మంగళవారం, ఆగస్టు 11, 2009

అంతులేని కథ

తొమ్మిదిమంది సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం కోసం తనను తాను యంత్రం గా మార్చుకున్న పాతికేళ్ళ సరిత కథ 'అంతులేని కథ.' కె. బాలచందర్ దర్శకత్వంలో 1976 లో విడుదలైన ఈ సినిమా కథానాయికగా జయప్రద స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆమెకి అనేకమంది అభిమానులని సంపాదించి పెట్టింది..వాళ్ళలో నేనూ ఒకడిని. చక్కని, చిక్కని కథ చేతిలో ఉంటే అతి తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీయొచ్చని నిరూపించారు బాలచందర్.

సంసారం బరువు మోయలేక పారిపోయిన తండ్రి, అతను తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూసే తల్లి.. తనకంటూ పైసా సంపాదన లేకపోయినా, పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని కన్న వ్యసన పరుడైన అన్న మూర్తి. కాళ్ళ పారాణి ఆరకముందే వితంతువుగా పుట్టింటికి చేరిన చెల్లెలు భారతి. ఈమె కాక మరో చెల్లెలు, ఓ అంధుడైన తమ్ముడు.. ఇదీ సరిత కుటుంబం. వీళ్ళందరినీ పోషించే ఏకైక దిక్కు సరిత.

చదువుకున్నది, సంస్కార వంతురాలు, అందగత్తె ఇంకా దయార్ద్ర హృదయ అయిన సరిత పైకి మాత్రం నడిచే నిప్పుకుండ. 'రాక్షసి' అంటారామెని ఇంటా, బయటా. తను ప్రేమించిన తిలక్ కి కూడా తనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయనీ, అవి తీరాక పెళ్లి చేసుకుందామనీ చెబుతుందే తప్ప అవేమిటో చెప్పదు సరిత. ఈ సరితకో స్నేహితురాలు చంద్ర.. ఈమె స్వభావం సరితకి పూర్తి విరుద్ధం.. బలాదూర్ జీవితం చంద్రది.

ఎప్పటికైనా ఆ ఇంటికి ఓ మగదిక్కు ఏర్పడితే, ఉద్యోగానికి రాజీనామా చేసి, తిలక్ ని పెళ్లి చేసుకుని ఓ బుల్లి సరితకి తల్లవ్వాలన్నది సరిత కల. అన్నని మార్చాలని ప్రయత్నించి విఫలమవుతుంది. తండ్రి వస్తున్నాడని తెలిసి సంతోషిస్తుంది. కానీ ఆ తండ్రి ఓ బైరాగి రూపంలో ప్రత్యక్షం కావడంతో భోజనం కూడా పెట్టకుండా పంపేస్తుంది. సరిత బాధ్యతలు తీరేవి కాదని తెలుసుకున్న తిలక్ భారతిని పెళ్లి చేసుకుంటాడు.

సరిత పనిచేసే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆమెని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతాడు. చివరి నిమిషంలో అతనికి తన చిన్న చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తుంది సరిత. పెళ్లి జరగడానికి కొద్ది క్షణాల ముందే మూర్తి హత్యకి గురయ్యాడని తెలియడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. నటీనటుల గురించి చెప్పాల్సొస్తే మొదట చెప్పాల్సింది జయప్రద గురించే. అభిమానం చేతో ఏమో కానీ నాకు మాత్రం ఈ సినిమాలో ఆమె నటన అసామాన్యం అనిపిస్తుంది.

మూర్తి పాత్రతో రజనీకాంత్ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. వికటకవి గోపాల్ గా నటించిన నారాయణ రావుకీ ఇదే తొలి సినిమా. మేనేజింగ్ డైరెక్టర్ గా అతిధిపాత్ర చేశాడు కమల్ హాసన్. మూర్తి, ఇతర కుటుంబ సభ్యులు సరిత సంపాదనకి లెక్కలు అడిగే సన్నివేశం నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన సీన్. భారతి సరితని 'అప్పు' అడిగినప్పుడు, భారతి-తిలక్ ల ప్రేమ గురించి సరితకి తెలిసినప్పుడు సరిత గా జయప్రద ప్రదర్శించిన హావభావాలు గుర్తుండిపోతాయి.

మూర్తి గా రజనీ నటననీ తక్కువ చేయలేం. మిగిలిన పాత్రల్లో బాగా నచ్చేది 'చంద్ర' గా 'ఫటాఫట్' జయలక్ష్మి నటన. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో పాటలన్నీ బాగుంటాయి. 'తాళికట్టు శుభవేళ' పాట ఎవర్ గ్రీన్. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..' 'ఏమిటి లోకం..' 'ఊగుతుంది నీ ఇంట వుయ్యాల..' ప్రతి పాటా ప్రత్యేకమైనదే. నా చాయిస్ విషయానికొస్తే 'దేవుడే ఇచ్చాడు..' తో పాటు 'కళ్ళలో ఉన్నదేదో..' పాట. మొత్తం సినిమా అంతా డామినేట్ చేసిన జయప్రద ఈ పాట దగ్గరికి వచ్చేసరికి జానకి గొంతు ముందు వెనక్కి తగ్గిందనిపిస్తుంది.

క్రమశిక్షణ తో ఉండే సరిత జీవితాన్ని చూపిస్తోనే, పార్లల్ గా క్రమశిక్షణ లేని చంద్ర జీవితాన్నీ చూపిస్తాడు దర్శకుడు. ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకునే చంద్ర తత్త్వం వల్ల ఆమె తన తల్లిని నష్టపోతుంది చివరికి. సరిత ఆఫీసు ప్రయాణం తో మొదలయ్యే సినిమా, అదే సన్నివేశంతో ముగుస్తుంది. అక్కడక్కడా మెలోడ్రామా కొంచం శృతి మించినట్టు అనిపిస్తుంది. చూసేటప్పుడు ఇది మూడు దశాబ్దాల కిందటి సినిమా అని గుర్తు పెట్టుకోవాలి.

31 కామెంట్‌లు:

  1. వాస్తవిక సమస్యలకు చలనచిత్ర రూపం ఇవ్వటంలో బాలచందర్ ముద్ర ఏమిటో తెలుగు ప్రేక్షకులకు స్పష్టంగా చాటిన సినిమా ‘అంతులేని కథ’. ‘తాళి కట్టు శుభవేళ’ పాటలో బాలు మిమిక్రీ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ పాట అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. ‘మరో చరిత్ర’కు ముందే కమల్ తెలుగు తెరపై కాసేపు మెరిసిన చిత్రమిది!

    రిప్లయితొలగించండి
  2. ఇది నేను చిన్న తనంలో చూసి చాన్నాల్లు హాంటింగా ఫీల్ అయ్యాను. మంచి సినిమా. ఇంటర్మీడియట్ చదివేటపుడు మరలా చూసి బాల చందర్ అభిమానినైపోయాను.

    దేవుడే ఇచ్చాడు వీధిఒకటి జేసుదాసుగొంతులో అద్బుతంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక గొప్ప మెలడీనే. ఆ పాట సాహిత్యానికి ఆత్రేయకు దాసోహం అయ్యాను కానీ తమిళనాడులో చదువుకొనే రోజుల్లో కన్నదాసన్ వెర్షను విని మరింత ఆశ్చర్యపోయాను. (అదే వరిజినల్)

    పదాల అమరికలో అతి చిన్న తేడా అర్ధాన్ని ఎలా మార్చేస్తుందన్నదానికి ఈ పాటలోంచి ఒక ఉదా:

    తెలుగులో: నన్నడిగి తలితండ్రి కన్నారా?
    తమిళంలో: నేనడిగితే తలితండ్రి కన్నారా?

    చిత్రం గురించి మంచి రివ్యూ
    ధన్యవాదములు

    బొల్లోజు బాబా

    రిప్లయితొలగించండి
  3. మురళి గారూ, అన్నట్టు- అసలు విషయం మర్చిపోయాను :-)
    బాగా రాశారు ఈ సినిమా గురించి. అభినందనలు!

    రిప్లయితొలగించండి
  4. ఈ సినిమాలో నాకు అర్ధం కాలేని ఒకే ఒక విషయం..చివరి క్లైమాక్స్ లో మూర్తి చనిపోయే సీన్ లో సరిత ఆఫీస్లో పనిచేసే ఓ ఆయన ఆమె కారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఆమెను ఉపయోగించుకున్నానని చెప్తాడు. అక్కడ దర్శకుడు అలా ఎందుకు చెప్పించాడో అస్సలు అర్ధం కాలేదు. అంటే ఆమె కుటుంబ క్షేమం కోసం ఏదైనా చేసేందుకు సిద్దంగా ఉందని చెప్పాలనుకున్నాడా లేక ఆ విషయాన్ని ప్రేక్షకులు లైట్ తీసుకోవలసిందే అని ఆశించారా? అప్పటి వరకు సరిత కారెక్టర్ ని హుందాగా మలిచిన దర్శకుడు ఆ డైలాగ్ తో అయోమయానికి గురిచేస్తాడు.
    సినిమా చాలా బావుంటుంది. మీరన్నట్టు జయప్రద నటన కూడా ప్రశంసించదగ్గదే.

    రిప్లయితొలగించండి
  5. >>అక్కడక్కడా మెలోడ్రామా ఎక్కువైనా
    దర్శకుడు నిష్కర్షగా తాను చెప్పదల్సుకున్నది ముఖం మీద గుద్దిమరీ చెప్పాడు.
    అత్భుతమైన సినిమా.
    ధన్యవాదాలు మురళి.

    రిప్లయితొలగించండి
  6. చాలా మంచి సినిమా గురించి చెప్పారు మురళి గారు. నాకు బాగా నచ్చిన పాటలు కూడా ఆ రెండే "దేవుడే ఇచ్చాడు" "కళ్ళలో ఉన్నదేదో". కానీ ఈ సినిమా చూసేప్పుడు మెలోడ్రామాకు పూర్తిగా సిద్దపడి ఇన్వాల్వ్ అయి చూడాలి లేదంటే ఒకో చోట మరీ ఇన్ని కష్టాలా అని విసుగొస్తుంది :-)

    రిప్లయితొలగించండి
  7. నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. కానీ ఎందుకో మా అమ్మకి అంతగా నచ్చదు. ఉద్యోగం చేసేవాళ్లు అంతా అంతసింగారించుకోవాలా? అన్నది ఆమె అభిప్రాయం. పాటలసంగతికి వస్తే అన్నీ సూపెర్బ్. నా ప్లేలిస్ట్ లో ముందుకూర్చుంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తుంటారు ఐనా డోంట్‌కేర్. ఇక ఒకచిన్న తమాషావిషయం ఒకటి చెప్పాలి. ఒకసారి ఇంట్లో అమ్మవాళ్లు లేరు నన్ను మాచెల్లికి తోడుండమని చెప్పివెళ్ళారు. నేను అలవాటు ప్రకారం బలాదూర్ తిరిగివచ్చేసరికే అది ఇంట్లో సీరియస్‌గా ఉందీ. గేటుదగ్గరే ఆపి వీధిలోకి తోసింది. నేను " దేవుడే ఇచ్చాడువీధి ఒకటి .." దానికి నవ్వాగలేదు. గేటుతీసేసింది.

    రిప్లయితొలగించండి
  8. మూడు దశాబ్దాల నాటిదైనా నాకు నచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి. ఎక్కడా వంక పెట్టడానికేలేదు ఈ చిత్రానికి.

    రిప్లయితొలగించండి
  9. నాకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం. 'దేవుడే ఇచ్చాడు..' పాట బాగా ఇష్టం. నా ringtone కూడా అదే. ఇక్కడ తెలుగు తెలిసిన జనాలు నన్ను వింతగా చూస్తారు ఆ ringtone విని.

    రిప్లయితొలగించండి
  10. emadhne tamil lo chusanu....
    malli gurthu chesesariki..........
    chala baga fell iyyanu....
    elanti kathalu vinnapudu , chusinappudu ekkoado nidropothunna writer mahipal nidralesthadu.......

    రిప్లయితొలగించండి
  11. mmmmm baagundi.............

    ఒక నెల క్రితం చేసి ఇప్పటికి దాదాపు 30 సార్లు చూసి వుంటాను ముఖ్యంగ ,కళ్ళలొ వున్నదేదొ,మరియు దేవుడే ఇచ్హాడు కోసం........... జయప్రద బాగానే చేసింది గాని నాకు ఎందుకొ ఆమె అంత మంచిగా అనిపించలేదు.బిగపట్టినట్లు వుంటుంది సినెమా మొదట్లో.
    కళ్ళలొ పాట ముందు వరకు ఇలంటి పాట అంటే సుసీల గారే పాడేవారు ....ఇలాంటివి జానకి పాడలేదా అని బాధపడేవాడిని.....ఇది జానకి గారి మరొక కోణం

    రిప్లయితొలగించండి
  12. నాకు కూడా బాగా ఇష్టమయిన సినిమా ఇది. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, 'ఏమిటి లోకం'..my all time favorites.

    నాకు జయప్రద కన్నా ఫటాఫట్ ఎక్కువ నచ్చింది ఈ సినిమాలో. చాలా సహజంగా ఉంటుంది తన నటన. జయప్రద నటనలో అక్కడక్కడా కాస్త మెలొడీ ఎక్కువనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  13. బాగుందండీ మీ పునఃపరిచయం. మళ్ళీ ఒకసరి డీవీడీ దుమ్ము దులిపి చూస్తాను.

    రిప్లయితొలగించండి
  14. మురళిగారూ, ఈ సినిమాని గురించి ఇంకొంచెం లోతుగా రాసి ఉండాల్సింది. పైపై విషయాల్ని స్పృశించి వొదిలేశారు. పోనీ ఈ టపా మొదటి సోపానం అనుకొని, మాంఛి రసవత్తరమైన విశ్లేషణా రాసి నవతరంగంలో ప్రచురించండి.

    రిప్లయితొలగించండి
  15. నాకెంతగానో నచ్చిన సినిమా ఇది. ఎన్నో ఊహించని మలుపులుంటాయి...కానీ ఏవీ అసహజంగా అనిపించవు. రజినీకాంత్, జయప్రదల నటన బాగా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  16. @వేణు: 'తాళికట్టు శుభవేళ' ఇప్పటికీ పాపులర్ అండీ.. ఈమధ్య ఇద్దరూ మిత్రుల దగ్గర విడివిడిగా ఈ సినిమా గురించి ప్రస్తావించా.. ఇద్దరూ మొదట ఈ పాటనే తలచుకున్నారు. అంత గొప్ప బాలచందర్ కూడా 'పరవశం' లాంటి సినిమా ఎందుకు తీశారో నాకు అంతుబట్టదు.. ధన్యవాదాలు.
    @బొల్లోజు బాబా: నిజమేనండీ.. ఇలాంటిదే మరో పాట 'రక్త సంబంధం' లో 'చందురుని మించి అందమొలికించు..' ట్యూన్ ఒకటే అయినా రెండు భాషల్లోనూ సాహిత్యం భిన్నంగా ఉంటుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @శేఖర్ పెద్దగోపు: ఆ ఆఫీసు వ్యక్తి సరిత పై అధికారి అండీ. సినిమా ప్రారంభంలో సరితకి ప్రేమలేఖ ఇచ్చి భంగ పడతాడు.. ఆమె ఆ ఉత్తరాన్ని మేనేజింగ్ డైరెక్టర్ (కమల్) కి పంపుతుంది.. అప్పటినుంచీ సరిత మీద పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.. కేవలం సరిత పెళ్లి చెడగొట్టాలన్నదే అతని ఉద్దేశం.. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: కష్టాలు ఎక్కువగానే ఉన్నా అన్నీ సహజంగానే ఉంటాయండీ.. నేనీమధ్య వరుసగా మూడు రోజులు చూశాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @సుబ్రహ్మణ్య చైతన్య: మీ వ్యాఖ్య చదివినప్పటి నుంచీ మీరు పాట పాడే సీన్ విజువలైజ్ చేసుకుని నవ్వుకుంటున్నానండీ.. what a sense of humour!! ..సినిమా కేవలం 'కళ' మాత్రమే ఐతే సరిత అంతలా అలంకరించుకోనవసరం లేదండీ.. కానీ సినిమా వ్యాపారం కూడా కదా? అందుకే అలా.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.
    @శ్రీవత్సవ: 'ఆ పాట నాకు ఇష్టం' అంటేనే నన్ను వింతగా చూశారు కొందరు.. ఇంక రింగ్ టోన్ అంటే చూడకుండా ఉంటారా చెప్పండి? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @మహిపాల్: మహిపాల్ లో రచయితని పూర్తిగా నిద్రలేపి, ఆయనో బ్లాగు రాస్తే చదవాలని నా కోరికండీ.. ధన్యవాదాలు.
    @వినయ్ చక్రవర్తి గోగినేని: అప్పటికి జయప్రదకి అది రెండో సినిమానో, మూడో సినిమానో అండి.. నాకు తెలిసి పూర్తిస్థాయి నాయికగా మొదటి సినిమా.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: మీ పేరు చూసి మీరు జయప్రద అభిమాని అనుకున్నా.. కాదన్న మాట :-) బహుశా శ్రీశ్రీ గారి అభిమాని అయి ఉంటారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @బుడుగు: తప్పక చూడండి.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: బహుశా ఒక పుస్తకమే రాయొచ్చేమోనండీ.. ధన్యవాదాలు.
    @భవాని: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. బాల చందర్ ఇలాంటి గొప్ప సినిమాలు తీయటం వార్తా కాదు,విశేషమూ కాదు...అబద్ధం లాంటి సినిమాలు ఆయన దగ్గ్రనుంచి రావటం మాత్రం బాధాకరం పైగా భయంకరం కూడా. పైన వేణు గారన్నట్లు ‘తాళికట్టు శుభవేళ’పాటలో మిమిక్ర్ర్రీ బాలుది కాదు ఎవరో ఒక కళాకారుడిది.
    ఈ సినిమా ద్వారా బోలెడంత మంది నటీనటులు వెండితెరకు తొలిసారిగా పరిచయమవటమో,గుర్తింపుపొందటమో జరిగింది.జయప్రద,ఫటాఫట్ జయలక్ష్మి,శ్రీప్రియ,జయవిజయ(తర్వాతి రోజుల్లో బెంజిబుజ్జి గా పేరు మోగింది,ఈమధ్యేకన్నుమూసారు)రజనీకాంత్,కమల్ హసన్,నారాయణరావు,ప్రసాద్ బాబు,సురేష్(ఫటాఫట్ జయలక్ష్మి బాయ్ ఫ్రెండ్ ముత్యాలముగ్గులో సంగీత్ ఆన్నయ్య పాత్రధారి ఇప్పుడు మనమధ్య లేరు)రజనీకాంత్ భార్య పాత్రధారి ఈమధ్య ముత్తులో ఆయనకు తల్లిపాత్రపోషించారు..ఇలా ఎందరో.
    ఇందులో జయప్రద పాత్ర పేరు సరిత అదే పేరును తర్వాత మరోచరిత్ర కధానాయికకు స్థిరపరచారు.
    ఈ సినిమా పాటల విషయానికొస్తే,జానకి,సుశీల,ఎల్లారీశ్వరి,జేసుదాస్,బాలు ఒక్కొక్క పాటపాడారు.
    ఈ పిడకలవేటకేమిగానీయండి మీరు మరిన్నిభాగాలు రాయాల్సిందే :)

    రిప్లయితొలగించండి
  22. నాకు బాల చందర్ (అప్పుడప్పుడు మణి రత్నం, శేఖర్ కమ్ముల కూడా) సృష్టించే స్త్రీ పాత్రలంటే చాలా ఇష్టం. విశ్వనాథ్ సినిమాల్లోలా పెద్ద కళ్ళేసుకుని నిస్సహాయంగా చూడటానికో, మిగతా సినిమాల్లోలా కేవలం అంగాంగ ప్రదర్శనకో కాకుండా వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఆలోచనా వుంటాయి.
    బాల చందర్ ది ఇంకొకటి తప్పక చూడాల్సిన సినిమా "ఒరు వీడు-ఇరు వాసల్". ఇది తెలుగులో డబ్ చేసారో లేదో తెలియదు కానీ, awesome movie
    సొంత ఆలోచనా, బలమైన వ్యక్తిత్వమూ, జీవితంతో సొంతంగా తలపడే ధైర్యమూ వున్న ఆడవాళ్ళను చాలా సినిమాల్లో చూపిస్తారు బాల చందర్.
    శారద

    రిప్లయితొలగించండి
  23. @రాజేంద్రకుమార్ దేవరపల్లి: యెంతో విలువైన సమాచారం ఇచ్చి పిడకల వేట అంటారా? బాలేదండి.. మీరు 'అబద్ధం' వరకు ఓపిక పట్టారు కానీ నాకు 'పరవశం' దెబ్బ నుంచి కోలుకోడానికే చాలా సమయం పట్టింది. ఒక్క బాలచందర్ అనే కాదండి, విశ్వనాధ్, బాపు, వంశీ వీళ్ళ తాజా సినిమాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @శారద: విశ్వనాధ్ కి కొంచం ఎగ్జంప్షన్ ఇవ్వొచ్చు అనిపిస్తుందండీ, మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు.. బాపు సినిమాల్లో స్త్రీ పాత్రలు కూడా బలమైనవే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. ఈ చిత్రం తో ఇంకో అయన పరిచయం అయ్యారు. ఆయనే ప్రదీప్ శక్తి ... బస్సు కండక్టరు గా వేసింది ప్రదీప్ శక్తి

    http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_antulenikatha1976.php

    ఈ సినిమాకి ఒరిజినల్ మేఘ డాక్ తార అన్న బెంగాలీ చిత్రం..

    రిప్లయితొలగించండి
  26. ఈ సినిమా ఓ ఆణిముత్యమే ....
    బాలచందర్ గారికేం సరదానో కానీ ప్రతి సినిమాలోనూ ప్రేక్షకుల్నిఏడిపిస్తూనే ఉంటారు.ఈ సినిమా కూడా ఎన్ని సార్లు చూసినా క్లైమాక్స్ లో జయప్రద జింఖానా ప్లీజ్ అంటూ టికెట్ అడుగుతున్నపుడు ఏడ్చేస్తాను . నవ్వుకోకండెం... సినిమా కష్టాలకే కన్నీళ్ళోచ్చేస్తాయి నాకు :(
    బ్లాగ్ మిత్రుల కామెంట్స్ వల్ల ఈసినిమాకి సంబంధించిన చాలా సమాచారం తెలిసింది . మీకూ ,వారికీ థాంక్స్ !

    రిప్లయితొలగించండి
  27. @శ్రీ: చాలా చక్కని సమాచారం అండి.. ధన్యవాదాలు.
    @పరిమళం: ఎందుకండీ నవ్వడం? అలా కదిలించగలగడం సినిమా గొప్పదనం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. గొప్ప సినిమా అండి..
    కాకపోతే చూసేకొద్దీ కదిలిపోయి ఏడుపు వచ్చేస్తుంది
    చెప్తే నవ్వుతారేమో
    ఇంత వరకు నేను "కళ్ళలో వున్నదేదో " పాట పూర్తిగా వినలేదు..
    జానకి గారి గొంతు లో పలికే ఆర్ద్రత నన్ను కదిలించేస్తుంది.
    నాకు చాల ఇష్టమైన, చిన్నప్పటినించి బాగా ఎంజాయ్ చేస్తున్న పాట "తాళి కట్లు శుభవేళ"
    ఆ పాట లో ఒక చోట "సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మ్రోగేనమ్మ" అనే లైన్
    నాకు ఎందుకో కానీ చాల ఇష్టం..
    సరిగ్గా ఆ టైం కి మా అన్నయ్య ఎక్కడి నించో వచ్చి రేడియో ఆఫ్ చేసేసే వాడు..
    ఇంకేముంది..చిన్న సైజు యుధం..
    అమ్మ సర్దిచేప్పడం..
    మొత్తానికి మంచి సినిమా ని మళ్లీ రిఫ్రెష్ చేసారండి..

    అలాగే బాలచందర్ గారి "గుప్పెడు మనసు" సినిమా గురించి కూడా రాయండి ..మురళిగారు..
    అందులో కూడా పాటలన్నీ బాగుంటాయి..

    రిప్లయితొలగించండి
  29. @ప్రణీత: అవునండీ.. 'గుప్పెడు మనసు' చూసి చాలా రోజులయ్యింది.. చూడాలి మళ్ళీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. Murali garu,
    Ee cinema matruka benagali lo Ritwik Ghatak theesina "Meghe Dhaka Thara" (mabbulu moosina nakshtram)dorukuthundaemo choodandi.Anthulaeni kath naenu chudaledu kaani originalku daggaraga kooda undadhani cheppagalanu.Mukyam ga meeku telugu lo nachchani akhari scene benagali lo chusthe thappaka nachchthundi.Supriya chowdhuri, anil biswas nu marchipolaeru.

    రిప్లయితొలగించండి
  31. @సురేంద్ర: తప్పకుండా ప్రయత్నిస్తానండి.. అన్నట్టు మీ కార్టూన్లంటే నాకు ఇష్టం.. మిమ్మల్ని ఇలా కలుసుకోడం చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి