శుక్రవారం, జనవరి 21, 2011

వంశీ 'మా' పసలపూడి కథలు

గత ఐదు రోజులుగా రోజూ అరగంట పాటు 'మా' టీవీ చానల్ దూరదర్శన్ గా మారిపోతోంది. మొన్న సోమవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన 'వంశీ మా పసలపూడి కథలు' ధారావాహిక, నన్ను దూరదర్శన్ రోజులకి తీసుకెళ్ళి పోతోంది. ముఖ్యంగా దర్శకత్వం, నటీనటుల నటన చూస్తుంటే రెండున్నర దశాబ్దాల నాటి దూరదర్శన్ సింగిల్ ఎపిసోడ్లు, పదమూడు భాగాల ధారావాహికలూ వద్దన్నా గుర్తొచ్చేస్తున్నాయి.

వంశీ రాసిన 'మా పసలపూడి కథలు' కథాకాలం 1844 లో మొదలై నిన్న మొన్నటి తానా సభలతో ముగిసింది. అధిక శాతం కథలు వర్ణన ప్రధానంగా సాగేవి. వీటికి దృశ్యరూపం ఇవ్వాలనుకోవడం ఒక రకంగా సాహసమే. ఎందుకంటే వర్ణనలని అక్షరాల్లో చదివినప్పుడు పాఠకులకి కలిగే అనుభూతిని దృశ్యం ద్వారా కలిగించడం దుస్సాధ్యం. ఈసాహసానికి పూనుకున్నవారు శంకు.

నిజానికి శంకు ని గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కార్టూనిస్ట్ అనీ, బాపు-రమణల దగ్గర కొన్ని సినిమాలకి పనిచేశారనీ, అలనాటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శ్రీమతి శోభాశంకర్ భర్త అనీ మాత్రమే నాకు తెలుసు. కథలని ఒకటికి పదిసార్లు ఇష్టంగా చదివిన వాడిగా, చిత్రీకరణలో కష్టనష్టాలని అర్ధం చేసుకోగలను. శంకు కాదు కదా, స్వయంగా వంశీనే దర్శకత్వం వహించినా, కథలకి దీటుగా ధారావాహికని తీర్చి దిద్దడం అన్నది అసాధ్యం.

ఈ ధారావాహికకి గీత రచన, గానం, నేపధ్య సంగీతం సమకూర్చడం వంటి ప్రకటిత బాధ్యతలతో పాటు, ప్రాజెక్ట్ మానిటరింగ్ అనే అప్రకటిత బాధ్యతనీ వంశీ తీసుకున్నట్టు సమాచారం. ప్రతి ఎపిసోడూ వంశీ చూశాక మాత్రమే ప్రేక్షకుల ముందుకి వస్తోందన్న మాట. ఇక ధారావాహిక లోకి వస్తే, వెండితెరకి వంశీ ప్రొడక్ట్ గా పరిచయమైన తనికెళ్ళ భరణి వ్యాఖ్యానంతో మొదటి ఎపిసోడ్ ప్రారంభమయ్యింది. ఓ నలుగురు సూత్రధారులని ప్రేక్షకులకి పరిచయం చేసి తను పక్కకి తప్పుకున్నారు భరణి. వీళ్ళంతా పసలపూడిలో ప్రస్తుతం నివాసం ఉంటున్న మధ్య వయస్కులు.

ఈ సూత్రధారులు గతాన్ని తలచుకుంటున్నట్టుగా 'నల్లమిల్లి పెద భామిరెడ్డి గారి తీర్పు' అనే కథని గత ఐదు రోజులుగా ప్రసారం చేస్తున్నారు. నా అంచనా నిజమైతే మరో ఎపిసోడ్ తో ఈ కథ ప్రసారం పూర్తవ్వాలి. మూడు పేజీల కథని ఆరు ఎపిసోడ్లుగా మలచడానికి చేయాల్సిందంతా చేసింది నిర్మాణ బృందం. సూత్రధారుల అనవసరపు కామెడీ అయితేనేమి, చిత్రీకరణలో డైలీ సీరియల్ తరహా సాగతీత ధోరణి అయితేనేమి...ప్రేక్షకులకి విసుగు కలిగించే అంశాలు పుష్కలంగా ఉన్నాయిందులో.

ఈ ధారావాహికలో మెచ్చుకోదగ్గ అంశాలు ఏవీ లేవా? అంటే, చాలానే ఉన్నాయి. కథాకాలానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, కరెంటు దీపాల వంటివి చూపక పోవడం, నటీనటుల ఆహార్యంతో పాటు పచ్చని కోనసీమ, గోదారి, పిల్లకాలువలా అందాలని ఒడిసిపట్టడం లాంటి విషయాల్లో నూటికి నూరు మార్కులు ఇచ్చేయాల్సిందే. పెద భామిరెడ్డి పాత్రని కొంచం సద్దుకుంటే, మిగిలిన పాత్రల పాత్రధారులందరూ అతికినట్టు సరిపోయారు. ముఖ్యంగా మహిళా పాత్రలు, భామిరెడ్డి భార్య వీరమ్మ, కూతురు శివాలక్ష్మి, ఎర్ర నూకరాజు, సుంకి చాలా చక్కగా ఉన్నారు.

నటీనటుల్ని ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసుకుని, వాళ్లకి ఆహార్యాన్ని సమకూర్చారో, వాచికం విషయంలో అంతటి నిర్లక్ష్యాన్నీ చూపించారు. వంశీ కథలకి జీవం పోసిన గోదారి జిల్లా యాస, ధారావాహికలో పాత్రల సంభాషణల్లో మచ్చుకైనా వినిపించదు. పైగా, ప్రధాన పాత్రలు మినహా, మిగిలిన పాత్రలన్నీ డైలాగుల్ని ఎవరికో అప్పగిస్తున్నట్టు చెప్పడం అస్సలు భరించలేని విషయం. వాళ్ళంతా ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కాకపోవచ్చు, కనీసం డబ్బింగ్ దగ్గరైనా జాగ్రత్త పడాలి కదా? పాత్రల హావభావాలకీ, సంభాషణలకీ అస్సలు పొంతన లేకపోవడం మరో లోపం.

శంకూ గారికి కోనసీమతో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో నాకు తెలీదు కానీ, అక్కడి భాషనీ, యాసనీ ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. లేదూ వేరెవరికైనా సంభాషణల బాధ్యత అప్పగించడం అన్నా జరగాలి. అలాగే కథలో ప్రతి వాక్యాన్నీ దృశ్యంగా మలిచే ప్రయత్నం కూడా అనవసరం. రెండు మాధ్యమాలకీ ఉన్న తేడాని పట్టుకోవడం అవసరం. సూత్రధారులని, వాళ్ళ ఆహార్యాన్నీ చూసినప్పుడు వాళ్ళు వంశీ సృష్టే అనిపించింది నాకు. తాపీ మేస్త్రి ప్రతి సన్నివేశంలోనూ తాపీ పట్టుకుని కనిపించడం ఏమిటో అర్ధం కాదు.

సంభాషణలు, ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, ఈ ధారావాహిక పుస్తకాన్ని మరిపించనప్పటికీ చూడ చక్కని ధారావాహిక అవుతుంది. ఎడతెగని సీరియళ్ళతో విసిగిపోయిన ప్రేక్షకులకి మంచి రిలీఫ్ కూడా కాగలదు. పంధాని మార్చుకోకుండా, పుస్తకానికీ, వంశీకీ ఉన్న ఇమేజ్ నీ, నేపధ్య గీతాన్నీ నమ్ముకుని ఇలాగే కొనసాగితే మాత్రం ప్రేక్షకులని నిలుపుకోవడం కష్టం.

24 కామెంట్‌లు:

  1. "వంశీ కథలకి జీవం పోసిన గోదారి జిల్లా యాస, ధారావాహికలో పాత్రల సంభాషణల్లో మచ్చుకైనా వినిపించదు"- కోనసీమ లో పుట్టి పెరిగిన నాకు, సరిగ్గా మీరు చెప్పినట్లే అనిపించింది. కానీ, నా అభిప్రాయాలకి అక్షరరూపం ఈయలెకపోయాను. మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకిభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. మా టి వీ వాళ్ళు గత కొంతకాలంగా "మా పసలపూడి కధలు" అని ఊరిస్తుంటే..ఏ సీరియల్ మొహం చూడని నేను..వంశీ మీదున్న నమ్మకంతో ఈ సీరియల్ చూసాను .. మొదటి ఎపిసోడ్ లోనే తేలిపోయింది..ఇక్కడ అంత విషయం లేదని ...ఏ ఒక్క నటుడి వాచకం గానీ, యాస గానీ కోనసీమ యాస లో లేదు ...వంశీ పసలపూడి కధలన్నిటిలో ఆ "యాసే" చాలా ఇంపార్టెంట్ ..ఇదే ఇక్కడ మిస్సింగ్...డబ్బింగ్ చెప్పించేటప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవలసింది ...అది కూడా శూన్యం....నాకు తెలిసి భూమిరెడ్డి పాత్ర చేసినాయన, హేమచందర్ కొద్దిగా నటించగలరు. మిగతా వాళ్ళంతా "వీధి భాగవతం" గాంగే.. ఆ హేమచందర్ కూడా తూర్పు యాస తో మాట్లాడుతున్నారు గానీ, కోనసీమ యాస లేదు. ఇంతటి సాహసోపేతమైన ప్రోజెక్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఏ జాగ్రత్తలూ వీళ్ళు తీసుకోలేదు...మొత్తంగా తారకరత్న 9 సినిమాలు ఆర్భాటంగా ప్రారంభమైనట్టు, ప్రజారాజ్యం పార్టీ ప్రారంభమైనట్టు..ఇది కూడా ప్రారంభమైంది...అలాగే మూలన పడింది....
    ఒక్క మాటలో చెప్పాలంటే ..."ఏనుగు పిత్తింది" సామెత లానే ఉంది ఈ సీరియల్ ...ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ చక్కటి కధలకు మంచి దృశ్య రూపం ఇవ్వగలరు ..అందరినీ నవ్వించగలరు.

    రిప్లయితొలగించండి
  3. మంచి రివ్యూ వ్రాసారు. ధన్యవాదాలు. ఈ వ్యాసం లింకును నా బ్లాగులో ఇస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. @అక్కడి భాషనీ, యాసనీ ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఉంది


    భాష ని అవసర౦ రీత్యా మార్చి ఉ౦డొచ్చు ..లేకపోతె అన్ని సినిమాలు తీసిన వ౦శీ కి యాస తెప్పి౦చడ౦ కష్టమా ..

    రిప్లయితొలగించండి
  5. నేను నిన్న యూ ట్యూబ్ లో చూసి నిరాశ చెందాను. పెద్ద బామి రెడ్డి గారికి కనీసం గంభీరమైన గొంతు తో డబ్బింగ్ చెప్పినా బాగుండేది.

    >>, కథలకి దీటుగా దారావాహికని తీర్చి దిద్దడం అన్నది అసాధ్యం.
    బాగా చెప్పారు

    మూడో ఎపిసోడ్ లో అనుకుంటా ఎవరో పెళ్ళి చేసుకుని ఈయన దగ్గరకి వస్తారు. ఆ సీనప్పుడు సంభాషణలయితే దారుణం గా ఉన్నాయి.

    గ్రామ సభ అంటూ సీన్ లో పట్టుమని పది మంది కూడా ఉండరు,గమనించారో లేదో.

    పాత్రధారుల వాచకం లేదా డబ్బింగ్ సరిగా ఉంటే మనం దానిలో లీనమయ్యి ఇలాంటివి పట్టించుకోమేమో.

