శుక్రవారం, అక్టోబర్ 30, 2009

దిసిజిట్-జాక్సన్ కి నివాళి

నేను మైఖేల్ జాక్సన్ అభిమాని ని కాదు.. అప్పుడప్పుడూ అతని పాటలు వినడం, టీవీలో ఎక్కడైనా కనిపిస్తే కాసేపు చూడడం, పత్రికల్లో అతని గురించి వచ్చే కథనాలు చదవడం.. జాక్సన్ తో నా పరిచయం ఇంతవరకే. నాలుగు నెలల క్రితం ఈ పాప్ ప్రపంచపు రారాజు శాశ్వతంగా సెలవు తీసుకున్నప్పుడు "అయ్యో" అనిపించింది ఒక్క క్షణం.. అతని గురించి వచ్చిన చాలా కథనాలు చదివాను.

ఇప్పుడు జాక్సన్ ని వెండి తెరమీద చూశాను. సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన 'This Is It' డాక్యుమెంటరీ ని అనుకోకుండా చూశాను. జాక్సన్ చివరి రోజులకి సంబంధించిన డాక్యుమెంటరీ అని ప్రచారం జరిగింది కానీ, తెర మీద నేను చూసింది వేరు. ఈ డాక్యుమెంటరీ మనకి తెర వెనుక జాక్సన్ ని చూపిస్తుంది. అతను, అతని బృందం ఎంత కృషి చేస్తే ఒక ప్రదర్శన జరుగుతుందో వివరిస్తుంది.

తొంభై నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ, వివిధ షో ల కోసం జాక్సన్, అతని బృందం తో కలిసి చేసిన రిహార్సళ్ళ సమాహారం. అన్నీ డ్రెస్ రిహార్సళ్ళే కావడం వల్ల జాక్సన్ ఆహార్యం అతని షోలలో ఉన్నట్టుగానే ఉంది. విచిత్రమైన రంగుల కాంబినేషన్ల దుస్తులు, అతని శరీర బరువు కన్నా బరువుగా అనిపించే బూట్లు మొదలైన యాక్సెసరీలు, ప్రతి పాటకీ మారిపోయే కనుముక్కు తీరు, హెయిర్ స్టయిలూ.. వెరసి పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్.

వేదిక మీద ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాడో, తెర వెనుక కూడా అలాగే కనిపించాడు జాక్సన్. ఒక కళాకారుడిని మించిన టీం లీడర్ అతనిలో కనబడ్డాడు. తన బృంద సభ్యులతో మృదువుగా వ్యవహరిస్తూనే తనకి కావలసినది రాబట్టు కోవడం, తను వారి నుంచి ఏమి ఆశిస్టున్నాడో వివరంగా చెప్పడం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించడం, ఎక్కడా రాజీ పడక పోవడం.. ఎలాంటి కష్టమూ పడకుండా అంత పేరు వస్తుందా మరి?

లక్షలాది మంది జనం ముందు నాట్యం చేసే జాక్సన్, అవే సెట్టింగులతో, దుస్తులతో కేవలం తన బృంద సభ్యుల ముందు మాత్రమే ఇచ్చిన ప్రదర్శనలు చూడడం ఒక చిత్రమైన అనుభూతి. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో, దానికి తను, తన బృందం ఎలా ప్రతిస్పందించాలో కూడా రిహార్సల్ చేశాడు జాక్సన్. ఇవన్నీ రికార్డు చేసినప్పుడు బహుశా అతనికి తెలిసి ఉండక పోవచ్చు, ఆ క్లిప్పింగులతో ఒక డాక్యుమెంటరీ చేస్తారని, తన తదనంతరం అది ప్రదర్శింప బడుతుందనీ.

జాక్సన్ బృంద సభ్యుల అభిప్రాయాలని కూడా రికార్డు చేసి చూపారు మధ్య మధ్యలో. అతను తన బృందాన్ని ఎంపిక చేసుకునే తీరు, వారి నుంచి తనకి కావాల్సింది రాబట్టుకోడానికి ఇచ్చే శిక్షణ తరగతులనూ చేర్చారు డాక్యుమెంటరీలో. జాక్సన్ సహాయకులు, హెయిర్ స్టయిలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ల అభిప్రాయాలనూ చూడొచ్చు. జాక్సన్ అభిమానులు ఎలాగూ చూస్తారు. అభిమానులు కాని వాళ్ళు కూడా చూడదగ్గ డాక్యుమెంటరీ ఇది. కేవలం రెండు వారాలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శింప బడుతుంది.

9 వ్యాఖ్యలు:

rama108 చెప్పారు...

history channel lo chusaanu. atani music anna steppulu anna chala ishtam. atanu yento mandini prabhavitham chesadu. mee blogulu kuda nannu prabhavitham chesayi. all the best.

sunita చెప్పారు...

ఈ డాక్యుమెంటరీ నేనూ చూడాలి.

తృష్ణ చెప్పారు...

నా కిష్టమైన వెస్ట్రన్ సింగర్స్ లో జాక్సన్ ఒకరు. ఆయన గురించిన వివాదాలెల ఉన్నా తను పోయిన విధానం చాలా బాధాకరం...ఆ రోజు నే రాసిన టపా ఇది. ఆసక్తి, వీలు ఉంటే చదవండి.

http://trishnaventa.blogspot.com/2009/06/michael-jackson.html

మంచి విషయం గురించి చెప్పారు. బావుంది.

విజయవర్ధన్ చెప్పారు...

ఇండియాలో విడుదల అవలేదనుకున్నానండి. ఇప్పుడే paper చూస్తే తెలిసింది విడుదల అయ్యిందని.

ఉమాశంకర్ చెప్పారు...

మీబ్లాగు చదువుతుంటే నాకు నా చిన్నప్పటి పరీక్షల రోజులు గుర్తుకొస్తున్నాయి..పరీక్ష ముందు రోజు రాత్రి ఇంకా చదవాల్సిన పేజీలవైపు ఒకసారి చూసుకొని "ఇంకా చాలా సిలబస్ మిగిలుంది" అనుకొనేవాడిని.

మీరు రాసినవన్నీ వెంటనే చదువుతాను. (బిజీగా ఉన్నప్పుడు) ఒకసారి పైపైన చదువుకొని , మళ్ళా ఇంకొకసారి తీరికగా చదవాలి అనుకుంటా.. అలా ఒక వారం పదిరోజులు గడిచేసరికి సిలబస్ అమాంతం పెరిగిపోతోంది..ఏంచేయాలంటారు? :)

కీపప్ ది గుడ్ వర్క్ మురళిగారు..

జయ చెప్పారు...

ఈ డాక్యుమెంటరి చూడాలి. అప్పుడే చాలా వివరాలు తెలుస్తాయి. విన్న రకరకాల విమర్శలు ఎంతమటుకు నిజమో కూడా తెలుసుకోవచ్చనుకుంటా.

పరిమళం చెప్పారు...

"పాప్ ప్రపంచపు రారాజు శాశ్వతంగా సెలవు తీసుకున్నప్పుడు "అయ్యో" అనిపించింది" నాక్కూడానండీ.......

మురళి చెప్పారు...

@rama108: ధన్యవాదాలు..
@సునీత: తప్పక చూడండి.. ధన్యవాదాలు.
@తృష్ణ: జాక్సన్ కి మీరిచ్చిన నివాళి చదివానండి.. బాగుంది.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@విజయ్ వర్ధన్: విడుదలయ్యిందండి.. ఏపీ లో కలెక్షన్స్ అంతగా లేవుట.. మిగిలిన చోట్ల బాగానే నడుస్తోందని సమాచారం.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: బహుశా నేనే ఏమైనా చేయాలేమోనండి, సిలబస్ తగ్గించడానికి:):) .. ధన్యవాదాలు.
@జయ: అబ్బే.. జాక్సన్ తెర వెనుక జీవితం అంటే కేవలం రిహార్సల్స్ మాత్రమేనండీ.. అతనిలోని కళాకారుడిని మాత్రమే చూడగలం.. ధన్యవాదాలు.
@పరిమళం: ధన్యవాదాలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి