తకాన్నీ అప్పుడే చదివేశామా అనిపిస్తుంది. మొత్తం పుస్తకాన్ని యాభైయేడు అధ్యాయాలుగా విభజించారు. పేజీలు 424, వెల రూ.150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.

18 కామెంట్‌లు:

 1. నాకు ఒక పాత తెలుగు సినిమా పాట గుర్తుకువస్తుంది . సినిమా పేరు గుర్తురావడం లేదు కాని ఇన్సాఫ్ కా తరాజ్ ని బాపు గారు తెలుగులో తీసారు . ట్రైలరే ఇంత లబ్జుగా ఉంటె పిక్చరెంత హిట్ !!! మీకు చాల ధన్యవాదములు ఈ పుస్తకమును పరిచయం చేసినందుకు , వెంటనే కొని చదువుతాను .

  రిప్లయితొలగించు
 2. నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ప్రసాద్ గారు ఒకరు. వారి మెయిల్ ఐడి తీసుకుని అప్పుడప్పుడు మెయిల్స్ పెట్తేదాన్ని. చక్కగా స్పందించేవారు. అన్నిటికంటే ఎక్కువగా...నా పెళ్ళికి వారికి శుభలేఖ పంపినప్పుడు...ఆ వేంకటేస్వరుని ఆశీస్సులు మీ కొత్త దంపతులపై ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఆయన పంపిన మెయిల్ నేనెప్పటికి మర్చిపోలేను :) ఆయనది 'సర్వ సంభవాన్ ' ఎంత బాగుంటుందో! ఈ ఆర్టికల్స్ అపుడప్పుడూ స్వాతిలో చదివేదాన్ని. ఐతే బుక్ వచ్చేసిందన్నమాట. :) మీ టపా కూడా చాలబాగుంది.సంక్షిప్తంగా అయినా బాగా విశదీకరించారు.

  రిప్లయితొలగించు
 3. మురళిగారు, నేను స్వాతి లో కొన్ని వారాలు ఆయన శీర్షిక ఫాలో అయ్యాను, మీరు చెప్పే పుస్తకాలు బెంగళూరులో కూడా దొరుకుతాయా? నేను ఎప్పటినుండో అడగాలనుకున్న ప్రశ్న ఇది. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి :)

  రిప్లయితొలగించు
 4. స్వాతి లొ వచ్చినప్పుడు ఆ సిరిస్ అంతా చదివానండి. నాకు బాగా నచ్చింది. పి.వి గారి మీధ అప్పటివరకు వున్న గౌరవం ఇంకాస్త పెరిగింది.అలానే ఇంకెన్నొ విషయాలు కూడా తెలుసుకొగలిగాను..

  రిప్లయితొలగించు
 5. హ్మ్ ! మురళి నాకు నచ్చిన మరో పుస్తకం మీ పరిచయంలో . నేను ఈ పుస్తకం కొన్నది PV గారి గురించి రాసారు అని తెలిసి . చదివాకా మాత్రం ప్రసాద్ గారి మీద గౌరవం మరింత పెరిగింది . అలాగే PV ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రసాద్ గారు చదివిన అప్పుడు మాత్రం అప్పటికి , ఇప్ప్తతికి పరిస్తితులు ఒకేలా ఉన్నాయి అనిపించింది, కాకపొతే PV గారి లాంటి మేధావి పదవి లో లేరనుకోండి :)

  రిప్లయితొలగించు
 6. ఇదేంటండీ బాబూ నా బ్లాగులో రాసుకుందామనుకున్నదాన్ని మీరే రాసేశారు. పుస్తకం మాత్రం చాలా బావుంటుంది. బర్త్ డే గిఫ్టులుగా కొనిస్తుంటాను, ఎందరికో రికమెండ్ చేస్తుంటానీ(చదివే అలవాటు లేనివాళ్లకి కూడా) పుస్తకాన్ని. పివి దగ్గరకి వెళ్లాకా నాకు ఆసక్తి తగ్గింది గానీ అప్పటివరకూ ఆయన నిర్ణయాలు తీసుకోవడం సమస్యలు ఎదురవడం లాంటివి చదువుతుంటే మునివేళ్ల మీద నుంచున్న ఫీలింగ్. ఒక్కరోజు ముఖ్యమంత్రిలా ఒక్కరోజు ఐ.ఎ.ఎస్ ని అయ్యాను నేను(పోర్టులో కొన్ని సమస్యలకి ఆయన చేసిన పరిష్కారాలు కొన్ని నాకు ముందుగానే తట్టేవి:)). పుస్తకం అంతటికీ హైలెట్ ఆయన పోర్టు అనుభవాలు.

  రిప్లయితొలగించు
 7. చదివి తీరాల్సిన పుస్తకాల జాబితాలో మరో పుస్తకం చేరింది. ఈ పుస్తక పరిచయానికి ధన్యవాదాలు మురళి గారు.

  రిప్లయితొలగించు
 8. ఈ బుక్ కోసం చాలా రోజుల నుంచీ వెయిట్ చేస్తున్నాను మాష్టారు.. అప్పట్లో స్వాతి లో కోతి కొమ్మచ్చి, ఈ సీరియల్ రెండూ వచ్చేవి.. ఇలాంటివి మైన్ని వస్తే తెలుగు పత్రికలు పునరిజ్జీవనం దిశగా సాగుతాయనుకునే వాడిని..
  ఇందులో నాకు నచ్చిన విషయం ఫరూక్ అబ్దుల్లా కు బ్రహ్మం గారి మఠం వాళ్ళ శాలువ కప్పడం.. ఆ ఎపిసోడ్ గురించి ఆయన రాసిన విధానం చాలా బాగుంది

  రిప్లయితొలగించు
 9. పైన కార్తిక్ గారు చెప్పినట్టు ఆరోజుల్లో కోతి కొమ్మచ్చి, ఇంకా ఈ వ్యాసాల కోసం.. మిగతా చెత్త ని ఇగ్నోర్ చేస్తూ పత్రిక తెప్పించుకునేవాళ్లం మేము...

  ఏమైనా.. గత దశాబ్దం లో తెలుగు లో వచ్చిన కాంటెంపరరీ స్వానుభవాలు వివరించే రచనల్లో దీనికే నేను రెండవ స్థానం ఇస్తాను.

  రిప్లయితొలగించు
 10. కొనవలసిన పుస్తకాల జాబితా లొ ఇంకోటి చేర్చారండి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. మంచి పుస్తకం పరిచయం చేసారు .ప్రసాద్ గారు నాకు చాల ఇష్టం .గమ్మత్తెవిటంటే స్వాతిలో ఆయన రచనలు ఫాలో అయ్యేప్పుడు పరిచయం చూసి బోల్డంత ఆశ్చర్యపోయాను .ఎందుకంటే ఆయన మాకు ట్రైనింగ్ కాలేజి( I.O.A)కమీషనర్ గా వున్నారు కాని రచయిత అని అప్పటివరకు తెలియదు ..నాదగ్గరున్న గ్రూప్ ఫోటోలోని వ్యక్తి ఈయన ఒకటేనని తెలిసి చాలా థ్రిల్ అయ్యాను .చక్కగా నిర్మొహమాటంగా నిజాలు చెబుతారు ..రాస్తారు.

  రిప్లయితొలగించు
 12. మురళి గారు,
  ఈ పుస్తక సమీక్షను రెండు బాగాలుగా రాసి వుంటే బాగుండెదని అనిపించింది.అందువలన పుస్తకం చదవటం వీలు కాని వారికి కూడా మీ సమీక్ష ద్వారా మరిన్నివివరాలు తెలిసేవి. ముఖ్యంగా చంద్ర స్వామి గురించి ఇంకా రాసి వుండవలసినది. సాధారణం గా చాలామంది పాఠకులు ఇటువంటి పుస్తకాలను చదవటానికి ఆసక్తి చూపరు. ఆ రాసేవారికి కూడా అవిషయం తెలుసు. వారు రాయటం వెనుక గల కారణం అధికారంలో వున్నపుడు తీసుకొన్న నిర్ణయాలను మీడీయా వారు మసి బూసి మారేడుకాయ చేస్తారు. సమకాలిన ప్రజలు నాయకులలో మంచి కన్నా చేడే ఎక్కువ చూస్తారు, కనుక రాబోయే తరం వారన్న తమని అర్థం చేసుకొంటారని, తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవో కావో బేరీజు వేసుకోవటానికి( ఆ తరానికి ఈ నిర్ణయాల వలన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి) అనుకూలంగా తామ వాదనను ఇటువంటి పుస్తకాలలో రాస్తారు. ఈ పుస్తకాలను రాజకీయాలను దగ్గర గా పరిశిలించేవారు మాత్రమే కొని చదువుతారు.

  ఇక పి వి గారు చనిపోయినపుడు పేపర్లో రాసిన వ్యాసాలలో ఆయనని తీవ్రంగా విమర్శించిన ఏకైక జర్నలిస్ట్ వీర్ సింఘ్వి. ఆయన గారు పి వి మీదే కాక, విజయ రామారావు (మాజి సి బి ఐ డైరెక్టర్), ప్రసాద్ గారిని కూడా చాలా తక్కువ చేస్తూ హిందుస్తాన్ టైంస్ లో ఏడిటోరియల్ కాలం రాశారు. ఇతను ఎమీటీ నిజాయితీ పరుడైన ప్రసాద్ గారిని ఇలా అంట్టున్నాడు, నిజా నిజాలు తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించినపుదు, సంవత్సరం క్రితం ఈ పుస్తకం చదవటం జరిగింది. ప్రసాద్ గారు ఆ పుస్తకం రాయటానికి ప్రధాన కారణం వీర్ సింఘ్వి ఇంగ్లిష్ పేపర్లలో పి వి గారిని తూలనాడటమే! వీర్ సింఘ్వి అమ్ముడు పోయాడు అని అర్థమైన ప్రసాద్ గారు, ఆయనకు తెలిసిన విషయాలను వివరంగా, నిజాయితీగా రాశారు. ఈ మధ్య జరిగిన అనూహ్య సంఘటనలో వీర్ సింఘ్వి నంబర్ 10 వర్గం సభ్యుడని లోకానికి వేళ్లడైంది. ఇది అందరికి తెలిసిన విషయమే.

  *అలాగే మీడియా మేనేజ్మెంట్ విషయంలో పీవీ-చంద్రబాబు ఉత్తర దక్షిణ ధ్రువాలన్న విషయం కూడా సులువుగానే అర్ధమవుతుంది.*

  మీడీయా ను పి వి గారు పట్టిచుకోకుండా పని చేయక పోవటమనేది, కాన్షియస్ డేసిషన్ అనిపించింది. కారణం మీడీయా ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయటానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తాయనే విషయం(ప్లాంటింగ్ ది న్యుస్) పి వి గారికి బాగా తెలుసనే విషయం అర్థమౌతుంది. పి వి గారు తీసుకొన్న ప్రతి నిర్ణయం అడ్మినిస్ట్రేటివ్ పరంగా, దేశానికి మాత్రమే ఉపయోగ పడే విధంగా ఉండాలని అనుకొనే వారని తెలుస్తుంది.
  -------------------
  కీ.శే. పర్వతనేని ఉపేంద్ర గారు కూడా తన ఆత్మ కథని రాశారని చదివాను. ఆపుస్తకం పేరు, ఎక్కడ దోరుకుతుందో వివరాలు మీకు తెలిస్తే చెప్పేది.

  రిప్లయితొలగించు
 13. @రాజశేఖర్ దాసరి: ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి పేజీ ఆసక్తికరంగా సాగిందండీ.. నాన్-ఫిక్షనే అయినా, ఫిక్షన్ ని మించి చదివించింది.. ధన్యవాదాలు.
  @ఇందు: అవునండీ.. 'సర్వ సంభవాన్' చదివాను. వరుసలో ఉంది :-) ..ఈ పుస్తకంలో కూడా ఒక పాఠకురాలి నుంచి వచ్చిన మెయిల్ ని ప్రస్తావించారు.. కాకపొతే అది నెగటివ్ విషయం.. ధన్యవాదాలు.
  @శ్రీ: బెంగళూరులో జరిగే పుస్తక ప్రదర్శనల్లో దొరుకుతాయండీ.. అప్పుడప్పుడూ విశాలాంధ్ర అనంతపురం వాళ్ళు సంచార పుస్తకాలయాన్ని పంపుతూ ఉంటారట.. చాలా రోజులుగా వాళ్ళక్కడ ఒక స్టోర్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు కానీ, ఎందువల్లనో వర్కవుట్ కావడం లేదు :( ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 14. @ప్రబంద్ చౌదరి: అవునండీ.. పీవీ గురించి చాలా కొత్త విషయాలు, ఆశ్చర్యకరమైనవి తెలిశాయి.. ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: నిజమండీ.. వ్యవస్థలో పెద్దగా మార్పేమీ లేదు, వ్యక్తులు మారారు, అంతే :( ధన్యవాదాలు.
  @పక్కింటబ్బాయి: ఆమధ్య తరచుగా వినిపించిన ఫిర్యాదండీ ఇది.. చాన్నాళ్ళ తర్వాత మీ నుంచి వింటున్నా.. నా స్టాక్ రిప్లై ఏమిటంటే "మీరూ రాయండి.. మీదైన కోణంలో" ..అవునూ ఒకరోజు ఐఏఎస్ ఎందుకండీ, కొంచం కష్టపడితే జీవిత కాల ఐఎఎస్సే అయ్యే అవకాశం ఉన్నట్టుంది కదా మీకు... జస్ట్ నా అభిప్రాయం.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 15. @శిశిర: అవునండీ, తప్పక చదవాల్సిన పుస్తకం అనేచెప్పాలి.. ధన్యవాదాలు.
  @కార్తీక్: రాఘవేంద్ర స్వామి మఠం శాలువా అండీ అది.. "బ్రదర్.. ఫోటోలు వీడియోల్లో పడేలా యెర్రని మెరుపులా శాలువా పది నిమిషాల్లో అరేంజ్ చేయగలరా? ఎర్రది, ధగధగా మెరిసేది అయితే ఫోటోలు, వీడియోలో బాగా వస్తుంది" అన్నప్పుడు ఎన్టీఆర్ లో చిన్నపిల్లాడు కనిపించాడు నాకు.
  దాదాపు అన్ని ఎపిసోడ్స్ నీ అలాగే ఆసక్తికరంగా రాశారండీ.. ధన్యవాదాలు.
  @కృష్ణప్రియ; వీలు చూసుకుని మీ జాబితాని కొంచం వివరంగా మీ బ్లాగులోనన్నా ఇవ్వండి.. పుస్తకాలు చదివే అందరికీ ఉపయోగ పడుతుంది కదా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. @స్వాతి: చాలా రోజుల తర్వాత కనిపించారు... ....ధన్యవాదాలండీ..
  @చిన్ని: ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డీ లో ఈయన కమిషనర్ గా, ఊర్మిళ సుబ్బారావు డిప్యుటీ కమిషనర్ గా చేసిన వర్క్స్ గురించి కూడా చాలావివరంగా రాశారండీ. మీరు చదివారన్న మాట అయితే! ..ధన్యవాదాలు.
  @సాంబశివుడు: పుస్తకం చదివాన నాకనిపించిన నాలుగు మాటలు ఇక్కడ రాస్తూ ఉంటానండీ.. ఎన్ని భాగాలు గా రాసినా పుస్తకాన్ని మరిపించలేము కదా.. వీర్ సంఘ్వి తో వివాదాన్ని గురించి వివరంగానే రాశారు కానీ, సంఘ్వి పని చేసేది 'అవుట్ లుక్' లో అని ఒకసారీ 'ది వీక్' లో అని ఒకసారీ రాశారు. ఇక మీరన్న ఉపేంద్ర ఆత్మకథ 'గతం-స్వగతం' మార్కెట్లో అందుబాటులో ఉంది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 17. స్వాతిలో వచ్చిన వ్యాసాలు చాలావరకు చదివాను.
  ప్రముఖవ్యక్తుల దగ్గర పనిచేసిన వాళ్ళు వ్రాసేవి సహజంగానే ఆసక్తికరంగా ఉంటాయి. ఒక తెలుగు వాడు దేశచరిత్రలోని ఎన్నో ముఖ్యమైన సందర్భాలలో పాలు పంచుకోవడం గర్వించదగినది.

  ఇక వీర్ సింఘ్వీ హిందుస్తాన్ టైంస్ లో ప్రసాద్ గారి గురించి పరోక్షంగా జోకర్ అని వ్రాయడం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చదివాను.
  ఢిల్లీలోని ఆధునిక వ్యక్తులకు దక్షిణభారతీయుల ఆచారాలు (ముఖ్యంగా బ్రాహ్మణులవి)చాదస్తంగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

  రిప్లయితొలగించు
 18. @బోనగిరి: లేదండీ.. పీవీ ప్రధానిగా ఉండగా జర్నలిస్టుల అమెరికా టూర్ కోసం, వీర్ సంఘ్వి తన భార్యని ఒక ఉర్దూ పత్రిక జర్నలిస్టుగా పరిచయం చేస్తూ జాబితాలో చేర్చమన్నపుడు ప్రధాని మీడియా సలహాదారు హోదాలో తను ఆ ప్రతిపాదన తిరస్కరించాననీ, తర్వాతే ఆ కథనాలు వచ్చాయనీ రాశారు ప్రసాద్. దక్షిణ భారతీయుల ఆచార వ్యవహారాల విషయంలో మీ పరిశీలన కూడా నిజమే అయి ఉండొచ్చు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు