'యద్భావం తద్భవతి' అని ఒక వాడుక. అంటే మనం ఏం చూడాలనుకుంటున్నామో అదే చూడగలం. ఇందిర ని గురించి చెప్పడానికి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది అనిపించింది నాకు. ఆమెని ఎలా అయినా అనుకోవచ్చు.. బతక నేర్చినది అనో, తను అనుకున్నది సాధించుకోడానికి ఎంతకైనా తెగించే జాణ అనో, పరిస్థితులకి ఎదురు నిలిచి పోరాడగల ధీర అనో.. ఆమె ఎలాంటిది అన్నది చూసే మన దృష్టిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇందిర మామూలు వ్యక్తి కాదు.. 'కాలాతీత' వ్యక్తి.
అర్ధ శతాబ్దానికి పూర్వం డాక్టర్ పి. శ్రీదేవి రాసిన నవల 'కాలాతీత వ్యక్తులు' లో నాయిక ఇందిర. నిజానికి నాయకుడు అనాలేమో. బలమైన పురుష పాత్ర లేని ఈ నవల్లో ప్రతి పాత్రా ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఇందిర చుట్టూ తిరిగేవే. తనకంటూ ఒక ఇల్లూ, నేనున్నాను అని అండగా నిలబడే భర్తా, సంతానం.. ఇవీ ఇరవయ్యేళ్ళు నిండిన ఇందిర కలలు. ('అంతులేని కథ' నాయిక సరిత గుర్తొస్తోంది కదూ?)
కానీ ఇందిర వాస్తవ జీవితం వేరు. ఇంటరుతో ఆగిపోయిన చదువూ, బాధ్యత పట్టని, తన మీద ఆధారపడ్డ తండ్రీ.. ఆ తండ్రిని పోషించడం కోసం చాలీచాలని సంపాదన ఇచ్చే ఉద్యోగమూ.. విశాఖపట్నంలో అద్దింటి జీవితం ఆమెది. హోటలు భోజనం, స్నేహితులతో షికార్లూ.. పర్సులో పైసా లేకపోయినా దర్జా వెలగబెట్ట గలదు.. ఆమె షికార్లకీ, స్నేహాలకీ అడ్డు చెప్పడు తండ్రి ఆనందరావు. ప్రతిగా అతని పేకాట, తాగుడు వ్యసనాలకి డబ్బిచ్చి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇందిర.
తనవాడుగా చేసుకోదగ్గ మగవాడికోసం ఇందిర కళ్ళెప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. అదిగో ఆ వెతుకులాటలో ఆమెకి కనిపించినవాడు ప్రకాశం. మెడికల్ కాలేజి స్టూడెంట్.. ఆమె ఉండే ఇంట్లోనే పై వాటాలో ఉంటున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ పెంపకంలో పెరిగిన 'పిరికి' ప్రకాశాన్ని తనదారికి తెచ్చుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది ఇందిర.. అతనితో వెళ్ళాల్సినంత దూరమూ వెళ్తుంది. ఆ ప్రకాశం తను ఆశ్రయం ఇచ్చిన కళ్యాణి పట్ల ఆకర్షితుడవుతున్నాడని తెలిసి తట్టుకోలేకపోతుంది.
కళ్యాణిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి, గాలివాటం మనస్తత్వం ఉన్న ప్రకాశం మళ్ళీ ఆమెని కలుసుకోకుండా చేస్తుంది ఇందిర. ప్రకాశం ఉత్త 'చెవల వాజమ్మ' అని అర్ధం కాగానే అతని స్నేహితుడు కృష్ణమూర్తి తో స్నేహం మొదలుపెడుతుంది. కృష్ణమూర్తి డబ్బున్నవాడు, డబ్బంటే లెక్కలేని వాడు. ఈ కారణానికి అతడు ఆనందరావుకి కూడా నచ్చుతాడు. ఇంతలో మేనమామకి భయపడ్డ ప్రకాశం అతను చూసిన సంబంధం చేసుకోడానికి ఒప్పేసుకుంటాడు..
అయినా అధైర్య పడదు ఇందిర.. తనకి కావాల్సింది తనకి ధైర్యం ఇచ్చేవాడనీ, తన కొంగు చాటున దాక్కునే వాడు కాదనీ చెబుతుంది. ఈసారి కృష్ణమూర్తితో వెళ్ళాల్సినంత దూరం వెళ్తుంది ఇందిర. "మనమందరం శుద్ధ నూనె మిఠాయి సరుకు మనుషులం కృష్ణమూర్తీ! ఏమిటేమిటో అనుకుంటాం. రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా, అవి తడిసి పోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. అంచేత మనిద్దరి పరుగులాటలూ ఒకటే.." అని జీవిత సత్యం బోధపరుస్తుంది అతనికి.
మిన్ను విరిగి మీద పడ్డా నిశ్చలంగా ఉండగల ఇందిర, తనలో భావాలనీ వాటి సంచలనాన్నీ ఏమాత్రం బయట పడనివ్వని ఇందిర, కృష్ణమూర్తి తనని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించినప్పుడు మాత్రం ఆశ్చర్యపోతుంది. అతనితో వాదిస్తుంది.. ఆ వాదనలో ఓడిపోతుంది. కృష్ణమూర్తికి భార్య అవుతుంది. ('కాలాతీత వ్యక్తులు' విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)
"రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా, అవి తడిసి పోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది".Beautiful!!
రిప్లయితొలగించండిఈ పుస్తకం ఎప్పుడో ఎక్కడో చదివినట్టుగా లీలగా గుర్తుకు వస్తోంది కానీ సరిగా గుర్తుకు రావటంలేదు. చక్కటి పుస్తకాలను ఇలా పరిచయం చేస్తున్న మీకు అభినందనలు
రిప్లయితొలగించండిమీ సమీక్ష చాలా బాగుంది.
రిప్లయితొలగించండిప్రకాశం పిరికివాడు అనటానికి ఏమాత్రం సందేహించను. సమాజాన్ని ఎదురించలేడు. తన లోపాలను తెలుసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం కూడా చేయడు.
స్త్రీ ని అంత బలమైన వ్యక్తిత్వం గలదానిగా సృష్టించిన మొదటి నవల ఇదేనేమో?
ఏది ఏమైనా బాగా ఆలోచింపచేసే నవలల్లో ఇది ఒకటని చెప్పవచ్చు.
అసలు మీరు ఇందిరను అపార్థం చేసుకున్నారు. తండ్రిని ప్రోత్సహిస్తోందన్న మాటలోనే అది తోస్తోంది నాకు! సగటు ఆడపిల్లలు అందరి లాగానే సుఖంగా తల్లి దండ్రుల చాటున జీవితాన్ని గడపాలనుకున్న ఇందిరకు అలాంటి అవకాసం ఏనాడైనా దక్కిందా?
రిప్లయితొలగించండిఇందిరనెందుకిలా అర్థం చేసుకుంటారు? ఈ నవల ఆధారంగా తీసిన చదువుకున్న అమ్మాయిలు సినిమాలో కూడా ఇందిర పాత్ర కు నవల్లో ఉన్న ప్రాధాన్యాన్ని(అసలు నవలంతా ఇందిర చుట్టూనే తిరుగుతుంది)పూర్తిగా తీసేసి ఒక వాంప్ గా చిత్రించి ఈవీ సరోజను ఆ పాత్రలో కుదించారు. ఒకరి భుజం పై వాలి ఏడవాలని చూసే కల్యాణేమో హీరోవినూ!
లాభం లేదు. నేనొకటపా రాయాల్సిందేనండీ!
చాలా బాగా సమ్మరైజ్ చేశారు. తెలుగునవలల్లో ఇందిరంత విలక్షణ పాత్ర చూడలేదు నేను అనిపిస్తుంది చదివినప్పుడల్లా. తెలుగులో 10 బెస్ట్ నవల్స్ లో 'కాలాతీత వ్యక్తులూ . ఏమంటారు..
రిప్లయితొలగించండి-బు
Good analysis.chadivinaTlu gurtu.
రిప్లయితొలగించండిచక్కటి పుస్తకాలను ఇలా పరిచయం చేస్తున్న మీకు అభినందనలు!!
రిప్లయితొలగించండిపీజీలో చేరిన ఒకనెలకో నెలన్నరకో జూనియర్స్ కు వెల్ కం పార్టీ వుడాపార్కులో ఏర్పాటుచేసి పనిలో పనిగా చిన్న ర్యాగింగ్ కూడా మొదలుపెట్టిన మా సీనియర్స్ అమ్మాయిలు(అప్పట్లో మా విభాగం లో విధ్యార్ధినులచే ర్యాగింగు జరిపించుటనునది ఒక ఆనవాయితీ)తెలుగులో మీఅభిమానపుస్తకం పేరు చెప్పమనగానే కాలాతీతవ్యక్తులు అన్నాను.అంతే నన్నొదిలేసారు.(తర్వాత నేను వాళ్ళను చాలా టీజింగ్ చేశాననుకోండి).శ్రీదేవి గారిది అనకాపల్లి.చాలా చిన్నవయసులో మనలను వదిలిపోయారు.ఆమె గురించిన వివరాలకొరకు చాలా ప్రయత్నించాను.మరలా ఈమధ్య బుక్ సెంటర్ వరహాల చెట్టిగారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నా.నాకు ఈ నవలా బాగా నచ్చింది.చదువుకున్న అమ్మాయిలు సినిమా కూడా నచ్చింది.కాకపోతే రెండూ వేరువేరు అనుకుని ఆనందిస్తుంటా :)అదొక భ్రమ
రిప్లయితొలగించండిఈ నవల మొన్ననే నా చేత చిక్కింది. అందుకని మీ నాయికా పరిచయం ఇప్పుడు చదవట్లేదు :)
రిప్లయితొలగించండి@పద్మార్పిత: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@లక్ష్మి: దొరికితే తప్పక చదవండి.. మంచి నవల.. ధన్యవాదాలు
@వెంకటరమణ: చలం నవలల్లో బలమైన స్త్రీ పాత్రలు ఉన్నాయి కదండీ.. నిజంగానే ఆలోచింపచేసే నవల.. ధన్యవాదాలు.
@సుజాత: 'తండ్రిని ప్రోత్సహిస్తోంది' అనడంలో నా ఉద్దేశ్యం అతనికి తిండి పెట్టి పోషించడమే కాక, అతని వ్యసనాలకి కూడా డబ్బిస్తోంది అనండి.. నిజానికి ఇది ఇందిర మీద కోపంతో చేసిన వ్యాఖ్య. టపా ఒక్కసారి మళ్ళీ చదవండి. మీరు రాసే పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బుడుగు: ఏం అంటానండి? అవును అంటాను.. ధన్యవాదాలు.
@సునీత: చదివే ఉంటారు.. దొరికితే మళ్ళీ చదవండి.. ధన్యవాదాలు.
@సృజన: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: అమ్మాయిలూ అబ్బాయిలను ర్యాగింగ్ చేయడం.. అదీ ఆంధ్ర దేశం లో.. ప్చ్.. వైజాగ్ లో చదవకపోడం వల్ల చాలా మిస్సైపోయినట్టు ఉన్నాను.. శ్రీదేవి గారి వివరాలు దొరకగానే మాతో పంచుకుంటారు కదూ? 'చదువుకున్న అమ్మాయిలు' కి ఆధారం ఈ నవల అనడానికి నాకూ మనసొప్పదండీ.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: నవల చదివాక మీరే ఓ టపా రాయండి.. ధన్యవాదాలు.
ఆబ్బే అలా ఊహించుకుని నిరాశపడకండి,ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో ఒక్క మా విభాగములో మాత్రము అప్పటిలో ఆఆనవాయితీ ఉండేది అంతే :)
రిప్లయితొలగించండి@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: అయితే నేనేమీ మిస్సవ్వలేదంటారు.. హమ్మయ్య :-) :-)
రిప్లయితొలగించండిమీ నవలా పరిచయం, క్రింద అందరి వ్యాఖ్యలూ చూశాక 'ఇందిర' తప్పక తెలుసుకోవాల్సిన పాత్ర అనిపిస్తోంది. తప్పక 'కాలాతీత వ్యక్తులు' నవలని నా చదవాల్సిన పుస్తకాల లిస్టులో రాసుకుంటాను :)
రిప్లయితొలగించండి@మధురవాణి: తప్పక చదవండి.. మిమ్మల్ని నిరాశ పరచదు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి"ఈసారి కృష్ణమూర్తితో వెళ్ళాల్సినంత దూరం వెళ్తుంది ఇందిర."
రిప్లయితొలగించండి"మిన్ను విరిగి మీద పడ్డా నిశ్చలంగా ఉండగల ఇందిర"
ఇందిర వ్యక్తిత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలీలేదు .కనుక పాత్ర గురించి కామెంట్ చేయను .
మీరు పరిచయం చేసిన తీరు బావుంది .
@పరిమళం: వీలయితే 'కాలాతీత వ్యక్తులు' చదవండి.. కేవలం ఆ నవల చదవడం మాత్రమే ఇందిర ని అర్ధం చేసుకోగలుగుతాం. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిsridevi gari gurinchi emi details kaavaali meeku. aavida naaku peddamma avutaaru
రిప్లయితొలగించండిమీరు ఎక్కడ వుంటారు? నేను కేంద్ర సాహిత్య అకాడమీ వారికి శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసాను అది 2015 లో ప్రచురితం అయ్యింది.ఆమె వివరాలు ఎక్కవదొరకకపోవటౌ వలన సాహిత్యం మీదే ఎక్కువ రాసాను.అంతేకాక ఆమె కథలూ, కవిత్వం నా సంపాదకత్వంలో పుస్తకాలు అనల్పా బుక్స్ వారు ప్రచురించారు.ఆమె మీద తెలంగాణ విశ్వవిద్యాలయం లో పీహెచ్డీ పరిశోధన జరుగుతోంది.
తొలగించండిపూర్ణిమ గారు,నేను విశాఖపట్నం లో ఉంటాను.వృత్తిరీత్యా జర్నలిస్టును.శ్రీదేవి గారి గురించి వివరాలు తెలిస్తే ఒక సమగ్రమైన వ్యాసం ఒకటి రాయాలని కోరిక.మీరు అనకాపల్లిలో ఉంటారా?మీరు వివరాలు ఈ ఈ-మెయిలుకు పంపగలరు.devarapalli.rajendrakumar
రిప్లయితొలగించండి@
gmail.com
ఈ మధ్యనే నవల చదివాను అద్భుతం... ఇప్పుడిప్పుడే తెలుగు నవలలు చదవడం చేస్తున్న దయచేసి మంచి నవలల పేర్లు తెలియజేయండి.
రిప్లయితొలగించండినేను చదివిన పుస్తకాల గురించి బ్లాగులో రాస్తున్నానండీ.. ధన్యవాదాలు..
తొలగించండి