మంగళవారం, సెప్టెంబర్ 22, 2009

బాణం

ఒక్కోసారి మనం అస్సలు చేయకూడదు అని నిర్ణయించుకున్న పనిని అనుకోకుండా చేసేస్తాం.. అతి కొద్ది సందర్భాలలో అలా చేసినందుకు పశ్చాత్తాప పడం. నాకు సంబంధించి ప్రస్తుతం అలాంటి సందర్భం 'బాణం' సినిమా చూడడం. ఈ సినిమా చూడకూడదు అనుకోడానికి కారణం కొత్త హీరో నారా రోహిత్, 'అన్నగారికి' వేలువిడిచిన వారసుడు కావడమే. వంశం డైలాగులు, తొడ చరిచే చప్పుళ్ళు తప్పించుకోడం కోసం సినిమా వద్దనుకున్నా.

అయితే సినిమా చూసిన ఒక మిత్రుడు తప్పక చూడమని చెప్పడంతో నిన్ననే 'బాణం' చూశాను. మొదటి పది నిమిషాల్లోనే ఇది రొటీన్ సినిమా కాదని అర్ధమయ్యింది. నక్సల్ నాయకుడు చంద్రశేఖర్ పాణిగ్రాహి (షాయాజీ షిండే) తన పదేళ్ళ కొడుకుతో మాట్లాడుతూ ఉండగా, పోలీసులు చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు.. వాళ్ళని తప్పించుకోడం కోసం నదిలో దూకేస్తాడు పాణిగ్రాహి.

ఇక రెండో సన్నివేశంలో మరణ శయ్యపై ఉన్న తండ్రిని తుపాకితో కాల్చి చంపేస్తాడు పాతికేళ్ళ శక్తి పట్నాయక్.. అలా తండ్రి దందాలకి వారసుడవుతాడు. పెరిగి పెద్దవాడైన చంద్రశేఖర్ పాణిగ్రాహి కొడుకు భగత్ పాణిగ్రాహి (నారా రోహిత్) ఉద్యోగం చేసుకుంటూ సివిల్ సర్విస్ పరీక్షలకి తయారవడం మూడో సన్నివేశం. ఐపీఎస్ కావడం అతని ఆశయం. కథానాయకుడి నేపధ్యం, అతని ఆశయం నాకు సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. పర్వాలేదు, నెమ్మదిగానే అయినా తెలుగు సినిమా కూడా ఎదుగుతోంది అనిపించింది.

నక్సలైట్ ఉద్యమం నుంచి స్వచ్చందంగా విరమించుకుని ప్రభుత్వానికి లొంగిపోతాడు చంద్రశేఖర్ పాణిగ్రాహి. ప్రతి ఉద్యోగికీ ఉన్నట్టే తనకీ రిటైర్మెంట్ కావాలంటాడు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని తిరస్కరిస్తాడు. తండ్రీకొడుకులు కలుసుకుంటారు. ఒక పక్క దందాలు చేసే విలన్, పోలీసు ఆఫీసర్ కావాలనుకునే హీరో.. మరి వీళ్ళిద్దరి ముఖాముఖి ఎలా? అప్పుడు ప్రవేశిస్తుంది నాయిక సుబ్బలక్ష్మి (వేదిక). కట్నం డబ్బు ఇవ్వలేదని పెళ్ళిపీటల మీదే వదిలేసిన భర్త, గుండె ఆగి మరణించిన తండ్రి.. వెరసి అనాధగా మారిన సుబ్బలక్ష్మికి ఆశ్రయం ఇస్తాడు భగత్.

ఇక్కడినుంచి కథ ఊహించని మలుపులు తిరిగింది.. ఎంత ఉత్కంఠభరితంగా సాగిందంటే విశ్రాంతి పది నిమిషాలూ ఎప్పుడు పూర్తవుతాయా అని అసహనంగా వాచీ చూసుకునేంతగా. సివిల్ సర్విస్ మెయిన్స్ పరిక్షలు రాయాల్సిన భగత్ అనూహ్యంగా పోలీసు కష్టడీకి వెళ్ళడం.. పరిక్ష రాసే అవకాశం వచ్చినా కలిగే ఆటంకాలూ.. అతని ఆశయం నెరవేరే క్రమంలో ఎదురైనా ఇబ్బందులూ.. ఉద్యమాన్ని వదిలేసినా ప్రతిహింస కోసం ఆయుధం పట్టాలనుకున్న చంద్రశేఖర్ పాణిగ్రాహి.. విలన్ గ్యాంగులో లుకలుకలు.. పోలీసుల్లో మంచీ చెడు.. సినిమా ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చూశాను.

ఇది పూర్తిగా దర్శకుడి సినిమా.. కొత్త దర్శకుడు చైతన్య దంతులూరి రొటీన్ కి భిన్నమైన, క్లిష్టమైన సబ్జెక్టుతో ఆరంగేట్రం చేయడాన్ని అభినందించాలి. సీనియర్ నిర్మాత అశ్విని దత్ కుమార్తె శేషు ప్రియాంక కి నిర్మాతగా తొలి చిత్రం ఇది. ఇక కొత్త హీరో నారా రోహిత్ కి ఐతే ఇది బహు చక్కని ప్రారంభం. స్క్రీన్ ప్లే వేగానికి గంధం నాగరాజు పదునైన సంభాషణలు తోడవ్వడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టని విధంగా సాగింది. మణిశర్మ సంగీతం సినిమా తాలూకు మూడ్ ఆసాంతమూ కొనసాగేందుకు సహకరించింది.

నాయిక పరిచయ సన్నివేశం లో భగత్ రైల్లో ఆఫీసుకి వెళ్తుండగా, ఆమె రైల్వే స్టేషన్ లో ఒంటరిగా, విషాదంగా కూర్చుని ఉంటుంది. అంత విషాదంగా కూర్చున్న అమ్మాయి తలలో ఫ్రెష్ మల్లెపూల దండ అవసరమా అనుకున్నా.. సాయంత్రం ట్రైన్లో ఆఫీసు నుంచి భగత్ తిరిగి వచ్చేసరికి ఆమె అక్కడే కూర్చుని ఉంటుంది.. తలలో పూలదండ వాడిపోయి ఉంటుంది.. కంటిన్యుటీ విషయంలో దర్శకుడి శ్రద్ధకి ముచ్చటేసింది. అంతే కాదు, హింసని నేరుగా చూపకుండా దాని ప్రభావాన్ని మాత్రమే చూపడం బాధ్యతాయుతమైన చర్యగా అనిపించింది.

అయితే ఇంకా చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కథా స్థలం శ్రీకాకుళం జిల్లా రణస్థలి అని చూపారు.. అక్కడి వాతావరణాన్ని చిత్రించారు.. పాత్రలన్నీ ఆ ప్రాంతానికి చెందినవే అయినా వారంతా కృష్ణా జిల్లా తెలుగు మాట్లాడతారు. శ్రీకాకుళం యాస ఎక్కడా వినిపించదు. భగత్ సివిల్ సర్విస్ మెయిన్స్ పరిక్ష కి వెళ్తాడు.. నిజానికి ఈ పరిక్ష ఒకరోజులో పూర్తయ్యేది కాదు.. కనీసం పది రోజులు జరుగుతుంది.

పైగా హీరో ఆబ్జెక్టివ్ ప్రశ్న పత్రానికి సమాధానం రాస్తాడు, మెయిన్స్ పరిక్ష కి జవాబులు వ్యాస రూపంలో ఇవ్వాలి. అలాగే సివిల్ సర్విస్ ఇంటర్వ్యూ సీన్ తేలిపోయినట్టుగా అనిపించింది. నిజానికి నక్సల్ ఉద్యమాన్ని గురించి ఒక లోతైన చర్చ జరుగుతుందని ఎదురుచూశాను. బోర్డు సభ్యులుగా మరికొందరు సీనియర్ నటులని తీసుకుని, కొంచం పొడిగిస్తే ఓ గొప్ప సీన్ అయ్యేది. హీరో ఉపన్యాస ధోరణిలో మాట్లాడడం కొరుకుడు పడదు.

నారా రోహిత్ బాగానే చేశాడు.. చాలా మంది కొత్త హీరోల కన్నా పర్వాలేదు. హెయిర్ స్టయిల్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. వేదిక ని చూస్తే కెరీర్ తొలి రోజుల్లో నగ్మా గుర్తొచ్చింది చాలాసార్లు. ప్రాధాన్యత ఉన్న నాయిక పాత్ర దొరికింది ఈమెకి. కథకి మూలస్థంభంగా నిలిచిన పాత్ర చంద్రశేఖర్ పాణిగ్రాహి. షాయాజీ షిండే కి ఈమధ్య కాలంలో దొరికిన మంచి పాత్ర. కాకపొతే అతని తెలుగు తెలుగులా వినిపించదు.. అదొక్కటే లోపం.

హీరో పాత్రని ఎలివేట్ చేసే ప్రయత్నాల్లో భాగంగా, అతనికి సాయం చేయడానికి వచ్చిన పోలిస్ ఆఫీసర్ తోనూ, పోలిస్ అకాడెమీ లో సీనియర్ ఆఫీసర్తోనూ హీరో చేత పదునైన సంభాషణలు చెప్పించాడు దర్శకుడు. దీనివల్ల ఆయా సన్నివేశాల్లో నాటకీయత కొంచం శృతి మించింది. అలాగే ముగింపు కూడా.. ఉన్నత లక్ష్యంతో పోలీసు ఆఫీసర్ అయిన హీరో కూడా చివరికి చట్టాన్ని చేతిలోకి తీసుకోడమే పరిష్కారంగా చూపారు.

మొత్తంగా చూసినప్పుడు దర్శక నిర్మాతలని, హీరోని అభినందించాల్సిందే.. తొలి ప్రయత్నానికి రొటీన్ ప్రేమ కథని ఎంచుకోకుండా వైవిధ్యమైన ప్రయత్నం చేసినందుకు. మొదటి సినిమాని వైవిధ్యంగా తీసిన దర్శకుడి మీద బోల్డన్ని ఆశలు పెట్టుకోవడం నా అలవాటు/బలహీనత. 'బాణం' చూశాక చైతన్య దంతులూరి నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాని కనీసం మరో రెండుసార్లు చూస్తానని మిత్రులకి సందేశాలు పంపాను.

23 కామెంట్‌లు:

  1. మా ఫ్రెండ్స్ కూడా బాగుందన్నారండీ...అభినందించవలసిందేమిటంటే నారా రోహిత్ తన కెరీక్ ప్రారంభ సినిమాలో కమర్షియల్ హంగులు నమ్ముకోకుండా దర్శకుడిని నమ్ముకోవడం...
    తొడ చప్పుళ్ళు, కంటి చూపులు, జాలీమ్ లోషన్ లు...వగైరా నమ్ముకుని ఉంటే సింహాల(చెప్పుకోడానికి మాత్రమే) మందలో ఇంకోంటి ఏడ్ అయ్యి ఉండేదంతే...మనకేమో బీ.పీ మరో పాయింట్ పెరిగుండేది...థాంక్ గాడ్..

    రిప్లయితొలగించండి
  2. ఈ మధ్య చాలా రోజులై మీరు సినిమాల గురించి రాయలేదు అనుకుంటూండగా "బాణం" టపా రాశారు. మీ విశ్లేషణ చాలా బాగుంది. అలాగే అబ్జేర్వేషన్ కూడా.

    రిప్లయితొలగించండి
  3. కొత్త సినిమాని...ఇంకో రెండు సార్లా?ఇంతకు ముందు కూడా రెండోసారి చూడటానికి టిక్కు పెట్టుకున్నా అని 2,3సార్లు చదివిన గుర్తు..మీ ఓపికకి జోహార్లు సార్!!

    రిప్లయితొలగించండి
  4. అయితే మనోళ్ళు మంచి ప్రయత్నం చేశారన్నమాట. చూడాలైతే.

    రిప్లయితొలగించండి
  5. మీ విశ్లేషణ బాగుంది ! మూవీ కి mixed response వస్తునట్లుంది :)

    రిప్లయితొలగించండి
  6. మీ విశ్లేషణ బాగుందండి మురళి గారు. వీలు చూసుకొని ఈ సినిమా చూడాలి

    రిప్లయితొలగించండి
  7. నాది సేం ఫీలింగ్, ఈ వారసత్వపు బాధ వద్దు అని, కాని నవతరంగం లో ఇప్పుడు ఇక్కడ అభిప్రాయాలు చదివేక తప్పక చూద్దాము అనుకుంటున్నా సినిమా..

    రిప్లయితొలగించండి
  8. ఎవరిమీదా ఈ బాణం అనుకుంటూ వచ్చాను. మంచి పరిచయం , ఇక మా హీరో మనవడి సినిమా చూడటమే తరువాయి :)

    రిప్లయితొలగించండి
  9. మురళీగారు....మీ అబ్జర్వేషన్ అండ్ విశ్లేషణకి జోహార్లు!!

    రిప్లయితొలగించండి
  10. మూవీ బావుందండి.
    మీ రివ్యూ కూడా బావుంది

    రిప్లయితొలగించండి
  11. Interesting.
    ఐతే మరీ కొట్టిపారెయ్యాల్సిన సినిమా కాదన్నమాట.
    ఈ రెండు విభిన్న దృష్టుల మధ్య సమన్వయం కోసమన్నా చూడాలి! :)
    బైదవే, మీరు గమనించి మెచ్చిన పాయింట్లు బావున్నై.

    రిప్లయితొలగించండి
  12. నేను బాణం సినిమా నిన్ననే చూసాను చాలా బాగుంది. కొత్త హీరో, హీరోయిన్ అయనా చాలా బాగా చేసారు. డైరక్షన్ చాలా బాగుంది రొటీన్ కాకుండా డిఫరెంట్ గా.

    రిప్లయితొలగించండి
  13. మురళి గారూ! మీ సమీక్ష ఎత్తుగడ నుంచీ చివరి వరకూ బావుంది. సినిమా చూడాలనిపించేలా రాశారు. అభినందనలు!

    ‘సివిల్స్’పరీక్ష గురించి బాగా పాయింటవుట్ చేశారు. మంచి సినిమాల్లో కూడా ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో ఎందుకు జాగ్రత్తలు తీసుకోరో!

    రిప్లయితొలగించండి
  14. మీ సమీక్ష బాగుందండీ...అమ్మాయి తల్లోపూలు ...అయ్యబాబోయ్ మరీ ఇంత నిశిత పరిశీలన ! సివిల్ సర్విస్ గురించి సినిమాల్లో దారుణంగా చూపిస్తారు,ఒక్క పరీక్షలో ,ఒక్కరోజులో కలెక్టర్ అయ్యి వాళ్ళ గ్రామానికే వచ్చిన సందర్భాలు :)...అదే ఆడోళ్ళయితే కళ్ళఅద్దాలు నెత్తిమీద కొప్పు ...:)

    రిప్లయితొలగించండి
  15. @శేఖర్ పెద్దగోపు: జాలిం లోషన్లు :-) :-) బీపీ ఎందుకండీ, సినిమా చూడ్డం మానేయ్యడమే.. మన చేతిలో పనే కదా.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: థియేటర్ లో సినిమా చూసి చాలా రోజులు అయ్యిందండీ.. 'కలవరమాయే మదిలో..' తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం.. ధన్యవాదాలు.
    @తృష్ణ: సినిమా నచ్చితే మరో సారో, రెండు సార్లో చూడడం నా బలహీనత అండీ.. అలా అలవాటైపోయింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @భవాని: చూసి ఓ టపా రాయండి.. మీరేమంటారో వినాలని ఉంది.. ధన్యవాదాలు.
    @శ్రావ్య: అందరి అభిరుచీ ఒకేలా ఉండదు కదండీ.. ఈ సినిమా రొటీన్ కి భిన్నంగా ఉంది.. ధన్యవాదాలు.
    @జయ: మీరు కూడా చూశాక టపా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @భావన: వారసత్వం మరీ 'రుద్దుడు కార్యక్రమం' గా మారుతోందండీ.. ఒకట్రెండు సినిమాలకే బాగా విసిగిపోయాను.. ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: అవునండీ.. మీ హీరోకి 'వేలు విడిచిన' మనవడు :-) ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @మాఊరు: ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: అవునండీ.. కొట్టి పారేయాల్సిన సినిమా మాత్రం కాదు.. ధన్యవాదాలు.
    @లక్ష్మణ్: హీరోయిన్ ఇంతకూ ముందు 'ముని' లాంటి రెండు మూడు సినిమాల్లో చేసిందండీ.. ఈ సినిమాలో చీరలో ఉంది ఉండడం వల్ల బహుశా మీరు గుర్తుపట్టి ఉండరు :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @వేణు: ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ప్రశ్న పత్రం తెలుగులో ఉంటుంది.. ఇలాంటి విషయాలని ఎందుకు వదిలేస్తారో అర్ధం కాదండి.. వాళ్లకి తెలీదు అనుకోవాలో లేక జనాలకి తెలీదని అనుకుంటారో... ధన్యవాదాలు.
    @చిన్ని: కళ్ళద్దాలు, నెత్తిమీద కొప్పు.. నిజమేనండీ.. చాలా సినిమాల్లో ఇదే గెటప్.. నిశిత పరిశీలన అంటే, మరి టికెట్ కొనుక్కుని వెళ్ళినప్పుడు చూడాలి కదండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. హీరోయిన్ ఇంతకూ ముందు 'ముని' లాంటి రెండు మూడు సినిమాల్లో చేసిందండీ.. ఈ సినిమాలో చీరలో ఉంది ఉండడం వల్ల బహుశా మీరు గుర్తుపట్టి ఉండరు :-)

    కెవ్వు కేక :-D మీరు సూపర్ మురళి, తల్లోపూలకు మరో కేక.

    రిప్లయితొలగించండి
  21. @వేణూ శ్రీకాంత్: ఇంతకీ సినిమా చూస్తున్నారా? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. "కంటిన్యుటీ విషయంలో దర్శకుడి శ్రద్ధకి ముచ్చటేసింది."మీ సునిశిత దృష్టికి మరీ ముచ్చటేస్తుంది . ఈ వారంలో బాణం సినిమాని తప్పకుండా చూడాలి .

    రిప్లయితొలగించండి
  23. @పరిమళం: చూసి ఊరుకోకుండా ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి