శనివారం, ఆగస్టు 08, 2009

బాధ్యత

ఏదైనా పని చేసినప్పుడు విజయం మనల్ని వరిస్తే అది మనవల్లే అని చెప్పడం, పరాజయం పాలైతే అందుకు నెపాన్ని మరొకరికి నెట్టడం మానవ నైజం. గెలుపులో ఓ మత్తు ఉంటుంది.. అది మన కళ్ళకి గంతలు కడుతుంది. ఫలితంగా మనం ఆ గెలుపు సాధించడానికి సాయపడ్డ వాళ్ళని తాత్కాలికంగానైనా మర్చిపోయేలా చేస్తుంది. అదే వైఫల్యం ఐతే మన ఇగో ని దెబ్బ తీస్తుంది. 'నా అంతటి వాడు ఓడిపోవడం ఏమిటి?' అనిపిస్తుంది. ఓటమికి కారణం మనం కాదు మరెవరో అనిపిస్తుంది.

చిన్నప్పుడు క్లాసులో మంచి మార్కులు వస్తే 'కష్టపడి చదివాను.. అందుకే మార్కులు వచ్చాయి' అంటాం. అదే మార్కులు సరిగ్గా రాకపోతే 'మేష్టారు సరిగ్గా పాఠం చెప్పలేదు' అనేస్తాం. అంతేనా? 'మేష్టారికి ఫలానా వాళ్ళంటే ఇష్టం..అందుకే నేనెంత చదివినా వాళ్ళకే మార్కులు వేస్తారు' అని ప్రచారం చేయడానికీ వెనుకాడం. ఇదే ప్రచారం ఎవరైనా మనమీద చేస్తే వాళ్ళని 'కుళ్ళుబోతు' అంటాం.

ఉద్యోగంలో మనం చాలా కష్టపడి పనిచేస్తాం.. (కనీసం మనం అలా అనుకుంటూ ఉంటాం) ప్రమోషన్ వస్తే అది మన ప్రతిభే.. మనకి కాకుండా పక్కవాడికి వస్తే వాడు బాసుని కాకా పట్టి తెచ్చుకున్నాడు.. ఈ రెండు వాదనలూ మన దగ్గర సిద్ధంగా ఉంటాయి. మనకి ప్రమోషన్ ఇచ్చిన బాస్ దేవుడు..ఆయనకి ప్రతిభని గుర్తించడం తెలుసు. అదే ప్రమోషన్ పక్కవాడికి ఇస్తే ఆ బాస్ ఓ పెద్ద ఫూల్.. మనం సరిగ్గా పని చేయకపోవడం అనే కారణం ఉండి ఉంటుందని మనకి తోచదు.

విజయానికి బాధ్యత వహించడానికి ఉత్సాహ పడే వ్యక్తులు మనకి అన్నిచోట్లా తారస పడతారు. ముఖ్యంగా సిని, రాజకీయ రంగాల్లో కొంచం ఎక్కువగా కనిపిస్తారు. సినిమా హిట్టయ్యిందంటే 'అది నా ప్రతిభే' అని హీరో, దర్శకుడూ విడివిడిగా ప్రకటనలిస్తారు. ఆ సినిమా కోసం వాళ్ళెంత కష్టపడ్డారో ఇంటర్వ్యూలు ఇస్తారు, అలుపు లేకుండా. తర్వాత వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది. నిర్మాత కూడా సంపాదించింది ఖర్చయ్యే వరకూ సినిమాలు తీస్తూనే ఉంటాడు.

సినిమా ఫెయిలయితే మాత్రం హీరో, దర్శకుడూ కూడా వేలెత్తి చూపేది నిర్మాతనే. "నిర్మాత ఖర్చుకి వెనుకాడ్డంతో అనుకున్న క్వాలిటీ రాలేదు" అంటాడు దర్శకుడు. "నా ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా లేదు.. పబ్లిసిటీ కూడా సరిగ్గా లేదు.. నా అభిమానులు చాలా నిరాశ పడ్డారు" అంటాడు హీరో. నిర్మాతకి సొమ్ము పోవడంతో పాటు, పెద్ద హీరో, దర్శకులతో సినిమా తీసే చాన్సు కూడా శాశ్వతంగా పోయినా పోతుంది. ఒక్కోసారి దర్శకుడూ, పాపం హీరోయిన్నూ కూడా ఫ్లాపుకి బాధ్యత వహించాల్సి వస్తూ ఉంటుంది.

రాజకీయాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. గడిచిన ఐదేళ్లూ రాష్ట్రంలో చక్కగా వర్షాలు కురిశాయి. ప్రభుత్వం వరుణదేవుడికి అడక్కపోయినా తమ పార్టీ సభ్యత్వం ఇచ్చేసింది. (సభ్యత్వ రుసుము ఎవరు కట్టారో తెలీదు) సమయానికి వర్షాలు కురిపించినందుకు ఆయనకి కృతఙ్ఞతలు చెబుతూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. (ఆయన కూడా పేపర్లు చదువుతాడని నాకు అప్పటివరకూ తెలీదు) వర్షాలు కురిసినందుకు పూర్తి బాధ్యత వహించింది.

ఇప్పుడేమో వర్షఋతువు సగం గడిచినా చినుకు రాలలేదు. వరుణ దేవుడు పార్టీ పదవి ఇవ్వలేదని అలిగాడో ఏమిటో తెలీదు కానీ చుక్క రాల్చలేదు. గడిచిన ఐదేళ్లూ వర్షాలు పడితేనే ధరలు ఇలా ఉన్నాయంటే, ఇప్పుడు వర్షాలు లేకపొతే భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో ఆలోచించడానికి ధైర్యం చాలడం లేదు. వర్షం కురవకపోడానికి ప్రభుత్వం బాధ్యత వహించడం లేదు. కనీసం వరుణ దేవుడిని నిలదీస్తూ ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. అసలు వర్షం విషయమే మర్చిపోయినట్టుంది.

విజయమైనా, వైఫల్యమైనా అందుకు పూర్తి బాధ్యత ఒక్కరిదే అవ్వదు. మనకి విజయం వచ్చినప్పుడు అందులో మరొకరి వాటాని అంగీకరించగల విశాలత్వం, వైఫల్యానికి బాధ్యత తీసుకోగల గుండె ధైర్యం, ఆత్మ విశ్వాసం అవసరం. ఇది రాత్రికి రాత్రి అలవడేది కాదు.. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కానిదీ ఏదీ లేదు.

15 కామెంట్‌లు:

  1. మరే నండీ.
    ఏ విషయంలో నైనా సరే బాధ్యతను స్వీకరించే వాడే నిజమైన నాయకుడు.

    రిప్లయితొలగించండి
  2. బాగు౦ది మీ పొస్ట్....
    మరి మన గర్నమె౦ట్ ఈ సారి వరుణుడు కరుణ లెక పొవటానికి కారణ౦ త్వరలోనే చెపుతారు.ఖచ్చిత౦గా బాబే కారణ౦ అ౦టారు.
    వాళ్ళు వీళ్ళా మీద వీళ్ళు మీద మన౦ ఎర్రి మొహలు వేసుకుని అలాగ అనాలని వాళ్ళ తాపత్రయ౦.

    రిప్లయితొలగించండి
  3. Good subject, I can only concur with you. Many experiences to relate to the content in the post. Lack of time yet. Sorry.

    రిప్లయితొలగించండి
  4. ఆశక్తిగా రాశారు. మంచి అంశం.
    @సుభద్ర గారు :))

    రిప్లయితొలగించండి
  5. మీకు తెలిదా ! విజయం అందరి బిడ్డ ......అపజయం అనాధ కదూ.......ఇది అత్యంత సహజం.

    రిప్లయితొలగించండి
  6. మంచి విషయం. వరుణుడు పార్టీ మార్చేసిన సంగతి మీకింకా తెలియదా? :)
    చిన్నిగారూ, సూపర్.

    రిప్లయితొలగించండి
  7. మీ టపాలో మొదటి పేరా నేను చాలా సార్లు అనుకునే మాటలు.....!ఎవరో ఎక్కడో వ్యాఖ్య రాసినట్లు...మనం అనుకునే మాటలు,ఆలోచనలూ ఎక్కడో అక్కడ ఏదో ఒక టపాలో కనిపిస్తూ ఉంటాయి...మంచి విషయం చర్చకు తెచ్చారు.బాగుందండీ.

    రిప్లయితొలగించండి
  8. @రఘు: ధన్యవాదాలు.
    @విశ్వప్రేమికుడు: అంతేకదండీ మరి.. ధన్యవాదాలు.
    @సుభద్ర: జరుగుతున్నది అదేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @పద్మార్పిత: ధన్యవాదాలు
    @ఉష: అరె..మీకు టైం దొరికి ఉంటే బాగుందేదండీ.. మీ నుంచి కూడా వినేవాళ్ళం.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @శ్రీ: ధన్యవాదాలు..
    @చిన్ని: ఒక్క ముక్కలో చెప్పారు కదా... ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: అంటే వేరే పార్టీ వాళ్ళెవరూ 'వరుణుడు మా పార్టీ' అని ఇంకా చెప్పలేదు కదండీ..ఆయనేమో నోరు
    విప్పుడు :-) ..ధన్యవాదాలు.
    @తృష్ణ: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. ఈ పద్దతి మనవరకూ పరిమితమయితే కనీసం పరవాలేదు అనుకోవచ్చు. కానీ మరీ ప్రభుత్వం కూడా ఇలా ఉండటం మన దురదృష్టం.

    రిప్లయితొలగించండి
  12. @భవాని: యధాప్రజా..తధా రాజా :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి