గురువారం, ఆగస్టు 13, 2009

నీరాకకోసం...

"ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల.. విరహ బాధను మరిచిపోవగా నిదురపోయెను ఊర్మిళ..." ...ప్చ్.. ఏం కవులో.. ఎదురు చూపులు కేవలం ఆడువారికే పరిమితమైనట్టు రాస్తారు.. వీళ్ళు మగవాళ్ళై ఉండి సాటి పురుషులని అర్ధం చేసుకోరెందుకో..

అర్ధం చేసుకో గలిగిన వాళ్ళే ఐతే నీ కోసం నేనెంతగా ఎదురు చూస్తున్నానో తెలిసేట్టుగా ఓ కవితో గేయమో రాసి ఉండేవాళ్ళు కదా? నేను కనీసం దానిని పాడే ప్రయత్నం చేసి నిన్ను ప్రసన్నం చేసుకునే వాడిని కదా.. పాడడం ఆపమని నన్ను బెదిరించదానికో, బతిమాలడానికో నువ్వు వచ్చేదానివి కాదూ?

"యమునా తటిపై నల్లనయ్యకై ఎదురు చూసేను రాధ..." బాగుంది వర్ణన.. మరి నీ కోసం..ఈ నల్లపిల్ల కోసం.. నా ఎదురు చూపుని తెలిపేదేలా? ఎప్పుడో తప్ప అలగని నువ్వు ఇప్పుడిలా మూతిబిగేస్తే ఏం చేసి నీ అలక తీర్చాలి? నీ చెలులు, సఖులు అప్పుడప్పుడూ ఇలా కనిపించి అలా మాయమవుతున్నారు.. వాళ్ళని నువ్వేమని బెదిరించావో తెలియదు..నీ జాడ మాత్రం చెప్పడం లేదు.

నీది కోకిల రూపమే కావొచ్చు.. స్వరం కాకి కన్నా కర్ణ కఠోరం కావొచ్చు.. అయినా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా? నీ పాట వినడం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో.. ఏం? నలుపు మాత్రం రంగు కాదా? అందులో మాత్రం అందం లేదా?

ప్రేమని వ్యక్తం చేయడానికి నీకు తెలిసినంత భాష నాకు తెలియదు.. ఏం చేయమంటావు చెప్పు? నీ ప్రేమలో తడిసి ముద్దైన క్షణాన, వళ్ళంతా కళ్ళు చేసుకుని నిన్ను చూస్తానే.. ఆ చూపులో నా ప్రేమను నువ్వు చదువుకోగలవు అనుకుంటాను నేను. నీకు నేను అర్ధం కాలేదా? అర్ధమయ్యీ నన్ను సాధిస్తున్నావా?

ఎంకి ఎక్కడుందని ఎవరైనా అడిగితే "ఎలుగు నీడలకేసి ఏలెత్తి సూపింతు.." అన్నాడు నాయుడు బావ. ఎంత అదృష్టవంతుడు?! నాకామాత్రం అదృష్టం కూడా లేదే.. వెలుగుకీ నీకూ చుక్కెదురు మరి.. ఒక్క దానివీ రాకుండా నిశిని తోడు తీసుకుని మరీ వస్తావు..

ఎప్పుడైనా ధైర్యం చేసి వెలుగు నీకేసి ఓరచూపు చూసిందనుకో.. అహ.. ఎప్పుడైనా మాత్రమే.. అప్పుడు నువ్వూరుకుంటావా? రంగురంగులు చూపించేస్తావు. వెలుగు మొండితనానికి పోతే, చురచురా చూసి చరచరా వెళ్ళిపోతావు. ఎప్పుడూ వెలుగు మీద చూపించే కోపాన్ని ఇప్పుడు నామీద చూపిస్తున్నావు నువ్వు.

అసలు ప్రేమని ప్రకటించడం అన్నది నీ దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా.. ఎన్నాళ్ళుగానో నీలో.. లోలో.. దాచుకున్న ప్రేమనంతా ఒక్కసారిగా కుమ్మరించేస్తావు.. అవతలివాడు తట్టుకోగలడా లేదా అన్న ఆలోచన కూడా ఉండదు నీకు.. నీ ప్రేమ ధాటికి ఉక్కిరిబిక్కిరై, తేరుకునే లోగా ఉన్నట్టుండి ఒక్కసారిగా నిశ్శబ్దమై పోతావు. నిన్ను అర్ధం చేసుకోవాలని ఎన్నో వెర్రి ప్రయత్నాలు.. అర్ధమైతే ఇక నీ గొప్పదనం ఏముంది చెప్పు?

ఇన్ని చెబుతున్నాను కదా.. ఈక్షణంలో నువ్వొస్తే ఇవన్నీ మర్చిపోతాను నేను.. అసలు నువ్వు కనిపిస్తే నన్ను నేనే మర్చిపోతాను. ఎందుకు అలిగావని అడగాలని కూడా గుర్తుండదు నాకు. నువ్వు కనిపించకపోతే నేనెంత దిగులు పడతానో ఇన్నేళ్ళ మన చెలిమి సాక్షిగా నీకు తెలుసు..

నా దిగులు పోగొట్టడం కోసం నీలాకాశపు రాజమార్గాన మెరుపు నగలని సింగారించుకుని ఉరుముల సన్నాయి నేపధ్యంలో నాకోసం వచ్చి నీ ప్రేమను వర్షించవా నీలిమేఘమా....

29 కామెంట్‌లు:

  1. వావ్ ఎంత బాగుందండీ మీ విరహం మీ నీలి పైన... ఇలాంటి విరహ గీతాలు చూడటం కోసమైనా ఈ విరహమింకా తీవ్ర మవ్వాలని కోరుకునేంత చెడ్డదానిని కాకపోయినా అప్పుడప్పుడు ఈ విరహం ప్రాప్తిరస్తు అని మాత్రం దీవించకుండా వుండ లేక పోతున్నా.
    మనలో మన మాట మీ చెలి ఇటు కేసి వచ్చిందండి ఈ రోజు పొద్దుట, నేను సరిగా చూడలేదు మీ గురించి రెకమండేషన్ చేద్దామంటే.. పొద్దుట నిద్ర లేచి చూసే సరికి ఆమె తాలూకూ ప్రేమ ఆనవాళ్ళు కనిపించాయి. మీ కోసం, మీ విరహం భరించలేక బిర బిరా పరుగెడుతు మరి మా పైన కూడా కొంచ దయ ను కురిపించిందో ఏమో...

    రిప్లయితొలగించండి
  2. చిన్న సలహా నండోయ్ మురళి, అలా ఎంత ప్రేమ గా నైనా "నీది కోకిల రూపమే కావొచ్చు.. స్వరం కాకి కన్నా కర్ణ కఠోరం కావొచ్చు.. " అని అనుంటారు ఎప్పుడో అందుకే అలిగి వుంటుంది ఆమె అలా అనకండి మరి ఎప్పుడు..

    రిప్లయితొలగించండి
  3. మురళి .....ఎవరా అదృష్ట వంతురాలు....మీ మదిని దోచుకున్న ...ఆ పిల్ల ....:)

    రిప్లయితొలగించండి
  4. చాల బాగుందండి. నిన్న మీ చెలి ఇటువొచ్హినప్పుడు నిజంగా నాకు తెలియదండి ఆమె మీ చెలేనని. తెలియకుండా పొరబాటు జరిగి పొయిందండి. ఈ సారి మా వైపు వొస్తే తప్పకుండ మీ మీద ఇంక అలక ఒదిలివేయమని చెబుతాను. అయినా నా పిచ్హి కాని మీ చెలి కోసం లొకమంతా ఎదురుచూస్తోంది కదా, చూసిన ప్రతిఒక్కరూ చెబుతారులెండి.

    రిప్లయితొలగించండి
  5. మీ నెచ్చెలి నాపై మనసు పారేస్కుందండోయ్. నేను సింగ్రౌలీ సినుకులు టపా పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు వాన పడనిరోజు లేదిక్కడ. చూస్తూచూస్తూ పో అక్కడ హైదరాబాదులో ఫలానా ఆయన ఎదురుచూస్తున్నాడు అని ఎలా చెప్పేది. అందుకే మీబాధ తెలిసినా ఊరుకొన్నా. కొంచెం స్వార్థం. ఏమనుకోకండే.

    రిప్లయితొలగించండి
  6. అంత ముద్దుగా పిలిచాక ఆగుతుందటండీ...... సింగారించుకుంటుంది చూడండి, రేపో మాపో ఇంక ఏకధాటిగా ప్రేమని కురిపిస్తుంది చూడండి!!!

    రిప్లయితొలగించండి
  7. Chala baga rasaru.... alai the memu 2 rojulokakosari me chelini palkaristhamu ikkada.... so meru mamuli prasanam chesukunte me gurinchi recomand chestham...

    రిప్లయితొలగించండి
  8. నల్లనయ్య గురించి రాస్తారనుకుంటే ...నీలిమేఘ మాల గురించి రాశారా ? మీ విరహం చూస్తె త్వరలోనే మీనుండి కవితా వెల్లువ మమ్మల్ని తడిపేట్టుంది.అవునూ ...మనలో మనమాట ...ఇంతకూ ఇదంతా మేఘం గురించే ?
    ప్చ్ ...నమ్మశక్యంగా లేదు .ఎవరా నల్లపిల్ల ?ఏమా కధ ? :) :)

    రిప్లయితొలగించండి
  9. అబ్బ!రాత్రే 56 మిమి వర్షం పడిందండి. ఎంత సంతోషమో చెప్పడం చేతకాలేదు.బాగా చెప్పారు. ఒక మంచి స్క్రిప్త్ తయారు చేసి పెట్ట కూడదూ?

    రిప్లయితొలగించండి
  10. చాల బాగుందండి మీ టపా.తొందరగా మీ నీలిమేఘాల నెచ్చలి రావాలని నేనూ కోరుకుంటున్న.

    రిప్లయితొలగించండి
  11. మీ భావుకత్వానికి ఒక్క నీలి మేఘం ఏంటండి నీలి కళ్ళ అమ్మాయైనా పెట్టే బేడ సర్దుకుని పరిగెత్తుకు రావాల్సిందే!! అంత బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
  12. @శేఖర్ పెద్దగోపు
    నిజం చెప్పారు :)

    రిప్లయితొలగించండి
  13. మురళి గారు వాహ్ అని ఒక పది సార్లు అనుకుని ఉంటానండీ.. అద్భుతం గా ఉంది మీ విరహం. ఈ ఎడబాటు అతి త్వరలో ముగియాలని మనసారా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  14. అబ్బే ఇదేబాలేదబ్బాయ్, మురళీ నాకు పోటీ వచ్చేస్తున్నావ్.. ఏళ్ళ తరబడి పడిగాపులు నాకే ఇంకా అతీ గతీ లేదు తమరికి పడిపోతుందనే వూహాకన్నియ ;) ? నిజంగా ఎంత బాగా వ్రాసారో ఎవరో ఆ జవరాలు...

    రిప్లయితొలగించండి
  15. @భావన: ఓసారి ఓరచూపు చూసి వెళ్ళిందండీ.. ఆలోచనలో పడిందేమో మరి.. మీ సూచన తప్పక పాటిస్తాను, నిజమే తన రంగు గురించి, గొంతు గురించీ అలా అన్నందుకు అలిగే ప్రమాదమూ ఉంది.. ధన్యవాదాలు.
    @చిన్ని: నీలిమేఘమాల అండీ.. ధన్యవాదాలు.
    @జయ: నిజమేనండీ.. అందరూ ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడొస్తుందో..ఏమిటో?.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @కొత్తపాళీ: ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: మీ అక్షరాలకి ఉన్నంత శక్తి నా అక్షరాలకు లేనట్టుందండీ.. ఇంతలా అడిగినా కరగలేదు.. మీరు తనని హైదరాబాద్ పంపితే, నేనూ తనకోసం అక్కడికి వెళ్ళాలి.. నా దగ్గరికే రమ్మని చెబుదురూ.. అడ్రస్ తనకి తెలుసు.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: చూస్తున్నానండి.. నాకు ఎదురు చూపులే మిగులుతున్నాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @మహీపాల్: యెంత అదృష్టవంతులు!! తనిక్కడికి రాడానికి మొహమాట పడితే నేనే మీదగ్గరికి వచ్చేస్తాను, తనకోసం :-) ధన్యవాదాలు.
    @పరిమళం: కథ ఏమీ లేదండీ.. మీరేదో కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉన్నారు :-) ..ధన్యవాదాలు.
    @సునీత: స్క్రిప్టా? నేనా? భలే వారే.. ఇప్పుడిప్పుడే రాయడం నేర్చుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు
    @మెహెర్: :-) :-) ధన్యవాదాలు.
    @స్వాతిమాధవ్: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  19. @శేఖర్ పెద్దగోపు: వద్దండీ.. అప్పుడు నేను 'ఎర్ర' కళ్ళకి సమాధానం చెప్పాలి :-) ధన్యవాదాలు
    @చిన్ని: మీదీ అదే మాటా?
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.
    @ఉష: ఏదో నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి.. అయినా మీతో ఎవరైనా పోటీ పడగలరా? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. హన్నన్నా...ఎంత విరహం...!!
    బుద్ధి చెప్తామనేమోనండి మీ మేఘ మాల ఈ వైపు రావడమే మానేసింది..

    రిప్లయితొలగించండి
  21. మురళీ గారూ, రూటు మార్చారు, హేమిటి సంగతి? ప్రేమ కావ్యమా, విరహ గానమా? బాగుంది.

    రిప్లయితొలగించండి
  22. @ప్రణీత: ధన్యవాదాలు
    @హరేకృష్ణ: ధన్యవాదాలు
    @భాస్కర రామిరెడ్డి: రెండూనండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. మీ టపా చదివినట్లుందండి నీలి మేఘం...ఆఘమేఘాలపై వచ్చి నిన్న చాలాసేపు బాగా కురిసేసింది....మిమ్మల్ని పలకరించిందాండి మరి?

    రిప్లయితొలగించండి
  24. @తృష్ణ: వచ్చి వెళ్ళిందండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  25. మోన్న బద్రచలమ్ వెల్లి గొధావరి లొ ఆదుకొన్తున్తె మీ ప్రియురాలు తదిపెసిన్ద౦ధి. తరువాత నెను ఎక్క్దదికి వెల్లితె అక్కదికి వచ్చిన్ది.. నా కొస౦ ఎమొ అనుకున్నను మీ కొసమ్ అన్న్ మాత(mata).ఏదురుచూపులొ ఉన్న తియధనమ్ మీకు తెలియదానికత, తొన్ధరలొ వస్థానని మీకు చెప్పమన్ది. అప్పతివరకూ మీ విరహనికి అక్షర రుపమ్ ఇచ్చి మా అన్దరిని స౦థొష పెత్త్ మని ఒర్దెర్ వెనసి౦థి.
    :)

    రిప్లయితొలగించండి
  26. @హరిప్రియ: మంచి కబురు చెప్పారండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి