ఆదివారం, నవంబర్ 08, 2009

ఊరి చివరి ఇల్లు

హోరున కురిసే వర్షం.. చిమ్మ చీకటి.. ఊరికి దూరంగా ఉన్న ఒంటరి ఇల్లు.. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులు.. ఎవరికి ఎవ్వరూ ఏమీ కారు. ఆ రాత్రి వాళ్ళ జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందన్నదే దాదాపు యాభయ్యేళ్ళ క్రితం తిలక్ రాసిన 'ఊరి చివరి ఇల్లు' కథ. కవిత్వం లాగే కథలమీదా తనదైన ముద్ర వేసిన రచయిత తిలక్. వచనమైనా, కవిత్వమైనా భావుకత్వం ఆయన కలం నుంచి పరవళ్ళు తొక్కుతుంది. మానవ మనస్తత్వ చిత్రణ మీద తిలక్ కి ఉన్న పట్టు కి పరాకాష్ట ఈ కథ.

రమ ఓ పాతికేళ్ళ యువతి. ఆమెది ఓ బరువైన గతం. మూడు నెల్ల పసికందుని కోల్పోయిన గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు. ఇంత బాధ లోనూ ఆమె కళ్ళు 'విజయుడి' కోసం వెతుకుతూనే ఉన్నాయి. నిజానికి ఆ 'ఊరి చివరి ఇల్లు' రమ ది కాదు. ఆమె స్థితికి జాలిపడీ, తనకి పనికొస్తుందన్న ఆశ తోనూ ఆమెకి ఆఇంట్లో ఆశ్రయమిచ్చింది 'ముసిల్ది.' ఎందుకంటే జీవితపు చివరి రోజుల్లో తన బాగోగులు చూసే మనిషి కావాలి ముసిల్దానికి. రమ అందం, వయసు, అసహాయత చూశాక నమ్మకం కలిగింది, ఆమె తనని చూసుకోగలదని.

మన్నూ మిన్నూ ఏకమయ్యేలా వర్షం కురుస్తూనే ఉంటుంది బయట.. ఆ వర్షాన్ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది రమ. వర్షం ఆమెని గతంలోకి తీసుకు పోతుంది. 'ఆరోగ్యం పాడైపోతుంది పిల్లా.. శాలువా కప్పుకో..' అన్న ముసిల్దాని మాటలు లెక్క పెట్టదు రమ. వర్షానికి అడ్డం పడి రోడ్డున వెళ్తున్న నిలువెత్తు మనిషి ఉన్నట్టుండి రమ కంటపడతాడు, ఆ సంజెవేళ. వర్షంలో చిక్కుకుపోతాడేమో అన్న భయంతో అతన్ని ఇంటికి పిలుస్తుంది రమ. ఆజానుబాహుడైన అతనిలో తన 'విజయుడి' పోలికలు చూసి కలవర పడుతుంది. ఆ రాత్రి తన ఇంట ఉండి మర్నాడు ఉదయం రైలుకి వెళ్ళమంటుంది అతన్ని.

రమ కలవరపాటుని గుర్తిస్తాడతను. అతని పేరు జగన్నాధం. తనకంటూ ఎవరూ లేని జీవితం అతనిది. ఎక్కడా స్థిరంగా ఉండే మనస్తత్వం కాదు జగన్నాధానిది. అతని పట్ల యెంతో ఆదరం చూపుతుంది ముసిల్ది. వేడి వేడిగా వండి పెడుతుంది. పక్క సిద్ధం చేస్తుంది. రమ కూడా అతని పట్ల అభిమానంగా ఉంటుంది. అతను తన విజయుడేమో అన్న ఆశ ఏ మూలో మినుకు మినుకు మంటూ ఉంటుంది ఆమెకి. బయట వర్షం ఆగాగి కురుస్తూ ఉంటుంది.

ఓ రాత్రి వేళ తను గాఢ నిద్రలో ఉండగా రమ లాంతరుతో వచ్చి తన ముఖాన్ని పరిశీలనగా చూడడం గమనిస్తాడు, అప్పుడే మేల్కొన్న జగన్నాధం. ఆమెకి తన గతం చెబుతాడు.. ఇంట్లోనుంచి పారిపోయి సైన్యంలో చేరిన వైనాన్ని వివరిస్తాడు. 'విజయుడు కూడా సైన్యంలోకే వెళ్ళాడు' అంటుంది ఆమె. ఓ స్నేహితుడిని చూడడం కోసం అతని ఊరికి వెళ్లి, అతను చనిపోయాడని తెలిసి అక్కడ ఉండడానికి మనస్కరించక తిరుగు ప్రయాణంలో ఆ ఊళ్ళో, ఆమె ఇంట్లో ఎలా చిక్కుకు పోయాడో చెబుతాడు జగన్నాధం.

అతను తనకి దగ్గరవాడు గా అనిపించడం తో తన గతాన్ని పంచుకుంటుంది రమ. అనాధ శరణాలయం లో కష్టాలు, విజయుడి స్నేహం, ఎడబాటు, మరో మోసగాడి బారిన చిక్కిన వైనం, చివరికి ముసిల్దాని ఆశ్రయం పొందడం వరకూ ఏదీ దాచకుండా చెబుతుంది రమ. ఆమె కథ విని కరిగిపోతాడు జగన్నాధం.. ఆమెని వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిశ్చింతగా నిద్రపోతుంది రమ. గదిలో మాటల్ని బయటినుంచి వింటుంది ముసిల్ది. జగన్నాధాన్ని బయటికి పిలిచి మాట్లాడుతుంది.. ఫలితం..అతను అప్పటికప్పుడే పెట్టె తీసుకుని బయటకు నడుస్తాడు.. తర్వాత ఏం జరిగిందన్నది కదిలించే ముగింపు. తిలక్ కథలన్నింటిలోనూ నాకు ఈ కథంటే ప్రత్యేకమైన ఇష్టం.

21 కామెంట్‌లు:

  1. మరల చదవాలన్న కోరిక కలగచేసారు అన్ని కథలు చదివి చివరిలో ఎప్పటికో చదివిన కథ ఇది

    రిప్లయితొలగించండి
  2. 'తిలక్ కధలు' పుస్తకం లోని కధా. నాకు గుర్తు లేదు వెళ్ళి ఆ పుస్తకాన్ని బయటకు తియ్యలి ఏమి మాట్లాడిందో ఏమో ఆ ముసలామె నాకు టెన్షన్ గా వుంది :-|

    రిప్లయితొలగించండి
  3. తిలక్ గారిగురించి ఎంత బాగా రాశారండీ ....మీరు పరిచయం చేసిన ప్రతికధా చదవాలనిపిస్తుంది. కానీ అన్నీ అందుబాటులో ఉండవు.మీరేమో క్లైమాక్స్ చెప్పరు .ఎలాగండీ ?

    రిప్లయితొలగించండి
  4. ఇదోటీ నల్లజర్ల రోడ్డు ఒకటీ. అసలు తల్చుకుంటేనే వెన్నులో జలదరింపు. మహ గొప్పగా రాశాడు.

    రిప్లయితొలగించండి
  5. పరిచయం బాగుంది :-) వెంటనే పుస్తకంతీసి ఈ కథ చదివేశాను.

    రిప్లయితొలగించండి
  6. రమ పెళ్లి చేసుకుంటే ముసలమ్మకి తోడు ఉండదు ,అందుకే ఏమైనా కల్పించి చెప్పి ఉంటుంది .అయిన దారేపోయే దానయ్యని అప్పటికప్పుడు (అప్పటికే ఒకరితో మోసపోయింది అన్నారు )పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకోవడమేంటి?సరే, ఇంతకి క్లైమాక్స్ ఏంటో చెప్పండి వినాలని ఉంది .

    రిప్లయితొలగించండి
  7. ఇదేనండి పరిమళ గారు మురళి గారితో వొచ్చిన తిప్పలు. మంచి మంచి కథలో, నవల్లో పరిచయం చేస్తారు, క్లైమాక్స్ చెప్పరు. వెంటనే చదువుదామంటే ఫలానా బుక్ దొరకదు. చిన్ని గారు అల్రెడీ చదివేసారు. భావన గారు కనీసం బుక్ వెతుక్కొని చదువుకుంటారు. మనమేం చేయాలట మరి? వెంటనే షాప్కెళ్ళండి అంటారా మురళీ గారు.

    రిప్లయితొలగించండి
  8. బొల్లోజు బాబా గారన్నట్లు

    ఎప్పుడో, ఎక్కడో, ఎవరోఒకడు
    దోసెడు అక్షరాల్ని
    కాలానికి అర్ఘ్యమిస్తాడు.
    పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
    పుస్తకపుటలపై చల్లుతాడు.

    ఎప్పుడో, ఎక్కడో, ఎవరోఒకడు
    ఆ పుస్తకాన్ని తెరుస్తాడు.

    ఒక జీవనది వాని గుండెల్లోకి
    ప్రవహించటం మొదలౌతుంది.
    http://sahitheeyanam.blogspot.com
    july 15 2008
    ఆ ప్రవాహం అనంతం.
    ఇదిగో ఇలా మీరు, నేను,మనలా మరిందరో కదా..
    (అనుమతి లేకుండా మీ కవితా భాగాన్ని వాడినందుకు బొల్లోజు బాబా గారికి క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి
  9. నాకు చాలా చాలా ఇష్టమైన కథ... ఎన్నోసార్లు చదువుకున్న కథ...ఈ కథని మొట్టమొదటిసారి చదివిన సందర్భం కూడా నాకు బాగా గుర్తు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లైబ్రరీలో కాసేపు ఏవేవో చదివి ఇక ఇంటికివెళ్దామని బయట మెట్లవద్దకురాగానే హఠాత్తుగా మొదలైంది వర్షం.మళ్ళా లోపలికెళ్ళి ఏదో చేతికి దొరికిన పుస్తకాన్ని చేతికి తీసుకొని,కథ పేరు ఆసక్తికరంగా ఉండటంతో మొదట ఈకథే చదివాను.బయట వర్షం, కథలో వర్షం , నన్నెంతో ఆకట్టుకున్న ఆ వర్షపు వర్ణన. ముసురు పట్టిన ఆకాశం తాలూకు ఆ మసకచీకటిలో, కిటికీవారగా కూర్చొని, ఆ వెలుగులో బయటి వర్షాన్ని చూస్తూ ఈకథని చదవటం ఇప్పటికీ ఒకమంచి జ్ఞాపకం..అలా పరిచయమయ్యాడు తిలక్ నాకు..

    రిప్లయితొలగించండి
  10. @చిన్ని: నేను మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాల్లో 'తిలక్ కథలు' ఒకటండీ.. చదవండి.. ధన్యవాదాలు.
    @భావన: తెలిసింది కదండీ ముసలామె ఏం మాట్లాడిందో? :-) :-) ..ధన్యవాదాలు.
    @పరిమళం: ఈ కథ 'తిలక్ కథలు' సంపుటం లోదండీ.. తిలక్ అభిమానులందరూ అస్సలు మిస్ కాకూడని పుస్తకం మరి.. మీ కొత్త ఇంట్లో లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @సునీత: ధన్యవాదాలు
    @కొత్తపాళీ: నాకు బాగా నచ్చే కథలండీ ఆ రెండూ.. అద్భుతమైన కథలు.. ధన్యవాదాలు.
    @మధు: :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @వేణూ శ్రీకాంత్: ఇంతకీ ముగింపు ఎలా అనిపించిందో చెప్పలేదు మీరు :-) ..ధన్యవాదాలు.
    @అనఘ: నేను చెప్పడం కన్నా, కథ మీరు చదవడం బాగుంటుందండీ.. ధన్యవాదాలు.
    @జయ: విశాలాంధ్ర అన్ని బ్రాన్చీల్లోనూ 'తిలక్ కథలు' దొరుకుతుందండీ.. మిమ్మల్ని అస్సలు నిరాశ పరచదు ఈ పుస్తకం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @శ్రీనిక: బహు చక్కని కవిత.. ఇంచక్కని పోలిక.. నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: తిలక్ మీకు పరిచయమైన తీరే ఒక కథలా ఉందండీ.. బయట వర్షం.. కథలో వర్షం... భలే యాదృచ్చికమైన సంఘటన కదా... నాకు వర్షం పడేటప్పుడు తిలక్ పుస్తకాలు చదవడం అంటే ఇష్టం అండీ.. కథలు, కవితలు..ఏవైనా.. ఆ మూడ్ కి భలే సూట్ అవుతాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఏం చెబితే ముగింపు గురించి ఏం క్లూ వదులుతానో అని ఏమీ మాట్లాడలేదండి. మీరన్నట్లు కదిలించే ముగింపు, కథ మటుకు చాలా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  15. మీకు నేను ఆఖరి సారి చెప్తున్నాను. ఇలా మమ్మల్ని సస్పెన్స్ లో మళ్ళి పెట్టారనుకోండి . నేనొప్పుకోనంతే.
    ప్లీజ్ కనీసం కధ దొరికే లింక్ అయినా ఇవ్వండి. ఇప్పటికిప్పుడు నాకు పుస్తకం ఎక్కడ దొరుకుతుంది. వా...... (ఏడుస్తున్న నేను).

    రిప్లయితొలగించండి
  16. మంచి కధని పరిచయం చేసారు.
    ఇదివరకు చదివాను కాని. ముగింపు గుర్తులేదు.
    మళ్ళీ నిన్న రాత్రి చదివాను.

    రిప్లయితొలగించండి
  17. ఈ కధలో తిలక్ గారు "ఒంతరితనాన్ని" గురించి రాసిన వాక్యాలు నాకు బాగా నచ్చుతాయండి. ప్రతి మనిషి జీవితం లో ఏదో ఒక సందర్భంలో అలాటి ఒంతరితనాన్ని ఫీలవుతాడనిపిస్తుంది నాకు.
    తిలక్ గారు గమ్యం చిత్ర సంగీతదర్శకులు ముర్తిగారికి స్వయానా మేనమామ. ఈ సంవత్సర ప్రారమ్భంలొ అనుకుంటా వారి కుమారులిద్దరూ ఇండియాలో తిలక్ గారి పుస్తకాల పునర్ముద్రణ చేయించి, ఓ పెద్ద సభలో విడుదల చేసారు. అప్పుడు
    ఆ సభలో ప్లే చేయటానికి తిలక్ గారి "వాయిస్" మా నాన్నగారు తన దగ్గర భద్ర పరుచుకున్న కేసెట్ లోంచి రికార్డ్ చేసి ఇచ్చారు.

    రిప్లయితొలగించండి
  18. @వేణూ శ్రీకాంత్: అందుకా... నేనింకా కథ నచ్చలేదేమో అనుకున్నానండి..
    @కిరణ్మయి: 'తిలక్ కథలు' తెలుగు సాహిత్యం దొరికే అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుందండీ.. లంకె దొరికితే వెంటనే ఇస్తాను.. ధన్యవాదాలు.
    @బోనగిరి: కొందరైనా పుస్తకం తిరగేశారంటే చాలా సంతోషంగా ఉండండి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: మీరు అర్ధం కారండీ.. అందరు గొప్పవాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని గురించిన విశేషాలని మాతో పంచుకోవచ్చు కదండీ.. అసలు తిలక్ కథల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? లాంటివి.. ఒక్కసారి ఈ లైన్ లో ఆలోచించండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. dear murali gaaru.
    tilak gaari kathe kantatadipettistundate, mee review koodaanaa chaaladannatuu...? review chaalaa aardrangaa undi. hats off to u murali gaaru!
    mee saahitee mitrudu, bhasker koorapati.

    రిప్లయితొలగించండి