మంగళవారం, ఆగస్టు 18, 2009

అన్నం కావాలి

చిన్నప్పుడు నాకు తడిమట్టితో బొమ్మలు చేసి ఆడుకోవడం సరదా.. బొంగరాలతో పాటు కూరగాయలు, జంతువులు ఇలా రకరకాల బొమ్మలు చేసేవాడిని. (వాటిని నేను బొమ్మలనే అనేవాడిని, చూడ్డానికి అలా లేకపోయినా) మర్నాటికి అవి పెళుసెక్కి ఎందుకూ పనికొచ్చేవి కాదు. ఓసారి నేను బొమ్మలకోసం మట్టి తెచ్చుకోడానికి తోటలోకి వెళ్తుంటే అమ్మ అడ్డుకుంది.. "గోళ్ళనిండా మట్టి చూసి తాతగారు కొప్పడుతున్నారు" అంటూ..

నేను బొమ్మలు చేయాలని పట్టుబట్టేసరికి ప్రత్యామ్నాయంగా మైదాపిండి తడిపి ముద్ద చేసి ఇచ్చింది. అప్పటి నా క్రియేటివిటీ అంతా ఉపయోగించి నేనో బల్లి బొమ్మ తయారు చేశాను. రెండు ఆవ గింజలు సంపాదించి కళ్ళు పెట్టేసరికి అది పరాగ్గా చూస్తే బల్లి అనుకునేలా తయారైంది. మా ఇంట్లో బల్లులకి లోటు లేకపోవడంతో గోడమీద సజీవ బల్లులని చూస్తూ నా బొమ్మకి మెరుగులు దిద్దాను. అమ్మేదో పనిలో ఉండేసరికి ఆ బొమ్మని బామ్మకి చూపిద్దామని ఉత్సాహంగా వంటింట్లోకి బయలుదేరాను.

వంటగది గుమ్మం దాటి లోపలి పిల్లలకి ప్రవేశం ఉండేది కాదు. దాంతో గుమ్మంలో నిలబడి బామ్మని పిలిచాను. ఆవిడ వంట హడావిడిలో పరాగ్గా చూసి, నేను నిజం బల్లిని వేట చేసి తెచ్చాననుకుని తిట్టడం మొదలు పెట్టింది. 'ఎవర్నీ ముట్టుకోకు..బట్టలిప్పేసే స్నానం చెయ్యి..' అని ఆవిడ హడావిడి చేస్తుండగా అమ్మొచ్చి నన్ను రక్షించింది. నేను కష్టపడి బొమ్మ చేస్తే మెచ్చుకోకపోగా తిట్టిన బామ్మ మీద నాకు సహజంగానే బోల్డంత కోపం వచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.

ఆవేళ శనివారం. మా ఇంట్లో ఒంటి పొద్దు. అంటే మధ్యాహ్నం మామూలుగానే అన్నాలు తినేస్తారు కానీ రాత్రి అన్నం బదులు ఇడ్లీలు, మినపరొట్టి, పెసరట్లు, పిండి పులిహోర..ఇలా ఏదో ఒక టిఫిన్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళ కోసం. పిల్లలకి రెండు పూటలా అన్నాలే. కావాలంటే టిఫిన్ కూడా తినొచ్చు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అమ్మ, బామ్మ మాట్లాడుకుంటుంటే అనుకోకుండా నా చెవిన పడిందో సంగతి. విషయం ఏమిటంటే రాత్రికి ఒక చిన్న అన్నం కరుడు మాత్రం మిగిలింది.

"వాడి మొహం.. వాడు ఇంతకన్నా తింటాడా అత్తయ్య గారూ.. అంతగా ఐతే ఆ చేసేదేదో కొంచం ఎక్కువగా పెడదాం.. మళ్ళీ వాడికోసం వండడం ఎందుకూ" అంటోంది అమ్మ. రాత్రి వంట గురించి చర్చలు అన్నమాట. బామ్మేమో "సరే సరే అలాగే చేద్దాం" అంటోంది. వీళ్ళిద్దరూ కలిసి నాకేదో అన్యాయం తలపెడుతున్నారని అర్ధమయ్యింది. అసలే బల్లి తాలూకు అవమానం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు నన్నెవరు రక్షిస్తారు, తాతయ్య తప్ప?

తాతయ్య సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం.. ఎదురెళ్ళి చెప్పేశా.. "రాత్రికి నాకు అన్నం వండరుట.. మధ్యాహ్నంది కొంచం ఉంటే అదే పెడతారుట" అని కొంచం దీనంగా చెప్పేశా.. అసలే బయటినుంచి చిరాగ్గా వచ్చారేమో, తాతయ్యకి బోల్డంత కోపం వచ్చేసింది. ఆయన కోసం అమ్మ మంచినీళ్ళ గ్లాసు తెచ్చింది. "మీ అత్తగారు లేదా అమ్మా?" అని అడిగారు. కోడళ్ళని ఏమీ అనకూడదని ఆయన పాలసీ. బామ్మ రాగానే అగ్గి రాముడైపోయారు.

"చంటి వెధవకి కాస్త అన్నం వండలేరా? ఏం.. వాడి తిండి దగ్గరే పొదుపు గుర్తొచ్చిందా?" అని ఇంకా ఏవేవో అని, నాకోసం వంట చెయ్యమని ఆర్డరేసి, బయటకి ప్రయాణమయ్యారు, ఊళ్ళో షికారుకి. వెనకాలే నేను. రాత్రి వంట అమ్మ డ్యూటీ.. అమ్మ టిఫిన్ పనిలో బిజీ గా ఉండడంతో నా వంట బామ్మమీద పడింది. ఇంటికి తిరిగి రాగానే వంట చేశారో లేదో కనుక్కుని, నన్ను అన్నం తిని రమ్మని పంపారు తాతయ్య.

బామ్మ సీరియస్ గా వడ్డించింది. "మాదొచ్చోదాని.. తినకపో చెబుతాను.." అంటూ దండకం మొదలు. నేను కొంచం అన్నం తిన్నానో లేదో..అమ్మ కాలుస్తున్న మినప రొట్టి వాసనకి నోట్లో నీళ్ళూరాయి.. అన్నం తినేస్తే మరి రొట్టి తినడానికి పొట్టలో చోటుండదు కదా.. అందుకని "ఇంక చాలు బామ్మా.. కడుపు నిండిపోయింది" అని చెప్పా. ఇంక చూడాలి, బామ్మకీ తాతయ్యకీ పెద్ద యుద్ధమైపోయింది. తర్వాత నేను మినపరొట్టి ఆరగించడమూ, మర్నాడు నన్ను తిట్టుకుంటూ మిగిలిన అన్నాన్ని బామ్మ పనిమనిషికి ఇవ్వడమూ జరిగాయి.

32 కామెంట్‌లు:

  1. నేనైతే శనివారం కోసం ఎదురుచూసేదానిని.ఎందుకంటే ఆరోజు మా ఇంట్లో ఒంటిపొద్దన్న మాట.రకరకాల టిఫిన్లు తినొచ్చని నా ఆశ.అందులోనూ నాకు మినపరొట్టె[దిబ్బ రొట్టె] అంటే మరీ ఇష్టం.సాయత్రం ఎప్పుడో నిప్పుల మీద పెడితే రాత్రికి అయ్యేది.అంతసేపూ నోటిలో నీళ్ళు ఊరించుకుంటూ కూర్చోడమే. మీకు జరిగిన దానికి పూర్తిగా వ్యతిరేకమన్న మాట నాకు.మధ్యాన్నం అన్నం మిగిలిపోతే ఆ రోజు సాయంత్రం అన్నం పెట్టేసేవారు.నాకేమో టిఫిన్ తినాలనిపించేది. మా ఊర్లో సుబ్బమ్మ అని ఒకప్పుడు బాగా బతికిన ఆవిడ భిక్షం తీసుకుంటూ వుండేది.శనివారం మధ్యాన్నం అన్నం మిగిలిపోయినప్పుడు ఆవిడ ఊర్లో ఎక్కడుందో వెతికి పట్టుకుని ఒక హింట్ ఇచ్చేదానిని.అంతే ఆవిడ మా ఇంటిదగ్గర ప్రత్యక్షం. అలా సాయంత్రం నాకు టిఫిను ప్రాప్తించేది.

    రిప్లయితొలగించండి
  2. హ్హ హ్హ హ్హ , చాలా బావుందండీ..ఇప్పుడర్ధమవుతోంది మీ బామ్మ మిమ్మల్ని తన శత్రువుల కేటగిరీలో ఎందుకు పెట్టారో..

    రిప్లయితొలగించండి
  3. అయితే చిన్నప్పుడు మీరు చిలిపి కృష్ణుడు అన్నమాట...పేరుకు తగ్గ చేష్టలండి మీవి..

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు భలే వాళ్లండి మీరు !
    మీరు ఒక నిజం చెప్పండి మీ మేనత్త గారి కి ఇద్దరు పిల్లలు కదా, మీ నానమ్మ గారు ఎప్పుడు వాళ్ళతో పోల్చి మీ గురించి అందరి దగ్గర కంప్లైంట్ చేసేవారు కదా :)

    రిప్లయితొలగించండి
  5. ఎంత ఇబ్బంది పెట్టారండి బామ్మగారిని...హన్నా!! పాపం బామ్మ...
    భలే ఉన్నాయి మీ ముచ్చట్లు..
    ఎప్పుడు అనిపిస్తుంది మురళి గారికి ఉన్నట్టు నాకు అప్పట్లో తాతగారు ఉంటే ఎంత బావుణ్ణో అని.
    నేనైతే శనివారం వస్తే చాలు పొద్దున్నే "అమ్మా ఈ రోజు ఏమి టిఫిన్ చేస్తున్నావు" అని అడిగేసేవాడిని. ఆ టిఫిన్ ఆలోచనే రాత్రి తిన్నంతవరకు నా బుర్ర చుట్టూ కందిరీగలాగ తిరుగుతుండేవి.

    రిప్లయితొలగించండి
  6. ఈ మనవళ్ళంతా అంతే ! బామ్మలని ఏడిపించటమే వాళ్ళ పని. హ హ హ

    రిప్లయితొలగించండి
  7. మీరుసూపరండీ మట్టితో బొమ్మలు చేయడం నాకు కూడా అలవాటే, బామ్మను బాగా ఏడిపించారు పాపం :)

    రిప్లయితొలగించండి
  8. బంకమట్టి బొంగరాలు భలే గుర్తు చేశారండీ ...వాటికి అగ్గిపుల్లలు గుచ్చి కాగితం పూల రేకు దానిపై చిన్న ఆకు ...బొంగరం తిరిగేప్పుడు రంగు రంగులు కనిపించేవి.....చిన్నప్పటి క్రియేటివిటీ ... :) :)
    తాతగార్ని అడ్డం పెట్టుకొని బామ్మగార్ని అంతలా ఏడిపిస్తారా ...ఆవిడ మీమీద రివెంజ్ తీర్చుకుంటారు ఎలాగో తెలుసా ?

    రిప్లయితొలగించండి
  9. చాలా సీరియస్ గా చదువుతున్నాను మీ కథ. మీ నాయనమ్మ తిట్టు చదివాక నవ్వాగింది కాదు. మురళి గారు, మీ రచనల రహస్యం అక్కడే దాగుంది. మీరు ఈ పుస్తకభాషలో రాయకుండా మీ ఇంటిభాషను as it is రాయండి సంభాషణలు ఉన్నదున్నట్టు రాస్తే ఆ అందమే వేరు. మీ కథలకు జీవమొస్తుంది. మరిన్ని టపాలకై ఎదురుచూస్తూ..

    రిప్లయితొలగించండి
  10. :):)..నేను మాత్రం బామ్మ పార్టీనే,ఆమెని దారుణంగా హింసపెట్టేవరన్నమాట ! బాగుంది ...కరడు అంటే?..కొంచెం ముద్దా అనా ?

    రిప్లయితొలగించండి
  11. నిజ్జంగా ఇంత అల్లరీ మీరే చేసేవారా అని...???
    అయినా అదేవిటండి ఆ చేసేదేదో కాస్త మంచి బొమ్మ చెయ్యచ్చుగా..
    ఎంత మైదాపిండైనా మరీ బల్లినా చేసేది..
    అసలు ఆ పేరు వింటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది..
    అందుకేనేమో బామ్మగారి శత్రువయ్యారు..
    అయినా తాతగారున్నారుగా..మీకేం భయం..!

    రిప్లయితొలగించండి
  12. మొగ్గల చీర!!
    తస్సదియ్య, బామ్మగారిని పాపం ఓ ఆట ఆడినట్టు ఉన్నావ్ సోదరా!!
    మా ఇంట్లోకూడా శనివారాం సాయంత్రాలు ఇప్పటికీ టిపినీలే. ఈ మధ్య మానెసాకానీ, ఎక్కువగఆ పీజ్జా. దేశంలో ఐతే అట్లు/ఉప్మా/ఇగ్లీ అదే అదే ఇడ్లీ.
    :):) బాగున్నాయ్ మీ జ్ఞాపకాలు.

    రిప్లయితొలగించండి
  13. నాకు అన్నం, టిఫినూ రెండూ పెట్టేవారు. నా తరువాత వచ్చిన వాళ్ళందరూ తినేసి లెగిచిపోయేవారు. అంత ఆలస్యంగా తినేదాన్ని. ఎవరూ లేని సమయం చూసి పెరట్లోకి వెళ్ళి అన్నం ఆవుకు వేసేసేదాన్ని. దొరికితే తిట్లు. లేకపోతే బుద్దిగా తినేసానని మెచ్చుకోళ్ళు.

    రిప్లయితొలగించండి
  14. పాపం బామ్మ ను బాగానే ఇబ్బంది పెట్టేవారు ఐతే.
    "మాదొచ్చోదాని." "మాదాచ్చెద్" అని తిట్టే వారండి మా చిన్నప్పుడు కూడా, అర్ధం ఏమిటో తెలియదు కాని చిన్నప్పుడు బాగానే వినపడేది ఆ తిట్టు... :-)

    రిప్లయితొలగించండి
  15. మొత్తానికి తాతగారి అండదండలు చూసుకుని మామ్మగారిని ఒక ఆట ఆడించేవారు కదా :)

    ప్చ్, మా ఇంట్లో ఏ వారాలూ వర్జాలూ లేవు, అందుకని ఇలాంటి సువర్ణావకాశం మిస్ ఐపోయాను

    మాదొచ్చోదాని ...ఎన్ని రోజులైందో (కాదు కాదు యేళ్ళు)ఈ మాట విని, మా నానమ్మ బ్రతికుండగా తరచూ ఉపయోగించే పదం ఇది. దాని అర్థం అడిగితే మాత్రం చిన్నపిల్లవి చెప్పకూడదు అంటూ దాట వేసేసేవాళ్ళు...హ్మ్మ్మ్ యేమి పెద్దవాళ్ళో, నేను పెద్దదాన్ని అయ్యే లోపల నాకు మీనింగ్ చెప్పకుండానే హడావిడి పడి బాల్చీ తన్నేసింది

    రిప్లయితొలగించండి
  16. హమ్మ మురళీ ఎన్ని తెలివితేటలు మీకు చిన్నప్పుడే.. ? చిన్న యజమాని గారన్నమాట :)

    రిప్లయితొలగించండి
  17. మొత్తానికి కక్ష విషయంలో బామ్మకీ మినహాయింపు లేదన్నమాట. :)

    రిప్లయితొలగించండి
  18. "మాదొచ్చొ" ఈ దీవెన నాకూ పరిచయమేనండోయ్. కాని అర్ధం తెలీదు. అసలు ఏవైఉంటుంది .ఎవర్కైనా తెలిస్తే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  19. బాగుందండి మీ అన్నం గోల....
    దీన్ని బట్టి చూస్తే అప్పట్లో మీకు మీ బామ్మ గారికి మధ్య చాల యుద్దాలు జరిగాయన్నమాట!!!
    "మా ఇంట్లో బల్లులకి లోటు లేకపోవడంతో గోడమీద సజీవ బల్లులని చూస్తూ నా బొమ్మకి మెరుగులు దిద్దాను"
    మీ narration చాల బాగుంది...బాగా నవ్వించారు.

    రిప్లయితొలగించండి
  20. .."అని కొంచం దీనంగా చెప్పేశా.." -మీరు ఖతర్నాక్ సుమండీ! :)

    రిప్లయితొలగించండి
  21. @రాధిక: నేను కూడా టిఫిన్ కోసమే ఎదురు చూసేవాడినండి.. ఆవేళ ఉక్రోషం కొద్దీ అలా :-) దిబ్బరొట్టి మా ఇంట్లో కూడా చేసేవాళ్ళు.. అన్నట్టు మీ చారిటీ బాగుందండి.. పుణ్యమూ, పురుషార్ధమూ :-) ..ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: అప్పుడే ఏం చూశారండీ.. ఇంకా చాలా ఉన్నాయి.. ధన్యవాదాలు.
    @సత్య: అంతేనంటారా? ఇప్పుడు మాత్రం కాదులెండి :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @శ్రావ్య: నాకు ఐదుగురు మేనత్తలు, వాళ్లకి మొత్తం పన్నెండుమంది పిల్లలండి.. బామ్మ నన్ను పోల్చేది కాదు కానీ నన్ను పెంచుతున్న విధానాన్ని పోల్చేది.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: "తాతగారు ఉంటే ఎంత బావుణ్ణో అని.." ప్చ్.. నేనేమీ చేయలేనండి.. కానీ ఒకటి మాత్రం చేయగలను.. భవిష్యత్తులో మీకు నాలాంటి మనవడు కలగాలని కోరుకోగలను..
    కోరుకోమంటారా? :-) ..ధన్యవాదాలు.
    @బుజ్జి: నాకూ తెలీదండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @మాలాకుమార్: మనవరాళ్ళ కన్నా బుద్ధిమంతులేనండి మనవలు :-) ..ధన్యవాదాలు
    @నాగ: ధన్యవాదాలు..
    @పరిమళం: రివెంజిలు తీర్చుకోడం అయిపోయిందండీ.. చెబుతా..వివరంగా... ధన్యవాదాలు.
    @బుడుగు: 'పుస్తక భాష' అంటారా? ఏదో రాసేయడమే కానీ అంతగా ఆలోచించడం లేదండీ.. ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @చిన్ని: అవునండీ.. కొంచం మిగిలితే అలా అనేవారు.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: నిజ్జంగా అండీ.. ఎదురుగా బల్లి కనిపించేసరికి నాకు బల్లిని చేయాలనిపించిందండీ.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @భావాన్ని: ఆవుకి పెట్టేవాళ్ళా? పుణ్యమంతా మీకే :-) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  25. @భావన: అర్ధం నాక్కూడా తెలీదండీ.. ధన్యవాదాలు.
    @లక్ష్మి: ఏదోలా అర్ధం తెలుసుకుందామండీ.. ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: ఇంటికే కాదండీ.. ఇంచుమించు ఊరికి కూడా.. ఆ రోజులే వేరండీ.. ప్చ్.. ధన్యవాదాలు.
    @ఉష: ఆవిడతోనే ఎక్కువండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @లలిత: ప్చ్.. నాక్కూడా తెలియదండీ.. తెలుసుకోవాలి. ధన్యవాదాలు.
    @హను: చాలా జరిగాయండీ.. ధన్యవాదాలు.
    @చదువరి: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  27. "మాదొచ్చొ" అన్నది హింది లొ ఒక బూతు. మనవాళ్ళకి దాని అర్ధం తెలీక వాడేస్తుంటారు. మా నానమ్మ కి ఈ పదం మానిపిచడానికి చాల కస్ట పడ్డాం.
    దానికి అర్థం తెలుసుకొక పొవడం చాలా మంచిది. ఆ పదం వాడక పొవడం ఇంకా మంచిది. పక్కన నార్త్ ఇండియన్స్ వుంటె అస్సలు వాడొద్దు.

    రిప్లయితొలగించండి
  28. @మంచుపల్లకీ: మా ఇంట్లో ఇప్పుడెవరూ వాడడం లేదండి.. 'అరె..అర్ధం తెలీదే..' అని ఫీలయ్యాను.. ఫీల్ కానక్కర్లేదన్న మాట.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. మాదర్చోద్ ఒక హిందీ బూతుమాట. అర్థం తెలుసుకోకపోవడమే మంచిది. అయినా తెలుసుకోవాలనుంటే -
    http://www.urbandictionary.com/define.php?term=madarchod

    రిప్లయితొలగించండి
  30. ఇన్ని వ్యాఖ్యలు చదివాకా ఇంకేమి రాయాలొ తెలీట్లేదండి...మీ జ్ఞాపకాలు చాలా అద్భుతమైనవీ..మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేవీ అని మాత్రం రాయగలను..!

    రిప్లయితొలగించండి
  31. @శ్రీనివాస్: అర్ధం తెలిస్తే ఎవరూ వాడకపోదురండీ.. బహుశా తెలియకే వాడి ఉంటారు.. ధన్యవాదాలు.
    @తృష్ణ: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి