సృష్టి కి ప్రతిసృష్టి చేయడం మొదలు పెట్టిన ఘనత విశ్వామిత్రుడిది. ఇంద్రుడితో మాట పట్టింపు రావడంతో, తన తపశ్శక్తి ధారపోసి 'త్రిశంకు స్వర్గం' సృష్టించాడాయన. అంత కష్ట పడక్కరలేకుండా అదే సృష్టిని చక్కగా కాపీ చేయడం అన్నది ఎప్పుడు మొదలైందో ఇదమిద్దంగా తెలీదు. బహుశా విశ్వామిత్రుడికి ముందు నుంచే ఉండి ఉంటుంది. ఎటొచ్చీ చేసింది కాపీ అని ఎవరూ ఒప్పుకోరు. ఇంగ్లీష్ అంత ప్రబలంగా లేని రోజుల్లో 'స్ఫూర్తి పొందాం' అని చెప్పుకుంటే, ఇప్పటి వాళ్ళు 'ఇన్స్పైర్' అయ్యాం అని మాట దాటేస్తున్నారు.
ఈ స్ఫూర్తి పొందడం లేదా ఇన్స్పైర్ అవ్వడం అన్నది అన్ని రంగాల్లోనూ ఉన్నా, సంగీతం లోనూ సాహిత్యం లోనూ ఇది కొంచం ఎక్కువ. సినిమా సంగీతం లో ఇప్పటికీ జనం నాలుకల మీద ఆడే ఆపాత మధురాల్లో చాలావాటికి హిందీ సినిమా పాటలు, విదేశీ సంగీతమూ స్ఫూర్తినిచ్చాయి. చాలా సందర్భాలలో ఆయా సంగీత దర్శకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. దక్షిణాది సంగీతాన్ని ఉత్తరాది సినిమాలకి వాడుకోడమూ జరిగింది. మొదట్లో ఈ 'స్ఫూర్తి' విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసేది.
మీడియా వ్యాప్తి పెరిగాక, ముఖ్యంగా విదేశీ చానళ్ళు తమ ప్రసారాలను మన దేశంలో ప్రారంభించాక, ఏ రచయిత/సంగీత దర్శకుడు ఏ విదేశీ చిత్రం నుంచి స్ఫూర్తి పొందారన్నది సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతోంది. గతంతో పోల్చినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మెరుగు పడడంతో ఒకరికి తెలిసిన విషయం అతి తక్కువ కాలంలోనే పదిమందికీ చేరుతోంది. ఈ పరిణామం కొందరు కళాకారుల 'సృజనాత్మకత' కి గొడ్డలి పెట్టుగా మారింది.
"నా మ్యూజిక్ లో ఎక్కడైనా విదేశీ ట్యూన్స్ వినిపిస్తే రామచంద్రాపురం లో ఉన్న మా బంధువులు కూడా అడిగేస్తునారు.. ఈ పాటకి ఒరిజినల్ ఫలానా కదా అని" అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వాపోయాడు, నాలుగైదేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో. 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు' అనుకునే వాళ్ళు మాత్రం తమ కృషిని కొనసాగిస్తున్నారు. స్వదేశం లోని వివిధ ప్రాంతాల జానపద సంగీతం నుంచి స్ఫూర్తి పొంది సినిమా పాటలు చేసే సంగీత దర్శకులు మరో రకం. చాలా 'చిత్రం' గా సినిమా రంగం లో పేరు తెచ్చేసుకున్న ఓ సంగీత దర్శకుడు ఇలా స్ఫూర్తి పొందిన పాపానికి కేసులు కూడా ఎదుర్కొన్నాడుట.
నిన్నటితరం సంగీత దర్శకుల నుంచి స్ఫూర్తి పొందే సంగీత దర్శకులకీ కొదవ లేదు. ఈమధ్య వస్తున్న వంశీ సినిమాలకి చక్రి చేస్తున్న సంగీతం వింటుంటే నాకే కాదు, చాలామందికి ఎనభైల్లో ఇళయరాజా చేసిన ట్యూన్లు గుర్తొస్తున్నాయి. సంగీతం గొడవ ఇలా ఉంటే, సాహిత్యానిది మరో కథ. రచయిత్రుల శకం ముగిసింది మొదలు, మొన్నటివరకూ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించే రచనలు చేసిన ప్రముఖ నవలా రచయితలు ఇద్దరూ ఆంగ్ల నవలల నుంచి స్ఫూర్తి పొందినవారే. ఒకాయన ఒప్పుకుంటాడు, మరో ఆయన ఆవిషయం మాట్లాడడానికి ఇష్టపడడు.
సినిమా తీయడానికి కథ అవసరం అనుకున్న రోజుల్లో కథల మీద హక్కుల గురించి కోకొల్లలుగా గొడవలు జరిగాయి. "అన్ని కథలకూ మూలం రామాయణ భారతాలే.. అసలు ప్రపంచం లో ఉన్నవి ఏడు కథలే.. ఎవరు తీసినా వాటితోనే సినిమా తియ్యాలి" అని జంట రచయితలు పరుచూరి సోదరులు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. "ఒక్కడు రాసిన కథతో సినిమా తీయడం ఏమిటి నాన్సెన్స్.. పది మంది రచయితలని కూర్చోపెట్టి చర్చిస్తే ఆ చర్చల్లోనుంచి కథ పుడుతుంది" అని వాదించిన దర్శకులూ ఉన్నారు.
ఇప్పుడైతే ఎంచక్కా కథల బాధ లేదు కాబట్టి కాపీ బాధా లేదు. బాగా హిట్టైన హిందీ సినిమాలోదో, రొటీన్ కి భిన్నంగా ఉన్న విదేశీ సినిమాలోదో 'పాయింట్' ని మాత్రం తీసుకుని సినిమాలు తీసేస్తున్నారు నవతరం దర్శకులు. అంటే వీళ్ళు స్ఫూర్తి కూడా పొందడం లేదు, కేవలం పాయింట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఏమీ అనడానికి లేదన్నమాట. మనం కూడా కథ ఒరిజినలా, కాపీనా అన్న విషయంలోకి వెళ్ళకుండా, సినిమా బాగుందా లేదా అన్న విషయం మాత్రమే చూసి, బాగున్న పక్షంలో మూల కథ ఎక్కడిది అయి ఉంటుంది అని ఆలోచించడానికి అలవాటు పడిపోతున్నాం.
కాపీ కొట్టడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది, పాటల బాణీలు ఎత్తేసిన వాళ్ళు పక్కవాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు ఏమి అనిపీంచదేమో:(
రిప్లయితొలగించండికొసమెరుపు: నవతరంగం ట్యాగ్ లైను ఇరవై నాలుగు ఫ్రేములు, అరవై నాలుగు కళలు. అరవై నాలుగులో చోరకళ కూడా ఒకటి కదా అందుకే సినిమా వాళ్లు బాగా పోషిస్తున్నట్టున్నారు.
ఈ కళాత్మక చౌర్యం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. మొన్ననే కస్తూరి మురళీకృష్ణ అనే బ్లాగర్ రాసిన టపా ఒకటి ఆయనకు క్రెడిట్ ఇవ్వకుండా యథాతధంగా అచ్చువేసేసారు సూర్య పత్రిక వాళ్ళు. దానికి ఆయన చాలా భాద పడ్డారు కూడా. తర్వాత అది సీరియస్ గా తీసుకుని పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పించుకున్నారు.
రిప్లయితొలగించండిమీరు కూడా ఇలా పోరాడితే బాగుంటుందేమో...ఈ రోజు నాలుగు లైన్లు కాపీ చేసారు..రేపు టపాలనే మక్కీకి మక్కీ రాసేస్తే...
హూ....కాపీ దెబ్బ మీకూ తగిలిందన్నమాట.
రిప్లయితొలగించండియు ఆర్ గ్రేట్ మురళిగారు కనుకే కాపీ కొట్టారు మరి !
రిప్లయితొలగించండిఈ టపాకు వ్యాఖ్య రాయాలంటే మరొక టపా అవుతుందండీ. టాపిక్ అలాంటిది.
రిప్లయితొలగించండిసిన్మాలు, కధలు,నవలల అనుకరణ గురించి చెప్పాలంటే అదీ మరో కధ అవుతుంది.
ఇక సినీసంగీతం విషయానికి వస్తే, కాపీ పాటల ఒరిజినల్ వెష్ట్రన్ మ్యూజిక్ ఆరిజన్ తెలియక ముందర అదంతా మన భారతీయ సంగీతదర్శకుల ప్రతిభే అనుకునేదాన్ని. "తెలుసా మనసా" పాట సంగీతం "ఎనిగ్మా"వాళ్ళదని చాలాకాలం తెలియదు నాకు...ప్రజాదరణపొందిన తరుణ్ "సోరీ సోరీ" పాట కూడా ఒక కాపీ ట్యూనే.కొత్తపాటల్లో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. పాతసినిమా పాటల్లో కూడా ఇతర భారతీయ భాషలనుంచి వచ్చిన కాపీ ట్యూన్లు చాలానే ఉన్నాయి.
ఇక మీ "కొసమెరుపు" విషయానికి వస్తే...ఆ మధ్యన దీపావళి గురించి నేను రాసిన పోస్ట్ మొత్తం ఫోటోలతో సహా "సకలపూజలు.కామ్" అనే వెబ్ సైట్ వాళ్ళు వాళ్ళ వెబ్ పేజ్లో నా అనుమతి కానీ,రిఫరెన్స్ కాని లేకుండా వేసేసుకున్నారు. జ్యోతిగారిని అడిగితే పెద్దగా ఎమీ చెయ్యలేము...అని "రైట్ క్లిక్ డిసేబుల్ " చేసే ఆప్షన్ చెప్పారు కానీ అది నా సైట్లో పనిచేయలేదు. "నా వెబ్ ట్రాకర్ లో మీ వెబ్ సైట్ నుంచి కాపీ చేసిన టైమ్,డేట్ ఉన్నాయి. నా బ్లాగ్ రిఫరెన్స్ అన్నా రాయండి. లేదా ఆ పోస్ట్ తొలగించండి అని మొత్తుకుంటే..." రెండో మైల్ రాసాకా నాకు జవాబు రాయలేదు కానీ అది తొలగించారు వాళ్ళు.
ఇక వేణూ గారి "వేణువు" బ్లాగ్ లో రాసిన సాగరసంగమం తాలుకూ వాక్యాలను యధాతధంగా ఒక టి.వి.చానల్ వాళ్ళు వాడుకుంటూంటే చూసానను "ruth" అనే బ్లాగర్ రాసిన వ్యాఖ్య చదివాను ఆ బ్లాగ్లో.
ఇలాంటి సంఘఠనలు మన బ్లాగర్లకు ఇంకా చాలానే జరిగి ఉంటాయని ఇవాళ మీ టపాతో తెలిసింది. ఈ కాపీలని అరికట్టే మార్గం ఎవరైనా తెలిపితే బాగుంటుంది...
మీకు వచ్చిన ప్రశంస ఇది.
రిప్లయితొలగించండి---------
ఎలాగూ కళలకాపీ/కాపీకళ ప్రసక్తి వచ్చింది కాబట్టి.. జంధ్యాల చంటబ్బాయిలో ఉన్న కొన్ని సీన్లను సరిగ్గా అలాగే నేనో ఇంగ్లీషు సినిమాలో చూసాను. తాళం కోసం జేబులో చెయ్యిపెట్టినపుడు దానికున్న చిల్లుగుండా చెయ్యి బయటకు రావటం లాంటి రెండు మూడు సీన్లు చూసాను -ఆ సినిమా పేరు గుర్తు లేదు. మహామహా వాళ్ళే ఈ పాట్లు పడ్డారు. మీరన్న ఆ చిత్ర సంగీత దర్శకుడి గురించి చెప్పేదేముంది.. మన విద్యాసాగర్ మలయాళంలో చేసిన బాణీని కాపీకొట్టి పెద్దహిట్టు కొట్టాడని పేరొచ్చింది కదా!
గంక్రాట్స్ ! సో మీరు గ్రేటు రైటరు అయిపోయేరన్నమాట. BTW, నా రాతల్ని ఎవరయినా కాపీ కొడతారేమో అని చూస్తున్నా ! అప్పుడేమోచ్చీ - మీకు పార్టీ ఇస్తా !
రిప్లయితొలగించండిమురళి గారు మన సినిమా రంగంలో ఎంత చెత్త రచయితలున్నారో నే ప్రత్యేకం గా చెప్పవసర్లేదు అనుకుంటా ఇన్ని తెలిసిన మీకు
రిప్లయితొలగించండిఇక పరిచూరి బ్రదర్స్ అంటారా నాద్రుస్తిలో వాళ్ళు రచయితలే కాదు.... గొప్ప కాపీ రైటర్స్....
ఎప్పుడో తీసిన " ప్రేమ పావురాలు" సినిమాని మళ్లీ కొంచం మార్పు చేర్పులతో మళ్లీ "నువ్వొస్తానంటే నేనోద్దంటానా " అనే పేరుతో స్క్రిప్ట్ రాసిన గణత వీరిదే...
www.tholiadugu.blogspot.com
నేనూ విద్యాసాగర్ ప్రస్తావన చేద్దమనుకుంటే చదువరిగారు చెప్పేశారు. ఓ ముఖాముఖి లో ఆయన Copy కి మించిన Compliment ఏముంది అన్నారు
రిప్లయితొలగించండిగూగుల్ లో ఆ సినిమా పేరు కొట్టి ఉంటారు మీ బ్లాగు వచ్చి ఉంటుంది ... కాపీ కొట్టేసారు .... నేను కూడా తీరిక వేళల్లో గూగుల్ లో నా టపాలో కొని లైన్స్ కొట్టి నా రాతలు ఎక్కడెక్కడ తేలాయో చూసుకుని నవ్వుకుంటా ....
రిప్లయితొలగించండిఆమధ్య విశ్వప్రేమికుడు గారు రాసిన, "నా కవితలు కాపీ కొట్టే స్థాయికెదిగాయోచ్" కూడా నాకు గుర్తుకు ఒస్తోంది. ఇంకెవరో బ్లాగ్ లో కూడా ఇటువంటిదే చదివినట్లు గుర్తు. ఇలాగే కొనసాగితే మంచి రచయితలకి తమ పేరుతో సంబంధం లేకుండా 'మంచిగుర్తింపే" లభిస్తుంది.
రిప్లయితొలగించండి:-) Take it Easy Murali ji. Like every one said, Take it as a compliment.
రిప్లయితొలగించండిహ్మ్... ఒక విధంగా బాధే ఐనా ఇంకోవిధంగా చూస్తే అదొక కాంప్లిమెంటే. ఎంజాయ్
రిప్లయితొలగించండిమొన్న జరిగిన స్టార్ నైట్ ప్రోగ్రాం లో కీరవాణి బంగారుకోడిపెట్టా పాట పాడేసాకా, "బాలూగారూ , మా బంగారు కోడిపెట్టా రిమిక్స్ లొ అప్ అప్ప్ హేండ్సప్ .....అనే లైన్స్ లో మీ ఒరిజినల్ వాయిస్ వాడేసుకున్నామండీ. ఎందుకంటే ఎంతట్రై చేసినా ఎవ్వరూ మీలా పాడలేకపోయారు అందుకు క్షమించాలి అన్నాడు ( దొంగలు పడ్డ అర్నెల్లకు అన్న సామెతలా..) . అలాంటివి చేసినపుడు నాకో ముక్క చెప్పండయ్యా....అన్నారు బాలూ, ఏడ్వలేకనవ్వుతూ .........
రిప్లయితొలగించండిమొదటగా మురళీ గారు...నమస్కారం. చాలా రోజులైంది మీ టపాలు చదివి...మీ బ్లాగుకి వచ్చి.
రిప్లయితొలగించండిఇదిగో ఇప్పటికి కాస్త తీరిక దొరికి...వచ్చాను..వచ్చీ రాగానే మీ "కళాత్మక చౌర్యం" చదివాను.
ముందు నవతరంగంలో మీరు రాసిన టపా చదివి...తరవాత సాక్షిలో వాళ్ళ వ్యాసం చదివాను. మీరు ఎన్నైనా చెప్పండి....మీరు మాత్రం వాళ్ళు చేసిన పనిని తేలిగ్గా తీసెయ్యకండి. శేఖర్ పెద్దగోపు గారు చెప్పినట్టు, ఇవాళ నాలుగు లైన్లు..రేపు టపా మొత్తాన్ని ఎత్తినా ఎత్తేస్తారు. ఇంకొక్క సారి మీ టపాల విషయంలో ఇలా జరిగిన్న జరగకపోయినా...మీ లాంటి మంచి బ్లాగర్లకు మళ్ళీ ఇలా అవమానం జరగకుండా....కాస్త గట్టిగానే మీరు 'సాక్షి ' ని హెచ్చరిస్తే బావుంటుందని నేను భావిస్తున్నాను.
అలాగే....మన సంగీత దర్శకుల పనితనం గురించి బాగా చెప్పారు.
ఎవరికి తెలిసిన కాపీల గురించి వారు బాగ చెప్పారు.
నాకు కుడా రెండు కాపీలు తెలుసు,,,సభాముఖంగా అందరితో అవి ఇక్కడ పంచుకుంటా. నాకు తెలిసి ఈ విద్యలో కీరవాణి గారు ఎప్పుడు ముందుంటారు.
ఛత్రపతి సినిమాలో బాగా పాపులర్ అయిన పాట ' అగ్ని స్కలన ' పాట MYST 4 అని ఒక జర్మన్ థీం కి మక్కికి మక్కీ కాపీ.
అలాగే సిమ్హాద్రి సినిమాలో ' చిరాకు అనుకో పరాకు అనుకో ' పాట ట్యూన్ కూడా Cotton Eye Joe అని ఒక అమెరికన్ పాటకు వాడిన ట్యూనే.
అలాగే మణి శర్మ పోకిరి సినిమాకి ఇచ్చిన సంగీతంలొ ' దేవ దేవ దేవ దేవుడ ' పాట రిక్కి మార్టిన్ పాడిన పాటది...ఇవి నాకు తెలిసినవి.
ఇంకా మన సో కాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ల భారతం అంతా ఇక్కడ ఉంది...చూడండి.
http://www.cinegoer.com/copycatcrown.htm
ప్రతి దాంట్లోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు వుంటాయండి . అందరు చెప్పినట్టు, మీ టపా ఒకరు కాపీ చేసారు అంటే అది అందరికి చూపించుకో తగ్గ గొప్ప స్టేజి లో వుందని అర్ధం కదండీ. సో డోంట్ వర్రీ బి హ్యాపీ.
రిప్లయితొలగించండిఒక ఆక్రొశం నుంచి మంచి రచన వచ్చిందన్నమాట ! ఎనీవే కంగ్రాట్స్ .
రిప్లయితొలగించండిఇళయరాజాని కాపీకొట్టని సంగీతదర్శకుడు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా?
రిప్లయితొలగించండి@కన్నగాడు: మీ కొసమెరుపు అద్భుతంగా ఉందండీ :):) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: ఊరుకునే ఉద్దేశ్యం లేదండీ.. ముందుగా బ్లాగ్మిత్రుల దృష్టికి తీసుకొచ్చాను.. ధన్యవాదాలు.
@సునీత: "మీకూ.." అంటే.. మీరూ బాధితులేనా?? మరి ఎలా స్పందించారు? ..ధన్యవాదాలు.
@పరిమళం: అలా అనుకోమంటారా? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: పెద్ద పోరాటమే చేశారన్న మాట.. అందరూ మీలాగా పోరాడడమే పరిష్కారం.. ధన్యవాదాలు.
@చదువరి: ఎందుకో అలా సరిపెట్టుకో లేకపోతున్నానండి.. ఇక 'చంటబ్బాయి' విషయానికి వస్తే, ఆ ఆంగ్ల సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి రాసిన నవల ఆధారం గా వచ్చిన సినిమా అయి ఉండొచ్చేమో అనిపిస్తోంది నాకు.. దర్శకుడిని స్ఫూర్తి పొందడం నుంచి మినహాయించాలని నా ఉద్దేశ్యం కాదు సుమండీ.. ధన్యవాదాలు.
@Sujata: మీరు మరీనండీ.. ఇప్పుడిలా చెబుతున్నారు కానీ, నిజంగా కాపీ జరిగినప్పుడు మీ స్పందన పార్టీ ఇచ్చేలా మాత్రం ఉండదని నా నమ్మకం :) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కార్తీక్: అదొక్కటే కాదండీ.. ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయి.. వాటి సంగతి ఇంకెప్పుడైనా.. ధన్యవాదాలు.
@vookadampudu: అలా అన్న వాడు ఊరుకోలేదండీ..కేసు వేశాడు.. ఏదో సెటిల్మెంట్ జరిగినట్టు వినికిడి.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ : బహుశా అదే జరిగి ఉంటుందండీ.. మీరిచ్చిన ఐడియా బాగుంది.. ఇకనుంచీ ఖాళీ సమయాల్లో నేను కూడా :):) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: నిజమేనండీ.. మంచి గుర్తింపే.. ధన్యవాదాలు.
@శ్రీదేవి: ముగిసిపోయిన ఇష్యూ కి సంబంధించి వాదోపవాదాలకి ఇక్కడ చోటు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో మీ వ్యాఖ్యని ప్రచురించ లేదండీ.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అలా తీసుకోలేకే ఇలా అండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@లక్ష్మి: మీక్కూడా ఇది కాంప్లిమెంట్ లాగే కనిపించిందా!! ..ధన్యవాదాలు.
@లలిత: బాలూ ముఖం నేనూ చూశానండీ.. భలే నవ్వొచ్చింది.. ధన్యవాదాలు.
@"శం కరోతి" - ఇతి శంకరః 'ఉషా పరిణయం' చూసి వస్తానని చెప్పి వెళ్ళిన వాళ్ళు. సుమన్ బాబు 'నాన్ స్టాప్' విడుదలయ్యే ముందు వస్తారా? ఇంతకీ పౌరాణిక చిత్ర రాజాన్ని చూశారా? కాపీ సంగతి వదిలేయాలని నేనూ అనుకోడం లేదండీ.. మంచి లంకె ఇచ్చినందుకు థాంకులు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కరుణ: ఏవిటో.. మెజారిటీ అభిప్రాయం ఇలాగే ఉంది.. నాకేమో దీన్నిలా వదలకూడదని ఉందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మాలాకుమార్: మీరు కూడా ఇదే మాటా?! ..ధన్యవాదాలు.
@బోనగిరి: నిజమేనండీ.. ఎవరూ కనిపించడం లేదు.. ధన్యవాదాలు.
మురళి గారు క్షమించాలి లేట్ గా చూసేను మీ టపా. వూరుకోవద్దండీ. మన రాతలు ఏవో ప్రపంచ ప్రసిద్ధి పొందాయని కాదు కాని ఇలా వదిలేస్తే ఎక్కడి కి వెళ్ళి ఆగుతుంది ఈ చౌర్యం.
రిప్లయితొలగించండిమురళీ గారూ..
రిప్లయితొలగించండినాదీ అదే మాట...వదిలేసి ఊరుకోవద్దండీ..అసలే మీరు మంచి మంచి టపాలు రాస్తుంటారు. ముందు ముందు ఇంకా భేషుగ్గా కాపీ చేసేస్తారు.
సాక్షి వాళ్లకి ఘాట్టిగా ఒక ఈమెయిలు కొట్టండి. దెబ్బతో నెమలికన్ను వైపు మళ్ళీ కన్నెత్తి చూడకూడదంతే :)
@భావన:"'మనకి మనకి క్షమాపణలు ఎందుకండీ.." ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మధురవాణి: అలాగేనండీ..ధన్యవాదాలు.