ఆదివారం, డిసెంబర్ 12, 2010

అంకితం

"ఓ కాలమా.. ఇది నీ జాలమా..." పాట, "ఈ ఇల్లు చినబాబుది.. అతనికి ఇష్టం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు..." అన్న జేవీ సోమయాజులు డైలాగు, "కొంతకాలం, నన్ను ఒంటరిగా వదిలేయండి నాన్నా.." అంటూ నాగార్జున చెప్పిన డైలాగు జమిలిగా బుర్రలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఇప్పుడే మన సుమన్ బాబు నటించిన 'అంకితం' ప్రీమియర్ షో రెప్ప వాల్చకుండా చూడడం పూర్తయ్యింది.

మూడు వారాలుగా ఎదురు చూసిన వేళ రానే వచ్చింది. సాయంత్రం ఆరూ ఇరవై ఐదుకి షో ప్రారంభం అని ఈటీవీ షెడ్యూల్ లో చూడగానే, ఆవేళకి కచ్చితంగా టీవీ ముందు ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ఓ పూర్తి స్థాయి కామెడీ షో చూడ్డానికి సిద్ధపడ్డ నన్ను సెంటిమెంటుతో పిండేశాడు సుమన్ బాబు. దర్శకత్వం ఇంద్రనాగ్ దే అయినప్పటికీ, చిత్రీకరణలో సుమన్ బాబు మార్కు పూర్తిగా కనిపించింది.

ముందుగా ఊహించినట్టుగానే ఇది ఓ సిన్సియర్ పోలిస్ కానిస్టేబుల్ కథ. 'నువ్వేకావాలి' సినిమాలో సునీల్ చెప్పిన కామెడీ డైలాగు "రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, పారిపోయిన తమ్ముడు, లేచిపోయిన చెల్లెలు..." గుర్తుంది కదా.. అచ్చం అలాంటి సెటప్. కాకపొతే ఇక్కడ తల్లి లేదు. తండ్రి రోగిష్టి. ఇద్దరు చెల్లెళ్ళు, ఓ తమ్ముడు, వీళ్ళందరి బాధ్యతనీ ఆనందంగా భరించే విజయ్ బాబు (సుమన్ బాబు). ఇంటిళ్ళపాదికీ, వాళ్ళ వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా వండి వార్చడం మొదలు, బట్టలు ఇస్త్రీ చేయడం వరకూ ప్రతి పనినీ యెంతో ఆనందంగా చేస్తాడితడు.

మళ్ళీ సునీల్ ప్రస్తావన తప్పడం లేదు. 'మర్యాద రామన్న' లో సునీల్ కి ఉన్న లాంటి సైకిల్ ఒక్కటే విజయ్ బాబు ఆస్తి. ఆ సైకిల్ మీద తిరుగుతూ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇవాళ్రేపు హోంగార్డులు కూడా హీరో హోండాలు మైంటైన్ చేస్తున్నారు కదా అనకూడదు. ఇతను సిన్సియర్ కానిస్టేబుల్ మరి. రోజూ ఆ సైకిల్ ని అరిగిపోయేలా తుడిచేక కానీ దాన్ని బయటకి తీయడు.

విజయ్ బాబు మీద పడి తినడం అతనికి కొత్త సమస్యలు తేవడం తప్ప, ఇంట్లో ఎవరూ అతనికి లేశమైనా సాయం చేయరు. పాపం, అతని ఇబ్బందులు పట్టించుకోకుండా మరదలు లావణ్య ప్రేమిస్తున్నా అంటూ వెంటపడుతూ ఉంటుంది, అచ్చం మన తెలుగు సినిమా హీరోయిన్లా. కాకపొతే ఈమె 'సుమన్ మార్కు' హీరోయిన్.. లంగావోణీ, వాలుజడ, వంటినిండా నగలు, జడనిండా పూలు.. ఇదీ అలంకరణ. ('అనుబంధం' సీరియల్లో కిన్నెర గుర్తొచ్చింది).

పెద్ద చెల్లెలి పెళ్ళికోసం స్నేహితుడు రాజు దగ్గర చేసిన అప్పు ఎలా తీర్చాలా అని మధన పడుతూ ఉండగానే, ఆ చెల్లెలు వితంతువుగా తిరిగి రావడం జరిగిపోతుంది. పులి మీద పుట్రలా చిన్న చెల్లెల్ని తన స్వహస్తాలతోనే బ్రోతల్ కేసు కింద అరెస్టు చేయాల్సి వస్తుంది. అది చాలదన్నట్టు విజయ్ బాబు కి బ్రెయిన్ ట్యూమర్ అని తెలియడం జరిగిపోతుంది. (సినిమా అయితే ఇక్కడ ఇంటర్వల్ పడి ఉండేది, బహుశా..).

తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేస్తున్న లావణ్య కి తప్పని పరిస్థితిలో తన జబ్బు విషయం చెప్పేస్తాడు విజయ్ బాబు. ఇంట్లో వాళ్ళంతా విజయ్ బాబు ని 'హిట్లర్' అంటూ నానా మాటలూ అంటున్న వేళ, ఉండబట్టలేక అతని జబ్బు విషయం నోరు జారేస్తుంది లావణ్య. తన వాళ్ళ కళ్ళలో కన్నీరు చూడలేని విజయ్ బాబు ఇది భరించలేడు. లావణ్య తో పోటీపడి, తన కిడ్నీ అమ్మేసి తన బాధ్యతలన్నీ తీర్చేసుకుని, బతికినంత కాలం ఒంటరిగా బతుకుతానంటూ సుదూరతీరాలకి విజయ్ బాబు బయలుదేరడం, ఆవెంటే లావణ్య "ఉన్నంతకాలం తోడుంటా.." అంటూ తనూ బయలుదేరడం ముగింపు.

ఈ కథలో కాంట్రడిక్షన్స్ బోలెడు. విజయ్ బాబు ఓ నిజాయితీ పరుడైన కానిస్టేబుల్. కానీ తన చెల్లెలికి 'కట్నం' ఇచ్చి పెళ్లి చేయడం తన బాధ్యతగా భావిస్తాడు. లంచం తీసుకోడు కానీ, తప్పని పరిస్థితిలో భారీ బహుమతిని అంగీకరిస్తాడు. సమస్యలకి ఎదురు నిలబడాలని ఉపన్యాసాలు ఇస్తాడు కానీ, తన సమస్యల పరిష్కారం కోసం తానుగా ఎలాంటి ప్రయత్నాలూ చేయడు. తనకి జబ్బు అని తెలిశాక, డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తాడే కానీ, తన వాళ్ళలో స్థైర్యం నింపడాన్ని గురించి ఆలోచించడు.

చిరంజీవి సినిమాలు 'హిట్లర్' 'విజేత' నాగార్జున 'గీతాంజలి' చూసి ప్రేరణ పొంది రాసినట్టు అనిపించిన ఈ కథతో ఓ ముప్ఫై ఏళ్ళ క్రితం సినిమా తీసి ఉంటే బ్రహ్మాండంగా ఆడి ఉండేది. ప్చ్.. బ్యాడ్ టైమింగ్. పోలిస్ పాత్రలో ఆశించే రఫ్నెస్ సుమన్ బాబులో కనిపించలేదు. ఇంట్లోనే కాదు, విధి నిర్వహణలోనూ అదే పాసివ్ నేచర్. టీవీ వాళ్లకి అబద్ధం చెప్పి (అదికూడా ఈటీవీనే) ఓ కిడ్నాప్ కి తెర దింపడం, ఓ లెక్చర్ ఇచ్చి విలన్ ని మంచివాడుగా మార్చేయడం పోలిస్ గా అతను సాధించిన విజయాలు.

కథలోనే మెలోడ్రామా విపరీతంగా ఉందనుకుంటే, నటీనటుల నటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. ఈ ప్రీమియర్ షో కి స్పాన్సర్లు 'క్లోజప్' వాళ్ళు. అందుకేనేమో క్లోజప్ దృశ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు నచ్చినవి కొన్ని సన్నివేశాల్లో సుమన్ బాబు ధరించిన చొక్కాలు (అబ్బే ఖాకీవి కాదు, యూనిఫాం లో అరుదుగా మాత్రమే కనిపించాడు), వాళ్ళ ఇంట్లో గోడకి తగిలించిన ఒక హ్యాంగింగ్ ఇంకా కొన్ని సన్నివేశాల్లో వినిపించిన నేపధ్య సంగీతం. నచ్చని వాటి గురించి ఒక టపాలో రాయడం అసాధ్యం. దీనిని థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయలేదో తెలీదు మరి. చాలా బోలెడు మంది స్పాన్సర్లని సంపాదించిన ఈటీవీ ప్రకటనల విభాగం వారిని మాత్రం ప్రత్యేకంగా అభినందించాల్సిందే.

23 కామెంట్‌లు:

  1. ఎంతైనా మీరు అదృష్టవంతులు మురళి గారు..;) మరేమో నాకైతే చాలా కుళ్లేసేస్తుంది.:P

    రిప్లయితొలగించండి
  2. ఈ ప్రీమియర్ షో కి స్పాన్సర్లు 'క్లోజప్' వాళ్ళు. అందుకేనేమో క్లోజప్ దృశ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
    .అయ్య బాబోయ్ !మీ ఓపికకి నా జోహార్ ..అంతలా ఎలా చుసారండి??ఆ సుమన్ బాబుని .వాళ్ళ మేకప్ లు,సీన్ లు చూడలేక పోయాను.నేను ఒక్క సీన్ చూడలేకే చానల్ మార్చేసెను.మళ్ళి దానిగురించి వెంటనే ఓ టపా:))..నిజంగా అంతిష్టమా సుమన్ అంటే మీకు?????

    రిప్లయితొలగించండి
  3. అంత ఓపికగా చివరికంటా చూసిన మీ అభిమానానికి మీ ఓపికకి నమస్సులు :-) చమత్కార భరితమైన మీ రివ్యూకి ధన్యవాదాలు. సుమన్ మిమ్మల్ని సెంటిమెంట్ లో ముంచేడేమో కానీ మీ రివ్యూతో మమ్మల్ని నవ్వుల్లో ముంచారు.

    రిప్లయితొలగించండి
  4. మంచి అభిరుచితో పుస్తకాలు చదివే మీరు, మంచి సినిమాల గురించి చర్చించే మీరు ఈ సుమను కార్యక్రమాలు ఎలా చూడగలుగుతారో :-? ఇది అర్థం కాని కోణం మీలో. బహుశా మీ ఇంటి రిమోట్ కంట్రోల్ మీ చేతిలో లేదా ఏంటి :-p
    -బు

    రిప్లయితొలగించండి
  5. సినిమా ఏమో గానీ మీ రివ్యూ మాత్రం అదిరింది. ఆసాంతం నవ్వించారు. ప్రొద్దున్నే మీ టపా చదివితే హాయిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు, ఇంతకు అది సినిమానా, టెలిఫిల్మ్ ఆ, నాటికా, లేక సిరియలా. బొత్తిగా అఙఞానం ఈ విషయాల్లో. సుమన్ గారిని అన్ని గంటలూ టివి లొ చుసారంటే మీది చాలా గట్టి గుండె అండి బాబు. అమ్మో.

    రిప్లయితొలగించండి
  7. రెప్పవాల్చకుండా చూసేశారా? బాగుందండి కధ. గుండెల్ని పిండేసే సెంటిమెంట్ అన్నమాట.
    >>>పోలిస్ పాత్రలో ఆశించే రఫ్నెస్ సుమన్ బాబులో కనిపించలేదు.
    సుమన్‌బాబు నవరసాలూ అధ్భుతంగా పలికిస్తారు కదా. బహుశా ఇన్ని కష్టాల్లో రఫ్నెస్ చూపించడం వీలయి ఉండదు.

    రిప్లయితొలగించండి
  8. I missed this premiere show.. I was expecting Sumanbabu to be like Rajasekhar in Ankusam,but from your review I got to know that it is quite oppisite..disappointment for all sumanbabu fans..

    Is this available in youtube? I will watch it when I am stressed so that I can happily laugh..

    Thanks,
    Swathi.

    రిప్లయితొలగించండి
  9. బహుశా మీ ఇంట్లో వారెవరో మిమ్మలని కుర్చీలో కట్టేసి, టి‌వి ఆన్ చేసి తలుపులు తాళం వేసి వెళ్లిపోయారేమో ననిపిస్తోంది. ఈ సినిమా కాని టి‌వి సేరియల్/ఫిల్మ్ ని చూసి మీరు అనుభవించిన బాధ ని మాతో ఇల్లా నవ్వుతూ పంచుకుని తగ్గించుకున్నారనుకుంటాను.

    ఏమైనా మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. వీక్షక రత్న అనే బిరుదు కి మీ కన్నా అర్హులు కనిపించటం లేదు నాకు.

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు నిజంచెప్పమంటారా. నేను ఈ అంకితం గుర్తుపెట్టుకొని చివరి దాకా మిమ్మల్ని తలుచుకుంటూ, ఏ సందర్భంలో మీరు ఎలా విమర్శిస్తారో ఊహించుకుంటూ మొత్తం సినిమా చూసేసాను. నాకు తెలుసు పొద్దున్నే మీ రివ్యూ తప్పకుండా కనిపిస్తుందని. లేవంగానే చూసాను. ఉంది:)

    రిప్లయితొలగించండి
  11. మీ సహనానికి ఓ నోబుల్ ప్రైజ్ ఇచ్చేయొచ్చు మురళీ!!! అతగాడు 2 ఉల్లిపాయలు, అరవై పచ్చిమిరపకాయలతో అదేదో వంట చేస్తూ, ముక్కు లిటరల్ గా కూర బాండీలో పెట్టేసి 'అబ్బా, భలే వాసన వస్తుందే' అని తలాడించేసి, చెల్లెలి బట్టలు ఇస్త్రీ చేయడానికి రెడీ అయిపోగానే నా ఫ్యూజ్ టప్ అంది.. మళ్ళీ ఇప్పటిదాకా ఆ ఛానల్ దరిదాపులకి వెళ్ళలేదు! :))

    రిప్లయితొలగించండి
  12. హహ్హహ్హా.. సుబ్రహ్మణ్యం గారూ..
    >>వీక్షక రత్న అనే బిరుదు కి మీ కన్నా అర్హులు కనిపించటం లేదు నాకు.
    సూ...పర్..:)

    నిషిగంధ గారూ,
    >>అతగాడు 2 ఉల్లిపాయలు, అరవై పచ్చిమిరపకాయలతో అదేదో వంట చేస్తూ
    నిజంగానా.. అంటే నేనైతే చూసే ధైర్యం చెయ్యలేదు కానీ, మీ వ్యాఖ్య వెటకారమో నిజంగా కారమో అర్థం కాలేదు..:(
    ఏదైతేనేమి నేనైతే నవ్వేసుకున్నాను.:))

    రిప్లయితొలగించండి
  13. @మనసుపలికే: ఏమైందండీ, మీరు చూడలేదా? వంట విషయం నిషిగంధ గారికి రాస్తాను చూడండి :-) ..ధన్యవాదాలు.

    @రాధిక (నాని): ఇవాళ్రేపు ఇంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతోంది చెప్పండి? :-) ..ధన్యవాదాలు.

    @వేణూ శ్రీకాంత్: నేనూ నవ్వుకుంటూనే చూశానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @బుడుగు: అతని అమాయకత్వంతో కూడిన ఆత్మవిశ్వాసం చూస్తే ముచ్చటేస్తుందండీ నాకు.. మరే ప్రోగ్రాం చూసినా అంతలా నవ్వురాదు నాకు. ఈ ప్రోగ్రాం కోసం టీవీ రిమోట్ కంట్రోల్ చేత్తో పట్టుకుని ఉండాల్సి వచ్చిందండీ.. ఇంట్లో రిమోట్ కంట్రోల్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలంటారా, అందరిలాగే :-) :-) ..ధన్యవాదాలు.

    @బద్రి: ధన్యవాదాలండీ..

    @నీహారిక: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @స్ఫూర్తి: అయ్యో.. ఇదేముందండీ.. నేను థియేటర్ కి వెళ్లి టిక్కెట్ కొని 'ఉషా పరిణయం' చూశాను.. ఏమాటకామాట, అంత వినోదం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? :-) ..ధన్యవాదాలు.

    @శిశిర: నేను మర్చిపోయిన మరో పాయింట్ గుర్తొచ్చిందండీ.. కొన్ని సన్నివేశాల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రభావం కనిపించింది, సుమన్ బాబు నటన మీద.. ధన్యవాదాలు.

    @స్వాతి; పోలిస్ డిపార్ట్మెంట్ గురించి మొదట్లో నాలుగు ఆవేశపూరిత డైలాగులు చెప్పడానికి విఫల యత్నం చేసినప్పుడు నేనూ అలాగే అనుకున్నానండీ, కానీ ఫ్యామిలీ డ్రామా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @బులుసు సుబ్రహ్మణ్యం: లేదండీ, నేనే ఇంట్లో వాళ్ళని వేరే చానల్ చూడనివ్వకుండా ఆసాంతమూ ఆస్వాదించాను.. కాసేపు చూడండి, కడుపు చెక్కలయ్యేలా నవ్వు రాకపోతే నన్నడగండి.. ధన్యవాదాలు.

    @జయ: మీరు కూడా ఓ టపా రాస్తే మిగిలిన చమక్కులూ అవీ తెసులుకునే వీలుండేది కదండీ అందరికీ.. (చమక్కులూ అవీ అనగానే శేఖర్ పెద్దగోపు గారు గుర్తొచ్చారు.. ఏమైపోయారో మీకేమన్నా తెలుసా అండీ?) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  17. @నిషిగంధ: మీరు చాలా పొరబడ్డారు.. రెండు ఉల్లిపాయలు, అరవై పచ్చి మిరపకాయలు కాదు. నాలుగు పచ్చి మిరపకాయలు మరియు సన్నగా తరిగిన తోటకూర. ఆ పళ్లాన్ని కూడా క్లోజప్ లో చూపించారు. కాబట్టి ఆ వంటకం తోటకూర పప్పు. ఇస్త్రీ చేయడానికి వెళ్ళింది చెల్లెలి బట్టల్ని కాదు, తమ్ముడి బట్టల్ని. వాటి పని చూస్తూ ఉండగానే చెల్లి తన బట్టలు కూడా పట్టుకొస్తుంది. అన్నట్టు ఆ చెల్లికి ఇష్టమైన బంగాళా దుంపల వేపుడు చేయకుండానే షో అయిపొయింది. తలాడించడం అన్నది సుమన్ బాబు మేనరిజం. ఎన్టీఆర్ ఎడమ చేయి ఊపడం, ఏఎన్నార్ చొక్కా గుండీ సరిచేసుకోడంలా అన్నమాట. చూసిన ఒక్క సన్నివేశం అయినా సరిగా చూడకపోతే ఎలా చెప్పండి? పైగా అప్పటికింకా ఫ్యూజ్ టప్ మనలేదు కూడాను :-) :-) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. ఉషాపరిణయం థియేటర్ లో. కెవ్వ్వ్వ్వ్ కెవ్వ్వ్వ్వ్వ్వ్. మురళిగారు వినిపించిందా ఆర్తనాదం.హహహ్హ.kidding

    రిప్లయితొలగించండి
  19. అయ్యో...అంకితం ప్రీమియర్ షో ఉందన్న సంగతి అసలు మర్చిపోయానండీ... ఎలా మర్చిపోయానబ్బా అని ఆలోచిస్తుండగా మీరు గుర్తొచ్చారు..ఎలాగు మీరు మన అభిమానులు తరపున ఆ విశేషాలు వివరిస్తారు అని అనిపించింది. అప్పటికి మనసు కుదుటపడింది. మీ టపా చదివాక మా నమ్మకం వమ్ము కాలేదని అనిపించింది....:) అధ్యక్షా..మీకు జోహార్లు!!!

    రిప్లయితొలగించండి
  20. @స్ఫూర్తి: :-) :-) వినిపించిందండీ, ధన్యవాదాలు.

    @స్నిగ్ధ: ప్చ్.. మీరు చూసి ఉంటే ఇంకా బాగుండేదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. ఐ లవ్ యూ డాడీ గురించి, ఆదివారమ్ అనుబంధం మీద ప్రకటనా, ఈ-టి.వీ లో ప్రోమో లు వస్తున్నా ఇంకా టాపా వ్రాయకపోవటం మీద నా నిరశన తెలియజేస్తున్నానధ్యక్షా.

    రిప్లయితొలగించండి
  22. మంచి కామెడి అండి..మీ పోస్టు,దానికొచ్చిన కామెంట్లు అంతా...కెవ్వు కేక...మీ పోస్టులు అన్నీ చదువుతున్నాను. ఎందుకో దీనికి మాత్రం కామెంట్ రాయాలి అని అనిపించింది.

    రిప్లయితొలగించండి