    రిప్లయితొలగించండి
  6. అవునండి మొదట్లోనే నిరాశ పరిచింది ఈ సీరియల్. భాష యాస ప్రధానమయిన కథలు ఇవి..దానిని విస్మరించటం ఏమిటో అర్థం కాలేదు! ఇకనుండయినా ఈ విషయం మీద శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  7. నాటకీకరణ సమయంలో, వ్యాపార సూత్రాల దృష్ట్యా, ఆంధ్రదేశ ప్రజలంతా చూస్తారు అనే విషయం దృష్టిలో ఉంచుకుని భాష లో గోదారి జిల్లా యాస కావాలని తగ్గించినట్లున్నారు. అయితే సుంకి పాత్రలో ఈ యాస వినిపిస్తుంది. ఇప్పుడొస్తున్న అనువాద ధారావాహికల మధ్య మా పసలపూడి కధలు ఎడారిలో ఒయాసిస్ లాంటిది. గ్రామీణ దృశ్యాలు, గోదారి గలగలలు, కొబ్బరి తోటలు ఇంకా పిల్ల కాలువలు నయనానందకరంగా ఉన్నై. తప్పక ఆదరించతగ్గదీ మా పసలపూడి కధలు ధారావాహిక.

    రిప్లయితొలగించండి
  8. మేము చాలా ఉత్సాహం గా ఎదురు చూసాము కానీ మొదటి ఎపిసోడ్ చూసే నిరాశచెందాము.ఎప్పటిలాగే మీ రివ్యూ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. ఎదురు చూసినంత ఉత్సాహంగా అనిపించట్లేదు బుల్లితెరమీద ! మీరన్నట్టు ఆహార్యం మీద చూపిన శ్రద్ధ వాచికంపై చూపలేదు గోదావరి యాస వంశీ సినిమాల్లో కనిపించినంత కూడా కనిపించలేదు కృతకంగా ఉంది. మొత్తానికి ఇప్పటికి నిరాశనే మిగిల్చింది.ఇక ముందు వేచి చూడాలి :( మీరు చెప్పిన ప్లస్ లు కూడా తప్పకుండా లెక్కల్లోకి తీసుకోవాల్సినవే!బావుంది మురళిగారు మీవిశ్లేషణ !

    రిప్లయితొలగించండి
  10. నిరాశ చెందాము అన్నది కూడా under statement. శ్రీ CB రావు గారన్నట్టు కమర్షియల్ కారణాల వల్ల, అందమైన గోదావరి యాస తీసేస్తే, చాలా విచారకరం. కొంతలో కొంత సూత్రధారులే నయమనిపించారు. మీ రివ్యూ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు, నా అభిప్రాయం ఇక్కడే వ్రాద్దామనుకున్నాను కాని లెంగ్త్ ఎక్కువ అవడంతో నా బ్లాగులోనే ఒక టపా వ్రాసాను. వీలైతే చదవండి.

    రిప్లయితొలగించండి
  12. సీరియల్ కోసం ఏదో రొటీన్ కధని తీసుకోకుండా వంశీ కధలను ఎంచుకున్నందుకు దర్శకుణ్ణి అబినందించాలి . ఇక యాస విషయానికొస్తే , వంశీ కధల్లో రాసిన భాష, యాస ఇప్పుడు పసలపూడిలో నివసిస్తున్నవాళ్ళు కూడా పలకలేరేమో ! కాబట్టి కొంతవరకు సరిపెట్టుకోవటమే . చిన్న చిన్న కేరెక్టర్ ల కి స్థానికుల్నే తీసుకోవటం వల్ల " యాక్టింగు " అంతగా పండటం లేదు . సీరియల్ కాబట్టి సాగదీత తప్పటంలేదు.
    వంశీ కధల్లో చాలా వాటిని దృశ్యరూపంలో చూపటం కష్టం . పెద్దపెద్ద మేడలు, మొహం మొత్తే మేకప్పులు లేకుండా హాయిగా అలా పైరగాలికి తిరిగినట్టూ వుంటుంది కాబట్టి , అందుకోసమైనా ఆ కాసేపు చూడకతప్పదు . టైటిల్స్ నాకు చాలా నచ్చాయి బాపూ బొమ్మల్ని కన్నులపండుగగా చూసుకోవచ్చు.
    మురళీ గారు , పసలపూడి కోనసీమలోకి వస్తుందంటారా! రామచంద్రపురం,మండపేట సైడు కదండీ ఆ ఊరు వున్నది .

    రిప్లయితొలగించండి
  13. ఐతే నేనింక టీవీ ధారావాహిక చూడనవసరం లేదన్నమాట. అయ్యో చూడలేకపోతున్నననే దిగులస్సలు అవసరం లేదన్నమాట.
    హమ్మయ్య..థాంక్స్ మురళీ గారూ..పసలపూడి కధలు చదివినప్పుడు కలిగిన అనుభూతిని కోల్పోతానేమో అనే బాధ తప్పించేశారు.

    రిప్లయితొలగించండి
  14. మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకంక్షలు.

    రిప్లయితొలగించండి
  15. గోదావరి యాస పెట్టినా పెట్టకపోయినా, పసల పూడి కథలు పసలపూడి కథలే. ఇప్పుడు ఒక చీడలా పట్టిన డైలీ సీరియళ్ళ తో పోలిస్తే ఈ ధారావాహిక తీస్తున్న వారి ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలి. కాని వారు కూడా కథలను సాగ తీయకుండా నియంత్రించుకోవాలి.

    నటీ నటుల నటన అంత బాగాలేదు. నిజం కావచ్చు. కాని మంచి నటనానుభవం ఉండి, చక్కటి హావ భావాలు చూపగలిగి, సంభాషణా చాతుర్యం ఉన్న నటీ నటులందరూ, డైలీ సీరియళ్ళ ఊబిలో మునిగిపోయారు. వారిని ఈ ధారావాహికలోకి తీసుకు రావాలంటే వారు డిమాండు చేసే డబ్బు దృష్ట్యా(టాలీ వుడ్ తారల తరహాలో ఉన్నాయట) సాధ్యం కానిపని. ఒక మంచి ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలుస్తూ, సామాన్యమైన పరిహారం తీసుకుని ప్రోత్సహించే నటీ నటులు కావాలి. ఇదంతా డబ్బుతో కూడిన వ్యవహారం. ఏ ధారావాహికకు ఎక్కువ రేటింగు ఉంటే ఆ ధారావాహికకు మంచి స్పాన్సర్లు వస్తారు, మంచి బడ్జెట్ ఉంటుంది. "సమాజపు టేస్ట్" మీద ఆధారపడి ఉంటుంది. సాహితీ విలువలు ఉన్న పసలపూడి కథలను ఆదరించే శక్తి మన తెలుగు ప్రేక్షకుడికి లేదన్న భయంతోనే తక్కువ బడ్జెట్ ఈ ధారావాహికకు కేటాయించి ఉంటారని నా ఊహ ఆందువల్లనే సమాజంలో మైనారిటీగా ఉన్న సాహితీ అభిమానులకు ఈ ధారావాహిక అంతగా నచ్చటం లేదు.

    కాని, ఊకదంపుడు చిత్రీకరణ, కథా కంగు లేని, చెత్త సంభాషణలతో సాగి పోతున్న ప్రస్తుతపు టి వి ధారావాహికల మధ్య, ఈ ధారావాహిక ఒక ప్రత్యేకత నిలుపుకుంటుందని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  16. @హరేఫల: ధన్యవాదాలండీ..
    @shyamkr: నిజమేనండీ.. భాష విషయంలో అస్సలు శ్రద్ధ తీసుకోలేదు.. ధన్యవాదాలు.
    @శివ: లంకె ఇచ్చినందుకు కృతజ్ఞతలండీ.. యాస ఈ కథలకి ప్రాణం.. అలాంటి భాష, యాసలని విస్మరించడం నాకు నచ్చలేదండీ.. ఇప్పుడొస్తున్న సీరియల్లతో పోల్చినందువల్ల 'గుడ్డిలో మెల్ల' అనిపిస్తోందే తప్ప, నిజంగా బాగుండి కాదు. ప్రస్తుతం స్పాన్సర్లు బాగున్నారు కాబట్టి, బడ్జెట్ విషయంలో మరికొంచం ఉదారంగా వ్యవహరించి జాగ్రత్తగా చిత్రీకరిస్తారని ఆశిద్దామండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  17. @Mauli: ధన్యవాదాలండీ..
    @రిషి: పాత్రధారులు మరో పాత్రతో కాక ఏ గోడతోనో మాట్లాడినట్టుగా డైలాగులు అప్పగించేస్తున్నారండీ.. రోజురోజుకీ సహనం తగ్గుతోంది నాకు.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: తీసుకుంటే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళలో నేనూ ఉన్నానండీ..

    రిప్లయితొలగించండి
  18. @cb rao: కేవలం వ్యాపార సూత్రాల కోసం యాసని మార్చినట్టైతే సీరియల్ గా తీయడమే అనవసరం అండీ.. అలాంటప్పుడు గోదారి జిల్లాల్లో చిత్రించడం మాత్రం ఎందుకు చెప్పండి.. సెట్లోనే తీసేయొచ్చు కదా.. ఐతిహాసిక పాత్రలు తెంగ్లిష్ లో మాట్లాడుతున్నట్టుగా సీరియలో, సినిమానో తీస్తే చూడగలమా మనం? ... ధన్యవాదాలు.
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @పరిమళం: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  19. @బులుసు సుబ్రహ్మణ్యం: మీకు సూత్రధారులు నచ్చారా? నాకైతే అస్సలు నచ్చలేదండీ.. ధన్యవాదాలు.

    @బోనగిరి: 'నసలపూడి కథలు'... ఒక్కమాటలో చెప్పేశారండీ, సారం మొత్తాన్ని.. ధన్యవాదాలు.

    @శిశిర: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  20. @లలిత: వర్తమానానికి అన్వయించుకుంటే, ఇప్పటి పసలపూడిలో 'పెద భామిరెడ్డి తీర్పు'లు కూడా ఉండవు కదండీ.. "పసలపూడి కోనసీమలోకి.." భలే పట్టుకున్నారండీ.. గోదారి జిల్లా అనబోయి, కోనసీమ అనేశా.. సొంత గడ్డ మీద మమకారం.. ఇక సమర్ధించుకోవాలంటే రెండు చోట్లా యాస ఇంచుమించుగా ఒకటే కదండీ :-) ..ధన్యవాదాలు.

    @ప్రణీత స్వాతి: చూస్తున్న నా అవస్థ అదేనండీ.. ధన్యవాదాలు.

    @తృష్ణ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. మురళి గారు.

    నా వ్యాఖ్య ని CB Rao గారు వివరి౦చి చెప్పారు ..కధలు చదివిన వారు ౧౦ మ౦ది ఉ౦టారు ..వారిలో మీ గోదావరి వాసులు ఒక ముగ్గురు ఉ౦టారు ...కాని ఇప్పుడు చూసే వారు ౧౦౦౦ మ౦ది ..ఆ ౧౦౦౦ మ౦ది లో ఒక ౭౦౦ మ౦దికి గోదావరి యాస అర్ధ౦ కాక, లేదా విసుగు తెప్పిస్తే :)

    రిప్లయితొలగించండి
  22. Murali garu chala baga chepparu..Nenu swathi book lo every week miss kakunda chadivey vadini..

    ee serial ni kooda dialy kakunda,weekly serail ga chesi , kadanam koncham fast gaa vunte bavuntundhi ani naa abiprayam..

    mee blog ivvala first time chusanu.. chala bavundandi..

    రిప్లయితొలగించండి
  23. @Mauli: గోదారి భాష, యాస వాడనప్పుడు కష్టపడి గోదారి జిల్లాలో షూటింగ్ చేయడం ఎందుకు చెప్పండి? చక్కగా హైదరాబాద్ లోనే ఏదో ఒక స్టూడియోలో తీసేయొచ్చుకదా.. ధన్యవాదాలు.
    @శశిధర్ అన్నే: చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండీ.. బాగా విసుగ్గా అనిపిస్తోంది.. నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి