మంగళవారం, సెప్టెంబర్ 08, 2009

నాయికలు-శాంతి

చదువుకున్న, మధ్యతరగతి గృహిణి శాంతి. ఇద్దరు పిల్లల తల్లి. యెంతో భావుకత్వం ఉన్న స్త్రీ. ఆమె భర్త భాస్కరరావు ఓ ఉద్యోగి. బాధ్యతాయుతమైన గృహస్తు. భార్యా పిల్లలంటే ప్రేమ ఉన్నవాడు. అయితే, భావుకత్వం ఏమాత్రమూ లేనివాడు. ఎంత కచ్చితమైన మనిషంటే..హనీమూన్ కి వెళ్ళినప్పుడు ఓ బిచ్చగత్తె పాడిన పాట యెంతో నచ్చి శాంతి ఆమెకి ఒక రూపాయి ఇస్తే, హోటల్ రూముకి రాగానే అతను తన డైరీ తెరిచి 'ధర్మం ఒక రూపాయి' అని లెక్క రాసుకునేంత.

తన భావుకత్వాన్ని ఒక డైరీ కి పరిమితం చేసుకుని, భర్త గురించి అప్పుడప్పుడూ బాధ పడుతూ అంతలోనే సర్దుకుపోతూ ఉండే శాంతి 'మల్లాది' మార్కు నాయిక. చెల్లెలి పురిటి కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిన శాంతికి అనుకోకుండా పరిచయమవుతాడు ప్రియతమ్. బ్యాంకు ఉద్యోగి. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృదుల, ముగ్గురు పిల్లలు శ్రేష్ఠ, శ్వేత, ఉపేష్. 'అందమైన జీవితం' ప్రియతమ్ ది.

ప్రియతమ్ పరిచయం శాంతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది అన్నదే దాదాపు మూడు దశాబ్దాల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల్లో కథ. ప్రియతమ్ ని ప్రతి విషయంలోనూ భాస్కరరావుతో పోల్చుకోకుండా ఉండలేదు శాంతి. అదే సమయంలో మృదుల పై రవ్వంత అసూయ కూడా కలుగుతుంది ఆమెకి. భాస్కర రావు పట్ల తనకున్న అసంతృప్తి ని ప్రియతమ్ దగ్గర ఏమాత్రం వ్యక్తం చేయదు ఆమె.

చెల్లెలున్న ఆస్పత్రికి వెళ్ళిరావడం కోసం శాంతి, తన బ్యాంకుకి వెళ్లి రావడం కోసం ప్రియతమ్ ప్రతిరోజూ లోకల్ రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణం లో వాళ్ళిద్దరి మధ్యా ఎన్నో కబుర్లు. ప్రియతమ్ నోరు తెరిస్తే చెప్పేది మృదుల గురించీ, పిల్లల గురించీ.. ఐతే శాంతి ఇందుకు భిన్నం. ఆమె తన బాల్య జ్ఞాపకాలు నెమరు వేసుకోడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది. తన పిల్లల అల్లరి గురించి అప్పుడప్పుడూ తల్చుకుంటుంది.

మంచునీ, వాననీ, వెన్నెలనీ, సూర్యోదయాన్నీ, సూర్యాస్తమయాన్నీ ఆస్వాదించగలరు వాళ్ళిద్దరూ.. చిగురులు తొడిగే కొమ్మ, చిన్నపాప బోసినవ్వు ఇలా సమస్తమూ వాళ్లకి సంతోషాన్ని ఇచ్చేవే. ప్రియతమ్ ని చూసిన ప్రతిసారీ శాంతికి ఒకటే సందేహం. "ఇలాంటి మగవాడు, ఒక భర్త, ఒక తండ్రి ఉండడం సాధ్యమేనా?" అని. సాధ్యమే అని నిరూపిస్తున్నాడు తన ఎదురుగా ఉన్న ప్రియతమ్, కమల్ హాసన్ అంతటి అందగాడు.

ఇద్దరు పిల్లల తల్లైనా తనలో ఆకర్షణ తగ్గలేదని తెలుసు శాంతికి. అయినా ప్రియతమ్ తననేప్పుడూ 'ఆ' దృష్టి తో చూడకపోవడమూ ఆశ్చర్యమే ఆమెకి. అనేక రకాలుగా అతన్ని పరీక్షిస్తుంది.. అతనిలో ఎలాంటి 'చెడు' ఉద్దేశమూ లేదని గ్రహిస్తుంది. రాను రానూ అతను ఆమెకో మిష్టరీగా మారిపోతాడు. జీవితాన్ని రొటీన్ కి భిన్నంగా ఎలా గడపొచ్చో ఉదాహరణలతో వివరిస్తూ ఉంటాడు ప్రియతమ్. రాజమండ్రి వెళ్ళాకా వాటిని అమలు చేయాలని అనుకుంటూనే, భాస్కర రావు ఎలా స్పందిస్తాడో అని సందేహ పడుతూ ఉంటుంది శాంతి.

శాంతికి హైదరాబాద్ ని చాలా కొత్తగా చూపిస్తాడు ప్రియతమ్. సినిమా హాల్లో ప్రొజెక్టర్ రూం, చోర్ బజార్, ఇంకా ఆమె అభిమానించే రచయిత చక్రపాణి ఇలా.. శ్మశానానికి తీసుకెళ్ళి జీవితపు అంతిమ ఘట్టాన్ని చూపించడం ద్వారా, జీవితం ఎంత చిన్నదో, విలువైనదో చెబుతాడామెకి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరగడానికి తాము ఏమేం చేస్తూ ఉంటామో తరచూ వివరిస్తాడు. ఒకసారి ఆమెని తన ఇంటికి తీసుకెళతాడు కానీ అక్కడ మృదుల, పిల్లలు ఉండరు. అత్యవసరమైన పని మీద బయటకి వెళ్తున్నామని మృదుల రాసిన లెటర్ ఉంటుంది ఇంట్లో.

ప్రియతమ్ గురించి శాంతి 'పూర్తిగా' తెలుసుకోడం, ఇద్దరూ ఉత్తరాలు రాసుకోవాలనీ, స్నేహాన్ని కొనసాగించాలనీ నిర్ణయించుకోడం ఈ నవల ముగింపు. నవలలో కొన్ని కొన్ని సన్నివేశాలు చదువుతుంటే ఏదో ఇంగ్లీష్ నవల ప్రభావం అనిపించక మానదు. మధ్య మధ్య మల్లాది మార్కు జోకులకి, చిట్కాలకీ కొదవ లేదు. రెండు మూడేళ్ళ క్రితం వచ్చిన '10th క్లాస్' అనే తెలుగు సినిమాలో (సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తొలి చిత్రం) లో ఈ నవలని ఎనభై శాతం వరకూ వాడుకున్నారు. మల్లాదికి తెలుసో, తెలీదో మరి. ఇప్పటికీ మల్లాది నవలల్లో నాకు ఇష్టమైన నవల 'అందమైన జీవితం.'

24 కామెంట్‌లు:

  1. మరో అందమైన పరిచయం ! నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మీరు పరిచయం చేయటం వల్ల ఇంతందంగా ...ఆసక్తికరంగా ఉంటుందేమో ....మామూలుగా చదివేస్తే ఈ ఫీల్ రాదేమోని !
    ఇంతకూ మృదుల , పిల్లలు ఉన్నారా ?లేక కల్పిత పాత్రలా ?మీరు చెప్పనేలేదు :(
    మూడు దశాబ్దాల క్రిందటి నవలన్నారుగా ...చెప్పేయొచ్చు కదండీ ...కొత్త సినిమా రివ్యులాగా ముగింపు దాచేశారు :(

    రిప్లయితొలగించండి
  2. బావుందండి పరిచయం..ఇంతకు మునుపు చదవలేదు ఈ నవల.

    రిప్లయితొలగించండి
  3. మీరు మల్లాది "మేఘమాల" గురించి రాస్తే ఎలా రాస్తారో చదవాలని వుంది :P

    రిప్లయితొలగించండి
  4. ఎప్పుడో ఒక నవల మల్లాదిదే అనుకుంటాను చదివాను. పేరు గుర్తులేదు. అతని భార్యా బిడ్డలు చని పోతారు. కాని వాళ్ళనే నిజంగా ఉన్నట్లే ఊహించుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా అంతా రోటీన్ గానే భావిస్తు ఉంటాడు. ఈ విషయం నవల చివరి వరకు తెలియదు. నాకూ '10 క్లాస్ ' సినెమా చూసినప్పుడు కూడ లీలగా ఈ నవలే గుర్తుకు వొచ్హింది. నేను చదివిన నవల, మీరు పరిచయం చేసిన 'అందమైన జీవితం ' రెండూ ఒకటే కాదుకదా! మీ విశ్లేషణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. మంచి నవల 'అందమైన జీవితం' ని గుర్తు చేసారు. నేను సాధారణంగా నవలలు చదవను.
    కాని ఈ నవల నాకు చాలా ఇష్టం.
    ఎంత ఇష్టమంటే, పెళ్ళికి ముందు నా (కాబోయే) భార్యకి నేను ఇచ్చిన కానుకలలో ఇదొకటి.
    స్వాతి వారపత్రిక వచ్చిన కొత్తల్లో సీరియల్ గా వచ్చిందని గుర్తు.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు, మంచి పుస్తకం పరిచయం చేశారు. అనుకోకుండా నా చేతికొచ్చిన పుస్తకం. మల్లాది పాట్ బాయిలర్స్ ఏం చదువుతాంలే అని చాన్నాళ్ళు ముట్టుకోలేదు. కానీ ఒకరోజు చదవడానికి అదొక్క తెలుగుపుస్తకమే మిగిలి చదివాను. నిజంగా ఇదో అందమైన పుస్తకం. తరువాత నా కాపీ కొనుక్కుని బొళ్డంత మందితో చదివించాను. i hope this is malladis original work. ఇప్పటి వరకు మీరు చదవకపోతే చదవాల్సిందే.
    జయగారు, పాపం మురళిగారు అంత కష్టపడి ముగింపు దాచితే మీరు ఇలా తీసేసారు గాలి.

    రిప్లయితొలగించండి
  7. అయితే 'బుడుగు ' గారు నేను చదివిన బుక్, మురళి గారు రాసిన 'అందమైన జీవితం ' ఒకటే నంటారా. ఇంక నేను ఈ సస్పెన్స్ భరించలేను. దయచేసి మీరైన చెప్పండి.నేను ఎలాగైన ఈ బుక్ మళ్ళీ చదవల్సిందే . ఇది గాలి తీయటం కాదండి. నా క్యూరియాసిటీ అంతే

    రిప్లయితొలగించండి
  8. @పరిమళం: ముగింపు చెప్పేస్తే చదివేటప్పుడు ఫీల్ పోతోంది అంటున్నారని రాయలేదండి.. అయినా ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా :-) చాలా పెద్ద ప్రశంశ ఇచ్చారు నాకు.. ధన్యవాదాలు.
    @తృష్ణ: చదవాల్సిన పుస్తకం అండీ.. ధన్యవాదాలు.
    @మెహెర్: చూడండి..చూడండి :-) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @లక్ష్మి: చదవండి.. త్వరలోనే కొత్త ప్రింట్ వస్తుందిట.. ధన్యవాదాలు.
    @జయ: రెండూ ఒకటేనండీ.. ముగింపు చెప్పడాన్ని గురించి లోగడ కొందరు బ్లాగ్మిత్రులు చేసిన సూచన దృష్టిలో ఉంచుకుని నేను క్లైమాక్స్ రాయలేదు.. మీరు చదివి ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @బోనగిరి: ఎవరికైనా బహుమతిగా ఇవ్వదగ్గ నవల.. మల్లాది మార్కు రొమాన్సు శృతి మించక పోవడం ఈ నవల ప్రత్యేకత.. అసలు మొత్తం నవల గురించి ఓ టపా రాయొచ్చండీ (ఈ టపా కేవలం శాంతి గురించి మాత్రమే) ..ధన్యవాదాలు.
    @బుడుగు: నేను మొదట సీరియల్ చదివానండీ..'స్వాతి' లో అని జ్ఞాపకం. తెగ నచ్చేసింది.. ప్రియతమ్ చెప్పే కొన్ని సంగతులు.. అంటే ఆల్మనాక్ లాంటివి, ఇంకా కొన్ని జోకులు చదివినప్పుడు ఏదైనా ఇంగ్లీష్ నవల ప్రభావం ఉండి ఉండొచ్చు అనిపించింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @జయ: అయ్యో..సారీ ఎందుకండీ.. తప్పేముంది ఇందులో.. నిజానికి మన మిత్రులు ముగింపు చెప్పమని అడిగారు కదా.. నా బదులు మీరు చెప్పారు అంతే కదా.. కాబట్టి.. నో సారీ..

    రిప్లయితొలగించండి
  12. చాల మంచి పుస్తకం పరిచయం చేసారు,అప్పుడప్పుడు చదువుతుంటాను కొన్ని పేజిలైన.....

    రిప్లయితొలగించండి
  13. పరిమళంగారు, పుస్తకమైనా సినిమా అయినా, ఎంత పాతదైనా, ముగింపు చెప్పకపోవడమే సరైన పద్ధతి.

    మురళి గారి సాహిత్య పరిచయాలు గొప్పగా ఉంటాయి .. ఆ కోవలోనే ఇదీనూ.

    రిప్లయితొలగించండి
  14. కొత్త పుస్తకం..!!నేను కొనుక్కోవాల్సిన పుస్తకాల సంఖ్య లో మరో ఆణి ముత్యాన్ని చేర్చారన్నమాట.
    చాలా బాగా రాశారండి.
    మొన్నవిశాలాంద్రలో చూసిన "నెమలి కన్ను" మీదేనేమో..కొంచం చెప్పరూ..

    రిప్లయితొలగించండి
  15. మరో మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మురళి జి. ఇంట్లో భార్యా పిల్లల బదులు లెటర్ అనగానే సగంమంది, ప్రియతమ్ గురించి ’పూర్తిగా’ తెలుసుకుని అనగానే చాలా మంది ముగింపు ను ఊహించేసి ఉంటారండీ.. మురళి గారు అసాధ్యులు, భలే క్లూస్ ఇచ్చేస్తారు :-)

    రిప్లయితొలగించండి
  16. @చిన్ని: నిజమేనండి.. కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @ప్రణీత స్వాతి: తప్పక చదవండి.. నేను రాసేది 'నెమలికన్ను' బ్లాగు మాత్రమేనండి.. జి.ఆర్. మహర్షి అనే ఆయన రాసిన 'నెమలికన్ను' పుస్తకాన్ని నేనూ చూశాను. ఆయన కొన్ని కథలు కూడా రాశారు. సాక్షి ఫండే లో వీక్లీ కాలం రాస్తూ ఉంటారు. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: "మురళి గారు అసాధ్యులు, భలే క్లూస్ ఇచ్చేస్తారు :-)" అసాధ్యులు క్లూలు ఇవ్వరండీ :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. nenu ee navalani 10 th class iyopoyaka summer lo chadivanu...appudu ma pedakkaku pap puttindhi,, nenu kuda aa papaku Chikky ani pettanu... idi Priyatham select chesina peru..
    ippatiki nenu priyatham nu follow avuthunaa konni visayallo...

    రిప్లయితొలగించండి
  19. @మహిపాల్: నన్ను కూడా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేసిందండీ ఈ పుస్తకం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. చాల మంచి నవలని పరిచయం చేసారు, నేను తొమ్మిదో క్లాసులో ఉండగా మొదటసారి చదివాను ఈ నవలని, తర్వాత చాలా సార్లు చదివా. నేను చదివిన పుస్తకం లో ముగింపు పేజీలు మిస్సింగ్. శాంతి కి మృదుల, పిల్లలు లేరని తెలిసాక ప్రియతమ్ ని కలవటానికి వెళుతుంది అంతవరకే ఉంది. బెంగుళూరు వచ్చాక చాల ప్రయత్నించాను ఈ నవల కోసం కాని ఎక్కడ దొరకలేదు. కొత్త ప్రింట్ వస్తుందన్నారు, దయచేసి బెంగుళూరు లో ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే చెప్పండి. మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటె పంపించండి.

    నవల చదివినప్పుడు నేను కూడా ప్రియతమ్ లాగానే ఉండాలని అనుకునే వాణ్ని కాని అది అంత సులభం కాదని తర్వాత తెలిసింది. రైలింజన్ లో ప్రయానించాలని ఈ నవల చదివాక అనిపించేది అదీ కుదర్లేదు.. :)

    రిప్లయితొలగించండి
  21. @నాగ: సాఫ్ట్ కాపీ లేదండి.. బెంగుళూరు లో తెలుగు పుస్తకాల ప్రదర్శన జరిగే చోట దొరుకుతుందండీ.. బహుశా వచ్చే నెలలో మార్కెట్లోకి వస్తుంది కొత్త ప్రింట్. ప్రియతమ్ లాగా ఉండడం.. కొంచం కష్టమే.. ప్రయత్నించండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి