శనివారం, అక్టోబర్ 24, 2009

గమ్యం

"ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది.." ఈ సత్యాన్ని తెలుసుకోడం కోసం, తను ప్రేమించిన జానకిని కలుసుకోడం కోసం కోటీశ్వరుడి గారాల కొడుకు అభిరాం ఎన్నో చోట్ల తిరిగాడు. ఏసీ కారులోకాదు, ఓ ఖరీదైన మోటార్ బైక్ మీద.. ఈ ప్రయాణం లో అతనికి తారస పడిన వ్యక్తులు, ఎదురైన అనుభవాల సమాహారమే 'గమ్యం' తెలుగు సినిమా.

'ది మోటార్ సైకిల్ డైరీస్' అన్న స్పానిష్ చిత్రం స్ఫూర్తితో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా 2008 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు తో సహా నాలుగు కేటగిరీల్లో 'నంది' అవార్డులని గెలుచుకుంది. 'గాలి శీను' పాత్ర పోషించిన అల్లరి నరేష్ కి ఉత్తమ సహాయ నటుడిగాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ఉత్తమ గీత రచయితగానూ అవార్డులు వచ్చాయి.

హైవే మీద ఒక టీ కొట్టు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో టీకొట్టు నడుపుకునే స్త్రీ కారు కింద పడి మరణించడం తో సినిమా ప్రారంభమవుతుంది. కారు నడిపిన కుర్రాడు గాయాలతో ఆస్పత్రి పాలవుతాడు. ఆ కుర్రాడు నగరంలోని మల్టి మిలియనీర్ కొడుకు అభిరాం అని టీవీ చానళ్ళకి తెలియడం తో టైటిల్స్ మొదలవుతాయి. అది మొదలు సినిమా ఆసాంతమూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. పాటలు, కామెడీ సైతం కథలో భాగంగా ఇమిడిపోయాయి.

ఆక్సిడెంట్ తాలూకు దెబ్బలు పూర్తిగా మానకుండానే 'జానకి' ని వెతుక్కుంటూ మోటార్ సైకిల్ మీద ఒక్కడూ బయలుదేరతాడు అభిరాం. మోటార్ సైకిల్ మీదే ఎందుకు? ఎందుకంటే కారు అద్దం లోనుంచి ప్రదేశాలను మాత్రమే చూడగలమనీ, ప్రపంచాన్ని చూడాలంటే మోటార్ సైకిల్ మీద తిరగాలనీ జానకి చెప్పింది కాబట్టి. జానకి ఒక మెడికో. ఎవరూ లేని అనాధ కావడం తో ఆమెకి అనాధలన్నా, అభాగ్యులన్నా ప్రేమ. పేద వాళ్లకి సాయం చేయడం కోసమే మెడిసిన్ చదివి, తన సంపాదనలో సింహ భాగాన్ని చారిటీ కోసం ఉపయోగిస్తూ ఉంటుంది.

అలాంటి జానకిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు అభిరాం. నెల్లాళ్ళలో ఆమె చేత 'ఐలవ్యూ' చెప్పించు కుంటానని స్నేహితుడితో బెట్ కడతాడు కూడా. జానకి తన డబ్బుని లెక్క చేయకపోవడం ఆశ్చర్య పరుస్తుంది అభిరాం ని. అతని ఇగో ని దెబ్బ కొడుతుంది కూడా. జానకికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తాడు. ఆమెతో స్నేహం చేసి, ప్రేమిస్తున్నానని చెబుతాడు. అదిగో అప్పుడంటుంది జానకి "ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది.." మాటని తిరిగి చెబితే ప్రేమ విషయం ఆలోచిస్తానని.

అభిరాం జానకిని ఇష్టపడతాడు కానీ ఆమె జీవితాన్ని ప్రేమించలేదు.. అతనికి పేదలంటే చిరాకు. మనుషులు ఎందుకంత డర్టీగా ఉంటారో అర్ధం కాదు. జానకి అభిరాం కి తన ప్రేమని ప్రకటిద్దామనుకున్న సమయంలోనే అతని బెట్ విషయం తెలుస్తుంది. ఆమె అతన్నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. జానకిని వెతుక్కుంటూ బయలుదేరిన అభిరాం కి మోటార్ సైకిల్ దొంగ గాలి శీను పరిచయమవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి యాడంకి, గుంటూరు, నర్సీపట్నం తిరుగుతారు, జానకిని వెతుక్కుంటూ.

ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు అభిరాం. ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం పాలవుతోందో, ఎన్నికలు ఎలా ఐదేళ్ళ కోసారి జరిగే తంతుగా మారిపోయాయో, కరువు ప్రాంతాల్లో గన్ కల్చర్, గ్రామాల్లో కనీస సౌకర్యాల లేమి, పొట్టకూటి కోసం పడుపు వృత్తికి సిద్ధ పడ్డ ఆడపిల్లలు, వాళ్లకి ఎదురయ్యే సమస్యలు, నక్సలైట్ ఉద్యమంలో చీలికలు... ఇలా ఎన్నో విషయాలు. తన చేతుల మీదుగా ఒక డెలివరీ చేస్తాడు, గాలి శీను తన చేతుల్లో మరణించడమూ చూస్తాడు.. ఒకలాంటి స్థిత ప్రజ్ఞత సాధిస్తాడు.

అభిరాం గా శర్వానంద్, జానకి గా కమలిని ముఖర్జీ, గాలి శీనుగా అల్లరి నరేష్ నటించిన ఈ సినిమాలో ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులనూ, ప్రభుత్వం నుంచి అవార్డునూ గెలుచుకున్నాడు అల్లరి నరేష్. ఈ సీరియస్ సినిమాని సామాన్య ప్రేక్షకుడికి చేరువ చేసింది గాలి శీను పాత్ర. నవ్విస్తూనే ఆలోచింపజేసే డైలాగులున్నాయి ఈ పాత్రకి. ఆనంద్, గోదావరి తర్వాత కమలిని కి దొరికిన మరో బలమైన పాత్ర జానకి, ఆమె పూర్తిగా న్యాయం చేసింది.

నిజానికి ఇది దర్శకుడి సినిమా. క్రిష్ స్వయంగా స్క్రిప్ట్ సమకూర్చుకున్న ఈ సినిమాకి అతి పెద్ద బలం స్క్రీన్ ప్లే. నర్సీపట్నం లో ఉన్న అభిరాం ని అతని తండ్రి కలుసుకుని అభినందిచడం మినహా అనవసరమైన సన్నివేశామేదీ లేదీ సినిమాలో. కే. శ్రావణ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, చివర్లో వచ్చే నక్సలైట్ సీన్ నిడివి కొంచం తగ్గించొచ్చు అనిపిస్తుంది. సీనియర్ నటులు గిరిబాబు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్ చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సీరియస్ విషయాలని చర్చించి నప్పటికీ సినిమా అంతా హాస్యరస భరితంగానే సాగుతుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం గంధం నాగరాజు రాసిన సంభాషణలు. సూటిగా, స్పష్టంగా, వ్యంగ్యంగా, హాస్యరస భరితంగా... మొత్తంగా సినిమా విజయంలో సంభాషనలది ప్రత్యేక పాత్ర. అలాగే యి.ఎస్ మూర్తి సంగీతం. సుజాత పాడిన 'సమయమా..' నాకు చాలా ఇష్టమైన పాట. థియేటర్ లో నేనీ సినిమాని మూడు సార్లు చూశానని తెలిసిన ఫ్రెండ్ ఒకరు డీవీడీ మార్కెట్లోకి రాగానే నాకు ప్రెజెంట్ చేశారు. అప్పటినుంచీ చాలా సార్లు చూశాను.

"హీరో హీరోయిన్లని చూస్తుంటే వరహీనం అనిపించడం లేదూ.." అని మిత్రులొకరు అన్నారు కానీ నాకలా అనిపించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని కేటగిరీల్లో అవార్డులు రానప్పటికీ, ఈ సినిమాకి నంది అవార్డులు రావడం నాకు సంతోషాన్ని కలిగించింది. 'గమ్యం' బృందానికి అభినందనలు. క్రిష్ తర్వాతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్ళలో నేనూ ఒకడిని.

24 కామెంట్‌లు:

  1. I too liked the movie. It was really a good screenplay from start end. Reg. your comment, the source is actually a Spanish movie, released in 2004.

    http://en.wikipedia.org/wiki/The_Motorcycle_Diaries_%28film%29

    రిప్లయితొలగించండి
  2. ఈ సినిమా గురించి రాద్దాం అని అనుకుంటూ ఇవాళ ఇంటికి వచ్చాను.రాగానే కూడలిలో మీ రివ్యూ...ఓ గాడ్..! అనుకున్నాను.
    మంచి చిత్రం.

    ఈ సినిమా సంగీత దర్శకులు ఈ.యస్.మూర్తి గారు మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు. నేను "మూర్తి బాబయ్య" అని పిలుస్తాను. రీరికార్డింగ్ పుర్తవ్వగానే సి.డి తెచ్చి నాన్నకు ఇచ్చారు ఆయన. వినగానే 'సమయమా' పాటే నచ్చింది నాన్నకు,నాకు కూడా...!!

    రిప్లయితొలగించండి
  3. నేనూ ఒకడిని
    క్రిష్ తరివాతి సినిమా వేదం అని విన్నాను. ఐదుగురి చుట్టూ ప్రధానంగా కధ నడుస్తుందట.

    రిప్లయితొలగించండి
  4. నాకు నచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. నేను థియేటర్ లో రెండుసార్లే చూసానండి.

    రిప్లయితొలగించండి
  5. ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

    రిప్లయితొలగించండి
  6. మంచి సినిమా..ఈ సినిమాలో కమ్ము(కమలిని ని ఫాన్స్ అలానే పిలుస్తారు) కొంచెం రొటీన్ ఎక్స్ ప్రెషన్స్ అక్కడక్కడా ఇచ్చిందేమో అని అనిపించిందండీ...ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గోదావరి సినిమాలో ఎక్స్ ప్రెషన్స్ లాగా...ఇంకొంచెం బెటర్ గా చేసుండొచ్చు...

    అన్నట్టు 'వరహీనం' అంటే??

    రిప్లయితొలగించండి
  7. "పొట్టకూటి కోసం పడుపు వృత్తికి సిద్ధ పడ్డ ఆడపిల్లలు, వాళ్లకి ఎదురయ్యే సమస్యలు" ఆ అంశం నన్ను బాగా కదిలించింది. ఆ సన్నివేశంలో నరేష్ సంభాషణ కూడా చాలా ఆర్థ్రంగా వుంటుంది. ఇప్పటికి నాలుగైదు సార్లు చూసాను.

    రిప్లయితొలగించండి
  8. గమ్యం..ఈ మధ్య కాలం లో నాకు బాగా నచ్చిన సినిమా. కానీ ఈ సినిమా నేను థియేటర్ లో చూడలేదు(ఈ మధ్య టీవీలో తప్ప థియేటర్ లో సినిమాలు చూడడం లేదు). టీవీలో ఏదో ఛానల్ లో చూశాను. రివ్యూ చాలా బాగా రాశారండీ.

    రిప్లయితొలగించండి
  9. మంచి సినిమా నాకు కూడా నచ్చింది ఆ హీరో ఏంటో గా వుంటాడు కాని నరేష్ బాగా చేసేడు సంభాషణలు బాగున్నాయి నాకు.

    రిప్లయితొలగించండి
  10. సౌత్ ఆఫ్రికా కి చెందిన 'చేగువెరా ' అడ్వెంచర్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. స్పానిష్ సినిమా తరువాత ఇంకా కొన్ని ఇతర భాషల్లో కూడా వొచ్హింది. తెలుగు సినిమా కథనం తో మార్పులు చేసారు. చాలా మంచి సినిమా. చక్కటి మ్యూజిక్. ఎవరైనా ఇష్టపడుతారు.బాగా రాసారు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  11. ఓ మంచి సినిమా గురించి మంచి పరిచయం, చాలా బాగుంది. సినిమా తలనొప్పిగా భావించిన ఓ కొలీగ్ అంత డబ్బు ఉంచుకునీ బైక్ మీద ఎందుకు వెళ్తాడు అంతా ఫార్స్ అని కొట్టిపారేస్తే నేను ఇదే డైలాగ్ ఉదహరించాను. "నువ్వు చూసింది ప్రదేశాలు ప్రపంచాన్ని కాదు ఒక్క సారి కార్ దిగి చూడు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది" అన్న హీరోయిన్ మాట ప్రకారమే అలా బైక్ పై యాత్ర అని.

    సమయమా మాంచి మెలొడీ కానీ నేను "ఎంతవరకూ ఎందుకొరకూ" "ఒన్ వే ఒన్ వే" పాటలు రెండూ ఎక్కువ సార్లు విన్నాను, కార్ లోనూ ట్రైన్ లోనూ ఈవే మోగేవి. "సమయమా" రాత్రి పడుకునే ముందు వినడానికి బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  12. అబ్బ అచ్చు ఇలానే నా స్నేహితుడు మూడు సార్లు చుస్తే ముచ్చటపడి తనకి డి.వి.డి.కోనిఇచ్చాను ..బోలెడు సంతోషపడిపోయారు.తను చూడమంటే చూసాను ..అరగంట సినిమా అయ్యిపోయింది ప్రసాద్ లో చూసాను .కొంచం ఎక్కువగా ఊహించనేమో నాకు మాములుగా అనిపించింది .
    @శేఖర్
    వరహీనం అంటే అమ్మాయి అబ్బాయికన్న వయసులో పెద్ద కావటం ...ఇది నా ఫ్రెండ్ చెప్పాడు .-:):)

    రిప్లయితొలగించండి
  13. తెలుగు సినిమాలంతె చులకనగా చూసే వారికి గమ్యం ఒక మంచి జవాబు

    బాగుందండి బాగా రాశారు

    రిప్లయితొలగించండి
  14. @TCS: సరిచేశానండీ.. ధన్యవాదాలు.
    @తృష్ణ: what a strange coincidence?! మాకెవ్వరికీ లేని చక్కని అవకాశం మీకు ఉంది.. మూర్తి గారితో మాట్లాడి ఈ సినిమాకి పనిచేసినప్పటి ఆయన అనుభవాలు, అవార్డు పట్ల అనుభూతి ఇలాంటివన్నీ ఒక టపా రాయొచ్చు కదండీ?? ..ధన్యవాదాలు.
    @అశ్విన్ బూదరాజు: అవునండీ, నేనూ విన్నాను.. ఎలా ఉంటుందో చూడాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @పద్మార్పిత: హమ్మయ్య.. నాలాంటి వాళ్ళు ఉన్నారన్న మాట:) :) .. ధన్యవాదాలు.
    @జీవని: 'నవజీవని' ఎలా ఉందండీ? ..ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: నాకైతే పాత్రోచితంగా చేసినట్టు అనిపించిందండీ కోమ్స్ (శేఖర్ కమ్ముల ఇలా పిలుస్తాడుట.. ) మీ ప్రశ్నకి చిన్ని గారు చెప్పిన సమాధానమే నాదీను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @ఉష: నిజమేనండీ.. సరదాగా మొదలయ్యే ఆ సన్నివేశం బరువుగా ముగుస్తుంది.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: మిస్సవకుండా చూశారు కదా.. చాలండీ.. ధన్యవాదాలు.
    @భావన: సంభాషణలు సగం బలం అంది ఈ సినిమాకి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. శర్వానంద్ తన తండ్రితో "జానకిని వెతుకుతుంటె నాకు నేను దొరుకుతున్నాను" అని చెపుతాడు.ఈ డైలాగ్ కోసం నాలుగు సార్లు చూసాను.మీకు అదొక్కటే నచ్చలేదంటె బాధనిపించి comment వ్రాసాను.మనిషి తనను తాను తెలుసుకోవడం ముఖ్యం,మీరైనా,నేనైనా, ఎవరైనా,కాదంటారా?

    రిప్లయితొలగించండి
  18. @జయ: అవునండీ.. TCS గారు ఇచ్చిన లింకులో చదివాను నేను.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: మీరు చెప్పిన రెండు పాటలూ కూడా నేను తరచూ వింటానండి.. కాని 'సమయమా..' అంటే ప్రత్యేకమైన ఇష్టం.. నా మిత్రులు కొందరు కూడా 'తలనొప్పి' అన్నారు.. ఏం చేయగలం చెప్పండి? ..ధన్యవాదాలు.
    @చిన్ని: ఇవాళేదో day of coincidences లాగా ఉందండి నాకు.. తృష్ణ గారు, మీరు భలే సర్ప్రైజ్ లు ఇచ్చారు.. మిత్రులకి ఇవ్వడానికి మంచి బహుమతి ఈ సినిమా.. 'మామూలుగా అనిపించిందంటే' అందరి టేస్ట్ ఒకలా ఉండదు కదండీ.. ధన్యవాదాలు.
    @కార్తీక్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @నీహారిక: అయ్యో..మీరు అపార్ధం చేసుకున్నారండీ.. ఆ డైలాగు నాకు చాలా నచ్చింది.. కానీ ఆ సన్నివేశం ఎందుకో కొంచం డ్రమటిక్ గా అనిపిస్తుంది నాకు.. మొదట్లో ఆస్తులు కూడబెట్టమని కొడుక్కి చెప్పి విదేశాలకి వెళ్ళిన తండ్రి అలా వెతుక్కుంటూ రావడం, కలవడం.. ఎందుకో సినిమా ఫ్లో లో కలవలేదు.. బహుశా తండ్రి పాత్ర కి ముగింపు ఇవ్వడం కోసం, అభిరాం సంఘర్షణ ని ప్రేక్షకులకి (డైలాగుల రూపంలో) చెప్పడం కోసం ఆ సీన్ పెట్టారేమో అనిపిస్తుంది నాకు.. అందుకే ఈ సీన్ అతికించినట్టు ఉందనిపిస్తుంది.. డైలాగులకి వంక పెట్టడానికి లేదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. ఈ సినిమా లో శర్వానంద్ నాకు నచ్చాడు . బాగుంది ఈ సినిమా .
    మీరు చాలా బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  21. హ్మ్మ్... చాలా లేట్ గా వచ్చినట్టున్నాను. కమలిని ని కోం అంటారు తన ఫ్రెండ్స్. బెంగాలీ లో అ ని ఓ అని పలుకుతారు కదా. ఇంకా శర్వానంద్ ని నంద్ అంటారనుకుంటా. గమ్యం బాగుంది. మీ సమీక్ష ఇంకా బాగుంది. నాకు మాత్రం అల్లరి నరేష్ దే ఆ సినీమా అంతా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  22. @మాలాకుమార్: చివర్లో చాలా బాగా చేశాడండి.. ధన్యవాదాలు.
    @Ruth: లేట్ అయినా ఏమీ పర్లేదండి.. బరువైన కథని తేలిక చేసి, సినిమాని అందరికీ చేరువ చేయడం లో గాలి శీను కీలక పాత్ర పోషించాడండి.. అల్లరి నరేష్ చాలా బాగా చేశాడు.. 'నేను' సినిమా నుంచి అతని నటన నచ్చుతోంది నాకు.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  23. ఈ మధ్యకాలంలో నాకునచ్చిన అతికొద్ది సినిమాలలో ఇదొకటి ! అల్లరి నరేష్ తన పాత్రకి పూర్తిన్యాయం చేకూర్చాడు. సినిమా అంతా నవ్విస్తూనే ....అన్నల దగ్గరకొచ్చినప్పుడు తనకు కష్టాలోచ్చినప్పుడు అన్నలొస్తారని ఎదురుచూసిన వైనం ఆవేశంగా చెప్పేతీరు హైలెట్ !మంచిసినిమా ...మీ పరిచయం ఎప్పటిలాగే అద్భుతం !

    రిప్లయితొలగించండి
  24. @పరిమళం: నిజమేనండీ.. రికార్డింగ్ డాన్స్ తర్వాతి సీన్లో కూడా అతని నటన బాగుంటుంది.. ఆ మాటకొస్తే సినిమా అంతా బాగా చేశాడు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి