ఆదివారం, అక్టోబర్ 25, 2009

క్షతగాత్ర గానం

ఉత్తరాంధ్ర.. ఈ పేరు వినగానే ఎన్నో ఎన్నెన్నో గుర్తొస్తాయి.. తమకంటూ ప్రత్యేకమైన సంస్కృతి ఉన్న, అమాయకత్వమే ఆభరణమైన ప్రజలు, కొబ్బరి తోటల ఉత్థానం, దట్టమైన అడవులూ, ఆ అడవుల్లో పుట్టి చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన శ్రీకాకుళ ఉద్యమం.. ఇలా ఎవరి శక్తి, ఆసక్తి మేరకు వాళ్ళు ఊహించుకోవచ్చు. మరి, అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకి కొంత వరకూ సమాధానం చెబుతుంది అట్టాడ అప్పల నాయుడి పదహారు కథల సంకలనం 'క్షతగాత్ర గానం.'

ఈ కథలన్నింటి నేపధ్యం ఉత్తరాంధ్ర గ్రామాలు. పక్కనే నదులున్నా తాగడానికీ సాగుకీ నీరందని దుస్థితి, ప్రాజెక్టులు వస్తాయన్న ఆశ తో పాటు వాటి వల్ల కలిగే నష్టాల గురించిన భయం, అవిద్య అమాయకత్వాల కారణంగా నిత్యం మోసపోతూ, పీడనకు గురవుతూ ఉండే ప్రజలు.. ఇవీ కథా వస్తువులు. నాయకుల రాజకీయాలు, దివాణాల కౌటిల్యాల మధ్య నలిగిపోతున్న సామాన్యుడే అప్పల నాయుడి కథల్లో కథా నాయకుడు.

పట్నవాసపు జీవితం లో ఖర్చులు పెరిగి, సంపాదన చాలక పల్లెలో ఉన్న భూమిని అమ్ముకుందామని వచ్చిన కోటేశ్వర రావుకి తన ఊళ్ళో ఎదురైన అనుభవాలే సంకలనం లో మొదటి కథ 'క్షతగాత్ర గానం.' పల్లె లో తను గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకున్న కోటేశ్వర రావుకి తమ జీవితాల్లో మార్పు ఎక్కడినుంచి వచ్చిందో అర్ధం కాదు. తండ్రి, ఇతర బంధువులు ఏ గ్రామ రాజకీయాలకి బలైపోయారో అదే నాయకుల వారసులతో సంధి చేసుకోవాల్సిన పరిస్థితి తో అతను ఏ నిర్ణయం తీసుకున్నాడన్నది ముగింపు.

పల్లె పట్నంగా మారే క్రమం లో ఉనికిని కోల్పోయిన 'ఓ తోట కథ' సంకలనం లో రెండో కథ. దగా పడ్డ తోట తన కథ తానే చెప్పుకుంటుంది. ఒకప్పుడు పళ్ళ తోటలతో విలసిల్లిన తాను రక్తపుటేరులని ఎందుకు చూడాల్సి వచ్చిందో వివరిస్తుంది. ఒకప్పటి ఆ తోట యజమాని కొడుకు ఇప్పుడు అదే స్థలం లో వెలిసిన వ్యాపార సంస్థలో కూలి చేయడాన్ని జీర్ణించుకోలేక పోతుంది ఆ తోట. మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా ఎలా మారాయో, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టగల శక్తి దేనికి ఉందో చెబుతుంది 'బంధాలూ-అనుబంధాలూ' కథ.

ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకి ఎందుకు ఉపయోగ పడలేకపోతున్నాయో 'ఎంపిక' కథ చెబితే, నిస్వార్ధంగా ప్రాణ త్యాగం చేయగల నక్సలైట్లు రచయిత అయిన ఒక పోలీసు అధికారిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించారన్నది 'వాళ్ళు' కథ చెబుతుంది. సర్వస్వం కోల్పోయినా ఆత్మవిశాసం సడలని 'బుధడు' మారుతున్న పల్లె ముఖచిత్రాన్ని చూపే 'ప్రయాణం' బతికి చెడిన చంద్రప్ప కి కనిపించే ఏకైక 'ప్రత్యామ్నాయం' కథలని కేవలం చదివి పక్కన పెట్టలేం.

స్త్రీల సమస్యలని చర్చించిన కథలు 'నేను నేనే' 'యానగాలి' 'సూతకం కబురు.' ఆర్ధిక స్వాతంత్రం సాధించినప్పటికీ స్త్రీ తనకి తెలియకుండానే పురుషుడిమీద ఎలా ఆధార పడుతోందో చెబుతుంది 'నేను నేనే.' ఒక పక్కనుంచి రాజకీయ నాయకులు, మరో పక్క నుంచి భర్త చేసే ఒత్తిడులని తట్టుకుని స్వయం నిర్ణయాలు చేసి అమలు పరిచే అధికారిని సరళమ్మ కథ 'యానగాలి.' ఇక నేనీ సంకలనం చదవడానికి కారణమైన కథ 'సూతకం కబురు.'

రెండేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమయిన ఈ కథ ఓ పల్లెటూరి గృహిణి స్వగతం. వ్యవసాయ పనులు లేక భర్త కూలి వెతుక్కుంటూ పరాయి దేశం వెళ్తే ఊళ్ళో కూలి చేసి పిల్లల్ని పోషిస్తోన్న నిరక్షరాస్యురాలైన మహిళకి గ్రామ రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకూ కొట్టిన పిండి. "మన గ్రేమమూ ఆదర్సి గ్రేమమట తెలుసా? రోజుకి పది, పదిహేను వేలు రూపాయల బ్రేందీ, సారా చెల్లిన గ్రేమం మండలం మొత్తం మీద మనదేనట. పొగులూ రేత్రీ పోలిసుబాబులు తిరుగాడే గ్రేమం ఇలాటిదింకొకటి లేదట," అని స్నేహితురాలు నీలవేణికి చెబుతుందామె. 'సూతకం కబురు' తెలిశాక ఆమె ఏం చేసిందన్నది ముగింపు.

వలసపోయిన రైతు కథ చెబుతుంది 'బతికి చెడిన దేశం' కథ. రాజకీయాలని చర్చించే కథలు 'పరిశి నాయుడి వొంశం' 'రెండూ ప్రశ్నలే' 'వల్మీకం' 'షా.' వామపక్ష ఉద్యమం పై, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ పై రచయితకి ఉన్న ప్రేమ ప్రతి కథలోనూ ప్రతిఫలిస్తుంది. అధికారులు, రాజకీయనాయకులు తమ ప్రైవేటు సంభాషణల్లో 'ఎర్ర జెండా' ని మెచ్చుకోవడం కనిపిస్తుంది చాలా కథల్లో. మొత్తం మీద కథలన్నీ ఉత్తరాంధ్ర జీవితంలోని ఒక పార్శ్వాన్ని మాత్రమే స్ప్రుశించాయని అనిపించక మానదు, పుస్తకం పూర్తి చేశాక. విశాలాంధ్ర ప్రచురించిన ఈ సంకలనం వెల రూ.100. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.

12 కామెంట్‌లు:

  1. చాలా బావుంది మీ సమీక్ష!రచయిత నాకు పేరు కొత్తయినా మీ సమీక్ష ఆధారంగా పుస్తకం చదువుతాను మరి!

    రిప్లయితొలగించండి
  2. "ఎర్ర జెండ్ ఎర్రజండ్ ఎర్రజండ్ ఎర్రజండ్.." పాట గుర్తొచ్చింది..విశ్లేషణ బాగుందండీ.

    చాలా మందికి ఆసక్తి లేని విషయాలకి సంబంధిత పుస్తకాల గురించి కూడా రాసి వ్యాఖ్యను రాబట్టుకోవటం మీ వద్ద నేర్చుకోవాల్సిన సంగతి మురళిసారూ! మీ వద్ద ట్యూషన్లో చేరాల్సిందే.. :) :)

    రిప్లయితొలగించండి
  3. ఇవి చాలా క్లిష్టమైన అంశాలు మురళి గారు. చాలా కష్టపడితే గాని అర్ధం కావు. అన్నిటికన్నా,సూతకం కబురు కథ బాగుంటుందనిపిస్తుంది. ఎంతైనా, రెవ్యూ లల్లో మీ స్పెషాలిటీ వేరు. తృష్ణ గారన్నట్లు కొంచెం స్పెసల్ క్లాసెస్ తీసుకోవచ్హుకదా!

    రిప్లయితొలగించండి
  4. బాగుందండీ పరిచయం, మీరు చెప్పిన తీరు కు చదవాలనిపిస్తోంది...

    రిప్లయితొలగించండి
  5. @సుజాత: అప్పలనాయుడు ఎనభై కి పైగా కథలు, మూడు నవలలు, ఐదు నాటకాలు రాశారండి..ఆయన కథలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: నేను చదివిన వాటిగురించి రాసుకోడమేనండీ.. వ్యాఖ్యల మీద దృష్టి లేదు నాకు.. ట్యూషనా? మీకా? నేనా? :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @జయ: కథలు చదువుతున్నంతసేపూ మనకి ఉత్తరాంధ్ర పల్లెలు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయండీ.. చదవడం ముగించాక ఆలోచనలో పడతాం.. 'సూతకం కబురు' కథంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.. ముగింపు నచ్చనప్పటికీ.. ట్యూషన్ గురించి తృష్ణ గారికి చెప్పిన మాటే మీకూను :) ..ధన్యవాదాలు.
    @భావన: తప్పక చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. మీ ఓపికకు ముచ్చటపడకుండానూ, మీ హాబీలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.

    రిప్లయితొలగించండి
  8. మురళీ గారూ, నాకీ కథలైతే తెలియవు గానీ, ఇంజనీరింగ్ చేసేరోజుల్లో చింతలపల్లె ( సఖినేటి పల్లెకు దగ్గర ) లో నాకో జాన్ జిగిరీ దోస్త్ వుండేవాడు. వరహగిరి వారు. వాడి కోరికమేరకు ఒక వారం రోజులు వాళ్ళింటిలో వుండి కోనసీమ అన్ని అందాలూ చూసాను. అప్పటికి చేపల చెరువులు ఇంతగా లేవు.ఎక్కడికి వెళ్ళినా పచ్చని తోటలు. పేర్లు అయితే గుర్తులేవు కానీ రాజోలు కు దగ్గరలో వున్న గోదవరి కి ఆవలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ చూసిన అందాలు ఇప్పటికీ నిత్య నూతనాలే. అలాగే గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ( అంతర్వేది అంటే ఇదేనా? ) అద్భుతం. ఎప్పటిలాగే అక్కడ వున్నన్ని రోజులో సత్యవతికో లేక సత్యభామకో మనసుకూడా ఇచ్చేసాను :)

    రిప్లయితొలగించండి
  9. నేనన్నది ఆసక్తి లేని విషయమైనా చదివిన మాకు వ్యాఖ్య రాయాలని అనిపిస్తుంది అని అండీ.

    రిప్లయితొలగించండి
  10. @భాస్కర రామిరెడ్డి: "ఎప్పటిలాగే అక్కడ వున్నన్ని రోజులో సత్యవతికో లేక సత్యభామకో మనసుకూడా ఇచ్చేసాను :)" తర్వాత మర్చిపోయారన్న మాట.. ప్చ్.. మా కోనసీమ కి అల్లుడయ్యారేమో అనుకున్నా... గోదావరి, సముద్రం కలిసే చోటు అంతర్వేది అండి.. ఆ ప్రాంతాన్ని 'అన్నా చెల్లెళ్ళ గట్టు' అంటారు అక్కడ.. చింతలపల్లె కాదండీ.. చింతలపల్లి.. ఇప్పటికీ ఆ ప్రాంతంలో పెద్ద మార్పు లేదు.. అదే పచ్చదనం.. ఇలాగే ఉండాలని కోరిక.. ధన్యవాదాలు.
    @తృష్ణ: అలా అంటారా.. సరేనండీ...

    రిప్లయితొలగించండి
  11. జయగారు చెప్పేశారు కదా !ఎంతైనా, రెవ్యూ లల్లో మీ స్పెషాలిటీ వేరు.

    రిప్లయితొలగించండి
  12. @పరిమళం: అయితే జయగారికిచ్చిన సమాధానమే మీకూను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి