గురువారం, సెప్టెంబర్ 10, 2009

పులస చేప పులుసు

పులసల సీజన్ నడుస్తోంది.. ప్రతి యేడాది కన్నా ఈసారి పులసలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. గత సంవత్సరం చేప ఒక్కింటికి రూ. 1,500 పైగా పలికిన పులస ఈసారి రూ. 2,000 వరకూ పలుకుతోంది. 'పుస్తెలు అమ్మైనా పులస తినాలి' అంటారు మా గోదావరి జిల్లాల వాళ్ళు. జలయజ్ఞం పూర్తయితే పులస ఇంక అదృశ్యమై పోవచ్చు అన్న వార్తల నేపధ్యంలో ఎంత రేటైనా పెట్టి పులస కొనడానికి సిద్ధ పడిపోతున్నారు జనం.

పులసలు రెండు రకాలు. పోతుపులస, ఆడపులస. ఆడపులస నే 'శనగ పులస' అని కూడా అంటారు. గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా, రాజమండ్రి దగ్గర దొరికిన పులస ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత సులువేమీ కాదు. పులస చేపతో పులుసు చేయడానికి ముందు పులసకి ఉన్న పొలుసులు తీసేసి శుభ్రం చేయాలి. చేదుకట్ట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలూ, అల్లం, జీలకర్రా, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి. వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నె (వీలయితే మట్టి దాక) స్టవ్ మీద పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. నూనె సెగ వచ్చేలా కాగాక నూరి ఉంచుకున్న ముద్దలు ఒక్కొక్కటీ వేసి దోరగా వేయించాలి.

లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి గిన్నెలో పోయాలి. అలాగే టమాటా పళ్ళని చిదిమి గిన్నెలో వేయాలి. లేత బెండకాయ ముక్కల్ని పొడుగ్గా తరిగి పులుసులో వేశాక, ఒక్కొక్క చేప ముక్కనీ జాగ్రత్తగా పులుసులో మునిగేలా జారవిడవాలి. గిన్నెమీద జల్లిమూత (చిల్లులున్నది) పెట్టి మంట పెంచాలి. కుతకుతా ఉడుకుతూ బుళుకు బుళుకు మనే చప్పుళ్ళు చేస్తుంది పులుసు.

పులుసు నుంచి కమ్మటి వాసన రావడం మొదలవ్వగానే మంట తగ్గించి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. చాలాసేపు మరిగాక పులుసు చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి వేడి పులుసు లో వెన్నముద్ద కలపాలి. పులుసు బాగా చల్లారాక మొన్న వేసవిలో పెట్టిన కొత్తావకాయ మీది తేటని పులుసులో కలపాలి. ఒకరాత్రంతా కదపకుండా గిన్నెలోనే ఉంచేసి, మర్నాడు ఉదయం అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది రుచీ....

ఇదేమిటి? కనీసం 'పులిహోర' చేయడం కూడా రాని నేనేమిటీ? పులస తో ఇంత రుచికరమైన పులుసు చేయడం ఏమిటీ? అని కదా సందేహం. మరి నాకు ఈ పులుసు చేయడం నేర్పించినావిడ సామాన్యురాలు కాదు. ఆవిడ పేరు శ్రీమతి వాసంశెట్టి చిట్టెమ్మ నారాయుడు. సింపుల్ గా చిట్టెమ్మ. వర్షాకాలం వచ్చిందంటే ఊళ్ళో ఎంత పెద్ద మేడలో ఉండే వాళ్లైనా సరే, పులస కొనుక్కుని చిట్టెమ్మ పెంకుటింటి ముందు నిలబడాల్సిందే. ఆమె చేసే పులుసు తిన్నాక ఇంక తనువు చాలించేసినా పర్వాలేదనుకుంటారు అందరూ.

పులుస పులుసు తిన్నాక చెయ్యి నీసు వాసన రాకుండా పులుసు చెయ్యడం చిట్టెమ్మ గొప్పదనం. అలా ఎలా కుదురుతుంది? అని అడిగితే 'రగిస్సం' అని నవ్వేస్తుంది. అలాంటి చిట్టెమ్మకి ఒక కష్టం వచ్చింది. అలాంటి ఇలాంటి కష్టం కాదు.. ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే అంత కష్టం. మరి ఇన్నాళ్ళూ ఆమె చేతి పులుసు తిన్న ఊరి వాళ్ళు ఊరుకున్నారా? ఇది మాత్రం నన్ను అడగొద్దు. ఎందుకంటే చిట్టెమ్మ మా ఊరి మనిషి కాదు.

మా ప్రాంతం లోనే ఉండే 'పసలపూడి' అనే పల్లెటూరు ఆమెది. ఆమెని నాకు పరిచయం చేసింది వాళ్ళ ఊరి మనిషి వంశీ.. 'మా పసలపూడి కథలు' పేరిట వంశీ వెలువరించిన 72 అచ్చ తెలుగు కథల సంకలనం లో అరవై తొమ్మిదో కథ 'చిట్టెమ్మ కాసే చేపల పులుసు' చదివితే తెలుస్తుంది, చిట్టెమ్మ కి వచ్చిన కష్టం ఏమిటో.. పసలపూడోళ్ళు ఏం చేశారో.. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 520, వెల 175). పులస చేప పులుసు తిన్న ప్రతిసారీ చిట్టెమ్మ ని తలచుకోకుండా ఉండలేరు మరి.

34 వ్యాఖ్యలు:

చిన్ని చెప్పారు...

vaaaa.........murali,xlnt.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అబ్బ..పులస పులుసు తయారీ విధానం చదువుతుంటే నా నోటిలో లాలాజలం ఒకటో నెం. ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. మొన్నెమో భోజనం టైంలో చిన్ని గారు గుత్తొంకాయ మీద టపా పెట్టేసి ఆశ పెట్టేసారు. ఇప్పుడు మీరు ఏకంగా పులస చేప పులుసు చెప్పి మళ్ళీ ఆశ పెట్టేరు.

లక్ష్మి చెప్పారు...

హయ్య బాబోయ్ ఎంత దెబ్బ కొట్టేసారండీ మురళి గారు!!!

నిజంగా మీరు నలభీముల తర్వాత ఉన్నరనుకున్నా లిస్ట్లో. బాగుంది కథ పరిచయం, ఎప్పుడో చదివా కానీ గుర్తుకు రావటం లేదు ప్చ్ :(

అజ్ఞాత చెప్పారు...

హ్మ్... పులస చేపలని చాణ్ణాళ్ళ తర్వాత గుర్తు చేసారు. ఇవి సాగరసంగమం వద్ద పుట్టి, ఏటికి ఎదురీదుతూ రాజమండ్రి వరకు ప్రయాణిస్తాయి. ఇలా గోదావరిలో ఎదురీదటం వల్ల ఆ మంచినీటికి వీటి రుచి మరింత పెరుగుతుంది. అందుకే ఇవి అంతర్వేది వద్ద చవకగా, రాజమండ్రి చేరేసరికి 2000 వరకు ధర పలుకుతాయి. ఇంత దూరం ప్రయాణించటం కష్టం కనుక ఇక్కడి వరకు వచ్చేవి తక్కువే. కొంతమంది అంతర్వేదిలోనే పట్టేసి, రాజమండ్రి తెచ్చి ఇక్కడివని అమ్ముతారు కూడా... :)

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీదైన తరహాలో పరిచయం బాగుంది. నిజంగానే మీరు పులస చేపల పులుసు రెసిపీ చెప్తున్నారనుకున్నానండి, కొంచం చదివాక ఇది మనకి కాదులే అని మూసేద్దామనుకుంటూనే చదివా:)

మేధ చెప్పారు...

చిట్టెమ్మ రాగానే అర్ధమయ్యిపోయిందోచ్ :)

సుజాత చెప్పారు...

రెసిపీ చదువుతుండగానే చిట్టెమ్మ రెసిపీ కాపీ కొట్టారని తెలిసిపోయింది. ఇంతలో మీరే చెప్పేశారు.పసలపూడి కథల్లో ఈ కథ చదివినపుడు శుద్ధ శాకాహారినైనా "స్స్ అబ్బ"అనిపించింది నిజంగా!

శేఖర్ గారు,
జాగ్రత్తండోయ్, ఇంకాసేపు ఇక్కడే ఉన్నారంటే రెండో నంబర్ కూడా దాటగలదు ప్రమాద హెచ్చరిక!

ప్రణీత.స్వాతి చెప్పారు...

కాఫీ కలపడం కూడా రాని మీరు..ఒక రెసిపీ గురించి వివరిస్తూంటే నేనూ ఆశ్చర్యపోయానండి.

భాస్కర్ రామరాజు చెప్పారు...

ఇది ఊహించని మలుపు. :):)

sunita చెప్పారు...

ముందు ఆశ్చర్యం అనిపించింది. మురళీ ఏంటి? పులస పులుసు రెసిపీ ఏంటీ అని? బాగా ఖంగు తినిపించారు.

Sravya Vattikuti చెప్పారు...

ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలూ, అల్లం, జీలకర్రా, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి>> ఇక్కడకి వచ్చేటప్పటికి అర్థం ఐంది ఇది పసలపూడి కథల గురించి అని, అంతే ముందు చివరి పేరాకి వెళ్లి confirm చేసుకొని మళ్లీ మొదటినుంచి చదివా :)

హను చెప్పారు...

మురళి గారు...
ఈ మధ్య మీ టపాలకు కామెంట్స్ ఇవ్వలేకపోతున్నాను...క్షమించండి.
ఈ టపా చదువుతున్నప్పుడు అరె..మురళి గారు ఏంటి ఇలా రాస్తున్నారు అని అనిపించింది...కాని మొత్తం చదివాక అర్థమైంది...ఒక కథని పరిచయం చేస్తున్నారు అని...చాల బాగుంది...
ఇక పోతే...ఈ మధ్య ఒక న్యూస్ ఛానల్ లో చూశాను పులసల గురించి...ఈ పులసలు ఏదో దేశం లో పుట్టి సముద్ర మార్గం గుండా బంగాళాఖాతం లో వచ్చి చేరతాయటా.అక్కడినుండి గోదావరిలోకి వరద నీరు వచ్చే సమయానికి ఎదురీదుతూ రాజమండ్రికి చేరుతాయి.ఈ వరద నీటి వల్ల అవి బాగా రుచేక్కుతాయి అట...
కాని వీటి ధరలు చెప్పేసరికి నాకు నిజం గా దిమ్మ తిరిగి పోయింది...కాని మీ టపా చదివాక అర్థం అయింది అవి ఎందుకు అంత రేటు పలుకుతున్నాయో...

కొత్త పాళీ చెప్పారు...

నా సోవిరంగ, ఇదీ ట్వ్ష్టంటే!
Ha Ha Ha
masterfully done

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఇది మన సిలబస్ కాదులే అనుకున్నా నెమలికన్నుని ఎక్స్ట్రా కరికులం కింద కలుపుకొని మొదలెట్టా. అందరూ వండుకున్న కూరలని రాస్తే మీరు మాత్రం చదువుకున్న కూరలగురించి రాసేశారు.

భావన చెప్పారు...

హి హి హి.... హ హ హ......:-) :-) మురళి .... నేను నిజం గానే మీరు అన్నట్లే ఆశ్చర్య పోయా పులిహోరే రాదు ఈయన చేపల పులుసు రెసిపీ ఏంటి రా బాబు మళ్ళీ అంత అథెంటిక్ గా చెపుతున్నారు అని. బలే ట్విస్ట్ ఇచ్చారు అండి.. హి హి... హా హా మళ్ళీ ... :-)

వాసు చెప్పారు...

పులస చేప రుచి దాదాపు చూపించేసారు.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

excellent write up.....nice twist

@vikasam
now i came 2 know what is pulasa........

thx........

మురళి చెప్పారు...

@చిన్ని: :-) :-) ..ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: అప్పుడెప్పుడో మీరే 'పసలపూడి' కథల్ని పరిచయం చేయమన్నారు.. తీరా నేను చిట్టెమ్మ గురించి చెబితే, మీరు పులుసు దగ్గరే ఆగిపోతారా? అన్యాయం.. :-) :-) ..ధన్యవాదాలు.
@లక్ష్మి: బహుశా 'స్వాతి' లో వారం వారం పసలపూడి కథలు వచ్చినప్పుడు చదివి ఉంటారు.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@వికాసం: అవునండీ.. ఈ అంతర్వేది-రాజమండ్రి గొడవ నేనూ విన్నాను.. యెంత రేటైనా ఇచ్చి కొనడానికి జనం సిద్ధంగా ఉన్నారు మరి.. ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: ఆపేద్దామనుకున్నారా? కథ మిస్సయ్యే వాళ్ళు అప్పుడు :-) ..ధన్యవాదాలు.
@మేధ: చిట్టెమ్మ రానంత వరకూ మీకు అర్ధం కాలేదన్న మాట :-) ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@సుజాత: కాపీ కాదండీ.. కథని కొంచం వైవిధ్యంగా చెప్పే ప్రయత్నం అంతే.. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: అంతా చిట్టెమ్మ దయ అండీ :-) ..ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: మలుపులెప్పుడూ ఊహాతీతంగానే ఉంటాయి :-) :-) ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@సునీత: పోనీలెండి.. పులుసు తినిపించ లేకపోయినా ఖంగు తినిపించాను :-) :-) ..ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: మిరప్పళ్ళ దగ్గర దొరికిపోయానంటారా ఐతే? :-) ..ధన్యవాదాలు.
@హను: అవునండీ.. గోదారి నీళ్ళు యెంత ఎక్కువ తాగితే పులసకి అంత రుచి.. అందుకే పులసల్లో రాజమండ్రి పులస ది ప్రత్యేకమైన స్థానం.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@కొత్తపాళీ: 'ట్విస్ట్' అంటారా? :-) ..ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: 'కాదేదీ బ్లాగడానికి అనర్హం' :-) బాగుంది కదండీ? ..ధన్యవాదాలు.
@భావన: :-) :-) బాగానే నవ్వించినట్టు ఉన్నాను ఐతే.. ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@వాసు: దీనికేనా? తింటే తప్ప తెలీదండీ, పులస రుచి.. కావాలంటే 'పసలపూడి' వాళ్ళని అడగండి :-) ధన్యవాదాలు.
@వినయ్ చక్రవర్తి: ధన్యవాదాలు.

మా ఊరు చెప్పారు...

అంతా బావుంది కాని సగం సగం కథ చెప్తే మా పరిస్తితి ఏంటట.
మిగిలిన ట్విస్ట్ కూడా చెప్పేయండి.కనీసం కథ లింక్ అయిన ఇవ్వండి

భవాని చెప్పారు...

నిజంగానే మీకు పులుసు చేయటం తెలుసేమోనని అనుకున్నాను. మా హజ్బెండ్‌కి ఏమీ తెలియనట్లు మళ్ళీ చదివి వినిపించా. తనూ నాలానే మోసపోయారు.:)

పరిమళం చెప్పారు...

అమ్మో ...మురళిగారు ! సరిగ్గా నేనూ అలాగే అనుకున్నా ( ఏమనుకోకండెం ) పులిహోర కూడా ......అని ! తర్వాతేమో భాస్కర్ రామరాజు గారికి (నలభీమపాకం ) పోటీ వస్తున్నారనుకున్నా ! చివరికి షాక్ ఇచ్చారుగా !
మొత్తానికి పులసకి ఇంత ప్రాసెస్ ఉందని మాత్రం తెలీదండీ .....అమ్మ వాళ్ళూ వండేవారు కానీ ఇన్ని ఐటమ్స్ వేసేవారు కాదనుకుంటా !

మురళి చెప్పారు...

@మా ఊరు: పుస్తకం వివరాలు ఇచ్చాను కదండీ.. మీరు చదివి తెలుసుకోవాలన్న మాట :-) ఈ కథ నెట్ లో దొరకదనుకుంటా.. ధన్యవాదాలు.
@భవాని: :-) :-) ..ధన్యవాదాలు.
@పరిమళం: నాకంత దృశ్యం లేదని బ్లాగు రెగ్యులర్ గా చదివేవాళ్ళందరికీ తెలుసు కదండీ.. కొంచం వెరైటీ గా రాద్దామని ప్రయత్నం అంతే.. ధన్యవాదాలు.

నేస్తం చెప్పారు...

నాకు చదువుతున్నప్పుడే వంశి గారి కధ గుర్తు వచ్చింది ..స్వాతి లో చదివాను.. అహా ..ఏం నోరూరించారో వంశి గారు ..మా పసలపూడి కధలు ఒక్కోక్కటి ఒక్కో ఆణిముత్యం :)

మురళి చెప్పారు...

@నేస్తం: పట్టేశారన్న మాట :-) ..ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అయ్ బాబోయ్ ఈ ట్విస్టేటండీ బాబు. నేను ఈయన పసలపుడి కధల్లోంచి కాపీ కొట్టేసి మనకి రిసిపీ ఇచ్చేస్తున్నారు అనుకున్నా కానీ పుస్తక పరిచయం అని ఊహించనేదు. చాలా బాగా రాశారు. ఆ కధలన్నీ దేనికవే సాటి.

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: 'వంశీ పసలపూడి కథలు' అని మొదలు పెట్టే కన్నా కూసింత డిఫరెంట్ గా ప్రయత్నిద్దాం అని... మొత్తానికి మీకు నచ్చింది కదా.. అన్నీ కాదు కానీ, చాలా కథలు నచ్చుతాయండి నాకు.. ధన్యవాదాలు.

Raghav చెప్పారు...

నిజంగా అంత బాగుంటుందా?? చదువుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ప్చ్ ఐనా మనకు తినే ప్రాప్తం లేదులెండి పక్కా నాన్ వెజ్ కదా మనం :-)

మురళి చెప్పారు...

@Raghav: పులస పులుసుని మిస్సయిపోతున్నారన్న మాట ఐతే :-) ..ధన్యవాదాలు.

Krishna చెప్పారు...

పిచ్హెకించావ్ మురళీ!! బాగుంది .

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి