శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

దసరాకి వస్తిమని...

...విసవిసలు పడక.. చేతిలో లేదనక.. అప్పివ్వరనక.." క్లాసు రూములలో గోల గోలగా అల్లరిచేసే పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెట్టి, మేష్టార్లందరూ ఈ పాట నేర్పడం మొదలు పెట్టారంటే త్వరలో దసరా సెలవులు రాబోతున్నాయని అర్ధం.. "అయ్య వారికి చాలు ఐదు వరహాలు.. పిల్ల వాళ్లకి చాలు పప్పు బెల్లాలు.." కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆ సంవత్సరమే స్కూల్లో చేరిన మేష్టార్లు ఈ లైన్లు చెప్పడానికి మొహమాట పడుతుంటే, హెడ్మాస్టారు అందుకుని మా చేత చెప్పించడం నిన్ననో మొన్ననో జరిగినట్టు ఉంది..

ఎలిమెంటరీ స్కూల్లో ఉండగా ఒక సంవత్సరం మాత్రం మమ్మల్ని ఊళ్ళో తిప్పారు.. అది కూడా గిలకలు లేకుండా.. తర్వాత పాటలు నేర్పడం తో సరిపెట్టేశారు. మా తర్వాతి పిల్లలకి పాటలు కూడా లేవు. పండక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి ప్లాన్లు.. మన ఇంటికి ఎవరైనా వస్తామని ఉత్తరం రాశారేమో అని ఉత్తరాల కట్ట వెతుక్కోడాలు.. ఏమేం పిండివంటలు కావాలో అమ్మని డిమాండ్లు చెయ్యడాలు.. దసరా అంటే సెలవుల పండగ.. సెలవులు తెచ్చే పండగ..

కొంచం పెద్దయ్యాక దసరా సరదాలన్నీ వార/మాస పత్రికల్లో కనిపించేవి.. దసరా మామూళ్ళ మీద ఎన్నెన్ని కార్టూన్లో.. మామూళ్ళ బాధ పడలేక మారువేషం వేసుకునే వాళ్ళు, అత్తారింటికి ముందుగానే వెళ్ళిపోయే అల్లుళ్ళు.. రేడియో హాస్య నాటికలదీ ఇదే ధోరణి. మా ఊళ్ళో పోస్ట్ మాన్ మాత్రమే ప్రతి ఏడూ దసరా మామూలు అడిగి పుచ్చుకునే వాడు.. అందువల్ల నాకు దసరా మామూళ్ళ మీద అన్ని జోకులెందుకో అర్ధమయ్యేది కాదు.

ఆయుధపూజ రోజున గుళ్ళో ప్రత్యేక పూజలు. "శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియదర్శనం.." అని ఓ కాగితం మీద రాసి, కింద మన పేరు రాసి జమ్మి కొమ్మలో ఉంచి దండం పెట్టుకుంటే అంతా జయం జరుగుతుందిట.. పరీక్షల్లో ఫస్టు వస్తుందిట.. (అప్పట్లో జీవితాశయం అదే కదా) ఒక్క తప్పూ లేకుండా శ్లోకం రాయడం కోసం ఎన్ని కాగితాలు ఖరాబయ్యేవో.. జాతరలూ మైక్ సెట్లూ లేకపోయినా దసరా ఉత్సాహంగానే ఉండేది.. పులి వేషాల వాళ్ళు వస్తే వాళ్ళ వెంటబడి తిరగడం.. పండగ కాబట్టి ఇంట్లో తిట్లు పడేవి కాదు. బొమ్మల కొలువు పూర్తిగా ఆడపిల్లల వేడుక.

"మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు.. ఎంత సరదాగా ఉండేదో.." అని తాతయ్య గుర్తు చేసుకోడం గుర్తొచ్చి నవ్వొస్తోంది ఇప్పుడు.. నేనూ అలాగే అనుకుంటున్నాను తాతయ్యా.. స్కూలైనా కాలేజీ అయినా మాకు సెలవులే ఉండేవి.. స్పెషల్ క్లాసులు ఉండేవి కాదు.. ఇంటికి ఎవరైనా రావడమో, మనం ఎక్కడికో వెళ్లడమో ఉండేది.. రేడియో వినే వాళ్ళం కానీ.. అదే పనిగా కాదు.. ఇప్పుడు మాకు 'మామూళ్ళు' నిత్య జీవితంలో భాగమై పోయాయి కాబట్టి దసరా మామూళ్ళు ప్రత్యేకత కోల్పోయాయి.. పండుగ కేవలం సెలవు రోజుగా మారిపోయింది.

'రోజులు మారిపోయాయి..' అని కాలాన్ని నిందించుకోడం అనవసరం.. మారుతున్నది మనుషులు, వాళ్ళ జీవిత విధానం. ప్రపంచంలో పోటీ పెరిగినప్పుడు, జీవితంలో వేగం పెరిగినప్పుడు అన్నీ మన చిన్నప్పుడు జరిగినట్టే జరగాలంటే కుదరదు కదా.. అలా జరగడం లేదని నిట్టూర్పులు విడవడం కూడా వృధానే. ఒకటి మాత్రం నిజం.. "మా చిన్నప్పుడు.." అని తాతయ్య తల్చుకున్నాడు.. నేను తలచు కుంటున్నాను.. రేపు నా మనవడూ తల్చుకుంటాడు.. ఇది సహజం.. అయితే నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం.. అందరికీ దసరా శుభాకాంక్షలు.

38 కామెంట్‌లు:

  1. మురళి గారు,
    అలా పాడేవారని మా నాన్న మాతో చెప్పేవారు. నాన్న ఆ పాటలు కూడా పాడేవారు మా చిన్నప్పుడు. కానీ నేను చదువుకోవడం మొదలు పెట్టేక అలా మాస్టార్లు పాడేవారు కాదు.
    >>>నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం..
    బాగుంది.
    విజయ దశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. అవునండీ! ఈ ఐదు వరహాల పాట నేను పుస్తకాల్లో చదవటమే గాని నాకు తెలియదు. నేను కూడా ఎలెమెంటరీ చదువంతా పల్లెటూరిలోనే చదువుకున్నాను. ఒకసారో, రెండుసార్లో మొక్కజొన్న రవ్వ ఉప్మా పెడితే తప్పు మనం తినకూడదు అని అమ్మమ్మ కేకలేసిన విషయం గుర్తుంది కాని ఈ పాట నాకు తెలియదు.
    >>నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం.. అందరికీ దసరా శుభాకాంక్షలు. >>నేను ఈ వాక్యం తో ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. ''రోజులు మారిపోయాయి 'అని కాలాన్ని నిందించకోవడం అనవసరం ...మారుతున్నది మనుషులు ,వాళ్ళ జీవిత విధానం''....TRUE.

    రిప్లయితొలగించండి
  4. Murali garu, samayathe papam (samythe papam kaadhu)

    nenu regular gaa mee blog follow avutha.

    ee gathanni thaluchukuni anandinche vallaki edho peru undhi ani ekkado chadivinattu gurthu. evaraina cheppagalaraa please.......

    రిప్లయితొలగించండి
  5. హమ్మయ్య .... నాకు చాల సంతోసం గా వుంది.. ఎందుకంటే నేను ఆ సందడిని కోల్పోలేదు ఐదవ తరగతి వరకు మేము అంటే మొత్తం పాఠశాల పిల్లలం గిట్టలు (విల్లు) , మరియు పులు ఆకులతో మా ఊరిలో అందరి ఇళ్ళ పై దాడి చేసి దసరా మముల్లు వసులు చేసేవాళ్ళం .
    నిజానికి మా ఊరు ఆంధ్ర ప్రదేశ్ లో లేదు, పక్కనే ఒరిస్సా లో వుంది . దసరా కోసం పది రోజుల ముందు నుండి ప్రతి రోజు సాయంకాలం పాటలను బట్టి పట్టి పడేవాళ్ళం. ఐదు వరహాల పాట చివరలో పాడే వాళ్ళం దాని కంటే ముందు ఎవరి ఇంటి వద్ద వారి పిల్లలు ఒక పాట పడేవాళ్ళు ఐదు వరహాల పాట అయ్యాక వారి ఇంటి నిండా విల్లు తో పువ్వులు ఆకులూ సందిచేవాళ్ళం . ఇప్పుడు కూడా మా ఊరిలో అల తిరుగుతూ వున్నారు. కలం తో పటు పడే పాటల సంఖ్య తగ్గింది కానీ ఆ ఐదు వరహాల పాట మాత్రం వుంది

    >>>నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం..
    * నిజమే కానీ
    ? రేపటి పరిస్తితి ఏమిటి....

    రిప్లయితొలగించండి
  6. బాగుంది !విజయ దశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు,
    ఇప్పుడు మాకు 'మామూళ్ళు' నిత్య జీవితంలో భాగమై పోయాయి కాబట్టి దసరా మామూళ్ళు ప్రత్యేకత కోల్పోయాయి..
    super
    ఈ డైలాగ్ కి విజిల్ వేసాను వినపడిందా

    రిప్లయితొలగించండి
  8. ఒకటి మాత్రం నిజం.. "మా చిన్నప్పుడు.." అని తాతయ్య తల్చుకున్నాడు.. నేను తలచు కుంటున్నాను.. రేపు నా మనవడూ తల్చుకుంటాడు.. ఇది సహజం.. అయితే నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం..

    చాలా లోతుగా చెప్పావు సోదరా.
    అందుకో నా అభినందనలు..
    మీక్కూడా విజయదశమి శుభాకాంక్షలు...
    మాకు రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది నువ్వు, ఎందుకో ఆలోచించి చెప్పేసేయ్ :):)

    రిప్లయితొలగించండి
  9. ఇప్పటి పిల్లలికి దసరా అంటే సెలవలు వస్తాయని మాత్రమే తెలుసు.

    రిప్లయితొలగించండి
  10. బాగుందండీ, మీరు చెప్పిన ప్రతీ మాటా అక్షర సత్యమే. నేను చదివింది క్రైస్తవ మిషనరీ స్కూల్ అది కూడా సిటీ లో సో అటువంటి ఆనందాలు మా అమ్మ చెప్తె వినటమే కానీ స్వయంగా అనుభవించలేదు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  11. ఓ,మీకు మనవడున్నాడా,ఎన్నేళ్ళండి ఇప్పుడు?బావుంది టపా.దసరా శుభాకాంక్షలు.
    నేను కూడా మీ బ్లాగ్ రెగులర్ ఫాలోవర్ని.

    రిప్లయితొలగించండి
  12. మురళిగారు బాగుంది మీ పోస్ట్. మారిపోయిన అభిరుచులతో మారుతున్న కాలానికి మనం బానిసలం కాక తప్పుతుందా. రేడియో గొప్పగా వున్నా రోజులనుంచి ఇలా బ్లాగులలో కలుసుకునే మార్పు ఉహాతితం కదా? జీవితం మార్పులేకపోతే బోర్ కొడుతుంది. తప్పదు మరి. జ్ఞాపకాలూ తీపి గురుతులు. మీకు విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. ఈ టపా చాలా బాగుంది మురళిగారు. మీ టపాలెప్పుడూ జ్ఞాపకాల తుట్టను కదుపుతాయనుకోండి. కానీ మీ శైలి అదిరిపోయింది. చాలా బాగా వ్రాశారు.

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు,
    నిన్నటిని తల్చుకుని అసంతృప్తి తో రగలకుండా నేటిని ఆస్వాదిద్దాం.. super...
    నేను మీ బ్లాగు కి ఫాన్ ని ...కాని యిదే మొదటి పోస్ట్....మీ టపాలని వెంటనే చదివేంత వరకి మనసులో మనసు ఉండదంటే నమ్మండి.....
    బావుంది టపా.

    అందరికీ దసరా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  15. ఏంటో మురళి గారూ, దసరా పండగ అంటే ఓ పది రోజులు సెలవులు ఇచ్చేవారు. ఊరంతా ఏవో పిండివంటలు చేసుకొని ఆరోజు తప్పకుండా నాన్వెజ్ తినేవాళ్ళం. అంతకు మించి పప్పుబెల్లాల హడావిడి విన్నగుర్తు కూడా లేదు. వచ్చే తరానికి దసరా అంటే అదీ ఒక మామూలు రోజులాగే , ఏ అనుభూతులు లేకుండా గడిచిపోతుందేమో.

    రిప్లయితొలగించండి
  16. గడిచిపోయిన రోజులన్నీ మధురంగానే ఉంటాయి .ముఖ్యంగా "బాల్యం"అప్పుడు దాని విలువ తెలియదు ,పెద్దయ్యాక తెలుస్తుంది .
    విజయదశమి శుభాకాంక్షలతో

    రిప్లయితొలగించండి
  17. ఎంతైనా పండగల ముచ్హట పల్లెటూళ్ళలోనే. మీ స్కూల్ అనుభవాలు నాకు లేనందుకు చాలా అసూయ గ ఉంది. దసరా శుభాకాంక్షలు. వీలైతే మీ ఊరికి వెంటనే వెళ్ళిపోయి ఆ పాతరోజుల ఆనందాన్ని మళ్ళీ అనుభవించండి.

    రిప్లయితొలగించండి
  18. కొన్ని జ్ఞాపకాలు మరిన్ని జీవిత సత్యాలు. Nice post. Remembered these quotes..

    "Yesterday is History, Tomorrow a Mystery, Today is a Gift, That's why it's called the Present" - Kung Fu Panda

    "It is ridiculous to live in the past. It is hard to live in the present. It is impossible to live in the future. And all three are less a minute apart"

    విజయ దశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  19. మురళి గారు
    మీ టపా చాలా బాగుంది. ఆ పాత మధురాలు తలచుకుంటూంటే సమయమే తెలియదు.మేము చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళేవాళ్ళం. ఏ ఆటలకి అమ్మ బయటకి పంపేదికాదు గాని ఈ పాటలకి మాత్రం పట్టు పరికిణి వేసి పంపేది. గురువంటే భక్తి భావం నింపడానికే..కాని ఈ నాటి దసరా (వేడుకలు/వేదనలు) చదవాలంటే నా బ్లాగు చూడాల్సిందే

    రిప్లయితొలగించండి
  20. @శేఖర్ పెద్దగోపు: ఒకప్పుడు సంప్రదాయం గానూ, వేడుక గానూ అనిపించినవి తర్వాతి కాలం లో 'మోటు పనులు' గా మారిపోవడం కొత్త విషయం ఏమీ కాదు కదండీ.. కాలంతో పాటు మార్పు సహజ పరిణామమే.. దన్యవాదాలు.
    @సునీత: పల్లెటూరి బళ్ళలో తప్పకుండా పాడించిన పాట అండీ.. మీరెలా మిస్సయ్యారో మరి.. ధన్యవాదాలు.
    @చిన్ని: నిజమే కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @మోహన వంశీ: సరి చేశానండీ.. పేరు నాకూ తెలీదు.. కనుక్కుంటాను.. ధన్యవాదాలు.
    అన్నట్టు మీరు ఈ లింక్ ఉపయోగించి తెలుగులో రాయొచ్చు: http://www.google.co.in/transliterate/indic/telugu
    @రాజేష్: కొత్త విషయం చెప్పారు.. 'రేపు' విషయం అంటారా..? అది మన చేతిలో లేదు కదా... ధన్యవాదాలు.
    @శ్రావ్య: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @మా ఊరు: ఇప్పడు వినిపించిందండీ :-) ..ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: బహుశా ఏ నెక్స్ట్ వీకేండో దసరా, దీపావళి కలిపి సెలెబ్రేట్ చేసుకుంటూ ఉండి ఉండొచ్చు.. am i right? ..ధన్యవాదాలు.
    @సత్య: నిజమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @లక్ష్మి: కనీసం విన్నారు కదా.. వినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.. ధన్యవాదాలు.
    @అమృత: ఫోటోలు బ్లాగులో పెడతాను.. చూస్తూనే ఉండండి :-) ..ధన్యవాదాలు.
    @వర్మ: నిజమేనండీ.. కానీ కేవలం గతాన్ని మాత్రమే స్మరిస్తూ వర్తమానాన్ని విస్మరించకూడదు కదా..? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @భవాని: ధన్యవాదాలు.
    @కవిత: ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: భవిష్యత్తు గురించి బెంగ పడడం కన్నా వర్తమానాన్ని ఆస్వాదించడం మంచిది కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @అనఘ: నిజమేనండి.. మన చేతిలోనుంచి జారిపోయాకే మనిషి/వస్తువు/కాలం విలువ మనకి బాగా తెలుస్తాయి.. ధన్యవాదాలు.
    @జయ: మీవైన అనుభవాలు మీకూ ఉంటాయి కదండీ.. ఏ ఇద్దరి జీవితమూ ఒకేలా గడవదు కదా.. ఏ మాత్రం వీలు చిక్కినా వెళ్తానండి.. ధన్యవాదాలు.
    @ఉష: Thank you very much..

    రిప్లయితొలగించండి
  26. @శ్రీనిక: అవునా.. చూస్తానండి అయితే.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  27. మీరు చాలా అదృష్టవంతులండి.. నా చిన్నప్పుడు మాత్రమే మా ఊళ్ళో దసరా హడావుడి వుండేది.. ప్రతీ వీధిలో ఒక ఇంటి ప్రాంగణం లో అమ్మ వారిని నిలపటం, పొద్దున్న, సాయంకాలం అక్కడికి వెళ్లి పూజలు చేయడం, సాయంకాలం వీధిలో లైటింగ్ మధ్య ఆడుకోవడం, రాత్రికి మంచి సినిమా ఒకటి వీధిలో తెరకట్టి వెయ్యడం.. ఇలా కొన్ని కొన్ని విషయాలు లీలగా గుర్తున్నాయి.. తరువాత స్కూల్ చదువులు, కాలేజీ లు .. వీటన్నిటి మధ్య దసరా కి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.. ఇప్పుడు మా ఊరిలో కూడా ఎక్కడా దసరా హడావుడి కనిపించడం లేదు..

    రిప్లయితొలగించండి
  28. నిన్న రాత్రి నేను ఇక్కడ ఒక కామెంట్ రాసానండి. చాంతాడంత వుంటుంది.. కాని ఎందుకో మీకు చేరలేదనుకుంట.. మళ్ళీ అంత పెద్ద కామెంట్ రాసే ఓపిక లేదండి.. వీలున్నప్పుడు అదే కామెంట్ మళ్ళీ రాయడానికి ట్రై చేస్తా.. ప్రస్తుతానికి.. బావుంది తో సరి పెడుతున్నాను..

    రిప్లయితొలగించండి
  29. ఏంటో ఎప్పుడు మీ టపా చదివినా మనస్సు ఎక్కడికెక్కడకో వెళ్ళిపోతుంది, ఆ పాత మధురాలన్నీ గుర్తుకొస్తాయి. కఠిన సత్యాలని చాలా అందంగా చెప్పారు. నిన్ననే మా పిల్లలకి అయ్యవారికి చాలు ఐదు వరహాల పాట గురించి చెప్పా, అంతలోనే దాని గురించి మీ టపా! మేమూ 5వ తరగతి వరకు బాగానే తిరిగాం.

    రిప్లయితొలగించండి
  30. మోహనవంశీగారు, మీకు గుర్తు రాని పదం "nostalgia" అయివుంటుంది.

    రిప్లయితొలగించండి
  31. @సత్య: గడిచిపోయిన రోజులెప్పుడూ అందంగానే కనిపిస్తాయండి.. బహుశా మనం సంతోష క్షణాలను మాత్రమే తల్చుకోడం వల్లనేమో.. ధన్యవాదాలు.
    @సిరిసిరి మువ్వ: కొన్ని సంప్రదాయాలు అంతరించిపోవడం, మరికొన్ని పుట్టుకుని రావడం సహజమే కదండీ.. మనం సాక్షులుగా ఉన్నాం కాబట్టి తల్చుకుంటున్నాం.. అంతే.. ధన్యవాదాలు.
    @అమృత: తెలుగు పదం ప్రయత్నించండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. మురళీ గారూ,
    ఇవ్వాళ తీరిగా మీ 'నెమలికన్ను' మీద పడిపోయానండీ ;) ఇన్నిరోజులు మిస్ అయిపోయిన టపాలన్నీ వెనక్కి వెళ్లి ఒక్కోటి చూస్తున్నా :)
    ఈ దసరా పోస్టు అంతా నాకు కొత్తగా ఉంది. ఇందులో మీరు చెప్పినవేవీ నాకు తెలినీ తెలీదు :( ఒక్క దసరా మామూళ్ళు తప్ప. దసరా వస్తే ఇంట్లో చాకలి అబ్బాయి దగ్గర నుంచీ, మన వీధి కరంటు అబ్బాయి (లైన్ మాన్) దాకా కనిపించిన వాళ్లందరూ అడుగుతుంటారు అని తెలుసు. ఈ టైం లో మా నాన్న వందలు, యాభైలు కాకుండా చిల్లర నోట్లు జేబులో పెట్టుకునేవారు. ఇప్పటికీ అంతే అనుకుంటా :) నాకది గుర్తొచ్చింది. ఇంకా మాకు దసరా అంటే, బతకమ్మ హడావిడి బాగా ఉంటుంది. నాకా పాటలు బాగా తెలుసు :)
    కొత్త (నాకు తెలియని పాత) విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు.
    అన్నట్టు.. పండుగ బాగా జరుపుకున్నారు కదూ..?

    రిప్లయితొలగించండి
  33. @మధురవాణి: అయితే 'బతుకమ్మ' మీద టపా రాయబోతున్నారన్న మాట.. బాగా జరుపుకున్నామండీ.. మీరు? ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. భాస్కర్ గారికి రెండుసార్లు wishes ఎందుకంటే, మన "ఇవాళ" వాళ్ల "రేపు" కదా.so,మన పండుగ రోజున,వాళ్ళ పండుగ రోజున కలిపి రెండుసార్లన్నమాట.భాస్కర్ గారూ కరక్టేనా?
    మురళిగారూ,మీ మనవడి ఫోటో ఎప్పుడు పెడుతున్నారు బ్లాగ్లో..చూడాలని ఉంది...ఇక బ్లాగ్ చూస్తూనే ఉంటా..:) !!

    రిప్లయితొలగించండి
  35. @తృష్ణ: నిజమేనండీ.. కానీ వేరే కారణం ఏమైనా ఉందేమో భాస్కర్ గారే చెప్పాలి.. ఫోటో అంటారా? చూస్తూనే ఉండండి మరి!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. మురళి గారు , దసరా శుభాకాంక్షలు కాస్త ఆలశ్యంగా ..
    మీ దసరా సంబరాలు ...ఆ మధురస్మృతులు మాతో పంచుకోవడం మరింత మధురం !బహుశా ఆరోజుల్లో చిరుద్యోగులు కూడా పండుగ ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ దసరా మామూళ్ళు ఉండేవేమో ...ఇప్పుడు మీరన్నట్టు మామూళ్ళు మామూలైపోయాయ్ .మంచిటపా !

    రిప్లయితొలగించండి