శనివారం, సెప్టెంబర్ 12, 2009

బ్లాగులు-'అనంతం'

సుమారు ఎనిమిది నెలల క్రితం.. అప్పటికి బ్లాగులతో కొద్దిపాటి పరిచయం.. నేను బ్లాగు మొదలు పెట్టాను, కానీ బ్లాగులని ఒక క్రమ పద్ధతిలో చదవడం అలవాటు కాలేదు. కనిపించిన టపా అల్లా చదవడమే కానీ బ్లాగు పేరు గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అప్పుడు చదివిన ఒక సుదీర్ఘమైన టపా మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను.. అప్పుడే మొదటిసారిగా ఆ బ్లాగు పేరు గుర్తు పెట్టుకున్నాను.. ఆ పేరు 'అనంతం.' 

"పుట్టింది, పెరిగింది గుంటూరు జిల్లాలో. ఇంజనీరింగ్ చదువు కోసం మొదట హైదరాబాదు కి , తర్వాత ఉద్యోగ రీత్యా అమెరికా కి పయనం. ప్రస్తుతం అమెరికా లోనే ప్రవాస జీవితం." ఇది బ్లాగర్ ఉమాశంకర్ స్వపరిచయం. "కొన్ని జ్ఞాపకాలు,కొన్ని అనుభవాలు,కష్టం-సుఖం, కొద్దిపాటి హాస్యం, అవీ, ఇవీ, అన్నీ.." ఇవి తన బ్లాగు గురించి ఆయన చెప్పిన నాలుగు మాటలు. విండ్సర్ (యునైటెడ్ స్టేట్స్) లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఉమాశంకర్ తన బ్లాగు ద్వారా అప్పుడప్పుడూ అమెరికా జీవితంలో భిన్నకోణాలని పరిచయం చేస్తూ ఉంటారు.

ఇంతకీ ఈ బ్లాగులో నేను ఎప్పటికీ మరిచిపోలేని టపా ఏమిటో చెప్పలేదు కదా.. ఆ టపా పేరు 'ఒక చలిలో వణికిన రాత్రి.' దేశం కాని దేశం లో అర్ధరాత్రి వేళ విమానం దిగి, తనకి ఏర్పాటు చేసిన వసతిలో ఉన్న కొలీగ్ ఎంతకీ తలుపు తీయకపోతే గడ్డకట్టించే చలిలో తను అనుభవించిన టెన్షన్ ని ఆయన హాస్యస్పోరకంగానే అందించినప్పటికీ టపా చదువుతున్న వాళ్లకి చెమటలు పట్టక మానవు. అంతే కాదు, కొత్తగా అమెరికా వెళ్ళే వాళ్ళకి ఇదో పాఠం కూడా. ఈ టపా మాత్రమే కాదు, తను రాసే ప్రతి టపానీ సున్నితమైన హాస్యంతో మేళవించడం ఈయన ప్రత్యేకత.

అది మొదలు వీలున్నప్పుడల్లా బ్లాగులో పాత టపాలు చదువుతుండగా ఒక రోజు 'నా వానాకాలం చదువు' అనే టపా కనిపించింది. ఎగిరి గంతేసినంత పని చేశాను. ఉమాశంకర్ ఎంతటి సాహిత్యాభిమానో ఈ టపాతో తెలిసింది నాకు. ఇంతకీ ఈ టపా తన అకడమిక్స్ గురించి కాదు, సాహిత్యాన్ని చదవడం గురించి. 'చందమామ' మొదలు 'మల్లాది' నవలల వరకూ తన పఠనాభిలాష ఎదిగిన తీరుని అదే క్రమంలో వివరించారు. తనకి ఇష్టమైన మల్లాది నవలల జాబితా లో 'అందమైన జీవితం' ఉంది.. నాకు చాలా ఇష్టమైన నవలల్లో అదొకటి.

'మా ఇంటి కథ' చదవగానే మన జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా ఉండలేం. పుట్టి పెరిగిన ఇంటితో మనకే తెలియకుండా మనలో ఉండే అనుబంధం తాలూకు గొప్పదనం అది. సాహిత్యం తో పాటు, టెన్నిస్ అంటే ఆయనకి ఇష్టమనీ, రాజకీయాలంటే ఆసక్తి అనీ అర్ధమయ్యింది, టపాలు చదువుతున్న కొద్దీ. అన్నట్టు సినిమాల గురించీ ఒకటి రెండు ప్రస్తావనలు ఉన్నాయి. ఒక టపా రాయడంలో ఈయన చూపే శ్రద్ధ నాకెప్పుడూ ఆశ్చర్యమే. వాక్య నిర్మాణం మొదలు, అప్పుతచ్చులు అస్సలు లేకుండా రాయడం వరకూ.. ఓ బండరాయిని అత్యంత జాగ్రత్తతో ఒక శిల్పంగా రూపుదిద్దే శిల్పి గుర్తొస్తాడు నాకు.

మొన్న ఆగస్టు 26 న 'అనంతం' మొదటి పుట్టిన రోజు జరుపుకుంది. గత సంవత్సరం ఇదే రోజున 'జీవన వైచిత్రి' అనే టపా తో మొదలయ్యిందీ బ్లాగు. ఇంతకీ గడిచిన పదమూడు నెలల్లోనూ ఈ బ్లాగులో ప్రచురితమైనవి కేవలం 35 టపాలు మాత్రమే. వీటిని చదువుతుంటే మాత్రం 'గంగిగోవు పాలు' 'నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు..' గుర్తురాక మానవు. ఆమధ్య 'వయసు ముచ్చట్లు' అనే టపా రాసి అందర్నీ ఆశ్చర్య పరిచారు ఉమాశంకర్. చాలా 'బోల్డ్' గా రాసిన ఆ టపాకి కొనసాగింపు ఉందని ప్రకటించారు.

ఎందుకో తెలీదు కానీ గత కొద్ది నెలలుగా నెలకి ఒక్క టపా మాత్రమే కనిపిస్తోంది ఈ బ్లాగులో. ఈ నెల టపా ఇంకా రాలేదు. ఈ బ్లాగులో టపాలు కొంచం తరచుగా వస్తే సంతోష పడే పాఠకుల్లో నేనూ ఒకడిని.

24 కామెంట్‌లు:

  1. హమ్మో ! ...ఎంత చక్కటి టపా రాసారండి ....ఒక్కసారే నేను చదువుతున్నది నమ్మలేకపోయాను' అనంతరం ' లేక అనంతం బ్లాగా అని ,...బ్లాగ్ లోకం లో నాకు అత్యంత ఇష్టమైన బ్లాగ్ 'అనంతం '....ఆఫ్కోర్స్ మీది కూడా -:) మీరు రాసిన ప్రతి అక్షరం తో నేను ఏకీభవిస్తాను. చాల చక్కటి శైలి వారిది ....నేను ఎప్పటినుండో 'వయస్సు ముచ్చట్లు' రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నాను .నాలానే ఎడురుచుసేవాళ్ళు తోడున్నారని తెలిసింది.;:). నెమలికన్ను ని మెప్పించిన బ్లాగ్ రచయితకు శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి బ్లొగ్ పరిచయం చేసారండి. వొక్కొక్క అనుభవం ప్రతివొక్కరికి ఆ అనుభవాన్ని ఇస్తోంది.ఇవన్ని రోజుకొకటన్నా చదువుతూ పోవాలి. థాంక్స్

    రిప్లయితొలగించండి
  3. so nice of you to write about the blog that left an impression on you. I did visit that blog in the past and I do concur with you.

    రిప్లయితొలగించండి
  4. నేను మీతో ఏకీభవిస్తున్నాను ఈ బ్లాగు విషయంలో.
    >>కనిపించిన టపా అల్లా చదవడమే కానీ బ్లాగు పేరు గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
    డిట్టొ.( మొదట్లో నేను కూడా ఇంతే).
    >>>ఆ టపా పేరు 'ఒక చలిలో వణికిన రాత్రి.' నేను ముందు ప్రారంభించింది కూడా ఈ టపాతోనే.
    >>మొన్న ఆగస్టు 26 న 'అనంతం' మొదటి పుట్టిన రోజు జరుపుకుంది.
    ఇంకా మంచి టపాలు రవాలని ఆశ.
    >>ఎందుకో తెలీదు కానీ గత కొద్ది నెలలుగా నెలకి ఒక్క టపా మాత్రమే కనిపిస్తోంది ఈ బ్లాగులో. ఈ నెల టపా ఇంకా రాలేదు. ఈ బ్లాగులో టపాలు కొంచం తరచుగా వస్తే సంతోష పడే పాఠకుల్లో నేనూ ఒకడిని.

    మీ టూ.

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా చెప్పేరు "అనంతం" గురించి....... అన్నిటి గురించి అవును అవును అని తల వూపుతున్నా.. ఉమశంకర్ గారు ఇంకా బోలెడన్ని పోస్ట్ లతో వస్తారని ఆశిస్తూ మా పక్కూరు ఆయనకు బ్లాగ్దినోత్సవపు శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  6. ఉమాశంకర్ గారి బ్లాగులో టపాలన్నీ నేను చదవలేదుగానీ ఆయన వయసు ముచ్చట్లు టపా చదివి ఆయన రాసే శైలికి ఫ్లాట్ అయిపోయాను. చాలా చక్కగా రాసిన టపా అది. ఆ టపా ద్వారానే నాకు ఆయన బ్లాగు పరిచయం. ఆ తర్వాత నుండి ఆ బ్లాగు ఫాలో అవుతున్నాను.

    రిప్లయితొలగించండి
  7. పుస్తక పరిచయమే అనుకున్నా ...బ్లాగ్ ని కూడా అంతే అద్భుతంగా పరిచయం చేశారు .పరిచయం ఉన్న బ్లాగ్ ఐనా కూడా మరోసారి ఆ లింక్స్ లోకి వెళ్లి చదవటం కొత్త అనుభూతినిచ్చింది . ఆ క్రెడిట్ ఉమా శంకర్ గారితోపాటూ మీది కూడా !

    రిప్లయితొలగించండి
  8. నిన్న రాత్రి ఓసారి వ్యాఖ్యలు చూసేసి మూసేసాను..మీ టపా మిస్సయ్యాను..ఇప్పుడే చూస్తున్నా..మంచి బ్లాగుని పరిచయం చేసారు..మీకొచ్చే వ్యాఖ్యల్లో తరచూ చుసే పేరే అయినా ఎప్పుడూ తొంగి చూడలేదు..దొరికే కొద్ది సమయంలో రొజూ చూసే బ్లాగులు కూడా చూడటం కుదరటంలేదు ఈ మధ్య....ఇవాళే ఆ పని ప్రారంభిస్తాను..

    (అచ్చుతప్పులు లేకుండా,నెలకో టపా వేస్తే నా బ్లాగు గురించి కూడా రాస్తారా :) :) )

    రిప్లయితొలగించండి
  9. ఇందాకా నా బ్లాగ్ గురించి రాస్తారా అని సరదాకి అన్ననండి..ఎవ్వరూ మరోలా అనుకోవద్దు.

    మీరు పరిచయం చేసారంటే ఆ బ్లాగ్ ఖచ్చితంగా చాలా గొప్పదై ఉంటుంది.ఆ రచయిత నిజంగా బాగా రాస్తూ ఉండి ఉందచ్చు.

    రిప్లయితొలగించండి
  10. బాగా రాసారు.మీరు మరో బ్లాగ్ గురి౦చి,మరో బ్లాగర్ గురి౦చి రాయట౦ నాకు చాలా నచ్చి౦ది.మీకు హ్యట్ ఆప్ అ౦డీ మురళిగారు.నేను చదివాను అన౦త౦ బ్లాగ్..నాకు నచ్చుతు౦ది..కాని అన్ని పోస్ట్లు నెను చదవలేదు..
    తప్పక చదువుతా..

    రిప్లయితొలగించండి
  11. వావ్! చాలా మంచి బ్లాగును పరిచయం చేశారు. నేనూ అతని అమెరికా ప్రయాణం టపాతోనే మొదలుపెట్టాను. అదెంతో పెద్ద టపా. కానీ ఎంతో ఆసక్తికరంగా వ్రాశారు. అతని ఆలోచనలు నచ్చుతాయి-అదే ప్రధాన కారణం ఈ బ్లాగు నచ్చటానికి.

    రిప్లయితొలగించండి
  12. @చిన్ని: నా వరకు మిగిలిన టపాలన్నీ ఒక యెత్తు, 'వయసు ముచ్చట్లు' ఒకటీ ఒక యెత్తు అండీ.. చూద్దాం, మన అభ్యర్ధన మన్నించి త్వరలోనే రాసేస్తారేమో.. ధన్యవాదాలు.
    @జయ: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @ఉష: Thank you..

    రిప్లయితొలగించండి
  13. @భాస్కర్ రామరాజు: Thank you..
    @సునీత: పర్లేదు.. కొత్తలో అందరూ అంతేనన్న మాట :-) మంచి టపాలు వస్తాయండీ.. ఎదురు చూద్దాం.. ధన్యవాదాలు.
    @భావన: 'మా పక్కూరు' అంటే మాకు ఎలా తెలుస్తుందండీ? ఇండియాలోనో, అమెరికాలోనో చెప్పాలి కదా :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @శేఖర్ పెద్దగోపు: యెంత పెద్ద టపా అయినా చివరి వరకూ వదలకుండా చదివేలా రాయడం ఆయన శైలి అండీ.. కుదిరినప్పుడు పాత టపాలు కూడా చూడండి.. ధన్యవాదాలు.
    @పరిమళం: గొప్పదనం అంటూ ఏమైనా ఉంటే అందంతా ఉమాశంకర్ గారిదేనండీ.. ఆయన బ్లాగు చదివేటప్పుడు నాకేమనిపిస్తుందో రాశాను అంతే.. ధన్యవాదాలు.
    @తృష్ణ: "మీరు పరిచయం చేసారంటే ఆ బ్లాగ్ ఖచ్చితంగా చాలా గొప్పదై ఉంటుంది." ఒక్క మాటలో చెప్పాలంటే నేను చేసిన పని సూర్యుడిని దివిటీ తో చూపించడం అండీ.. ఆయన టపాలు చదివాక మీరే ఈ మాట అంటారు. వీలు చూసుకుని చదివెయ్యండి మరి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @సుభద్ర: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @భవాని: పరిచయం కాదండి.. ఆ బ్లాగు నాకు పంచిన అనుభూతులు నెమరువేసుకున్నాను అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. వొక రచయితా లేదా భావుకుడు ముందు తన తృప్తి కోసం రాసుకుంటాడు ఆ తర్వాత కామెంట్స్ రూపం లో వొక ప్రశంసో లేదా విమర్సో వస్తే ఇంకా సంతోషిస్తాడు . ఎవరి మానాన్న వాళ్ళు వచ్చేసి ఏమి అనకుండానే వెళ్లి పొతే చాల బాధ పడతాడు. మనలో చాల మంది మంచి పోస్ట్ ని చదవడమే గాని ఆ బ్లాగ్ ని గుర్తు పెట్టుకోవడం ,నచ్చితే అభిననదించడం చాల rare గ చేస్తూ వుంటాం సమయా భావం వాళ్ళ . ఉమాశంకర్ గారు రాసిన కొన్ని పోస్ట్లు చదివి మనసులో అభినందిచిన వాళ్ళలో నేను వోకడిని అయితే అయన బ్లాగ్ అనంతం అని మీరు రాసే దాక గుర్తు పెట్టుకోలేదు అది నా తప్పే అందునా నేను సరిగ్గా సంవత్సరం క్రితం నా బ్లాగ్ ప్రారంభించిన కొత్తలో కూడలి లో కాక హోటల్ అన్న నా పోస్ట్ లో తను చాల ప్రోత్సాహకరమైన కామెంట్ పెట్టి వెన్ను తట్టి ప్రోత్సహించిన మిత్రులలో వొకరు .మీ రివ్యూ సందర్భంగా నాకు అయన రాసిన మరిన్ని పోస్ట్లు చదివే అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  17. మీ "కప్పు కాఫీ" టపాతో ఉమాశంకర్ గారి "అనంతం" పరిచయమైందండి. రెండు మూడు టపాలకి వ్యాఖ్య కూడా రాశాను. కానీ ఇంకా పబ్లిష్ కాలేదు. బహుశా ఆయన చూసివుందకపోవచ్చుననుకున్నా. నిండు గోదావరి గుర్తుకొస్తుంది ఉమాశంకర్ గారి బ్లాగ్ చూసినప్పుడల్లా.

    రిప్లయితొలగించండి
  18. Good wrietup for a good blog.. Nice job..
    I am also a regular reader of that blog..

    రిప్లయితొలగించండి
  19. మురళి ఎలా చూసినా మా పక్కూరే.. ఇండియా లో గుంటూరు ఇక్కడ కనక్టికట్ పక్కనే బోస్టన్ లో మేము వుండేది, ఎక్కడైనా పక్కూరే మరి..

    రిప్లయితొలగించండి
  20. @ప్రణీత స్వాతి: 'నిండు గోదారి'?? ఆయనది కృష్ణా తీరం కదండీ :-) ..ధన్యవాదాలు.
    @మేధ: ధన్యవాదాలు.
    @భావన: కొత్త విషయం..

    రిప్లయితొలగించండి
  21. మురళీ గారూ,
    ఈ బ్లాగు గురించి మీరు రాసినదానితో నేనూ ఏకీభవిస్తాను. నాక్కూడా ఈ బ్లాగు చాలా ఇష్టం.
    'ఒక చలిలో వణికిన రాత్రి' టపా ద్వారానే నాకు ఈ బ్లాగు పరిచయం అయింది. ఆ రోజు చూపు మరల్చకుండా చకచకా చదివేసాను ఆ టపా.. అలా చదివించేలా ఆసక్తికరంగా ఉమాశంకర్ గారు రాశారు అనడం సబబేమో.!
    ఇప్పటికీ నా దృష్టిలో అనంతం బ్లాగులో అత్యుత్తమైన టపా అంటే అదే. తరువాత మీరు చెప్పిన 'వయసు ముచ్చట్లు' టపా. ఆయన నిజాయితీగా, ముచ్చటగా రాసిన తీరుకి నేను చాలా అబ్బురపడిపోయాను. అలాగే 'మా ఇంటి కథ' నన్ను కూడా మా ఇంటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది.
    ఆయనకి కాస్త వీలు చిక్కి తరచుగా మంచి మంచి టపాలు రాయాలని కోరుకునే అభిమానుల్లో నేను ఒకదాన్ని :)
    ఒక ముచ్చటైన బ్లాగు గురించి బహుముచ్చటగా చెప్పిన మీ మంచిమనసుకు, స్నేహశీలతకు అభినందనలు.

    రిప్లయితొలగించండి