గురువారం, సెప్టెంబర్ 03, 2009

రాజు వెడలె...

రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అరవయ్యొక్క సంవత్సరాల ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు మరో నలుగురు ఆ ప్రమాదంలో కన్నుమూశారు. ఆంధ్ర రాష్ట్రం శోక సంద్రమైంది. జనం కన్నీళ్లు తుడుస్తానని పదే పదే ప్రకటించిన నేత కోసం ఇప్పుడు అదే జనం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శుభవార్త కోసం ఇరవైనాలుగు గంటల సుదీర్ఘ ఎదురుచూపు జీర్ణించుకోలేని చేదు వార్తతో ముగిసింది. నిన్న సాయంత్రం టీవీలో ఆర్ధిక మంత్రి జనానికి చేసిన విజ్ఞప్తి తో మొదలైన సందేహం, నిజం కాకూడదని పదే పదే కోరుకున్నా దురదృష్టవ శాత్తూ నిజమే అయ్యింది.

విద్యార్ధి నాయకుడిగా జీవితం మొదలు పెట్టి, ఫాక్షన్ రాజకీయాల మీదుగా సుదీర్ఘ ప్రస్థానం చేసి, ప్రతీ రాజకీయ నాయకుడి చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రాజశేఖర రెడ్డిని విజయలక్ష్మి అయాచితంగా వరించలేదు. ముఖ్యంగా 2004 ఎన్నికలకి ముందు ఆయన జరిపిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఏ రాజకీయ నాయకుడూ తలపెట్టలేని సాహసం. మండుటెండల్లో బయలుదేరి కాలినడకన రాష్ట్రాన్ని చుట్టి రావాలనే సంకల్పం కలగడానికి, దానిని నెరవేర్చుకోడానికి కేవలం పదవీలాలస మాత్రం ఉంటే సరిపోదు. ప్రజా సమస్యల పట్ల స్పందించే హృదయం కొంతైనా ఉండాలి. పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి మనస్తత్వంలో మార్పు తెచ్చింది అంటారు ఆయన సన్నిహితులు.

వ్యవసాయాన్ని గురించి ఆలోచించడానికి, ఉచిత విద్యుత్తు లాంటి స్కీములు ప్రకటించడానికి గ్రామీణ జీవితం పట్ల సంపూర్ణ అవగాహనతో పాటు, కించిత్ సాహసమూ కావాలి. ఆచరణలో అనేక లోటుపాట్లు ఉండొచ్చు కాక, జలయజ్ఞం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మొదలు పెట్టగల నాయకుడిని రాజశేఖర రెడ్డి లో తప్ప మరొకరిలో చూడలేం. తలుచుకున్నది చేసి తీరే మొండి తనం, ఫలితం ఎలాంటిదైనా బాధ్యత వహించడం ప్రస్తుత రాజకీయాలలో అరుదైన లక్షణాలే. నమ్మిన వాళ్లకి ప్రాణం ఇవ్వడం, శత్రువు యెంత బలవంతుడైనా లెక్క చేయక మడమ తిప్పని పోరాటం చేయడం వైఎస్ కి మాత్రమె సాధ్యమైన గుణాలు.

వైఎస్ కి సన్నిహితులు ఆయన మాటలని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. అరవై దాటాక రాజకీయాల్లో ఉండకూడదన్నది ఒకప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం. "అరవై దాటాక ఉండకూడదయ్యా.." అన్నారట చాలాసార్లు. ఆ మాటల్లో రెండో అర్ధం ఇప్పుడు స్ఫురిస్తోంది. వైఎస్ కి మరణం సంభవించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. నీడలా వెన్నంటి ఉండే సూరీడు కూడా వెంట లేకపోవడం..... ప్రమాద కారణాలు బయటికి వస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, తప్పిదానికి చెల్లించిన మూల్యం వెలకట్టలేనిది. రాష్ట్ర కాంగ్రెస్ కి జవజీవాలు పోసి, త్రిముఖ పోటీకి కూడా వెనుకాడక, తనవాళ్ళలో ఆత్మస్త్థెర్యం నింపి విజయం సాధించిన నేత ఇక లేరు అన్నది యెంత చేదు వార్త?? అబద్ధమైతే బాగుండును అని కోరుకోని వారు లేరు.

మంచి చెడు అన్నవి ప్రతి వ్యక్తిలోనూ ఉండే లక్షణాలు. పూర్తిగా మంచి మనిషి లేదా చెడ్డ మనిషి ఉంటారనడం కేవలం అతిశయోక్తి. నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే ప్రతి మనిషిలోనూ రెండు లక్షణాలూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి మన మధ్య లేరు అని తెలిసినప్పుడు ఆయన తాలూకు ఏ లక్షణాలను తలచుకుంటారు అన్నది జనం సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రి క్షేమం కోసం సందేశాలు పంపమని నిన్న, సంతాప సందేశాలని ఎస్సెమ్మెస్ రూపం లో పంపమని ఇవాళ మృత్యువులో కూడా వ్యాపారాన్ని వెతుక్కుంటున్న టీవీ చానళ్ళ గురించి ఇక్కడ మాట్లాడక పోవడమే మంచిది. వైఎస్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి.

12 కామెంట్‌లు:

  1. ఏమి రాయాలో కూడా తెలియడం లేదు..

    రిప్లయితొలగించండి
  2. వైఎస్ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి.

    రిప్లయితొలగించండి
  3. మురళి ... మీకు ఒక సామెత తెలుసో లేదో చెబుతున్నాను .."ఎద్దు పుండు కాకి కి ముద్దా "?....ఎవరిగోల వారిదే కదా ....ఎనీ హౌ ప్రజల మనిషిని కోల్పోయాము ..మంచి అధికారులని కోల్పోయాము.

    రిప్లయితొలగించండి
  4. నాకైతే ఇప్పటికీ అసలు నమ్మబుద్దికావటం లేదు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉండరు అన్న విషయం కూడా అంత తొందరగా జీర్ణించుకునేది కాదు. ఏంటో... క్షణంలో జీవితాలు తారుమారు అవ్వటం అంటే ఇదేనేమో! ఇక ఈ విషయాన్ని ఎవరెవరు వారి వారి స్వప్రయోజనాలకు వాడుకుంటారో మనం తర్వాత్తర్వాత చూడాల్సిందే!!
    చివరి పేరా చక్కగా రాశారు.
    ఆయన, ఆయనతో పాటు చనిపోయినవారందరి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. వార్తల కోసం నాకు అందుబాటులో ఉన్న ఆ ఏకైక ఛానల్ చూడక తప్పని పరిస్థితి , చూస్తూ వార్తను ప్రసారం చేసేవిధానం ఇదేనా "ఛీ ఛీ " అనుకోని క్షణం లేదు

    చనిపోయినవారందరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగా రాసారు. ముఖ్యంగా ఆఖరి పేరా.

    రిప్లయితొలగించండి
  7. శేఖర్ గారన్నట్టు క్షణాల్లో జీవితాలు తారుమారవ్వడమంటే ఇదేనేమో..
    ఆయన, ఆయనతో పాటూ చనిపోయిన వారందరి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి.

    రిప్లయితొలగించండి
  8. ఆయనకు,ఆయనతో పాటు చనిపోయినవారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్దిస్తున్నా!

    రిప్లయితొలగించండి
  9. మీదైన శైలిలో చక్కగా రాసారు.
    May his soul rest in peace..

    రిప్లయితొలగించండి
  10. ఈసారి ముఖ్యమంత్రి అయినాకా అతనిలో చాలా మర్పు వొచ్హింది. ప్రజలకి అంకితభావంతో సేవలను అందించాలని, ప్రజల సమస్యలన్నీ తీర్చి సుఖ సంపదలతో, సస్యశ్యామల ఆంధ్ర ప్రదేశ్ ని చూడాలని కలలు కన్నారు. కాని కలలు కల్లలు చేసి, ఇంతకన్నా ఇంకేదో తొందరపని ఉన్నట్లుంది, అందుకే ఎవ్వరికీ చెప్పకుండా హడావుడిగా వెళ్ళిపోయారు. ఒక మహోత్తర తరంగం హఠాత్తుగ ఆగిపోయి ఆంధ్రావని మూగపోయింది. భగవంతుడు వీరి ఆత్మకి శాంతి కలిగించాలని మనసారా కోరుకుంటున్నను. మనల్ని మనమే ఓదర్చు కోవాలి.

    రిప్లయితొలగించండి
  11. బాధని పంచుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి