గురువారం, ఆగస్టు 27, 2009

యూటర్న్

నిత్యం నోట్ల కట్టలతో సహజీవనం చేసే ఓ మల్టి మిలియనీర్ తన యాభై ఐదేళ్ళ వయసులో జీవిత గమనాన్ని మార్చుకునేలా చేసిందో పదేళ్ళ పిల్ల. అతని సంపదని, సంపాదనా కాంక్షనీ చాలెంజ్ చేసింది తన చర్య ద్వారా.. అంతటి వ్యాపార సామ్రాట్టూ ఆ పిల్లకి తాను వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఇలాంటి సంఘటనలు కథల్లో మాత్రమే సాధ్యమనిపిస్తాయి కదా? అవును, ఇది కథే. పేరు 'యూటర్న్' రచయిత దగ్గుమాటి పద్మాకర్.

మూడేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథలో నాయకుడు వసంత సేన్. అతను చేయని వ్యాపారం లేదు. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు. ప్రధానమంత్రిని నేరుగా కలుసుకోగల అతి కొద్ది మంది ప్రముఖుల్లో అతనూ ఒకడు. అతని ఒక్కగానొక్క కూతురూ ఐఏఎస్ కి ఎంపికై, ట్రైనింగ్ లోనే మరో ఐఏఎస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక దశ కి వచ్చాక జీవితం రొటీన్ గా అనిపించడం మొదలు పెట్టింది సేన్ కి.

మిత్రుడు, సైకాలజిస్టు డాక్టర్ శాంతారాం సలహా మేరకు జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటాడు సేన్. ప్రతి మూడు నాలుగు నెలలకీ ఒకసారి ఒక సామాన్యుడిలా సామాన్యులతో కలిసి కొద్ది రోజులు గడపడం వాటిలో ఒకటి. ఈ క్రమంలోనే ఒకసారి హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ నడుపుతున్న ఒక స్కూల్ కి వెళ్తాడు. అక్కడ హెడ్ మేష్టారు గా పని చేస్తున్న తన చిన్ననాటి మిత్రుడి సాయంతో ఓ మూడు రోజుల పాటు అక్కడి పిల్లలకి పాఠాలు చెప్పాలనుకుంటాడు.

సూటు, బూటు, బాడీ స్ప్రే, జెల్.. ఇలాంటివన్నీ వదిలి సింపుల్ గా తయారయ్యి స్కూలుకి వెళ్తాడు సేన్. మూడో తరగతి పిల్లలకి క్లాసు తీసుకుంటాడు. వాళ్ళ చేత ఆడిస్తాడు, పాడిస్తాడు. వాళ్ళు లెక్కల్లో వీక్ గా ఉన్నారని గమనించి, వైకుంఠపాళీ ఆడించి కూడికలు చురుగ్గా చేయగలిగేలా చేస్తాడు. రెండో రోజున క్లాసులో తను మర్నాడు వెళ్లిపోతున్నాననీ, పిల్లలందరికీ బహుమతులు ఇస్తాననీ, వాళ్ళంతా కూడా తనకి బహుమతులు ఇవ్వాలనీ చెబుతాడు. కాగితం మీద బొమ్మ గీసుకొచ్చినా చాలని చెబుతాడు.

మరికొన్ని రోజులు ఉండమని పిల్లలంతా బతిమాలినా తిరస్కరిస్తాడు సేన్. మర్నాడు పిల్లలందరికీ మ్యూజిక్ బాక్సులు కానుకగా ఇస్తాడు. పిల్లలు ఒక్కొక్కరూ బహుమతులు ఇవ్వడం మొదలు పెడతారు. రంగు పెన్సిలు, జెండా, కాగితం మీద వసంత సేన్ సారు గారికి అని రాసి స్పార్క్స్ చల్లి చేసిన ఆర్టూ ఇలా ఒక్కొక్కరూ వాళ్ళు తెచ్చిన బహుమతి ఇస్తారు. అందరికన్నా ఆఖర్న వస్తుంది శకుంతల.. సుమారు రెండు కేజీల బరువుండే నల్ల క్యారీ బ్యాగ్ మోసుకుంటూ.

ఆ సంచి అందుకుని "ఏమిటివి శకుంతలా?" అని అడుగుతాడు సేన్. "బలపాలు సార్" చెబుతుందా పిల్ల. అవన్నీ టేబిల్ మీద గుమ్మరిస్తాడు. "ఎందుకిన్ని దాచావు?" అని అడిగితే, ఆ పిల్ల "ఇది కూడా తెలియదా?" అన్నట్టు చూసి "రాసుకోడానికి సార్" అంటుంది, తను రెండేళ్ళు కష్టపడి దాచుకున్న బలపాలు, మంచి సార్ కదా అని ఇస్తే ఈయనేమిటీ ఇలా అడుగుతాడు అనుకుంటూ.

"అది కాదు శకుంతలా.. రెండేళ్లుగా మీ క్లాసులో యెంతో మంది పిల్లలు బలపాలు లేక దెబ్బలు తిని ఉంటారు కదా.. వాళ్లకి ఇస్తే..." ఉన్నట్టుండి మాటాడ్డం ఆపేస్తాడు సేన్.. అతనికి తన కోట్లాది రూపాయల సంపద గుర్తొస్తుంది. అదంతా టేబిల్ మీద కుప్పగా పోసిన బలపాల్లా అనిపిస్తుంది. మరో పక్క సేన్ మాటలకి శకుంతల ఏడ్చేస్తుంది. ఆమెని ఊరుకోబెట్టడం కోసం "కష్టపడి దాచుకున్నావు కదా? నాకు ఇష్టంగానే ఇస్తున్నావా?" అని అడుగుతాడు. తనకి ఇష్టమేనని నవ్వుతూ చెబుతుంది శకుంతల.

పిల్లలందరితోనూ ఫోటోలు దిగి, శకుంతలతో విడిగా ఓ ఫోటో దిగి, వాళ్ళిచ్చిన బహుమతులతో వెను తిరుగుతాడు సేన్. ఇంటికి వచ్చాక అతనిలో ఆలోచన మొదలవుతుంది. ఏ పని చేస్తున్నా అది బలపాలు కూడబెట్టడం లాగే అనిపిస్తుంది. అశాంతి పెరిగిపోతుంది. ఇక తప్పనిసరై శాంతారాం సలహా అడుగుతాడు సేన్. అతనితో చర్చించాక, తన వారసులు ఓ పది తరాలకి సరిపోయే ఆస్తి విల్లు రాసి మిగిలిన దానితో వీలైనన్ని స్కూళ్ళు ప్రారంభించి ఉచిత విద్య అందించాలని, స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ స్కూలు కోసం ఏదైనా చేసేలా చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించుకుంటాడు.

22 కామెంట్‌లు:

  1. chaalaa baagumdi murali gaaru.
    mee valla naaku chaalaa pustakaalu gurimchi telustundi.nenu note chasukuntunna konavalasina vatini.

    రిప్లయితొలగించండి
  2. వాస్తవంగా జరిగే అవకాశం లేదనిపిస్తున్నా.. కథ చాలా ఆసక్తికరంగా ఉంది.
    ఇలాంటివి చదివితే, నిజంగా ఇలా జరిగితే బాగుండు అనిపిస్తుంటుంది నాకు.
    ఇందులో కథానాయకుడిలాగా మనం మల్టీ మిలియనీర్లు కాకపోయినా, మనం కూడా మన లెవెల్లో ఎంతో కొంత బలపాల కుప్పలు చేసుకుంటూనే ఉంటాం కాబట్టి.. ఇది అందరూ ఓసారి ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తోంది.
    చక్కటి కథని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మురళి గారూ..

    రిప్లయితొలగించండి
  3. ఇంచుమించు ఇదే ఐడియాలజీతో ఒక ధర్మాత్ముడు అమెరికాలో లైబ్రరీలకు తన యావదాస్తీ దానం చేసాడు.
    ఆ డబ్బుతో వాళ్ళు వాటిని ఎంతగా అభివ్రుద్ది పరిచారో చూసి తెలుసుకోవలసిందే గాని చెప్ప వీలు కాదు. మంచి కధ.

    రిప్లయితొలగించండి
  4. చిన్న కాన్సెప్ట్ ,మంచి ట్విస్ట్ ఫైనల్ గా మంచి కథ .మాతో పంచుకున్నదుకు thanks

    రిప్లయితొలగించండి
  5. మంచి కధని పరిచయం చేసారు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  6. అందరు ఆచరించ వలసిన కథ ....chala chaala baagundhi

    రిప్లయితొలగించండి
  7. వావ్ మరో మంచి కధ పరిచయం చేశారు మురళి.

    రిప్లయితొలగించండి
  8. కధ బాగుందండి.చాలావరకూ చిన్నపిల్లలు మాత్రమే నిస్వార్ధమైన ఆలొచనలు చెయ్యగలరు అనిపిస్తు ఉంటుంది ఒకొసారి...

    రిప్లయితొలగించండి
  9. బాగుంది మురళి. పోగుపెట్టిన బలపాలు పెరిగే కొద్ది భారమెక్కువవుతుంది. పోగు చెయ్యకనే పోయినా భారమవుతుంది. ఏమిటో :-|

    రిప్లయితొలగించండి
  10. @సుభద్ర: ధన్యవాదాలు.. చదివాక మీరు కూడా టపాలు రాయండి, పుస్తకాల గురించి.
    @మధురవాణి: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @సునీత: ఆ పెద్దాయన్ని పరిచయం చేస్తూ ఓ టపా రాయొచ్చు కదండీ..? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @లక్ష్మి: ధన్యవాదాలు
    @మాఊరు: నేరేషన్ కూడా బాగుందండీ.. ఎక్కడైనా కథా సంకలనం లో వస్తే అందరికీ చదివే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @కొత్తపాళీ: మొదటిసారి చదివినప్పుడు నాకూ అలాగే అనిపించిందండీ.. నేరేషన్ చాలా బాగుంది.. ఎక్కడో ఒకచోట జరిగే అవకాశం లేకపోలేదు అనిపించింది.. ధన్యవాదాలు.
    @చిన్ని: నిజమేనండీ.. మొత్తం ఆస్తులు కాకపోయినా మనం చేయగలిగింది చేస్తే బాగుంటుంది.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @తృష్ణ: నిజమేనండీ.. చిన్నపిల్లల ఆలోచనా విధానమే వేరు.. ధన్యవాదాలు.
    @భావన: జీవన వైచిత్రి... ధన్యవాదాలు.
    @కుమార్: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. కధ చాలా బాగుంది మురళిగారూ..
    మేము కూడా (కేవలం మా కుటుంబ సభ్యులం) అంతా కలిసి మా తాతగారి జ్ఞాపకార్ధం మూడేళ్ళ క్రితం "సంరక్షణ" అనే చిన్న ట్రస్ట్ పెట్టాం. మొదటి సంవత్సరం ఏ వసతులు లేని ఒక వృద్దాశ్రమానికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాము. రెండో సంవత్సరం నించి ఇక్కడే ఒక స్కూల్ ని అడాప్ట్(స్లమ్ ఏరియా లో) చేసుకుని మా సహకారాన్ని అందిస్తున్నాం(అంత పెద్ద స్థాయిలో కాదులెండి). ప్రతీ నెల మా సాలరీస్ లోంచి కొంత "సంరక్షణ" ఎకౌంటు లో వేసేస్తాం. దానితో వారికి కావలసినవి (అంచలంచలుగానే అనుకోండి) సమకూరుస్తున్నాం.

    రిప్లయితొలగించండి
  15. @ప్రణీత స్వాతి: గ్రేట్ అండి.. చాలా మంచి పని చేస్తున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకి అభినందనలు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. కధ బావుంది ...వాస్తవంలో కూడా ఇలాంటివి జరిగితే బావుండుననిపించింది .

    రిప్లయితొలగించండి
  17. @పరిమళం:నిజమేనండి.. చదివిన ప్రతిసారీ నాక్కూడా అలాగే అనిపిస్తుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. పదేళ్ల తర్వాత చదవగలిగాను. కథా రచయితగా మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @దగ్గుమాటి పద్మాకర్: చాలా సంతోషం అండీ.. ధన్యవాదాలు. 

    రిప్లయితొలగించండి