గురువారం, మార్చి 04, 2010

అత్తగారి కథలు

తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు పుట్టడంతోనే అమృతం తాగేశాయి. అందుచేత అవి ఎప్పటికీ చిరంజీవులే. ఉదాహరణకి అలాంటి కొన్ని పాత్రలు: గురజాడ అప్పారావు గారు సృష్టించిన మధురవాణి, బాపు-రమణ ల బుడుగు, కే.ఎన్.వై. పతంజలి వీరబొబ్బిలి ఇంకా భానుమతీ రామకృష్ణ 'అత్తగారు.' తరాల అంతరాలతో సంబంధం లేకుండా మెజారిటీ తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు అందుకున్న పాత్రలివి.

సినిమాల్లో అత్తగారు అనగానే సూర్యకాంతం గుర్తొచ్చినట్టు, సాహిత్యంలో అత్తగారు అనగానే మొదట గుర్తొచ్చేది భానుమతి అత్తగారే. బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం.. ఈ లక్షణాలన్నీ కలబోసిన మూర్తే 'అత్తగారు.'

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ యధాలాపంగా సృష్టించిన 'అత్తగారి' పాత్రకి ఎంతటి పాఠకాదరణ లభించిందంటే, తర్వాతి కాలంలో ఆవిడ రాసిన కథలన్నింటిలోనూ ప్రధాన పాత్ర అత్తగారే. "నేను సృష్టించిన అత్తగారి పాత్ర ఎవరో కాదు మా ఇంట్లో మా అత్తగారే అనుకుంటారు చాలామంది.. కానీ అత్తగారి పాత్ర కోసం మా అత్తగారిలోని కొన్ని లక్షణాలు మాత్రమే తీసుకున్నాను నేను," అని భానుమతే ఒక సందర్భంలో చెప్పారు. అత్తగారి చుట్టూ తిరిగే కథలన్నింటి సంకలనమే 'అత్తగారి కథలు.'


ఆవకాయ పెట్టడంలో ఓనమాలు తెలియక పోయినా నిమ్మకాయ పచ్చడి చేసినట్టే ఐదువేల మామిడి కాయలతో ఆవకాయ పెట్టేయాలనే అత్తగారి ప్రయత్నమే సంకలనం లో మొదటి కథ 'అత్తగారూ-ఆవకాయ.' అత్తగారి స్వరూప స్వభావాలని ఈ కథలోనే పటం కట్టేశారు భానుమతి. మన ఊహకి అందని లక్షణాలని కూడా స్పష్టంగా చూపించడం కోసం పక్కనే బాపూ బొమ్మ ఉండనే ఉంది. రైతు మీద అజమాయిషీ చేసి మామిడి కాయలు తెప్పించిన అత్తగారు, వాటిని ఏం చేశారన్నదే ఈ కథ.

పశు పోషణలో అత్తగారు కొంచం వీక్. కానీ ఆవిషయం ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ పోషణలో ఓ గేదె తనువు చాలించగా, ఓ ఆవుని పెంచుకోవాలని సంకల్పిస్తుంది. ఆ సంకల్పం నెరవేర్చుకోడానికి ఆవిడ చేసే ప్రయత్నాలు 'అత్తగారూ-ఆవు నం: 23' కథలో చదవాల్సిందే. 'అత్తా తోటికోడలీయం' 'అత్తగారూ-అరటికాయ పొడి' 'అత్తగారూ-జపాన్ యాత్ర' కథలు చదువుతున్నంత సేపూ నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా జపాన్ వెళ్లాలని కలగనే అత్తగారి బొమ్మని చూడాల్సిందే తప్ప చెప్పనలవి కాదు.


తనకి లంకె బిందెలు దొరుకుతాయని అత్తగారి జాతకంలో ఉంది. కానీ ఎప్పుడు దొరుకుతాయో స్పష్టంగా లేదు. ఎప్పటికైనా దొరుకుతాయని ఆవిడకి ఆశ. ఇంతలో ఊరి చివర తోటలో ఇల్లు కొనుక్కోవడం, ఆ ఇల్లు అచ్చం అత్తగారి జాతకం లో లంకె బిందెలు దొరికే ఇల్లులాగే ఉండడం తో ఆవిడ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది, కోడలితో కలిసి. లంకె బిందెల విషయం ఎవరికీ తెలియకూడదు కదా, అందుకని అర్ధ రాత్రి లేచి పెరట్లో తవ్వకాలు. ఓ రాత్రి నేలలో గునపం వేయగానే 'ఖంగ్' మని చప్పుడు వస్తుంది. ఇంతకీ లంకె బిందెలు దొరికాయా?

ఆచారాల్ని సర్దుబాటు చేయడం, పెళ్లి సంబంధాలు కుదర్చడం మొదలు పని వాళ్ళ మీద ఓ కన్నేసి ఉంచడం, కొడుక్కీ, మనవడికీ వాళ్లకి నచ్చేవి తనకి చేతకాక పోయినా చేసి పెట్టాలనుకోడం వరకూ అత్తగారిలో ఉన్న ఎన్నో లక్షణాలని మనకి హాస్య స్పోరకంగా వర్ణించారు భానుమతి. సాహిత్య అకాడెమీ బహుమతి గెలుచుకున్న ఈ సంకలనం లోని మొత్తం కథలు చదివాక, ఈ అత్తగారు ఒక కల్పిత పాత్ర అంటే వెంటనే నమ్మబుద్ధి కాదు మనకి. సంకలనానికి బయట ఉండిపోయిన మరికొన్ని కథలనీ ఇందులో చేరిస్తే బాగుండు. (అత్తగారి కథలు, పేజీలు:300 వెల: రూ. 130, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.) కొన్ని కథల్ని ఇక్కడ చదవొచ్చు.

17 కామెంట్‌లు:

  1. నిజమే ఈ అత్తగారు ఒక కల్పిత పాత్ర అంటే నమ్మబుద్ది కాలేదు నాకు కూడా, ఆవిడ అంత బాగా రాశారు :-) ఓ నాలుగేళ్ల క్రితం భీమవరం దగ్గరలోని ప్రకృతి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ ఈ పుస్తకం, పసలపూడి కథలూ చదివాను. ఆ యాంబియన్స్ మహిమేమో కానీ నాకు మరింత నచ్చేశాయి.

    రిప్లయితొలగించండి
  2. భలే అత్తగారండీ..ఎవర్ గ్రీన్ అత్తగారు. ఎన్ని సార్లు చదివినా మళ్ళీ ఫ్రెష్ గా నవ్విస్తుందావిడ.
    "నాలో నేను" లో భానుమతిగారు అక్కడక్కడా ప్రస్తావించిన "తన అత్తగారితో వున్న ఇంటిమసి" ని గురించి చదివితే..ఆవిడ స్పూర్తితోనే ఈ "అత్తగారి కధలు" రాశారనిపిస్తుంది. చక్కని పుస్తకం..

    మురళీ గారూ...పర్లేదండీ మీరు దిద్దించిన ఓ నా మః లు బాగానే వొంటబట్టేశాయి. "మొన్నటి ఆనాటి వాన చినుకులు, ఇవాల్టి అత్తగారి కధలు..." చూశారా..ఆల్రెడీ చదివేశాను. హమ్మయ్య..మేరు పర్వతం సైజు పుస్తకాల లిస్టు లోంచి రెండు పుస్తకాల సంఖ్య తగ్గించేసుకున్నా.

    రిప్లయితొలగించండి
  3. బలే పుస్తకం. నేను కూడా చదివేను. చదివినంత సేపు ఒక్కో కధ కు ఒక్కొక్కళ్ళ అత్త గార్లు గుర్తు వచ్చి నవ్వుతూనే వున్నా చదివినంత సేపు. చాలా మంచి పుస్తకం తప్పక చదవాల్సిన పుస్త్కం. పరిచయం సూపర్ మాములే కదా. :-)

    రిప్లయితొలగించండి
  4. మీ ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ సైజు కలెక్షన్ ఉన్నట్టుంది చూడబోతే. కొంచం ఈర్ష్యగా ఉంది. సాహిత్య అకాడెమి అవార్డు వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు ఈ కథలకి.

    ఈ కథల ఆడియో ఇక్కడ చూశాను. కానీ చదివితేనే బావుంటుందేమో అనిపించింది.

    http://www.tollynation.com/playlist/Attagari-Kadhalu-Smt-Bhanumathi-Ramakrishna-Radio-Channel

    రిప్లయితొలగించండి
  5. అత్తగారి కథలు మీరిచ్చిన లింకులో చూశాను ....అత్తగారు - ఆచారాలు కథ విన్నాను...మిగిలినవి కూడా చదువుతాను కవర్ పేజీ భలే ఉందండీ ..ధన్యవాదాలు మురళిగారు!

    రిప్లయితొలగించండి
  6. నా చిన్నతనంలో భానుమతి రామకృష్ణ గారంటే చాల ఇష్టం, ఆమె హీరోయిన్ గా కంటే బామ్మ గా, అమ్మగా, అత్తగా ఆమె నటన నాకు చాల ఇష్టం. ఇక మొదటి సారిగా భానుమతి గారు రాసిన అత్తగారి కథల గురించి ఒక సారి ఏదో వారపత్రిక లో చదివాను. కానీ ఆ పరిచయం నాకు అంతగా హత్తుకోలేదు........ కానీ బాపు గారి కోతి కొమ్మచ్చి లో ఈ అత్తగారి కథల ప్రస్తావన, భానుమతి రామకృష్ణ గారి గురించి తెలుసుకున్న తర్వాత వెంటనే బుక్ కొనేసాను. ఇక భానుమతి గారి గాత్రం గురించి వేరేగా చెప్పక్కరలేదు. ఆమె పాడిన చివరి పాట అనుకుంటాను....."శ్రీ సూర్యనారాయణా మేలుకో" పాట చాలా రోజులు నా నోట్లో నానింది.

    మంచి టపా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. యా........హూ.........!!! ముందు ఒక పది నిముషాలు తీన్మార్ డాన్సు !!! హమ్మయ్య.... ఇన్నాళ్ళకినాళ్ళకి, నేను పట్టువదలని విక్రమార్కిణి లా మీ బ్లాగు చదువుతున్నందుకు ఫలితం దక్కింది. హి హి, కుంచెం గాభరా పడుతున్నరా?? ఇన్నాళ్ళకి మీరు పరిచయం చేసిన పుస్తకమొకటి నేను ముందుగానే చదివేసాను. అంతే కాదు, ఈ పుస్తకం నా లైబ్రరీలో పెర్మనెంటు మెంబరు కూడాను.
    చాలా ఆథెంటిక్ తెలుగు అత్తగారు :) అన్ని కథలూ బాగున్నా, నా ఫేవరేట్ మాత్రం, అత్తగారు-అరటికాయపొడి !

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు నిజంగా ఈ బుక్ ఇష్టపడని వారెవరుండరేమో. చాలా బాగా పరిచయం చేసారు. నాకు మూడ్ బాగా లేక పోతే చదివే బుక్ ఇదే.

    రిప్లయితొలగించండి
  9. అత్తగారికథలు పుస్తకం నేను ఈమద్యనే చదివాను.మంచి హస్యంతో కడుపుబ్బా నవ్వించింది. మనసుకుహత్తుకొనేలా భానుమతి గారు చాలా చక్కగా రాసారు . ఆపుస్తకం గురించి బ్లాగ్ లో రాద్దామనుకొన్నాను కానీ ,దాని గురించి మీలాంటివాళ్ళెవరైనాఇతే బాగా రాస్తారు మనకెలాగూ అంతసీనులేదులే అని ఊరుకున్నాను . చాలా బాగా రాశారండి .

    రిప్లయితొలగించండి
  10. మంచి కథల పుస్తకం పరిచయం చేసారండీ .నాకిష్టం అయిన కథలు 'ఆవకాయ -అత్తగారు '..అత్తగారి అరటికాయ పొడుం కథ .అత్తగారి టైపు లో నేను ప్రయోగం చేసాను .

    రిప్లయితొలగించండి
  11. చాలా మంచి పరిచయం.. ఎవరన్నా ఇంట్లో లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలని పుస్తకాలు కొనాలనుకుంటే రిఫరెన్స్ కోసం మీ బ్లాగు, సుజాత గారి బ్లాగు చూస్తే సరిపోతుంది.. Very nice collection!!

    నాకు అతివీరభయంకరంగా నచ్చే Top Ten పుస్తకాల్లో ఇదొకటి... ఏ కధ కా కధే సాటి అనిపిస్తుంది.. ఈ సంకలనంలో లేని కధలు ఇంకా ఉన్నాయంటే 'ఎక్కడ ఎక్కడా' అని ఇప్పటికిప్పుడు వెదకాలనిపిస్తుంది!

    :))) @Ruth's తీన్మార్ డాన్స్..

    రిప్లయితొలగించండి
  12. మురళీగారూ మీరిలా రోజూ (తరచూ) మృష్టాన్నభోజనఫలహారాదులు (ఇలా చక్కటి పుస్తకపరిచయాలరూపంలో) మాకు కైంకర్యం చేస్తున్నారు సరే అజీర్తితో (మీరిచ్చిన పుస్తకాలు కొన్ని ఇంతకుముందుచదవక,మిస్సయిపోయి ఇక్కడ దొరక్క) అగ్నిహోతృడిలా గిలగిల్లాడుతున్నానండీ, ఊరొచ్చాక మీచేతే ఖాండవదహనం చేయించాలేమో మురళీనారాయణా...

    రిప్లయితొలగించండి
  13. @వేణూ శ్రీకాంత్: అయితే కొంచం క్రెడిట్ ని గోదారి జిల్లాకి కూడా ఇవ్వాల్సిందేనండీ.. మరీ సింహభాగం ఇమ్మంటే మీరు ఒప్పుకోరు కదా :-) :-) ..ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: భలే వాళ్ళే, నేను చేసింది ఏముందండీ.. పుస్తకాలు కొనుక్కున్నదీ, చదువుకున్నదీ మీరు.. ధన్యవాదాలండీ..
    @భావన: మీకు ప్రతి అత్తగారిలోనూ భానుమతి అత్తగారిలో ఉన్న ఒకటో రెండో లక్షణాలు కనిపించి ఉంటాయే తప్ప, అన్ని లక్షణాలూ ఉన్న అత్తగారు ఎక్కడా తారస పడి ఉండకపోవచ్చునండీ.. అదే భానుమతి అత్తగారి గొప్పదనం.. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  14. @వాసు: లంకెని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. నిజమే.. వినడం కన్నా చదవడమే బాగుంటుంది, నాక్కూడా..
    @పరిమళం: మీకు వినడం నచ్చితే వాసు గారిచ్చిన లంకె కూడా ప్రయత్నించండి.. ధన్యవాదాలు.
    @శ్రీకర్ బాబు: భానుమతి-వాణి జయరాం పాడిన మంచి పాటని గుర్తు చేశారు.. నాకైతే ఇద్దరూ పోటీ పడ్డారని అనిపించింది.. భానుమతి మల్లీశ్వరి పాటలు వినండి, తీరికగా.. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  15. @రూత్: మీ వ్యాఖ్య చూసి నేను డేన్స్ చేయడానికి విఫల యత్నం చేశానండీ :-) మీ ఫేవరేట్ కథ నాక్కూడా ఇష్టమే.. అప్పుడప్పుడన్నా తెలుగు పుస్తకాలు చదువుతూ ఉండండి.. ఇలాంటి మంచి పుస్తకాలు కూడా ఉన్నాయి కదా.. ధన్యవాదాలు.
    @జయ: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @రాధిక: మీరు కూడా తప్పకుండా రాయండి.. నాకు అనిపించినట్టే మీకూ అనిపించదు కదా.. మీ అనుభూతిని మీరు రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @చిన్ని: ఇంతకీ ఎలా వచ్చిందండీ మీ అరటికాయ పొడి? :-) ..ధన్యవాదాలు.
    @నిషిగంధ: కొన్ని కథలు లేవండీ.. వెతకాలి, ఎక్కడైనా దొరుకుతాయేమో.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: కథలు, ఆడియోల లంకెలు ఇచ్చినా ఇలా అనడం అన్యాయమండీ :-) :-) వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. చదవటమే ఇష్టం కాని ఇప్పుడు వినడమే బావుందండీ మీకు వాసు గారికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి