శనివారం, జనవరి 29, 2011

ఎర్నూగు పూలు

మాండలీకపు మట్టివాసనని ఆస్వాదించే తెలుగు పాఠకులకోసం, తరతరాలుగా హోసూరు ప్రాంతంలో స్థిరపడి, తమిళ, కన్నడ భాషా సంస్కృతులతో నిత్యంపోరాడుతూ తెలుగు భాషా సంస్కృతులని నిలబెట్టుకుంటున్న సోదరులు కలంపట్టి అందించిన కథల సంకలనం 'ఎర్నూగు పూలు.' పదకొండు మంది కథకులు అందించిన పందొమ్మిది కథల్లో ప్రధానంగా కనిపించే ఇతివృత్తం బతుకుపోరు.

ఈ సంకలనంలో కథ, కథనాలని మించి ఆకర్షించేది భాషా సౌందర్యం. కన్నడ ప్రభావం ఉన్న, అక్కడక్కడ ఉర్దూ పదాలు, రాయలసీమ యాస వినిపించే తెలుగు భాష ప్రతి కథనీ ఆసాంతమూ చదివిస్తుంది. అర్ధం కాని పదాల అర్ధాల్ని వివరించేందుకు ప్రతి కథ చివరా ఫుట్ నోట్స్ ఉండనే ఉంది. హోసూరు పల్లెల అందాలని, అక్కడి సంస్కృతిని మాత్రమే కాదు, ప్రజల సమస్యలనీ కళ్ళకి కడతాయీ కథలు.

గ్రామఫోన్ రికార్డుల పెట్టెని తలపై పెట్టుకుని ఊరూరూ తిరుగుతూ, జనానికి పాటలు వినిపించి, వాళ్ళిచ్చే డబ్బుతో పొట్ట పోషించుకునే శిన్నమ్మ జీవిత కథే సంకలనంలో మొదటి కథ 'పాటల పెట్టి.' నా.వెం. అశ్వత్ధ రెడ్డి రాసిన ఈ మూడు నాలుగు దశాబ్దాలకి పూర్వంనాటి హోసూరు పల్లెల జీవన విధానాన్ని కళ్ళముందు ఉంచుతుంది. 'పరస పొద్దు' అనే కథ పేరు చూడగానే 'ప్రళయ కావేరి కథలు'లో స.వెం. రమేష్ రాసిన 'ఉత్తరపొద్దు' కథ గుర్తొచ్చింది కానీ, ఏమాత్రం పోలిక లేదు. ఓ పల్లెటూరి పండుగ, విద్యావంతులైన ఆలుమగల్లో ఎలాంటి మార్పు తెచ్చిందన్నది ఇతివృత్తం. ఎన్. వసంత్ రాశారీ కథని.

ఎన్.ఎం. కృష్ణప్ప రాసిన 'కడసీ కోరిక' ఆద్యంతమూ సీరియస్ గా సాగితే, నంద్యాల నారాయణ రెడ్డి రాసిన 'కూరేసి కాశిరెడ్డి' చివరికంటా నవ్వుల్ని పూయిస్తుంది. కారుపల్లి నరసింహమూర్తి కథ 'అవును శిన్నబుడె బాగుండె' నాస్టాల్జియా కాగా, ఎద్దుల సత్యనారాయణ రెడ్డి రాసిన 'మా ఊరు ఎత్తేస్తారా' కథ 'సెజ్' లపై సంధించిన బాణం. ఈయన రెండో కథ 'కడసీ పయనం' ఓ వ్యక్తి అంతిమయాత్రని చిత్రించింది. మూడో కథ 'గెరిగమ్మ తల్లి మెరిగెనె' జంతుబలి నిషేధం నేపధ్యంలో సాగింది.

ఎన్. సురేఖ కథ 'వనజాక్షి ఉర్దూ' ఊహించని విధంగా ముగియగా, నీలావతి రాసిన 'కూరాకవ్వ' సెంటిమెంట్ ప్రధానంగా సాగిన రచన. కెం. మునిరాజు రాసిన మూడు కథల్లోనూ, 'వడ్డికాసుల గౌడు' 'శిన్నతిమ్మడు పెద్దతిమ్మడు' హాస్యరస ప్రధానంగా సాగగా, 'అత్తవాన పొంగిలి' స్థానిక ఆచారాన్ని వర్ణించింది. స.వెం. రమేశ్ రాసిన 'ఆ అడివంచు పల్లె' చదువుతున్నంతసేపూ కళ్యాణ రావు నవల 'అంటరాని వసంతం' గుర్తొస్తూనే ఉంది. టి.ఆర్. శ్రీనివాస ప్రసాద్ కథ 'గూడు శెదిరిన గువ్వ' సైతం సెజ్ ఇతివృత్తంతో సాగేదే. ఈయనవే మరో నాలుగు కథలు వ్యవహారికంలో ఉండి, మాండలీకపు సౌందర్యాన్ని మరింత బాగా అర్ధం చేసుకోడానికి ఉపయోగ పడ్డాయి. ఈ నాలుగూ పూర్తిగా 'ఈనాడు ఆదివారం' మార్కు కథలు.

"మేమూ మీవాళ్ళమే. ఆంధ్ర దేశంగా అవతరించే వేళ తెగిపడి గాయాల పాలై మూలుగుతున్న మీ నెత్తుటి చుట్టరికమే మేము. రాజకీయ చుట్టరికాలను పక్కనబెట్టి, సాంస్కృతిక చుట్టరికాన్ని ముందుకు తీసుకురండి.. అంటూ హోసూరు ప్రాంత వెతలను కతలుగా గుచ్చి మీ ముందుంచుతున్నారు కృష్ణరసం (కృష్ణగిరి రచయితల సంఘం) సభ్యులు కొందరు. చదవండి మరి. చదివి పొరుగుసీమల తెలుగును కూడా ఆస్వాదించండి" అంటూ కృష్ణరసం గౌరవాధ్యక్షుడు ఎస్. ఎం. కృష్ణప్ప ముందుమాట పుస్తకాన్ని చదవాలనే ఉత్సాహాన్ని పెంచుతుంది.

కథకులందరూ 'కృష్ణరసం' సభ్యులే. హోసూరు పల్లెల్లో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న వాళ్ళే. అన్ని కథలూ అద్భుతాలు కానప్పటికీ, భాషా సంస్కృతులని చిత్రించిన తీరు, భాషకోసం వారు పడుతున్న తపన ఈ కథల పట్ల ప్రేమని పెంచుతాయి. "ఇతర భాషల ప్రభావాలను పక్కనబెడితే, తెలుగులోని ప్రాచీన లక్షణాలను, సొబగులను వదలక ఇంకా పట్టి కొనసాగుతున్నట్లు ఉంటుంది ఇక్కడి తెలుగు" అన్న కృష్ణప్ప మాటలతో ఏకీభవించకుండా ఉండం, పుస్తకం పూర్తి చేశాక. 'కృష్ణరసం' ప్రచురించిన 'ఎర్నూగు పూలు' కథాసంకలనం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. (పేజీలు 132, వెల రూ. 70.)

గురువారం, జనవరి 27, 2011

కొమ్మకొమ్మకో సన్నాయి

తెలుగు సినీ గీత సాహిత్యంలో వేటూరి ఓ అధ్యాయం. సంధియుగంలో ఉన్న సినిమాపాటకి ఓ కొత్త ఒరవడి దిద్దిన వేటూరి సుందర రామమూర్తి తన సిని ప్రస్థానంలో అడుగడుగునా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించిన వ్యక్తులందరినీ వినమ్రంగా స్మరించుకుంటూ ఘటించిన స్మృత్యంజలి 'కొమ్మకొమ్మకో సన్నాయి.' హాస్య, సంగీత పత్రిక 'హాసం' లో ప్రచురింపబడిన ఇరవై ఏడు వ్యాసాల సంకలనమైన ఈ పుస్తకాన్ని ఓసారి చదవడం మొదలుపెట్టాక, పూర్తి చేయకుండా పక్కన పట్టలేం.

సినీ సాహిత్య రచనలో తన గురువు దైతా గోపాలం మొదలు, తనచేత చక్కని పాటలు రాయించుకున్న జంధ్యాల వరకూ సిని రంగానికి చెందిన అనేకులని తలచుకుంటూ వేటూరి రాసిన వ్యాసాలని చదువుతుంటే 'ఎదిగిన కొద్దీ ఒదగడం' అంటే ఏమిటో ఎవరూ చెప్పకుండానే అర్ధం అవుతుంది. ఆయావ్యక్తుల వ్యక్తిత్వాలతో పాటు, వారిని భక్తిగానూ, గౌరవంగానూ, ప్రేమగానూ స్మరించుకున్న వేటూరి వ్యక్తిత్వమూ ప్రకాశితమవుతుంది.

సినీ సంగీతంలో ఎంతటి గీత రచయితకైనా తొలినాళ్ళలో సంగీత దర్శకుడి సహకారం అత్యవసరం. మామూలు రచనకీ, సినీ రచనకీ ఉన్న భేదాన్ని వివరంగా చెప్పడానికైతేనేమి, ట్యూన్ కి తగ్గట్టుగా రాయడంలో మెళకువలు బోధించడానికైతేనేమి గీతరచయితకి తొలి గురువు సంగీత దర్శకుడే. తన తొలిగురువు మహదేవన్ ని భక్తిగా తలచుకున్నారు వేటూరి 'స్వర బ్రహ్మ రాగ విష్ణు గురుర్దేవో మహదేవన్' అన్న తొలి వ్యాసంలో.

'చదివించిరి నను గురువులు..' అన్న పద్యపాదం గుర్తుకురాక మానదు, ఈ వ్యాసం చదువుతుంటే. బాగా రాసినప్పుడు పదిమంది ముందూ మెచ్చుకుంటూనే, చిన్న చిన్న లోటుపాట్లని ఏకాంతంలో బోధ పరిచిన మహదేవన్ సంస్కారాన్ని వినమ్రంగా తలుచుకున్నారు వేటూరి. గీత రచనలో తొలిగురువు దైతా గోపాలానికి అర్పించిన నివాళి 'కులపతి స్తుతమతి దైతా గోపాలం' వ్యాసం. "విషయ వాంఛలను వేరు సేయుమా, విష్ణు భజనమున్ సేయుమా, తృష్ణా విషహార దివ్యౌషధమో, కృష్ణ నామసుధ గ్రోలుమా.." అన్నది గోపాలం, వేటూరి, మరిముగ్గురు యువకులకి ఇచ్చిన చివరి సందేశం.

"మాట తప్పడం నేరంగా పరిగణించే లోకంలో ఆత్రేయ ఆ నేరాన్ని ఎంత అందంగా ముద్దొచ్చేటట్లు చేసేవాడో ఆయన సన్నిహితులకు బాగా అనుభవం.." అంటూ సరదా సంగతులు చెప్పినా, "నిజమైన సంగీతానికి సాహిత్యం అవసరం లేద"న్న మర్మాన్నివిప్పిచెప్పిన 'ఆదినారాయణరావుకి అంజలి' ఘటించినా, "ఆయన నటనా ప్రభావంతో ముమ్మిడివరంలో బాలయోగి అవతరించాడు. బెంగుళూరులో శ్రీనివాస అయ్యంగార్ యావదాస్తినీ బృందావనంగా మార్చి నాగయ్యగారికి అంకితం చేశారు" అంటూ 'చిరంజీవి చిత్తూరు నాగయ్య పాల్ ముని ఆఫ్ ఇండియా' ని గుర్తు చేసుకున్నా, "ఇది వేటూరి మాత్రమే రాయగలిగే వ్యాసం" అని అనిపించక మానదు.

"ఎన్.ఏ.టీ. వారు నిర్మించిన 'సీతారామకళ్యాణం' చిత్రంపై ఘాటుగా నేను 'రామారావణీయం సీతారామకళ్యాణం' అనే శీర్షికతో రాసిన సమీక్ష చూసి చిరునవ్వుతో, ఎవరిగురించో రాసినట్టుగా 'కొంచం ఘాటు తగ్గిస్తే బాగుండేదేమో' అన్న సహ్రుదయశీలి ఆయన" అంటూ ఎన్టీఆర్ లోని ఓ కోణాన్ని చూపిస్తూనే, "ఒకానొక ఉగాదినాడు నంది అవార్డ్ అందుకోడానికి వచ్చిన నన్ను దూరంనుంచే చూసి దగ్గరకి వచ్చి కరచాలనం చేస్తూ 'మీ పాటలు మానోట పలకడం లేదే! మాపాట మాదై పోయిందే' అన్న రామారావుగారిని నేను మరవలేను" అన్న వేటూరి వాక్యాలని మనమూ మరువలేం.

దైతా గోపాలం సక్కుబాయి పాటలని 'సక్కుబాయి' సినిమాకోసం తన పేరిట వాడుకున్న సముద్రాల విమర్శల పాలయ్యారనీ, ఎంత చక్కని సంగీతం చేసినా, సత్యం కాపీ బాణీల విమర్శల నుంచి బయట పడలేక పోయారనీ చెప్పినప్పుడు వేటూరి లోని నిర్మొగమాటిని చూస్తాం మనం. అలాగే సంగీత విభాగం వారిని మాత్రమే కాక, నటులు రేలంగినీ, జగ్గయ్యనీ తల్చుకుని వారితో తన అనుభవాలని వివరంగా పంచుకున్నారు. జగ్గయ్య మరణించాక రాసిన వ్యాసానికి 'నాటి ఆకాశవాణి నేటి అశరీరవాణి' అనే శీర్షిక ఇవ్వడం వేటూరికి మాత్రమే సాధ్యం.

"ఆకుపచ్చని సిరాతో లేత కొత్తిమీర ఆకులవంటి అక్షరాలతో ధీమాగా నిలిచే తలకట్లతో ఆయన తెలుగు అక్షరాలు కనువిందు చేసేవి" అంటూ దాశరధి ఉత్తరాలని ఇష్టంగా గుర్తు చేసుకుంటూనే "ఆయనతో గడిపిన క్షణాలు సరస్వతీ వీక్షణాలు - నిత్యజీవితంలో విలక్షణాలు. ఈ సులక్షణ కవితాశరధికి దాశరధికి ఇవే నా తేనెకన్నీరాజాతాలు" అంటూ వ్యాసాన్ని ముగించిన తీరు అనితరసాధ్యం. పెండ్యాల, సాలూరి, రమేష్ నాయుడు, రాజన్ నాగేంద్ర, బాపు-రమణ, విశ్వనాధ్, చక్రవర్తి, నాగిరెడ్డి, బాలు, ఇళయరాజా, రెహ్మాన్... వీరందరితోనూ తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న తీరు అపురూపం.

ఇక్కడ సొంత సంగతొకటి చెప్పుకోవాలి. సుమారు ఓ రెండు నెలల క్రితం, అంటే ఈ పుస్తకం కొనడానికి పూర్వం, బ్లాగ్మిత్రులు కార్తీక్ గారు 'చిత్రమాలిక' కోసం జంధ్యాల గురించి వ్యాసం ఒకటి పంపమన్నప్పుడు, ఓ టపా రాసి దానికి 'జంధ్యావందనం' అని శీర్షిక ఇచ్చాను నేను. ఈ శీర్షిక గురించి ఒకరిద్దరు మిత్రుల దగ్గర తగుమాత్రంగా గర్వ పడ్డాను కూడా. ఈ పుస్తకంలో జంధ్యాలకి నివాళిగా వేటూరి రాసిన వ్యాసానికి అదే శీర్షిక చూసి షాక్కొట్టింది నాకు. వేటూరి నన్ను చూసి జాలిగా నవ్వినట్టు అనిపించింది. గర్వ పడ్డ క్షణాలను తల్చుకుని సిగ్గు పడ్డానని ఒప్పుకోడానికి మొహమాట పడడంలేదిప్పుడు.

బాపు కవర్ డిజైన్ తో అందంగా ముస్తాబైన ఈ 'కొమ్మకొమ్మకో సన్నాయి' ని అందుబాటులోకి తెచ్చిన వారు హైదరాబాద్ కి చెందిన వేటూరి సాహితీ సమితి వారు. నూట తొంభై పేజీల ఈ పుస్తకం వెల నూట ఇరవై రూపాయలు. సినిమాలనీ, సినిమా సంగీత సాహిత్యాలనీ ఇష్టపడే వాళ్ళు తప్పక చదవాల్సిన రచన ఇది.

సోమవారం, జనవరి 24, 2011

రెండేళ్ళ తర్వాత...

బ్లాగు ప్రయాణంలో రెండో మైలురాయిని దాటుతున్న క్షణాలివి. వెనక్కి తిరిగి చూసుకుంటే నడిచి వచ్చిన దారి పొడవునా పరచిన గులాబీలూ, వాటి అడుగున ఉన్న ముళ్ళూ కూడా కనిపిస్తున్న సమయమిది. నాకు సంబంధించి పుట్టినరోజు అన్నది గడిచిన జీవితాన్ని సమీక్షించుకోవాల్సిన సందర్భం. నా బ్లాగు 'నెమలికన్ను' కి రెండో పుట్టిన రోజు ఇది.

అనుకోకుండా మొదలుపెట్టిన బ్లాగు ఆడుతూ పాడుతూ తొలివసంతం జరుపుకున్న క్షణాలని నేనింకా మర్చిపోకముందే కేలండర్లో మరో పన్నెండు పేజీలు మారిపోయి, కొత్త కేలండర్ వచ్చేసింది. మొదటి సంవత్సరపు బ్లాగింగ్ అనుభవం నాకు ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ మిగిలిస్తే రెండో సంవత్సరం కొన్నివిలువైన పాఠాలని నేర్పించింది. రెండూ మనుగడకి ఉపయోగపడేవే.

నిజానికి రెండో సంవత్సరంలో నా బ్లాగు మనుగడ ప్రశ్నార్ధకంగా అనిపించిన సందర్భాలు ఒకటికి మించే ఉన్నాయి. బ్లాగింగ్ కొనసాగించడం అవసరమా? అన్న ప్రశ్న ఎదురైన ప్రతిసారీ, నేను చేసిన పని ఒక్కటే. వెనుకటి టపాలని ఓసారి చదువుకోవడం. బ్లాగింగుని ఎందుకు కొనసాగించాలో అవి చెప్పకనే చెప్పాయి నాకు. కాలం ఎవరికోసమూ ఆగదు కదా.

మొదటి సంవత్సరంతో పోల్చినప్పుడు, రెండో సంవత్సరంలో టపాల సంఖ్య తగ్గిందన్నది కనిపిస్తున్న సత్యమే. "కేవలం సంఖ్య మాత్రమేనా? లేక టపాలలో నాణ్యత కూడానా?" అన్నది ఈమధ్యనే నన్ను తొలచిన ప్రశ్న. కొన్ని ఇటీవలి టపాలని మళ్ళీ ఓసారి చదువుకున్నప్పుడు నాకే సంతృప్తికరంగా అనిపించలేదు. అదే సమయంలో కొందరు మిత్రులు కూడా నేరుగానూ, పరోక్షంగానూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇది నేను పట్టించుకోవాల్సిన విషయమే.. అలెర్ట్ చేసిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు.

వ్యక్తిగత జీవితం ప్రభావం బ్లాగింగ్ మీద పడడం అన్నది మొదటి సంవత్సరం కన్నా, రెండో సంవత్సరంలో ఎక్కువగా జరిగింది. కొన్ని మార్పుల కారణంగా బ్లాగింగుకి కొన్నాళ్ళ పాటు విరామం ఇవ్వడం, మరి కొన్నాళ్ళు తరచుగా టపాలు రాయలేకపోవడం జరిగింది. 'ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది కాదు, ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితమూ కాదు' అన్న వాక్యం చాలాసార్లు గుర్తొచ్చింది.

నన్ను నేను సమీక్షించుకున్నప్పుడు గతంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరంలో చదివిన పుస్తకాల, చూసిన సినిమాల సంఖ్య కూడా తక్కువేనన్న సత్యం బోధ పడింది. ఏడాది క్రితం మొదలుపెట్టిన బ్లాగ్మిత్రులతో లేఖాయణాన్ని ఈ సంవత్సర కాలంలో నేను బాగా ఆస్వాదించిన అంశంగా చెప్పాలి. ఉత్తరాల కారణంగా ఎందరో కొత్త మిత్రులైనారు. వ్యాఖ్యలని మించి వివరంగా స్పందనను తెలపాలనుకున్న మిత్రులు లేఖలు రాశారు. అచ్చుతప్పులు కనిపించిన ప్రతిసారీ ఎత్తిచూపారు. ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించినవే.

కొంచం తరచుగా రాయమన్నది ఎక్కువమంది మిత్రులు చేసిన సూచన. తప్పక దృష్టిలో ఉంచుకుంటాను. నిజానికి నాకు చదవడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో, రాయడమూ అంతే ఆనందాన్నిస్తుంది. నా రాతలని చదువుతూ, తమ తమ అభిప్రాయాలని సూటిగానూ, స్పష్టంగానూ నాతో పంచుకుంటున్న మిత్రులందరికీ మరో మరు కృతజ్ఞతలు.

శుక్రవారం, జనవరి 21, 2011

వంశీ 'మా' పసలపూడి కథలు

గత ఐదు రోజులుగా రోజూ అరగంట పాటు 'మా' టీవీ చానల్ దూరదర్శన్ గా మారిపోతోంది. మొన్న సోమవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన 'వంశీ మా పసలపూడి కథలు' ధారావాహిక, నన్ను దూరదర్శన్ రోజులకి తీసుకెళ్ళి పోతోంది. ముఖ్యంగా దర్శకత్వం, నటీనటుల నటన చూస్తుంటే రెండున్నర దశాబ్దాల నాటి దూరదర్శన్ సింగిల్ ఎపిసోడ్లు, పదమూడు భాగాల ధారావాహికలూ వద్దన్నా గుర్తొచ్చేస్తున్నాయి.

వంశీ రాసిన 'మా పసలపూడి కథలు' కథాకాలం 1844 లో మొదలై నిన్న మొన్నటి తానా సభలతో ముగిసింది. అధిక శాతం కథలు వర్ణన ప్రధానంగా సాగేవి. వీటికి దృశ్యరూపం ఇవ్వాలనుకోవడం ఒక రకంగా సాహసమే. ఎందుకంటే వర్ణనలని అక్షరాల్లో చదివినప్పుడు పాఠకులకి కలిగే అనుభూతిని దృశ్యం ద్వారా కలిగించడం దుస్సాధ్యం. ఈసాహసానికి పూనుకున్నవారు శంకు.

నిజానికి శంకు ని గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కార్టూనిస్ట్ అనీ, బాపు-రమణల దగ్గర కొన్ని సినిమాలకి పనిచేశారనీ, అలనాటి దూరదర్శన్ న్యూస్ రీడర్ శ్రీమతి శోభాశంకర్ భర్త అనీ మాత్రమే నాకు తెలుసు. కథలని ఒకటికి పదిసార్లు ఇష్టంగా చదివిన వాడిగా, చిత్రీకరణలో కష్టనష్టాలని అర్ధం చేసుకోగలను. శంకు కాదు కదా, స్వయంగా వంశీనే దర్శకత్వం వహించినా, కథలకి దీటుగా ధారావాహికని తీర్చి దిద్దడం అన్నది అసాధ్యం.

ఈ ధారావాహికకి గీత రచన, గానం, నేపధ్య సంగీతం సమకూర్చడం వంటి ప్రకటిత బాధ్యతలతో పాటు, ప్రాజెక్ట్ మానిటరింగ్ అనే అప్రకటిత బాధ్యతనీ వంశీ తీసుకున్నట్టు సమాచారం. ప్రతి ఎపిసోడూ వంశీ చూశాక మాత్రమే ప్రేక్షకుల ముందుకి వస్తోందన్న మాట. ఇక ధారావాహిక లోకి వస్తే, వెండితెరకి వంశీ ప్రొడక్ట్ గా పరిచయమైన తనికెళ్ళ భరణి వ్యాఖ్యానంతో మొదటి ఎపిసోడ్ ప్రారంభమయ్యింది. ఓ నలుగురు సూత్రధారులని ప్రేక్షకులకి పరిచయం చేసి తను పక్కకి తప్పుకున్నారు భరణి. వీళ్ళంతా పసలపూడిలో ప్రస్తుతం నివాసం ఉంటున్న మధ్య వయస్కులు.

ఈ సూత్రధారులు గతాన్ని తలచుకుంటున్నట్టుగా 'నల్లమిల్లి పెద భామిరెడ్డి గారి తీర్పు' అనే కథని గత ఐదు రోజులుగా ప్రసారం చేస్తున్నారు. నా అంచనా నిజమైతే మరో ఎపిసోడ్ తో ఈ కథ ప్రసారం పూర్తవ్వాలి. మూడు పేజీల కథని ఆరు ఎపిసోడ్లుగా మలచడానికి చేయాల్సిందంతా చేసింది నిర్మాణ బృందం. సూత్రధారుల అనవసరపు కామెడీ అయితేనేమి, చిత్రీకరణలో డైలీ సీరియల్ తరహా సాగతీత ధోరణి అయితేనేమి...ప్రేక్షకులకి విసుగు కలిగించే అంశాలు పుష్కలంగా ఉన్నాయిందులో.

ఈ ధారావాహికలో మెచ్చుకోదగ్గ అంశాలు ఏవీ లేవా? అంటే, చాలానే ఉన్నాయి. కథాకాలానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, కరెంటు దీపాల వంటివి చూపక పోవడం, నటీనటుల ఆహార్యంతో పాటు పచ్చని కోనసీమ, గోదారి, పిల్లకాలువలా అందాలని ఒడిసిపట్టడం లాంటి విషయాల్లో నూటికి నూరు మార్కులు ఇచ్చేయాల్సిందే. పెద భామిరెడ్డి పాత్రని కొంచం సద్దుకుంటే, మిగిలిన పాత్రల పాత్రధారులందరూ అతికినట్టు సరిపోయారు. ముఖ్యంగా మహిళా పాత్రలు, భామిరెడ్డి భార్య వీరమ్మ, కూతురు శివాలక్ష్మి, ఎర్ర నూకరాజు, సుంకి చాలా చక్కగా ఉన్నారు.

నటీనటుల్ని ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసుకుని, వాళ్లకి ఆహార్యాన్ని సమకూర్చారో, వాచికం విషయంలో అంతటి నిర్లక్ష్యాన్నీ చూపించారు. వంశీ కథలకి జీవం పోసిన గోదారి జిల్లా యాస, ధారావాహికలో పాత్రల సంభాషణల్లో మచ్చుకైనా వినిపించదు. పైగా, ప్రధాన పాత్రలు మినహా, మిగిలిన పాత్రలన్నీ డైలాగుల్ని ఎవరికో అప్పగిస్తున్నట్టు చెప్పడం అస్సలు భరించలేని విషయం. వాళ్ళంతా ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కాకపోవచ్చు, కనీసం డబ్బింగ్ దగ్గరైనా జాగ్రత్త పడాలి కదా? పాత్రల హావభావాలకీ, సంభాషణలకీ అస్సలు పొంతన లేకపోవడం మరో లోపం.

శంకూ గారికి కోనసీమతో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో నాకు తెలీదు కానీ, అక్కడి భాషనీ, యాసనీ ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. లేదూ వేరెవరికైనా సంభాషణల బాధ్యత అప్పగించడం అన్నా జరగాలి. అలాగే కథలో ప్రతి వాక్యాన్నీ దృశ్యంగా మలిచే ప్రయత్నం కూడా అనవసరం. రెండు మాధ్యమాలకీ ఉన్న తేడాని పట్టుకోవడం అవసరం. సూత్రధారులని, వాళ్ళ ఆహార్యాన్నీ చూసినప్పుడు వాళ్ళు వంశీ సృష్టే అనిపించింది నాకు. తాపీ మేస్త్రి ప్రతి సన్నివేశంలోనూ తాపీ పట్టుకుని కనిపించడం ఏమిటో అర్ధం కాదు.

సంభాషణలు, ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, ఈ ధారావాహిక పుస్తకాన్ని మరిపించనప్పటికీ చూడ చక్కని ధారావాహిక అవుతుంది. ఎడతెగని సీరియళ్ళతో విసిగిపోయిన ప్రేక్షకులకి మంచి రిలీఫ్ కూడా కాగలదు. పంధాని మార్చుకోకుండా, పుస్తకానికీ, వంశీకీ ఉన్న ఇమేజ్ నీ, నేపధ్య గీతాన్నీ నమ్ముకుని ఇలాగే కొనసాగితే మాత్రం ప్రేక్షకులని నిలుపుకోవడం కష్టం.

బుధవారం, జనవరి 19, 2011

బంగారు మురుగు

అనగనగా ఓ బామ్మ, మనవడు. ఆ బామ్మకి కాశీ, రామేశ్వరం అన్నీ మనవడే. మనవడికి అమ్మ, నాన్న, చుట్టం, పక్కం అన్నీ బామ్మే. బామ్మది కలిగిన కుటుంబం. కొడుక్కీ, కోడలికీ విపరీతమైన దైవ భక్తి. ఎప్పుడూ పూజా పునస్కారాలూ, మడీ ఆచారాలూ. వాళ్ళిల్లు స్వాములార్లకీ, పీఠాధిపతులకీ విడిది. అందుకే ఆ ఇంట్లో బామ్మదీ, మనవడిదీ ఓ జట్టు. వాళ్ళిద్దరూ ఒకే కంచంలో తింటారు. ఒకే మంచంలో పడుకుంటారు.

ఆరేళ్ళ మనవడిని వీపున వేసుకుని, అతగాడు సగం నిద్రలో జోగుతుంటే, దేవుళ్ళందరికీ మేలుకొలుపులు పాడుతూ, గుమ్మం ముందు ముగ్గులు తీర్చి దిద్దడంతో బామ్మగారి దినచర్య ప్రారంభమవుతుంది. "మేలుకొలుపులూ మనకోసమే, చక్రపొంగలీ మనకోసమే.." అంటుందావిడ చమత్కారంగా. "దయ కంటే పుణ్యం లేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు అన్నం పెట్టడం..." ఇది ఆవిడ సిద్ధాంతం.

పెరట్లో ఉండే బాదం చెట్టు బామ్మా మనవాళ్ళ స్థావరం. రోజులో ఎక్కువసేపు వాళ్ళు కాలం గడిపేది ఆ చెట్టు కిందే. తను కాపురానికి వచ్చేటప్పుడు మూడే బుల్లి బుల్లి ఆకులతో ఉండే బాదం మొక్కని తనతో తెచ్చిన బామ్మ, దానిని పెంచి పెద్ద చేసింది. ఇప్పటికీ చెంబెడు నీళ్ళు దాని మొదట్లో పోస్తుంది. నీడన కట్టేసిన ఆవుకి పరకలు వేస్తుంది. బాదం కాయలు వైనంగా కొట్టి మనవడికి తినిపిస్తుంది. బాదం ఆకులతో విస్తళ్ళు కుడుతుంది.

బామ్మ చేతికో బంగారు మురుగు. ఆవిడ దానిని ఎల్ల వేళలా ధరిస్తుంది. నెలకోసారి భజంత్రీ వాడొచ్చి తల పని చేసినప్పుడు మాత్రం, కాసేపు దాన్ని మనవడికిస్తుంది, లక్ష జాగ్రత్తలు చెప్పి. కోడలితో పాటు, ఆవిడ కూతురి కళ్ళు కూడా ఆ మురుగు మీదే. ఎలా అయినా ఆ మురుగుని సొంతం చేసుకోడానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు. బామ్మ ముందా వాళ్ళ ప్రయత్నాలు?

బామ్మకి లౌక్యం తెలుసు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అందుకే పంట శిస్తు తెచ్చే రైతులతో నేరుగా వ్యవహారం మాట్లాడకుండా, ఎండన పడి వచ్చిన వాళ్లకి ముందుగా విస్తరి నిండా వడ్డించి కడుపు నిండుగా భోజనం పెడుతుంది. ఆ తర్వాతే, పంటల కబుర్లు, శిస్తు లెక్కలు. మనవడికోసం బామ్మ ఎంతైనా చేయగలదు. అతనికి చిరుతిళ్ళు అందనివ్వక పోతుంటే, పీచ్మిఠా వాడికి దేవుడి గంట అమ్మేసి చిరుతిళ్ళు కొని తినిపించగలదు.

కొడుక్కీ, కోడలికీ పీఠాలని సేవించుకోవడం అంటే భయమూ, భక్తీని. బామ్మకి మాత్రం వాటి లెక్కేమీ లేదు. మనవడి తర్వాతే పీఠమైనా, దేవుడైనా. ఇంటికి వచ్చిన పీఠాధిపతికి తెలియక అపచారం చేసిన మనవడిని, కొడుకు చావ బాదుతుంటే అడ్డుపడింది బామ్మే. ఆక్షణంలో మనవడికి వెయ్యి చేతులు తనకోసం చాపిన అమ్మవారిలా కనిపించింది బామ్మ. "అరిసెల్నీ అప్పాల్నీవదలలేని వాడు అరిషడ్వర్గాలనేఁ వదులుతాడు" అంటూ కొడుకునీ, స్వాములార్నీ కలిపి తిట్టేసింది.

కాలం గడిచిపోయింది. ఆస్తులు కరిగిపోయాయి. బామ్మేమీ బాధ పడలేదు సరికదా, "మా ఉయ్యాల వెండి గొలుసులని గున్న ఏనుగు మింగేసింది" అని సరసంగా నవ్వుతుంది. గున్న ఏనుగు పీఠాల వారిది. ఇప్పుడు గత వైభవమూ లేదు, అలా అని దరిద్రమూ లేదు. మనవడి వైభవం బామ్మా, బాదం చెట్టూ -- రెండూ ఉన్నాయి. మనవడి ఎఫ్.ఏ. చదువు పూర్తి కావడం, సర్కారు కొలువు దొరకడంతో పెళ్లి సంబంధాలు రావడం మొదలవుతుంది. పిల్లనిస్తానంటూ మేనత్తే వచ్చినా, బామ్మ వద్దు పొమ్మంటుంది.

ఎట్టకేలకి బామ్మకి నచ్చిన సంబంధం వచ్చింది. చిన్న మాట పట్టింపు దగ్గర ఆగింది. బామ్మకి ఆ సంబంధం చేయాలని. ఎటూ చెప్పలేని పరిస్థితి మనవడిది. మనవడి పెళ్లి పల్లకీ ఊరేగింపు చూడాలన్న ఆ బామ్మ కల నెరవేరిందా? అంత ప్రేమగా చూసుకున్న బంగారు మురుగుని ఆవిడ ఏం చేసింది? ఇత్యాది ప్రశ్నలకి సమాధానం శ్రీరమణ రాసిన కథ 'బంగారు మురుగు.'

వెనకటి తరం కుటుంబ బంధాలని అద్దంలో చూపిస్తూ రాసిన ఈ కథని ఆసాంతమూ చదవకుండా విడిచి పెట్టలేం. కేవలం ఒక్కసారి మాత్రమే చదివి సరిపెట్టుకోలేము కూడా. ఇప్పటికీ ఈ కథని చదువుతుంటే చివరి వాక్యాల దగ్గర కళ్ళు మసకబారతాయి. 'మిథునం' కథల సంపుటిలో ఉందీ కథ.

సోమవారం, జనవరి 17, 2011

ప్రభలతీర్ధం - మెమరీకార్డ్

ధనుర్మాసపు ఉదయాన మంచుతెర కప్పుకున్న గోదారి కొత్తల్లుడి బెట్టునీ, కొత్త పెళ్ళికూతురి బెరుకునీ ఏకకాలంలో చూపించేస్తోంది. ఆకుపచ్చని కోనసీమలోకి అడుగు పెట్టాలంటే గోదారి దాటాల్సిందే. డిసెంబరు తుఫాను పండుగ కళని పట్టుకుపోయింది. ఎక్కడ చూసినా నవ్వు పులుకుకున్న దిగులు ముఖాలే. ఎగసి పడాల్సిన భోగి మంటలు మొహమాటంగా మండుతున్నాయి. హరిదాసు పాటలు, గంగిరెద్దు ఆటలూ అరుదైన దృశ్యాలు అయిపోయాయి. కాల మహిమ.

సంక్రాతి సంబరాలలో కోనసీమని ప్రత్యేకంగా నిలిపేది కనుమ పండుగనాడు జరిపే ప్రభల తీర్ధం. ఈశ్వర ప్రతిరూపంగా భావించే ప్రభని తుదకంటా చూడాలంటే నా చిన్నప్పుడు మెడ పట్టేసేది. ప్రభలన్నీ అంత ఎత్తుగా ఉండేవి. ఈసారి ప్రభ కట్టడాన్ని దగ్గరుండి చూశాను. కట్టడానికి ఉత్సాహం చూపిన జనమే అంతంత మాత్రం అనుకుంటే, ప్రభ సైజు మీద బోలెడన్ని ఆంక్షలు. మోయడానికి జనం ఎక్కువగా లేరు కాబట్టి, బరువు తక్కువగా ఉండాలనీ, కరెంటు వైర్లు తగిలేస్తాయి కాబట్టి ఎత్తు తగ్గించమనీ..ఇలా..

ఎప్పుడూ కన్నా ఈసారి ఊళ్ళకి వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగినట్టుగా అనిపించింది. పెంకుటిళ్ళ ముందు పార్క్ చేసిన బెంజిలూ, లాంసర్లూ ఈసారి పండుగ స్పెషల్. వచ్చిన వాళ్ళలో ఎక్కువమంది రాష్ట్ర రాజధాని నుంచి అనిపించింది, కొన్ని సంభాషణలు విన్నాక. భూములు, ఇళ్ళ స్థలాల ధరవరల గురించీ, కౌలు రైతులు కొలుస్తున్న ధాన్యాన్ని గురించీ మెజారిటీ సంభాషణలు జరిగాయి. ఈసరికే రాజధానిలో కొన్ని ఆస్తులు సమకూర్చుకున్న వాళ్ళూ, ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళూ కూడా సొంత ఊళ్లమీద దృష్టి పెడుతున్నారని అర్ధమయ్యింది. ఇప్పుడింక మా పల్లెల్లోనూ రియలెస్టేట్ ఊపందుకుంటుందేమో..


ప్రభ ఊరేగింపు మొదలయ్యింది. డప్పులు దరువేస్తుండగా కొందరు ఉత్సాహవంతులు చిందేస్తున్నారు. ఆదివారం కావడంతో చర్చిలన్నీ రద్దీగా ఉన్నాయి. ప్రభువు పాటలు డప్పుల మోతలతో పోటీ పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా, చేతిలో ఫోను, కెమెరా ఉన్న ప్రతి ఒక్కరూ ఊరేగింపుని తదేక దీక్షతో రికార్డు చేసేస్తున్నారు. "మెమరీ ఫుల్లయ్యిందే. నువ్వు కంజూస్.. టూజీబీ తీస్కోవచ్చు కదా..." అంటోందో ఆమ్మాయి.." హైడ్రాబేడ్ రిటర్న్డ్ అనుకుంటా. "లాష్టియర్ షిల్పారామం లో కైట్ ఫెస్టివల్ ఎంతబాగా జరిగిందో తెల్సా..." అంటూ మరో గొంతు.

కాస్త దూరం ఊరేగింపులో నడిచి అలిసిపోయిన వాళ్ళు బడ్డీ కొట్ల దగ్గర సాఫ్ట్ డ్రింకుల తోనూ, వాటర్ బాటిళ్ళతోనూ గొంతులు తడుపుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళముందు ఆగి, దాహం అడిగి తాగడం కనిపించింది. మళ్ళీ ఏడాదికి వాళ్ళు కూడా నీళ్ళ సీసాలవైపుకే మొగ్గు చూపుతారేమో. "ఇప్పుడే సిగ్నలొచ్చిందిరా.. మా ప్రెభ దార్లో ఉంది. వొచ్చేత్తన్నామెహే..." మరో ఫోన్ సంభాషణ. కరచాలనాలు, కార్డులు మార్చుకోడాలూ జరిగిపోతున్నాయ్ మరోపక్క. "మా అమ్మాయిని ట్రిపుల్ ఐటీ కి ప్రిపేర్ చేస్తున్నాం. మరి మీవాడు?" తరహా సంభాషణలకీ కొదవలేదు.

ప్రభలు ఒక్కొక్కటీ తీర్ధస్థలికి చేరుతున్నాయ్. జనం ఉన్నారు కానీ సందడీ, సంబరం కనిపించడంలేదు. రంగు సోడాలూ, రంగులరాట్నాలూ పిల్లల్ని అబ్బుర పరచడం మానేసి చాలారోజులే అయినట్టుంది. కొట్లు కూడా యేవో మొక్కుబడిగా ఉన్నాయ్. "మాచిన్నప్పుడు ప్రభల తీర్ధం లో మాంచి జీళ్ళు దొరికేవి.. బెల్లపు జీళ్ళు.." లాంటి నిట్టూర్పులు, సెల్ ఫోన్ రింగ్ టోన్లలో కలిసిపోయాయి. బయట ప్రపంచంలో ఇన్ని మార్పులు వచ్చేశాక కూడా ఈ తీర్ధం ఇంకా జరుగుతోన్నందుకు సంతోషపడాలా, లేక రాబోయే రోజులకి ఇది మెమరీ కార్డ్ లో భాగంగా మిగిలిపోతుందేమో అని బెంగ పడాలా అన్నది తేల్చుకోక ముందే తీర్ధం ముగిసిపోయింది.

శుక్రవారం, జనవరి 14, 2011

హరిదాసు

"అమ్మా.. హరిదాసు అవ్వాలంటే ఏం చదవాలమ్మా?" చిన్నప్పుడు అమ్మనీ ప్రశ్న ఎన్నిసార్లు అడిగానో లెక్కలేదు. నాకు అక్షరాభ్యాసం అయ్యింది మొదలు, ఎలాంటి సందర్భం వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళంతా దీవించే మొదటి దీవెన "పెద్ద ఉద్యోగస్తుడివై... దోసెడు రూపాయలు సంపాదించుకుని..." అవ్వడంతో పెద్దయ్యాక నేను ఉద్యోగం చేయాలన్న విషయం అర్ధమైపోయింది. అయితే, ఏ ఉద్యోగం చెయ్యాలో ఎవ్వరూ స్పష్టంగా చెప్పకపోవడం వల్ల, రకరకాల ఉద్యోగాలు నా ఊహల్లో మెదిలేవి. అదిగో, వాటిల్లో ఈ 'హరిదాసు' ఒకటి.

ధనుర్మాసపు ఉదయాల్లో, మంచు వర్షంలా కురిసే సమయంలో నిండా రగ్గు కప్పుకుని నిద్రపోవడం నాకు ఎంత ఇష్టమో. ఈ ఇష్టాన్ని నాకు తీరనివ్వకుండా చేసినవాడు హరిదాసు. అయినా కూడా నాకు హరిదాసంటే బోల్డంత ఆరాధన. హరిదాసు ఊళ్లోకి వచ్చాడన్న సూచనగా తంబురా శ్రుతో, చిరతల చప్పుడో, గజ్జెల ఘల్లు ఘల్లులో లేక "శ్రీమద్రమారమణ గోవిందో హరి.." అన్న పాటో అలలు అలలుగా చెవిని తాకేది. అంతే, నిద్ర మత్తు ఒక్కపెట్టున యెగిరిపోయేది. ముఖ ప్రక్షాళనకి పరిగెత్తేవాడిని, వెంటనే. ఎందుకంటే, ధనుర్మాసం నెల్లాళ్ళూ హరిదాసుకి బియ్యం పోసే డ్యూటీ నాదేకదా మరి. పాచి ముఖంతో బియ్యం పోస్తే పాపం చుట్టుకుంటుంది కూడాను.

ఉదయం ఏడవుతుండగా ఊళ్లోకి వచ్చేవాడు హరిదాసు. పట్టు పంచె, ఖద్దరు బనీను. మెడలో, చేతులకీ పూల దండలు. భుజాల చుట్టూ శాలువా. ఓ భుజం మీద తంబురా, చేతిలో చిరతలు. తలకి పాగా, ఆ పాగా మధ్యలో కొలువు తీరిన తళతళలాడే రాగి పాత్ర. గుమ్మడికాయ ఆకారంలో ఉండే ఆ పాత్రకి అలంకారంగా ఓ పూలదండ. నల్లనివాడైనా కళగల ముఖం మా హరిదాసుది. నుదుట, భుజాలమీద శ్రద్ధగా నామాలు దిద్దుకుని వచ్చేవాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చే వాడేమో, క్రమక్రమంగా దగ్గరయ్యే ఆ గజ్జెల చప్పుడు, తంబురా నాదం వింటుంటే ఏమిటో ఒకటే కంగారుగా ఉండేది.

హరిదాసు ఎవ్వరింటి ముందూ ఆగేవాడు కాదు. "శ్రీమద్రమారమణగోవిందో హరీ.." అంటూ ముగ్గు చుట్టూ ఒకసారి తిరిగి, గుమ్మంలో ఎవరూ నిలబడి లేకపొతే వెంటనే మరో ఇంటికి వెళ్ళిపోయేవాడు. హరిదాసలా తిరిగి వెళ్ళిపోతే అరిష్టం కదా, అందుకని మనం వీధి గుమ్మంలో కాసుకుని కూర్చోవాలి. హరిదాసు కోసం చూస్తున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా వేరే పనులేమీ చెప్పరు. మనం బియ్యం పళ్ళెంతో గుమ్మంలో నిలబడి ఉన్నామనుకో, ముగ్గులో మోకాళ్లమీద వంగి కూర్చుంటాడు హరిదాసు. గొబ్బిళ్ళు ఉన్నాకానీ అస్సలు తొక్కడు. చేతుల్లో తంబురా, చిరతలూ వాటిపని అవి చేస్తూనే ఉంటాయి, తలమీద పాత్ర కదులూమెదులూ లేకుండా అలాగే ఉంటుంది.

అలా చేయి నేలకి ఆన్చకుండా వంగి కూర్చోడానికి ఇంట్లో వాళ్ళెవరూ చూడకుండా నేను రెండు మూడుసార్లు ప్రయత్నించానుకానీ, నా వల్ల కాలేదు. ఇంతకీ హరిదాసు అలా కూర్చున్నప్పుడు మనం పళ్ళెంలో బియ్యాన్ని, రాగి పాత్రలో జాగ్రత్తగా పోసేయాలి. పాత్రని పొరపాటున కూడా తాకకూడదు. బియ్యం ఒలక కూడదు. మనం బియ్యం పూర్తిగా పోసేసిన సంగతి హరిదాసుకి ఎలా తెలుస్తుందో కానీ "కృష్ణార్పణం" అని, తంబురా మీటుతాడు. కొంచం భయంవేసినా అస్సలు భయపడకుండా దండం పెట్టుకోవాలి.

అమ్మకి నాతో పనున్నప్పుడల్లా ప్రశ్నలతో వేధించే వాడిని. హరిదాసు ఎక్కడ ఉంటాడు? తనకి పిల్లలు ఉంటారా? (హరిదాసుకి పిల్లలుండడం నాకు నచ్చలేదు ఎందుకో..), రోజూ రాకుండా నెలపట్టినప్పుడు మాత్రమే ఎందుకు వస్తాడు? మనం ఇచ్చే బియ్యం ఏం చేసుకుంటాడు? ...ఇలా ఉండేది ప్రశ్నల పరంపర. అమ్మ అప్పటికప్పుడు యేవో సమాధానాలు చెప్పేది కానీ, నాకేవీ నచ్చేవి కాదు. రోజూ హరిదాసు కట్టుకునే పట్టు పంచలనీ, కప్పుకునే శాలువలనీ శ్రద్ధగా చూసేవాడినేమో, ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి వెళ్లి తనకి మొత్తం ఎన్ని పంచలు ఉన్నాయో చూడాలని భలే కోరికగా ఉండేది.

హరిదాసుతో మాట్లాడ్డం అస్సలు కుదరదు. ఎందుకంటే తను చాలా తొందర తొందరగా ఊరంతా తిరిగేస్తాడా? మనం ఇంట్లో వాళ్ళు చూడకుండా తన వెంట పడ్డా, మనతో మాట్లాడడు. తలమీద పాత్ర ఉన్నంతసేపూ తను మాట్లాడ కూడదు మరి. ఊళ్ళో తిరిగినంతసేపూ తలమీద భిక్ష పాత్ర తప్పనిసరి. వేళ్ళు నలిగిపోకుండా తంబురా, చిరతలూ ఎలా వాయిస్తాడో అడగాలనీ, పాటలు ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసుకోవాలనీ ఇలా చాలా చాలా అనుకునే వాడిని. ఓసారి ఆ తంబురా మీటి, చిరతలని అలా అలా వాయించడం నా తీరని కోరికల జాబితాలో శాశ్వత స్థానాన్ని సంపాదించేసుకున్నాయి.

ధనుర్మాసం నెల మొత్తమ్మీద హరిదాసు కొంచం తాపీగా ఊళ్ళో తిరిగే రోజు ఒక్కటే ఉండేది. అది పెద్ద పండుగ. ఆవేళ హరిదాసు తలమీద పాత్ర పెట్టుకునేవాడు కాదు. తనతో పాటు తీసుకొచ్చిన మరో మనిషి మోసే కావిడిలో ఆ పాత్ర ఉండేది. రోజూ పొద్దు పొద్దున్నే వచ్చే హరిదాసు, ఆవేళ మాత్రం మధ్యాహ్నం భోజనాలప్పుడు వచ్చేవాడు. వీధిలో ఇంకా ఆరకుండా వెలుగుతున్న భోగి మంటని జాగ్రత్తగా దాటుకుని వాకిట్లోకి వచ్చి, ముగ్గులు తొక్కకుండా ఓ పక్కగా నిలబడి, ఇంట్లో అందరినీ పలకరించి మాట్లాడే వాడు. "అయ్య" "అమ్మ" "బాబు" అని మాట్లాడేవాడు.

అమ్మ, నాన్న పక్కనే ఉండేవాళ్ళు కదా.. అందుకని నాకు హరిదాసుతో మాట్లాడడానికి భయంగా ఉండేది. అదీకాక, ఏం అడిగితే ఏమంటాడో అని భయం కూడాను. తనేమో ప్రతిసంవత్సరం నా చదువు గురించి అమ్మానాన్నలని కనుక్కునేవాడు. ఆవేళ బియ్యంతో పాటు, పిండివంటలు, కొబ్బరికాయ, డబ్బులు ఇచ్చేవాళ్ళు హరిదాసుకి. నేను పండగ భోజనమన్నా చేయకుండా మా వీధి చివరివరకూ దిగబెట్టేవాడిని హరిదాసుని. ఇంక మళ్ళీ ఏడాది వరకూ తను కనిపించడంటే భలే దిగులేసేది. ఒకటి మాత్రం నిజం.. హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం.

....మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు....

ఆదివారం, జనవరి 09, 2011

సాగర సంగమం

మాధవి.. పేరుకి తగ్గట్టే అందమైన అమ్మాయి. అంతకు మించిన సున్నితమైన హృదయం. లలిత కళలంటే, ముఖ్యంగా నాట్యం అంటే ప్రాణం ఆమెకి. ఆమె ఇష్టాలకి అభ్యంతరం చెప్పని తండ్రి. పుట్టింది కలిగినింటే కావడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల చింత లేదు. తనకి నచ్చినట్టుగా జీవిస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్న మాధవి నీలి కళ్ళలో కనీకనిపించని నీలి తెర. గతం చేసిన గాయం తాలూకు జ్ఞాపకం కావొచ్చు.


భారతీయ నృత్య రీతులమీద సాధికారికంగా మాట్లాడగల మాధవి వాటిని గురించి ఆంగ్ల పత్రికకి వ్యాసాలు రాస్తూ ఉంటుంది. అదిగో, పనిలో ఉండగానే మాధవికి బాలూ పరిచయ మవుతాడు. నాట్యం అంటే ప్రాణం బాలూకి. భారతీయ నాట్య రీతులన్నీ ఔపోసన పట్టి కొత్త రీతిని తయారు చేయాలన్నది బాలూ కల. అయితే, మాధవి లాగా అతను డబ్బున్నవాడు కాదు. వంటలు చేసి పొట్ట పోషించుకునే తల్లి, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునే మిత్రుడు రఘు.. ఇవీ బాలూ ఆస్థిపాస్తులు.


బాలూ ఎంతటి అభిమానధనుడంటే, మాధవి తీసిన తన ఫోటోలలో ఒకదానిని తన తల్లికోసం అడిగి తీసుకోడానికి కూడా మొహమాట పడేటంత. అప్పటికే బాలూ నేర్చుకున్న నాట్య రీతుల మీద అతనికున్నట్టు, అంతకు మించి నాట్యం పట్ల అతడికున్న అవ్యాజమైన  ప్రేమని అతితక్కువ కాలంలోనే అర్ధం చేసుకుంది మాధవి. త పరపతి ఉపయోగించి, ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో నృత్య ప్రదర్శన చేయగలిగే  అరుదైన అవకాశాన్ని బాలూకి ఇప్పించగలిగింది. మాధవి సాంగత్యంలో అప్పుడప్పుడే ఎదుటివారిని అర్ధం చేసుకోడం మొదలు పెట్టిన బాలూ, ఇన్విటేషన్లో తన ఫోటో చూసుకుని చేష్టలుడిగి పోతాడు. ఆక్షణంలో అతడు తన భావోద్వేగాలని నిస్సంకోచంగా పంచుకున్నది మాధవితోనే.


తనతోపాటు తల్లినీ ఫెస్టివల్ కి తీసుకెళ్ళి, ప్రేక్షకుల్లో ముందువరుసలో ఆమెని కూర్చోబెట్టి, ఆ మహాజనం ముందు తను నాట్యం చేస్తుండగా ఆమె కళ్ళలో కనిపించే సంతోషాన్ని చూడాలన్న బాలూ కోరిక మాధవికి తెలియనిది కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే విధినీ, దేవుడినీ తలచుకునే వాళ్ళెవరు? ప్రయాణం రెండు రోజులుందనగా తీవ్ర అనారోగ్యంతో కన్ను మూస్తుంది బాలూ తల్లి. పోతూపోతూ తన అంత్యక్రియల కోసం దాచుకున్న డబ్బు కొడుక్కి అందేలా చేస్తుంది. ఆ మహా విషాదాన్ని బాలూ పంచుకున్నది కూడా మాధవితోనే.



బాలూని మామూలు మనిషిని చేయాలన్నది మాధవి సంకల్పం. అందుకే అతడిని తనున్నాననీ, ఎప్పటికీ అతడితోనే ఉంటాననీ చెబుతుంది మాధవి. తల్లి మరణంతో కుంగిపోయిన బాలూలో కదలిక ఉవ్వెత్తున ఎగసింది. మాధవిని తను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాననీ ఆమెకి చెబుతాడు బాలూ. మాధవిలో సంకోచం, సందిగ్ధత. అతనికి ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని అయోమయం. అతడు సున్నితంగా అందించిన గులాబీని సంకోచంగా అందుకుని తన జడలో తురుముకుంటుంది. ఆమె నీలి కళ్ళలో మాటలకందని భావాలు.


గతాన్నితుడిచేయగలమా? వెంటాడే జ్ఞాపకాలని కడిగేయగలమా? తనకో తోడు దొరికిందన్న ఆనందం బాలూని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్షణాల్లోనే, గత జ్ఞాపకాలని వదిలించుకుని కొత్తజీవితం మొదలుపెట్టే ప్రయత్నం ఆరంభించింది మాధవి. స్వతహాగా ఆవేశ పరుడు బాలూ. అందుకే కావొచ్చు, తన ప్రతిపాదనకి మాధవి నోటినుంచి ఎలాంటి జవాబూ రాకముందే, మాధవిని పెళ్లి చేసుకోవాలన్న తన ఆలోచనని ఆమె తండ్రితో పంచుకున్నాడు. మాధవి వివాహిత అనీ, ఆస్తి తగాదాల కారణంగా పెళ్ళైన మూడో రోజే పుట్టింటికి తిరిగి వచ్చేసిందనీ చెబుతాడు ఆమె తండ్రి.


సున్నిత మనస్కుడైన ఆ కళాకారుడు తన సంతోషాన్నైనా, విషాదాన్నైనా ప్రకటించ గలిగే మాధ్యమం ఒక్కటే.. నృత్యం. ఎగిసి పడుతున్న సముద్ర కెరటాలతో పోటీ పడి, బీచ్ లో నృత్యం చేస్తున్న బాలూని చూస్తుంది మాధవి. గతాన్ని పూర్తిగా తుడిచేసి అతడి చేయందుకోవాలన్న నిర్ణయానికి వచ్చి, తేలికపడ్డ మనసుతో అతడివైపు పరుగు తీస్తున్న మాధవి కాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి, బాలూకి ఏడడుగుల ముందు ఓ పడవ మీద కూర్చున్న గోపాలరావుని చూడగానే. అతడితోనే ఆమె వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచింది.




మాధవి అదృష్టవంతురాలు. ఆమెని పెళ్ళిచేసుకున్న గోపాలరావు, ప్రేమించిన బాలూ ఇద్దరూ మంచివాళ్ళే. మాధవి-బాలూల పెళ్లి చేయాలని గోపాలరావు నిర్ణయించుకుంటే, మాధవిని గోపాలరావుతో కాపురానికి పంపాలని అనుకుంటాడు బాలూ. దేవుడిమీద భక్తి, బాలూమీద నమ్మకం ఉన్న మాధవి బాలూ మాటని గౌరవించింది. సకోచంగా జడతో తురుముకున్న గులాబీని తీసి తన పెళ్లి ఆల్బం మీద ఉంచింది, స్థిరంగా. ఆమె పక్కన తనకి చోటులేదన్న వాస్తవాన్ని అంగీకరించిన బాలూ, శాశ్వితంగా కెనడా వెళ్ళిపోతున్న గోపాలరావు, మాధవిల ఫోటో తీసుకున్నాడు. తర్వాత అతను ఏడాదంతా బతికింది తను వాళ్ళిద్దరినీ కలిపిన రోజు కోసమే.. రోజున వాళ్ళ క్షేమం కోరుతూ అన్ని గుళ్ళూ తిరగడానికే.



కాలానికి కనికరం లేదు. అందుకే అది ఎవ్వరికోసమూ ఆగదు. నాట్యం అంటే తనకున్న మక్కువని తన కూతురు శైలజని నర్తకిగా తీర్చి దిద్దడం ద్వారా తీర్చుకుంది మాధవి. గోపాలరావు మరణం తర్వాత, కూతురితో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలూని చూసిన మాధవి అతడి స్థితికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కళలో ఏకోన్ముఖుడు కాలేకపోయిన సున్నిత హృదయుడు మద్యానికి బానిసై, మరణానికి చేరువగా ఉన్నాడు. మరోపక్క శైలజ మిడిమిడిజ్ఞానంతో తానో గొప్ప నాట్యకత్తెనని మిడిసిపడుతోంది. నేర్చుకోవాల్సింది ఏదీ లేదన్న అహంకారం కమ్మేసిందామెని.



బాలూలోని కళాకారుడు బహిర్గతం కాకుండా ఉండిపోయిన సంగతి తెలుసు మాధవికి. అందుకు కారణాలనీ అర్ధం చేసుకుంది. అతడి ఆరోగ్యాన్ని బాగు చేయడం అసాధ్యం అని అర్ధమయ్యాక, శైలజని బాలూ శిష్యురాలిగా చేసి, బాలూ కళని బతికించే ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చింది మాధవికి. అటు బాలూ స్నేహితురాలిగానూ, ఇటు శైలజ తల్లిగానూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. చివరిరోజుల్లో ఉన్న బాలూని బాధ పెట్టడం ఇష్టం లేక తను వితంతువన్న నిజాన్ని దాస్తుంది మాధవి. ఇందుకుగాను కన్న కూతురి నుంచి ఏతల్లీ పొందకూడని అవమానాన్ని పొందుతుంది.

తన కళని బతికించుకోవడం కోసం, అంతకు మించి మాధవికిచ్చిన మాట కోసం, మరణంతో పోరాడి మరీ నాట్య కళలో మెళకువలన్నీ శైలజకి నేర్పాడు బాలూ. తన నాట్యం చూడకుండా మరణించిన తల్లిలా మాధవి కాకూడదని అనుకున్నాడు. తన కళకి గుర్తింపు, గౌరవం తేవడం కోసం కృషి చేసిన 'మహాతల్లి' మాధవికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పరివర్తన వచ్చిన శైలజలో పరిపూర్ణమైన తన కళని చూసుకుని కన్నుమూశాడు. స్నేహితుడి పార్ధివ దేహం వర్షంలో తడవకుండా రఘు తన శరీరాన్నే గొడుగుగా చేస్తే, గొడుగుతో పరుగున వచ్చిన మాధవి తను తడుస్తూ బాలూ శరీరానికి గొడుగు పట్టింది.

నది సముద్రంలో కలిసినట్టుగా కళ, కళతోనే కలుస్తుంది. అది కళా సాగర సంగమం. స్త్రీ జీవితాన్ని నదితో పోల్చడానికి మాధవిని మించిన ఉదాహరణ ఎవరు. ఎన్నో ఎత్తుపల్లాలని దాటుకుని గంభీరంగా ప్రవహించే నది, సాగర సంగమ వేళ పిల్ల కాలువగా మారిపోతుంది. అలాగని నదిని శాంత స్వరూపిణి అనుకోగలమా? తరచి చూస్తే ఎన్ని సుడిగుండాలో... మాధవిని కేవలం కల్పిత పాత్రగా మర్చిపోలేం. 'సాగర సంగమం' చూసిన ప్రతిసారీ తను విడవకుండా వెంటాడుతుంది మనల్ని.

.....రాస్తుండగానే మూడొందల టపాలు పూర్తయ్యాయి.....

గురువారం, జనవరి 06, 2011

దేవాంగుల మణి

దేవాంగుల మణిది నవ్వు ముఖం. ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో లాకుల మధ్య మొండి మీద పడే వెన్నెల మరకలమీద నడిచినట్టు, వర్షాకాలమప్పుడు పుంతరేవు దగ్గరున్న సత్తిరాజు తాతగారి దూళ్ళపాకలో వెచ్చటి గడ్డిమోపు మీద కూర్చున్నట్టు, శీతాకాలం తెల్లారగట్ట నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలాలు దాటి నరాలపాలెం సైడు ఆ చిక్కటి మంచులో తడిసి వెళ్తున్నట్టు... చాలా బాగుంటుంది.

పసలపూడి దేవాంగుల పేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయిగారి సుందరాన్ని పెళ్లి చేసుకుని కాపురానికొచ్చింది మణి. పుట్టింది నూలు వడికే దేవాంగుల ఇంటే అయినా, కండెలూ, డబ్బాలూ చుట్టడం, మగ్గం నెయ్యడం రావు మణికి. ముక్కామల దిగువలో ఉన్న నేదునూరులో ఉండే మణి పుట్టింటి కుటుంబంలో ఎవరూ ఆపని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వృత్తే వేరు.

పెసర పొణుకులూ, మసాలా గారెలూ, నువ్వుపప్పు జీళ్ళు, సీనా ఉండలూ, మడత కాజాలూ, గవ్వలూ, చిలకలూ, పాలకాయలూ ఇలాగ రకరకాల వంటలు జేసి, సంతలో చిన్న నులక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సీవండి పళ్ళాలు పేర్చి వాటిల్లో పెట్టుకుని అమ్ముతారు. పసలపూడి వచ్చిన మణి అదే వ్యాపారం చేయడానికి భర్తనీ, అత్తమామలనీ ఒప్పించింది. ముందు మతిపోయినట్టు విన్న వాళ్ళంతా మణి లాభాలు లెక్కగట్టి చెపుతుంటే "సరే, మనూరి సంతలో తప్ప బయటూరు వెళితే ఒప్పుకోం మరి" అన్నారు.

ఆ మంగళవారం నాడు పసలపూడి కొత్తపేట సంతంతా సందడి సందడిగా ఉంది. ఆవేళ ఎక్కువమంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పల మంచం దగ్గర ఆగి వెళ్తున్నారు. కొందరైతే నవ్వుతూ కూర్చున్న మణినీ, ఆ చిన్ని మంచాన్నీ చిత్రంగా చూస్తూ వెళ్తున్నారు. చిన్నవోరి అరుగుమీద మిషను కుట్టే త్యాగరాజుని గిలిగింతలు పెట్టింది మణి నవ్వు. ఆ మత్తులో వెళ్తూ వెళ్తూ కర్రి నాగేంద్ర ప్రసాదుని గుద్దేశాడు. నవ్వుతూ చుసిన మణిని చూసి కరెంటు షాకు కొట్టినట్టు అయిపోయాడు ప్రసాదు.

సంత చేసుకుని వెళ్తున్న పాస్టర్ ఏసుపాదం గారికి మణి నవ్వు తెల్లకాగితంలాగా, ప్రభువు ముఖంలో తప్ప మరెక్కడా కనిపించని నవ్వులాగా అనిపిస్తే, సైకిలు మీద వెళ్తున్న హోటలు గోపాలరావు గారి శ్రీను మణి నవ్వు చూసి టెన్షను పెరిగిపోయి, ఇక సైకిలు తొక్కలేక నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి గారికి మణి నవ్వులో ఆయన రోజూ పూజ చేసుకునే కనక దుర్గ అమ్మవారు మామూలు రూపంలో దర్శనం ఇచ్చినట్టు అనిపించగా, భావరాజు సూర్నారాయణ మేష్టారికి మూడేళ్ళ క్రితం చనిపోయిన తన కూతురు శ్యామల కనిపించింది ఆ నవ్వులో.

ఎరకలోళ్ళ ఇళ్ళకవతలున్న రోగిబీడులో ఉండే ఆదియ్యకి మణి నవ్వుముందు సంబరాలప్పుడు అద్దెకి తెచ్చుకునే పెట్రోమాక్సు లైట్ల వెలుగెందుకూ పనికిరాదు అనిపించేసింది. ఇంక త్యాగరాజు, నాగేంద్రప్రసాదు అయితే మణి నవ్వింది తనని చూసి అంటే తనని చూసి అని మాటా మాటా పెంచేసుకుని, జుట్టూ జుట్టూ పట్టేసుకుని బట్టలు చింపేసుకున్నారు. విడదియ్యడానికి వెళ్ళిన బ్రాహ్మణ రెడ్డి గారి పెద్దాపురం సిల్కు చొక్కా పిట్లుపోయింది.

ఇంతకీ మణి ఎందుకలా నవ్వుతున్నట్టు? "మణికి ఇప్పుడు నవ్వాలి, ఇప్పుడు నవ్వకూడదు అని తెలీదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. శత్రువుల్తోనూ, మిత్రులతోనూ అదే నవ్వు. దేవుడితోనూ, దెయ్యంతోనూ అదే నవ్వు. మంచోడితోనూ, బూచోడితోనూ అదే నవ్వు. మణి నవ్వులో ఎలాంటి చెడుద్దేశమూ లేదు. ఆమెది ఒక నవ్వు. అందమైన నవ్వు. పరమపవిత్రమైన ఒకానొక నవ్వు. అంతే.." అంటూ 'దేవాంగుల మణి' కథని ముగిస్తాడు 'మా పసలపూడి కథలు' రచయిత వంశీ. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మీద నాయకుల అభిప్రాయాలని టీవీలో చూస్తుంటే ఈ కథ అప్రయత్నంగా గుర్తొచ్చింది నాకు.

బుధవారం, జనవరి 05, 2011

మధురవాణి - ఊహాత్మక ఆత్మకథ

'ఊహాత్మక ఆత్మకథ' అన్నది తెలుగు సాహిత్యం లో ఓ కొత్త ప్రక్రియ అని చెప్పాలి. ఈ ప్రక్రియ మొదలయ్యింది ఆంధ్రుల అభిమాన నాయిక గురజాడ అప్పారావుగారి సృష్టీ అయిన నాయిక 'మధురవాణి' తో కావడం 'కన్యాశుల్కం' నాటకాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ సంతోషం కలిగించే విషయం. గురజాడ రచనలపట్ల అవ్యాజమైన  అభిమానం ఉన్న పెన్నేపల్లి గోపాలకృష్ణ 'మధురవాణి' ఊహాత్మక ఆత్మకతకి మూడేళ్ళ క్రితం అక్షర రూపం ఇచ్చారు.

"ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలోని మొత్తం 33 దృశ్యాలలో మధురవాణి కనిపించేది కేవలం ఏడెనిమిది దృశ్యాలలో మాత్రమే. నాటకానికి ఆమె అవసరం ఎంతవరకూ ఉందో అంతవరకూ మాత్రమే ఉంది" అంటూ ముందుమాటలో రాసిన రచయిత, మధురవాణి ఆత్మకథని రాయడం కోసం గురజాడ రచనలనీ, ఉత్తరాలనీ క్షుణ్ణంగా చదివారు. "మధురవాణిని సజీవరూపంగా ఊహించుకుని, ఆవాహన చేసుకుని, నన్ను నేనే ఆమెగా భావించుకుని" ఆత్మకథ రాశానన్నారు.

'ఊరు-పేరు' తో మొదలు పెట్టిన తొలి అధ్యాయంలో తన గురించి చెప్పుకున్న మధురవాణి, తర్వాతి అధ్యాయాలలో తన తల్లి గురించీ, వేశ్యా వృత్తిని గురించీ, తన జీవన విధానాన్ని గురించీ, 'కన్యాశుల్కం' లో ప్రధాన పాత్రలన్నింటి గురించీ సవివరంగా, విశ్లేషణాత్మకంగా వివరించడం కనిపిస్తుంది. గిరీశం మొదలు, సౌజన్యరావు పంతులు వరకూ ప్రతి ఒక్కరినీ సునిశితంగా పరికించి విమర్శిస్తుంది మధురవాణి. అలాగే పూటకూళ్ళమ్మ, బుచ్చమ్మ, మీనాక్షిల పట్ల అభిమానాన్నీ, వాత్సల్యాన్నీ ప్రదర్శించింది.

కరటక శాస్త్రులు, మహేశం, అగ్నిహోత్రావధాన్లు, లుబ్దావధాన్లు, వెంకటేశం లాంటి నిడివి ఉన్న పాత్రల మొదలు, మాయగుంట, కనిష్టీబు, బైరాగి, అసిరి లాంటి చిన్న పాత్రల వరకూ ప్రతి పాత్రనీ మధురవాణి దృష్టికోణం నుంచి పరిశీలించి, ఆయా పాత్రలని ఓ కొత్త కోణంలో చూసేలా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారనే చెప్పాలి. నూట పదిహేనేళ్ళనాటి (కన్యాశుల్కం రచనాకాలం) విజయనగరం సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని అర్ధం చేసుకోడానికీ ఈ రచన ఉపకరిస్తుంది.

"అనాదీ వేశ్యకి జీవనాధారం సంగీతం, నాట్యమే కానీ ఇతరం కాదు. కాలగతిలో సంగీతం, నాట్యం అదృశ్యమై, అగ్రకులాల వశమై, మాకు దేహం మటుక్కు మిగిలింది జీవనానికి!" లాంటి నిష్టుర సత్యాలూ, "వేశ్యా వృత్తి భ్రష్టు పడి లోకుల దృష్టిలో చులకన కావడానికి ప్రధాన హేతువు వేశ్య మాతే సుమా!" లాంటి చారిత్రిక సత్యాలూ, "భార్యాభర్తల మధ్య ప్రేమలేని దాంపత్యాలెన్ని లేవు? అట్టి భార్యల స్థితి కంటే వేశ్య మేలు కాదు?" లాంటి సూటి ప్రశ్నలూ చాలానే కనిపిస్తాయి ఈ పుస్తకం నిండా.

మధురవాణి స్వాభావిక లక్షణాలని ఏమాత్రం విస్మరించకుండా, గురజాడ రచనా శైలిని విడిచిపెట్టకుండా రాసిన ఈ ఆత్మకథ ఆసాంతమూ చదివిస్తుంది. బాపు రూపుదిద్దిన కవర్ పేజీ ఎంత ఆకర్షణీయంగా ఉందో, మోహన్ గీసిన లోపలి చిత్రాలు అంత సొగసుగానూ ఉన్నాయి. ముఖ్యంగా లుబ్దావధాన్లు, అగ్నిహోత్రావధాన్లు బొమ్మలు చూడాల్సిందే. నాచ్ కల్చర్ కి సంబంధించిన కొన్ని అరుదైన ఛాయా చిత్రాలూ ఉన్నాయి ఇందులో.

ఆత్మకథని పూర్తి చేశాక మధురవాణి అనే స్త్రీ హృదయానికి బదులుగా పురుష హృదయం కనిపించింది. మధురవాణిని సృష్టించిన గురజాడ, ఆత్మకథ రాసిన పెన్నేపల్లి పురుషులే కావడం ఇందుకు కారణం కావచ్చేమో బహుశా. ఏదేమైనా మధురవాణి పాత్రకి దక్కిన మరో గౌరవం ఈ ఆత్మకథ. సుమారు రెండు దశాబ్దాల క్రితం 'మిసిమి' పత్రికలో ప్రచురితమైన 'మధురవాణి ఇంటర్వ్యూలు' కూడా పుస్తక రూపంలో వస్తే బాగుండును. (మధురవాణి ఊహాత్మక ఆత్మకథ - విసు కమ్యూనికేషన్స్ ప్రచురణ, పేజీలు 202, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).