బుధవారం, అక్టోబర్ 21, 2009

చక్కనోడు

ఒక 'పేట నాయకుడు' స్థాయి వ్యక్తి మరణించాడు. అతని ఇంటి ముందు టెంటు వెలిసింది. రోడ్డుకి ఇరుపక్కలా ప్లాస్టిక్ కుర్చీలు వేశారు. వీధిలో అతని ఫోటో, దానికి పెద్ద పూల దండ, ఒక దీపం. 'కార్యకర్తలు' చొక్కాలకి నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు. ఫ్లెక్సీ బ్యానర్ల కోసం ఫోన్లు వెళ్తున్నాయి. చనిపోయిన వ్యక్తి బంధువులు, స్నేహితులూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వాతావరణం విషాద భరితంగానే ఉంది.

ఓ నలుగురు కుర్రాళ్ళు త్వరత్వరగా మైకు బిగించారు. నేను 'పార్దా యత్ ప్రతిబోధితా..' అంటూ మొదలయ్యే ఘంటసాల భగవద్గీత వినడానికి సిద్ధపడిపోయాను. ఇంతలో పాట మొదలయ్యింది.. "చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు.. ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు.." అసందర్భమే అయినా అప్రయత్నంగా నవ్వొచ్చేసింది. అవును మరి.. ఒక రోజా, రెండు రోజులా.. వరుసగా వారం పది రోజులు.. ఏ చానల్ తిప్పినా ఇదే పాట.. ఇలాంటివే మరికొన్ని పాటలు.

ఆ పాట, పాటతో పాటు వచ్చే విజువల్స్ మళ్ళీ కళ్ళ ముందుకి వచ్చాయి. ఆ చక్కనోడు, ఈ చక్కనోడు ఒకే ఫ్రేములో కళ్ళముందు కనబడ్డారు. బహుశా అందుకేనేమో నవ్వాగలేదు. ఆపద్ధర్మంగా సెల్ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నా. "పాడె కట్టడానికే స్నేహమన్నది.. కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది.." పాట వినబడుతూనే ఉంది. రెండు నెలల క్రితం ఈ పాటల గురించి జరిగిన చర్చలన్నీ గుర్తొచ్చాయి.

"మా వాడు అర్ధరాత్రి బాత్రూం కి లేచి 'నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ' అని పాడుతుంటే ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.. కొన్నాళ్ళు న్యూస్ చానల్స్ చూడకూడదు డిసైడయ్యాను" నాకు తెలిసిన ఒకతను చెప్పాడు అప్పట్లో. 'కార్యకర్తలు' గుండాగి మరణించడానికి ఈ పాటలు, దృశ్యాలే కారణమని నిందించిన వాళ్ళూ ఉన్నారు. మొత్తానికి ఒక నాయకుడికి మరణం తర్వాత 'మహానాయకుడు' ఇమేజ్ రావడం లో ఈ పాటలూ కొంత పాత్ర పోషించాయనడం అతిశయోక్తి కాదేమో.

నా ఆలోచనల్లో నేనుండగానే 'పేట నాయకుడి' మరణాన్ని కవర్ చేయడానికి లోకల్ చానళ్ళ ప్రతినిధులు కెమెరాలతో వచ్చారు. అప్పటి వరకూ దూరంగా కూర్చున్న ఇద్దరు నడి వయసు మహిళలు ఒక్క ఉదుటన నాయకుడి ఫోటో దగ్గర చేరి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు. కెమెరాలు రికార్డు చేసేస్తున్నాయి. చోటా మోటా నేతలు టీవీ ముఖంగా సంతాపం తెలపడానికి పోటీ పడుతూ టీవీ వాళ్ళని మొహమాట పెడుతున్నారు.

మైకులో మాత్రం 'అప్పటి' పాటలన్నీ మారుమోగుతున్నాయి. ఒకందుకు చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సందర్భాలలో భగవద్గీత వినీ వినీ ఒక్కోసారి గుడి మీద మైకు నుంచి భగవద్గీత వినిపించినా 'ఎవరు పోయారో?' అన్న ఆలోచన వచ్చేస్తోంది. ఇప్పుడింక ఈ పాటల పుణ్యమా అని 'ఇలాంటి' సందర్భాలలో ఘంటసాల గొంతు నుంచి శ్రావ్యంగా వినిపించే భగవద్గీత వినక్కర్లేదు కదా.. అందుకు సంతోషం.

22 కామెంట్‌లు:

  1. మీరన్నది అక్షరాల నిజమండి ,వై .యస్ .ఆర్ మరణం వారం తరవాత ఒక యన్ .జీ .ఓ వాళ్ళు సంస్మరణ సభకి గెస్ట్ గా పిలిచారు .తప్పకుండ రావాలి అనడంతో వెళ్ళెను .హాలులోకి అడుగు పెట్టెను "చుక్కల్లో కేక్కినాడు చక్కనోడు ....పాట గట్టిగ వినిపిస్తుంది,హల్లో జనం ఉన్నరుగాని ,అంతా సైలెంట్ ........ఎదురుగ చక్కనోడి పెద్ద పెద్ద బ్యానర్లు. పూలదండలు ,అగరొత్లు,దీపాలు వై .యస్ .అర్ చిద్విలాసంగా చూస్తున్నారు .నాకు దుఖం పొంగుకొస్తుంది ,పాటవినిపిస్తున్నకొద్ది న కళ్ళలోనుంచి నీళ్ళు రాలటానికి సిద్దంగా ఉన్నాయి .ఇంకా చీఫ్ గెస్ట్ మేయర్ గారు రాలేదు ,చెప్పి వెల్లిపోదమంటే గొంతు పూడుకుపోయింది.అక్కడ సీన్ క్రియేషన్ ఎందుకు అని గబగబా బయటకు వచ్చేసా ."ఏంటి వెళ్ళిపోతున్నారు" అని నా వెనుక వచ్చిఅడుతున్నారు ,సైగ చేసి వచ్చి కార్లో కుర్చుని కళ్ళు తుడుచుకుంటున్న,డ్రైవర్ కి ఏమి అర్ధంఅవక ప్రస్నార్ధకంగా చూసి కారు స్టార్ట్ చేసేడు . పాట ఎంత పనిచేసిందో చూసేరా !ఆ పాట వై.యస్ .ఆర్ కి సూట్ అవుతుంది గానీ,అందరికి (పేట నాయకులకి )పెడితే నవ్వు రాకుండా ఎలాఉంటుంది .

    రిప్లయితొలగించండి
  2. :))

    మీకు గుర్తుందా..ఏదో చానల్లో 'ఆ' రోజు అమృత సినిమాలోని 'కడసారిది వీడ్కోలు..కన్నీటితో మా చేవ్రాలు..' అనే పాట అరిగిపోయినంత వరకు చావగొట్టారు..అసలు ఆ పాట వచ్చే సందర్భమే వేరు సినిమాలో..అయినా మన చానళ్ళవాళ్ళు విషాదం అయితే చాలు ఇంకేమీ వివరాలు అవసరం లేదన్నట్టుగా నచ్చిన పాటలు వేసి పడేసారు.

    రిప్లయితొలగించండి
  3. నిజమే, పోయిన నెలలో ఆ పాట ఎన్ని సార్లు, తెలుగు న్యూస్ చానెళ్ళలో విన్నానో.

    రిప్లయితొలగించండి
  4. మీ పేరడీ బాగుంది. నాయకులను తయారుచేయడ౦లో మీడియా పాత్రపై కూడా రాయండి.

    రిప్లయితొలగించండి
  5. హహహహ ...మురళి భలే రాసారు ."చుక్కలోకేక్కినాడు చక్కనోడు "నేను శ్రావ్యాంగా పాడటంనేర్చేసుకున్నాను ....నవాబుపేట నేతకూడా చుక్కల్లోకి ఎక్కిన చక్కనోడేనా!...హమ్మయ్య భగవత్ గీత రక్షించబడింది ......ఏది రాసిన మీకు మీరే సాటి .పేపర్ లో తమ పేరు పడటమే చూసుకుని మురుసుకునే జనాలకి ఏకంగా టి.వి లలో కనబడటం గోప్పకాదేంటి :):)....పాపులారిటీ ....గట్టిగ ఎడ్చార ..?కనీసం వార్డ్ మెంబెర్ సీట్ అయిన ఇస్తారేమో చూడాలి :):)

    రిప్లయితొలగించండి
  6. @అనఘ: దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుందన్న విషయాన్ని మీడియా వాళ్ళు మర్చిపోయినట్టు ఉన్నారండి.. ఆ పాట పదే పదే వినడం వాళ్ళ అప్రయత్నంగానే నవ్వు వచ్చింది.. ఇంతకీ ఆ పాట మిమ్మల్ని సంతాప సభ లో పాల్గోనివ్వ లేదన్న మాట.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: శోభన్ బాబు మరణం తో మొదలయ్యిందండీ ఈ బ్యాక్ గ్రౌండ్ పాటల హడావిడి.. అప్పుడేమో 'ఈ జీవన తరంగాలలో..' వేసి హింసించారు.. అస్సలు సంబంధం లేకపోయినా.. (బహుశా అది శోభన్ సినిమా అన్నదొక్కటే కారణం).. ఎన్నైనా చెప్పుకోవచ్చు లెండి.. ధన్యవాదాలు.
    @వీరుభొట్ల వెంకట గణేష్: నిన్ననే మిమ్మల్ని తలచుకున్నా.. మీ బ్లాగు చూసి చాలా రోజులయ్యింది అని.. నిజమేనండి.. ఆ పాట వందల సార్లు వినాల్సోచ్చింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @కుమార్: నా పేరడీ కాదండీ.. జరిగింది రాశాను.. మీడియా పాత్ర గురించి యెంత రాసినా తక్కువే.. ధన్యవాదాలు.
    @చిన్ని: మీరు పొరబడుతున్నారు.. మేము నవాబులం కాదు :) (మాది నవాబుపేట కాదని మనవి) వాళ్ళు, వీళ్ళు అని లేదు లెండి.. పోయిన నేతలందరూ 'చక్కనోళ్ళే' :):) (ఆత్రేయకి క్షమాపణలు) ..నిజమేనండీ భగవద్గీత రక్షింప బడింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. మీకిది న్యాయమా?!
    ఆమధ్య ఓ సారి చెప్పానుకందండి వంటింట్లో పోపు వేస్తూ కూడా ఈ పాటని అప్రయత్నంగా పాడేసుకుంటున్నానని. ఈ మధ్యే ఆ జ్ఞాపకాలు వరదల్లో కొట్టుకుపోయాయి. మీరేమో మళ్ళీ విక్రమార్కుడు భేతాళుడిని మోసుకొచ్చినట్టూ .......చుక్కల్లోకెక్కినాడు చక్కనోడూ, అయ్యబాబోయ్....... ఇప్పుడు నన్నెవరు రక్షిస్తారు

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగా చెప్పారు మన నాయకా నాయికల తీరూ

    "అప్పటి వరకూ దూరంగా కూర్చున్న ఇద్దరు నది వయసు మహిళలు ఒక్క ఉదుటన నాయకుడి ఫోటో దగ్గర చేరి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు"

    ఇది ఇంకా బాగుంది

    www.tholiadugu.blogspot.com

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు, మీ అభిమానానికి ధన్యుణ్ణి. నేను ప్రస్తుతానికి బ్లాగడం మానేసాను. మొన్న 9కి నేను ఊడిగంలో చేరి 3 ఏళ్ళు అయ్యింది. వెనక్కి తిరిగిచూసుకుంటే "Jack of all master of none" సామెత సరిగ్గా సరిపోతుంది. అందువల్ల, కొంచం నైపుణ్యాలు పెంచుకుని, నా వృత్తిలో స్థాయి చిక్కాక, ప్రవృత్తి జోలికి వద్దామని నిర్ణయించుకున్నాను.

    రిప్లయితొలగించండి
  11. "ఈ పాటల పుణ్యమా అని 'ఇలాంటి' సందర్భాలలో ఘంటసాల గొంతు నుంచి శ్రావ్యంగా వినిపించే భగవద్గీత వినక్కర్లేదు కదా.."

    బాగా చెప్పారు...

    రిప్లయితొలగించండి
  12. Interesting.
    ఐతే ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు విషాదం వెలిబుచ్చడానికి హిందుస్తానీ సారంగీ సంగీతం అక్కర్లేదన్న మాట!

    రిప్లయితొలగించండి
  13. మురళీ గారు ఒక్క అంశం మీద ఎంత బాగా రాశారండి. నాకైతే అసలు చుట్టు పక్కల పరిస్తితులను గమనించే పరిశీలనా శక్తి చాలా తక్కువ. అవును కదా, ఇలా కూడా రాయొచ్హు కదా, అని ఎప్పుడో గాని అనిపించనే అనిపించదసలు. మీరు కూడా ఆఫీస్ లో ఆ పాటే పాడుకోకుండ కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు! ఎందుకైనా మంచిది.
    అసలిటువంటి సందర్భాలలో భగవద్గీత వాడకూడదు. దాని పరమార్ధం వేరు.

    రిప్లయితొలగించండి
  14. నేను చాలా లక్కీ. మాకు ఒక్క తెలుగు న్యూస్ చానల్ కూడా రాదు.
    ఈ టి వి, జెమిని టి వి న్యూస్ మాత్రం అప్పుడప్పుడు చూస్తాం.
    ఇంతకీ ఆ పాట ఏ సినిమాలోది? అది వ్రాసిన మహానుభావుడెవరు?
    ప్రవాసాంధ్ర అజ్ఞానిని. చెప్పండి.

    రిప్లయితొలగించండి
  15. "అప్పటి వరకూ దూరంగా కూర్చున్న ఇద్దరు నడి వయసు మహిళలు ఒక్క ఉదుటన నాయకుడి ఫోటో దగ్గర చేరి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టారు" :) :)

    రిప్లయితొలగించండి
  16. @లలిత: ఏం చెయ్యమంటారు చెప్పండి? వద్దన్నా చెవిన పడుతున్నాయి ఆ పాటలు.. ధన్యవాదాలు.
    @కార్తిక్: జరిగిన సంగతేనండీ.. ధన్యవాదాలు.
    @వీరుభోట్ల వెంకట గణేష్: ప్రవృత్తి, వృత్తికి ఆటంకం అవుతుందని నేను అనుకోడం లేదండి.. మీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యండి.. ఆల్ ది బెస్ట్.

    రిప్లయితొలగించండి
  17. @తృష్ణ: అదొక్కటే రిలీఫ్ అండి.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ప్రసార భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు వాద్య సంగీతాన్నే ఉపయోగిస్తున్నాయండి, కానీ ఇప్పుడవి మైనారిటీ కదా.. ధన్యవాదాలు.
    @జయ: ఆ సమస్య రాదు లెండి :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @బోనగిరి: ఏడేళ్ళ క్రితం వచ్చిన 'జెమిని' అనే తమిళ్ రీమేక్ సినిమా కోసం వేటూరి రాశారండి. గానం వందేమాతరం శ్రీనివాస్, సంగీతం ఆర్పీ పట్నాయక్.. ధన్యవాదాలు.
    @పరిమళం: :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. తెలుగు ప్రజలకే కాదు తెలుగుమాధ్యమాలకు కూడా దూరంగా ఉంటున్న మూలాన ఈపాటలు చదవటమేగానీ వినడం జరగలేదు. నాఅదృష్టానికి మరీ కుళ్లుకోకండే

    రిప్లయితొలగించండి
  20. @సుబ్రహ్మణ్య చైతన్య: అదృష్టవంతులు.. అలాంటి అదృష్టం మాక్కూడా కలిగితే బాగుండు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. నిజమే సుమా! ఈ దరిద్రపు పద్దతి ఎక్కడ ఎవడు అరువు తెచ్చాడో కాని సమయం సందర్భం లేని విషాదంతో నవ్వు తెప్పిస్తున్నారు. వై.యస్ అంత్యక్రియల రోజు స్వప్న అనే ఆంకర్ ,సాక్షి ఛానల్లో చూపించిన వాక్పటిమ ఇప్పటికి మర్చిపోలేకుండా వున్నాము. ఆవిడకి తెలుగు నేర్పించిన మాస్టారు వినివుంటే గూబ గుయ్యిమనిపించిండేవాడు!

    రిప్లయితొలగించండి
  22. @naagodu: నిజమేనండీ. నేనూ విన్నాను ఆ రోజు ఆవిడ భాషా పటిమ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి