ఆదివారం, నవంబర్ 15, 2009

సుమన్ బాబు

ఉదయాన మగత నిదుర చెదిరిపోయిన వేళ 'ఈనాడు' చూసి ఉలిక్కి పడ్డాను.. 'ఈనాడు' అంటే కమల్ హాసన్-వెంకటేష్ బాబు సినిమా కాదు.. దిన పత్రిక. ఉలికిపాటుకి కారణం సినిమా పేజీలో 'నాన్ స్టాప్' వినోదం హెడ్డింగ్ తో వచ్చిన వార్త. ఇన్నాళ్ళూ 'ఈటీవీ' సుమన్ గా మనందరికీ చిర పరిచితుడైన సుమన్ 'సుమన్ బాబు' గా మారాడన్నది ఆ వార్త చదివాక నాకు అర్ధమైన మొదటి విషయం. నిర్మాతల కొడుకులు, హీరోల కొడుకులు 'బాబు'లవ్వడం తెలుగు సినిమా పరిశ్రమలో మామూలు విషయమే కాబట్టి ఉలికిపాటు అందుక్కాదు.

భారీ పౌరాణిక చిత్రం 'ఉషాపరిణయం' తర్వాత, సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ తన రెండో ప్రయత్నంగా నిర్మించిన 'నాన్ స్టాప్' సినిమా త్వరలో విడుదల కాబోతోందన్నది ఆ వార్త సారాంశం. బహుముఖ ప్రజ్ఞాశాలి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు, సంగీతం, దర్శకత్వం వంటి తెర వెనుక బాధ్యతలతో పాటు తెరపై నటించడం లోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సుమన్.. సారీ సుమన్ బాబు.. ఈ సినిమాకి కేవలం నిర్మాత బాధ్యతను మాత్రమే తీసుకున్నారు. ఇంత షాకింగ్ వార్త తెలిశాక ఉలికి పాటు కలగదూ మరి??

సుమన్ బాబు సినిమాకి ఎవరో కథ, మరెవరో మాటలు, ఇంకెవరో పాటలు రాయడం, ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహించడం నాకస్సలు మింగుడు పడలేదు. సకల కళల సవ్యసాచి అయిన సుమన్ బాబు, అజ్ఞాత వాసం లో అర్జునుడు బృహన్నల వేషం వేసినట్టుగా ('ఉషాపరిణయం' లో తను కూడా బృహన్నల వేషం లో ఓ మెరుపు మెరిశాడు) ఇలా తన టాలెంట్స్ అన్నింటినీ దాచేసుకోవడం విధి చేయు వింత కాక మరేమిటి? కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమైతే ఏదో ఒకటి.. మహా అయితే రెండు బాధ్యతలను కొత్త వాళ్లకి ఇవ్వొచ్చు.. అంతేకానీ తను ఒకేఒక్క బాధ్యతకి పరిమితమైపోతే ఎలా??

అభిమానులంతా 'ఉషాపరిణయం' మొదటి రోజే చూశారంటే అందుకు కారణం తెరమీద, తెర వెనుక సుమన్ బాబు అన్నీ తానే అవ్వడం వల్లనే.. (తర్వాతి రోజు సినిమా ఉంటుందో ఉండదో అనే అనుమానం వల్ల.. కూడా అని కొందరు గిట్టని వాళ్ళు గొణుగుతున్నారు కానీ అవన్నీ పట్టించుకోనవసరం లేదు) మరిప్పుడు సుమన్ బాబు కేవలం నిర్మాత పాత్రకే పరిమితమైతే ఈ సినిమా చూడాలనిపిస్తుందా? సాంకేతిక వర్గం మాత్రమే కాదు, నటీనటులు కూడా అందరూ కొత్తవాళ్ళేట.. అనుభవజ్ఞుడైన సుమన్ కూడా నటించి ఉంటే వాళ్లకి ఎంత ఉత్సాహం గా ఉండేది? అతన్నుంచి వాళ్ళు ఎన్ని విషయాలు నేర్చుకుని ఉండేవాళ్ళు?

మానవుడు ఆశాజీవి కాబట్టి, నేను కూడా మానవుడినే కాబట్టి నాకో ఆశ కలుగుతోంది. పేపర్లో వేసిన ఫోటోలో సుమన్ బాబు కొత్త గెటప్ లో కనిపించాడు.. నిజం చెప్పాలంటే కొంచం ఒళ్ళు చేసిన శ్రీకాంత్ లా అనిపించాడు. (శ్రీకాంత్ అభిమానులూ.. ఇది కేవలం అభిమానం తో చెబుతున్న మాట) బహుశా 'నాన్ స్టాప్' లో తను ఏదైనా 'ప్రత్యేక' పాత్ర పోషించి ఉండొచ్చేమో కదా.. ఆ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుతారేమో.. కేవలం నా ఊహాగానమే సుమా.. నిజమైతే బాగుండును కదా..

అన్నట్టు 'నాన్ స్టాప్' సినిమా కి కామెడీ అనే ఉప శీర్షిక ఉందిట.. టైటిల్స్ లో సుమన్ బాబు పేరుండగా ఇంక కామెడీ అని ప్రత్యేకంగా చెప్పాలా? కొత్త దర్శకుడి పిచ్చితనం కాకపొతే.. కామెడీ తో పాటు సస్పెన్స్ కూడా ఉంటుందిట సినిమాలో.. సుమన్ బాబు తెర మీద కనిపిస్తాడో లేదో అన్న సస్పెన్స్ ఉండనే ఉంది కదా. తెలుగు తో పాటు తమిళంలోనూ విడుదల చేస్తారుట. ఇలా రెండు భాషల్లో సినిమా నిర్మించడం నిర్మాత పరిణతి కి నిదర్శనం కాదూ?

ఇంద్రనాగ్ అనే కుర్రాడు స్క్రీన్ ప్లే రాశాడుట. ఇంకా క్రియేటివ్ డిజైనర్, ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు కూడా చూశాడుట. ఈటీవీ లో చూసిన ముఖమే.. విధి విలాపం వల్ల ప్రభాకర్ దూరమయ్యాక, ఇప్పుడా పాత్ర(ల)ని తనే పోషిస్తున్నాడుట ఈ కుర్రాడు.. అంటే సుమన్ బాబు రాముడైతే ఇతను సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అన్నమాట. ఆడియో వచ్చే శనివారం వస్తుంది.. సినిమా కోసం మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.

30 కామెంట్‌లు:

  1. విధి బలీయమైనది 'బాబు'గారూ విధి బలీయమైనది.
    ఇక్కడ బాబుగారి ప్రత్యేకత మీరు గమనించినట్లు లేదండీ. మిగిలినబాబులు హీరోలుగా వచ్చినప్పుడే తోకతగిలించుకుంటే ఈబాబు కొద్దిగా డిఫరెంట్ అని నిరూపించేశాడు.

    రిప్లయితొలగించండి
  2. హెంత హమాయకులండీ మురళీ గారూ. సుమన్ క్రియేటివిటీని తక్కువగా అంచనా వేశారు. అన్నీ తానేనై మారుపేర్లతో మల్టీ జాబ్స్ చేస్తున్నాడేమో చూడండి. ప్రతి దానికింద "సుమన్ బాబు" అని వ్రాస్తే ఏంబాగుంటుంది చెప్పండి.

    రిప్లయితొలగించండి
  3. అహ్హాహ్హ...పొద్దుట ఈనాడు చుడగానే నాకు ఒక్క క్షణం అర్థం కాలేదు,అసలు ఆ ముఖం సుమనదేనా అని ఓ ఐదు నిమిషాలు తేరిపార చూసాను.

    రిప్లయితొలగించండి
  4. ఇంతకీ మీ..ఈ...సుమనాభిమామేమిటండీ ఇలా రోజురోజుకూ ద్విగుణీకృతమౌతున్నట్లు గోచరిస్తోంది..??!

    రిప్లయితొలగించండి
  5. మురళి గారూ..మీరు మాత్రం అందరికంటే ముందు ఆ సినిమా చూసి దానిలో చమక్కులు గట్రా మాకు చెప్పాలి మరి!! అంటే మేమే చూసుకోవచ్చు కదా అని మీరనొచ్చు...కానీ మా గుండెలు కొంచెం వీక్ కదా..అందుకేనండీ ఈ రిక్వస్ట్...:)
    అ సినిమాలో ప్రభాకర్ కి కనీసం గెస్ట్ రోల్ అయినా ఇచ్చుంటారేమో!! మే బీ అది కూడా ఓ సస్పెన్స్!!

    రిప్లయితొలగించండి
  6. నేనుకూడా'' సుమన్బాబు '' అని చూడగానే నోరు వెల్ల బెట్టి వొకటికి పది సార్లు బుతద్దాం పెట్టి మరి ఆ ఫోటో చూసి ఛి ఛి అతనైతే ఈటీవీ సుమన్ అని వేసుకుంటాడు గాని ,యి బాబు శోభన్ బాబు పిన్ని కొడుకు అయి వుంటాడని సర్ది పెట్టుకున్నా . తీరా మీ పోస్ట్ చూసాక అరా తీస్తే దైవజ్న శర్మ నీకు తోక గా బాబు తగిలిస్తే శోభన్ బాబు రేంజ్ కి ఎదుగు తావని సెలవిస్తే పావు నూట పదహార్లు దక్షిణ సమ ర్పించుకుని ఈనాడు లో ప్రత్యక్షం అయినారని అభిజ్న వర్గాల బోగట్టా .

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు, నేనెందుకో ఇవాళ పేపర్లో, టి.వి. లో... సుమన్ బాబు, నాన్ స్టాప్ ...చూడగానే అనుకున్నాను. మీరు ఇవాళ తప్పకుండా దీని గురించి రాస్తారని. చూశారా, ఎంత కరెక్ట్ గా ఊహించేశానో. భలే బాగా రాశారండి. కాని ఏవిటో, ఆ కొత్త హైర్ స్టైల్ లో సుమన్ బాబు బాగాలేడు

    రిప్లయితొలగించండి
  8. అయ్యో గురువుగారూ ఇంతకీ మీరా సినిమా చూడరా ఏవిటి ? మేమందరం మీ మీద ఎన్నేసి ఆశలు పెట్టుకున్నాం :) :).

    రిప్లయితొలగించండి
  9. హ్హహ్హ.. నాకు నిధ్ర దిగిపోయింది అది చూడగానే...!!!
    ఇంకో వార్త.. ప్రభాకర్ "బాబు" కూడా తిరిగి ఈటివి లో కాలు పెడుతున్నాడు.!!

    రిప్లయితొలగించండి
  10. హన్నన్న, మీరు మా సుమన్ మీద...ఎర్ సుమన్ బాబు మీద ఇన్నిన్ని వ్యంగ్యాస్త్రాలు వేస్తారా, నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి, ఇప్పుడు ఎవరో ఒకరు నాకు క్షమాపణ చెప్పాల్సిందే, లేదా రాజీనామా చేయాల్సిందే :)
    నాన్-స్టాప్ అన్న తర్వాత దానికి సబ్ కాప్షన్ ఇవ్వకపోతే బాగుండేది, కామెడీ నా, తల నొప్పా అన్నది చూసే వాళ్ళ స్థాయీ సామ్ర్ధ్యం మీద ఆధారపడి కాప్షన్ నిర్ణయించుకుంటారు, ఏమంటారు

    రిప్లయితొలగించండి
  11. మొదటి రెండులైన్లూ చదవగానే షాక్ అయ్యి అక్కడే మీరిచ్చిన లింకును కూడా పట్టించుకోకుండా నిన్నటి పేపర్ తిరగేశా ! సుమన్ బాబు కొత్తగెటప్ లో దర్శనమిచ్చేసరికి కాస్త కళ్లు తిరిగి....సారీ కళ్లు చెదిరి ...హాశ్చర్యానందాలు (కడుపులో రకరకాలుగా ఉంటే ఇలాగే అంటారుకదా ) ఒక్కసారిగా పట్టలేక మళ్ళీ మీ మిగతా టపా చదివి కుంటుతున్నా....సారీ కామెంటుతున్నా ...ఏవిటో ...కళ్ళముందు కృష్ణుడు , బృహన్నల , మరియు కొత్త హెయిర్ స్టైల్ తో సుమన్ బాబు స్లైడ్ షో జరుగుతున్నట్టుంది ....హేవిటో ....

    రిప్లయితొలగించండి
  12. సుమన్ బాబు వార్తా, మీ టపా, వ్యాఖ్యలూ అన్నీ చాలా చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  13. హ హ టపా భలే రాశారు మురళి. నేను ఈ వార్త చూసే అదృష్టానికి నోచుకోలేదు :-) ఎవరో మనలాటి అభిమానులో శ్రేయోభిలాషులో హితబోధ చేసుంటారు. సినిమా లో బాబులను చూసి నేర్చుకో బాబు, వాళ్ళు చూడు ఎన్నిట్లో వేలు పెట్టినా ఒక్క దాన్లోనే పేరేస్కుంటారు అట్టాగే నువ్వు కూడా అందుగలడిందులేడను సందేహము వలదు అనకుండా.. మిగిలిన వాట్లో కనీసం డమ్మీ బొమ్మలను నించో పెట్టు అని.

    రిప్లయితొలగించండి
  14. దూరం గా వుండి మేమేదో చాలా మిస్ అవుతున్నట్లు వున్నామే. ఇక్కడకు ఎవ్వరు ధైర్యం చెయ్యటం లెదనుకుంటా సినిమాలు తేవటానికి (మరి డబ్బెవరికి చేదు కదా) :-)

    రిప్లయితొలగించండి
  15. ఏంటొనండీ.....పాపం పిల్లోడికి కేన్సరని తెల్సినప్పటినుంచీ బాబుని చూస్తే నవ్వాలనిపించడంలేదు.
    నా బ్లాగ్ పొస్ట్ లో తెలుగు బ్లాగులను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులుగా సుమన్, ప్రభాకర్ ను ఎంచుకుంటే
    ఓలాలూ.....అని కొత్తపాళీగారు అడిగినప్పుడు మాత్రం నవ్వొచ్చింది.

    రిప్లయితొలగించండి
  16. @సుబ్రహ్మణ్య చైతన్య: సుమన్ బాబు మొదటి నుంచీ అంతేనండీ.. 'నలుగురికి నచ్చినది..' ఈ బాబుకి నచ్చదు.. ఈ బాబుకి నచ్చింది నలుగురికీ నచ్చదు.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామిరెడ్డి: అభిమానులు సుమన్ బాబు పేరు చూసి సినిమాకి వెళ్తారు కానీ, మిగిలిన వాళ్ళు పేర్లు చూసి కాదు కదండీ.. తన పేరుకున్న బ్రాండ్ వాల్యూనైనా బాబు దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది.. ధన్యవాదాలు.
    @సిరిసిరి మువ్వ: వేరే ఎక్కడైనా అయితే అనుమానించాలి కానీ, వాళ్ళ పేపర్లో అతని ఫోటో విషయం లో పొరపాటు జరగదు కదండీ. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @తృష్ణ: ఈనాటి బంధం కాదండీ..ఈటీవీ తో మొదలయ్యింది.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: సుమన్ బాబు తెర మీద కనిపించని సినిమా చూడాలన్న ఆలోచనే చేదుగా ఉందండీ.. ధన్యవాదాలు.
    @రవిగారు: భలే పాయింట్ చెప్పారండీ.. నేనిలా ఆలోచించలేదు.. అన్నట్టు సదరు శర్మ గారు కేవలం నటీ మణులకి మాత్రమే సలహాలు ఇస్తారని కిట్టని వాళ్ళు అనడం విన్నాను.. లోగుట్టు మీబోటి వారికే తెలియాలి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @జయ: భలే ఊహించారు.. నాకు మాత్రం బాబు ఏ గెటప్ లో అయినా అందంగానే కనిపిస్తాడు.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: బాబు తెర మీద కనిపించక పొతే ఇంకెందుకండీ చూడడం.. మీరే చెప్పండి?? ..ధన్యవాదాలు.
    @మేధా: అవునా.. మీరు చెప్పింది ఇంకెక్కడా వినలేదు.. ఈటీవీ కి పూర్వ వైభవం రాబోతోందన్న మాట.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @లక్ష్మి: వ్యంగ్యాస్త్రాలా? ఇవన్నీ అక్షర సత్యాలు లక్ష్మి గారూ.. అక్షర సత్యాలు.. టపాలో ఒక్క లైను వ్యంగ్యం ఉన్నట్టు నిరూపించండి.. మన సుమన్ బాబు నటనకి రాజీనామా చేసేస్తారు.. ధన్యవాదాలు.
    @పరిమళం: ఆనందం అవధులు దాటినట్టు ఉంది కదండీ.. తెలుస్తోంది.. తెలుస్తోంది.. బాబు మరో పౌరాణికం ఎప్పుడు తీస్తారో ఏమిటో.. ధన్యవాదాలు.
    @అమ్మ ఒడి: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @వేణూ శ్రీకాంత్: అయ్యో.. ఫోటో చూడలేదా.. ఈనాడు నెట్ ఎడిషన్ లో ఒక రోజు మాత్రమే ఉంచుతారనుకుంటా.. మీరు తప్పక చూదాలండీ.. చూడాలి.. దంమీల పేర్లు చూసి అభిమానులు ఎవరూ సినిమాకి వెళ్లారు కదండీ..బాబు పేరు కనిపిస్తే ఆ అందమే వేరు.. ధన్యవాదాలు.
    @భావన: డీవీడీలు వస్తాయి లెండి.. సుమన్ బాబు కి ఓ ఉత్తరంముక్క రాసి పారేయండి.. అక్కడ కూడా రిలీజ్ అయ్యే ఏర్పాటు జరుగుతుంది.. అభిమానుల మాటంటే వేద వాక్కు బాబుకి.. ధన్యవాదాలు.
    @మిత్ర: అంతేనంటారా? ధన్యవాదాలు.
    @లలిత: ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టే అనుకుంటానండీ.. మంచి వైద్యం దొరికింది కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. నేనొప్పుకోను. బాబు మీరెవ్వరూ గుర్తు పట్టకుండా విగ్గు పెట్టుకుని, పేరు కూడా మార్చేసుకుని మరీ వస్తే అంత తేలిగ్గా గుర్తు పట్టెయ్యటం .. నేనొప్పుకోనంతే.

    రిప్లయితొలగించండి
  22. Small Correction -- Prabhakar's show is coming in Gemini not in Etv...

    రిప్లయితొలగించండి
  23. అవును, నేనూ చదివి జడుసుకున్నాను. అయితే 2012 యుగాంతం రాక తప్పదేమో!

    పైగా నేనూ అదే అనుకున్నా, బ్రహ్మానందం తర్వాత చూడగానే నవ్వొచ్చే ఫేసు బాబుది. ఇంకా "కామెడీ"అనే ఉపశీర్షిక ఎందుకుటా! అంటే ఎలాగూ సినిమా మనకి అర్థం కాదు కాబట్టి అది "కామెడీ"అని మనం ముందే అనేసుకుని చూస్తే వాళ్లకు ఒక శ్రమ తప్పుతుంది కదా! అదనుకుంటా సంగతి!

    ఈ ఇంద్రనాగ్ సుమన్ సీరియల్స్ లో వేసిన కుర్ర హీరోనే లెండి! ఎక్కువ ఆశలు పెట్టుకోకండి!

    రిప్లయితొలగించండి
  24. Have you read suman babu's interview on 18th nov ??

    http://eenadu.net/ncineshow.asp?qry=guest

    Waiting for another post on this..

    రిప్లయితొలగించండి
  25. @అబ్రకదబ్ర: అయ్యో.. యెంత పొరపాటు జరిగిందీ... 'మారు వేషం' అని బాబు ఒక్క మాట చెప్పి ఉంటె గుర్తు పట్టకపోయేవాడిని కదా.. సరే.. ప్రాయశ్చిత్తం మీరే చెప్పండి మరి.. ధన్యవాదాలు.
    @మేధ: అవునా.. అయితే జెమిని కి పూర్వ వైభవం వస్తుందన్న మాట..
    @సుజాత: నాకు ప్రస్తుతం ఉన్న ఆశల్లా ఒక్కటేనండీ.. బాబు ఏదైనా 'ప్రత్యేక' పాత్రలో కనిపిస్తాడేమో అని.. ఇంద్రనాగ్ ని చూశాను ఈటీవీలో.. యుగాంతం రాకుండా అడ్డుకునే శక్తి కూడా బాబుకి ఉందండీ.. తనే చెయ్యాల్సిన సబ్జక్ట్ వస్తే సినిమా చేస్తానని తాజా ఇంటర్వ్యూ లో సెలవిచ్చాడు కదా.. ధన్యవాదాలు.
    @స్వాతి: చదవకుండా ఎలా ఉండగలను చెప్పండి? ప్చ్.. ఏం లాభం.. అంత పెద్ద ఇంటర్వ్యూ లో కూడా నాక్కావాల్సిన విషయం దొరకలేదు.. 'నాన్ స్టాప్' లో తను నటించాడో, లేదో చెప్పనే లేదు :( ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. ఖడ్గం లో కృష్ణవంశీ ఈ "బాబు" ప్రయోగం మై కాస్త ఏదో విసురు విసిరిన గుర్తు... :) అయినా వాళ్ళకి కాస్త నమ్మకాలు వగైరాలు వుంటాయిట కదా?

    రిప్లయితొలగించండి
  27. @మరువం ఉష: ఒక్క విసురు కాదండీ..చాలా విసుర్లే విసిరాడు.. మన వాళ్ళు బాగా సున్నితం కదా.. అస్సలు పట్టించుకోలేదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. మురళి గారు, మీరు సుమన్ బాబు నటనా చాతుర్యాన్నే చూస్తున్నారు, అయన 'బహుకళాకోవిదుడు'. అయన రచనను మీకు పరిచయం చేద్దాం అని

    http://pootarekulu.blogspot.com/2011/06/blog-post_06.html

    ఒకవేళ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే...మీ బ్లాగ్ చదువరులందరికి ఈ పుస్తకం మీ శైలిలో పరిచయం చెయ్యండి :-)

    రిప్లయితొలగించండి
  29. @శ్రీ: సుమన్ బాబు ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అవుతాడని అప్పట్లో తెలుసుకోలేక పోవడం వల్ల ఈ పుస్తకాన్ని మిస్సయ్యానండీ మిస్సయ్యాను.. ఓసారి కోఠీ సెకండ్ హ్యాండ్ బజార్ లో కనిపించినప్పుడు కూడా చిన్న చూపు చూశాను.. నా పాపానికి నిష్..కృతి లేదు కదూ.. అన్నట్టు.. ఆ రివ్యూ ఏదో మీరే రాసేద్దురూ... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి