ఆదివారం, ఆగస్టు 09, 2009

ఆదివారం అనుబంధాలు

చాలా రోజులుగా వాయిదా వేస్తున్న పనులన్నీ ఉదయాన్నే ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాకున్న టైం ఒక్క పూట. ఈ ఒక్క పూటలో అన్ని పనులూ చేయడం ఎలాగూ సాధ్యం కాదు. 'ఏవిటి సాధనం?' అని ఆలోచిస్తుండగా, ప్రాధాన్యతా క్రమంలో ఒక పనిని ఎంచుకోమని అంతరాత్మ చెప్పింది.

ఈసారికిలా కానిద్దాం అనుకుని జాబితా వేస్తే కుప్పలుగా పేరుకుపోయిన 'ఆదివారం అనుబంధాలు' క్లియర్ చేయడం అధిక ప్రాధాన్యత ఉన్న పెండింగ్ పనిగా తేలింది. అసలే ఆ పుస్తకాల కుప్పలోకి ఈమధ్య ఓ చిట్టెలుక ప్రవేశించిం దన్న అనుమానాలు బలపడుతున్నాయి.

దినపత్రికల ఆదివారం అనుబంధాలు చాలారోజులు దాచడం మొదటి నుంచీ అలవాటు. వాటిని క్లియర్ చేసేముందు నచ్చిన కథలూఅవీ కత్తిరించి దాస్తూఉంటాను. ఉదయాన్నే'ఆంధ్రజ్యోతి' 'సాక్షి' 'ఈనాడు' సండేమేగజైన్లు ముందేసుకుని కూర్చున్నా. దగ్గర దగ్గర రెండేళ్ళ పుస్తకాలు. వాటిలో కొన్ని దుమ్ము ధూళితో నిండి ఉండడంతో ఎందుకైనా మంచిదని ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నా..

అటు, ఇటు ఉన్న ఇళ్ళ వాళ్ళు ఎందుకు అనుమానంగా చూస్తున్నారో కాసేపు ఆలోచిస్తే కాని అర్ధం కాలేదు. పేపర్లు, టీవీల నిండా స్వైన్ ఫ్లూ వార్తలే కదా.. పుస్తకాలు వేటికవి విడి విడిగానే ఉంచాను చాలా రోజులు. ఐతే అవన్నీ ఎప్పుడో నాకు తెలియకుండా ఐకమత్యాన్ని ప్రకటించాయి. మళ్ళీ వాటిని విడగొట్టడం ఎందుకని అలాగే నాపని మొదలుపెట్టాను.

ఇల్లేరమ్మ చెప్పినట్టు 'తనకున్న పని తినకున్నా తప్పదు..' అందులోనూ ఉదయాన్నే ఉప్మా తిన్నాక ఇంక అస్సలు తప్పదు. ఆహా.. ఒక్కో పుస్తకం తిరగేస్తుంటే ఎన్ని జ్ఞాపకాలు. ఎప్పుడో చదివిన కథలు, కబుర్లు. వీలైనన్ని పుస్తకాలు క్లియర్ చేయాలి అనుకుంటూ మొదలు పెట్టాను కానీ, నాకు తెలియకుండానే మున్సిపాలిటీ ఎద్దులా నచ్చిన చోట ఆగిపోవడం మొదలుపెట్టాను.

'జీవితం..రైలుబండి' అంటూ వంశీ రాసిన వ్యాసం. ఉదయం రైల్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణాన్ని తనదైన శైలిలో కళ్ళకు కట్టాడు. కత్తిరించి 'వంశీ' ఫైల్లో భద్రపరిచా. 'సాక్షి' 'ఈనాడు' తో పోల్చినప్పుడు 'ఆంధ్రజ్యోతి' ఆదివారాలు క్లియర్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. వాటిలో కథలతో పాటు, కొన్ని ఆర్టికల్సూ నాకు నచ్చుతాయి.

అప్పట్లో 'ఫెయిల్యూర్ స్టోరీ'లు చాలావరకు కత్తిరించి దాచాను. 'భజంత్రీ కథలు' తర్వాత దాచాల్సిన ఫీచరేదీ కనిపించలేదు. ఈమధ్య 'ఆంధ్రజ్యోతి' చదవడం తగ్గింది, పేపరబ్బాయి దయవల్ల.. మొన్నటివరకూ మనం ఏం చదవాలో జర్నలిస్టులూ, ఎడిటర్లూ నిర్ణయిస్తారనుకునే వాడిని. పేపరబ్బాయిలదే కీలక పాత్ర అని అనుభవం మీద తెలిసింది.

'సాక్షి' ఫండే తిరగేస్తుంటే ప్రారంభంలో మాత్రమే ఆకట్టుకున్న 'ఆరాధన' సీరియల్, మల్లాది బాగా నిరాశ పరచిన 'తాడంకి ది థర్డ్' సీరియల్ కనిపించాయి. తాడి బలరాం 'సిని ఫక్కీ' లో కొన్ని ఆర్టికల్స్ మరో సారి చదివా. కొన్ని ఇతర భాషల కథల అనువాదాలు మాత్రం ఫైల్ చేశాను. 'ఈనాడు' ఆదివారాల్లో ఓ సౌలభ్యం ఉంది. ఒకప్పుడు మంచి కథలు వచ్చేవి కానీ ఇప్పుడు ఎక్కడో తప్ప దాచాల్సిన కథలు తగలడంలేదు.

'ఈనాడు' లో కూడా వంశీ ఆర్టికల్ ఒకటి కనిపించింది. కేరళ హౌస్ బోట్ ప్రయాణం గురించి. కత్తిరించబోతుంటే వెనుక పేజిలో 'జాతీయ అవార్డ్ లక్ష్యం' అంటూ గాయని సునీత కబుర్లు కనిపించాయి. వీటిలో ఆమె చెప్పిన ఒక కబురూ, దానిపై మిత్రులు పేల్చిన జోకులూ గుర్తొచ్చి నవ్వుకున్నా. నేను అనుకున్నంత వేగంగా పని పూర్తి చేయలేకపోడం వల్ల, అనుకున్న టైమైపోయింది కానీ పనవ్వలేదు. ఏం చేస్తాం.. సగం లో వదిలేసి వాయిదా వేస్తాం.. వీలైనంత త్వరలో పూర్తి చేయాలి.

24 కామెంట్‌లు:

  1. మీరు చాలా సంవత్సరాల క్రిందట ఈనాడు ఆదివారం బుక్( feb 14th sunday,1999, ముఖచిత్రం తాజ్ మహల్ ఉంటుంది) లో "మనసులో వాన" అనే అజయ్ శాంతి రాసిన కధ చదివారా? నాకు మీలా పుస్తకాలు దాచేఅలవాటు అస్సలు లేదుకాని ఆ కధ ఉన్న ఆదివారం బుక్ మాత్రమే భద్ర్రంగా దాచుకున్నాను. ఆ కధ ఇచ్చిన పుస్తకం మీ దగ్గర ఉండే ఉంటుంది. వీలయితే ఒకసారి చూడండి. కురిరితే దాని గురించి రాయగలరు.

    రిప్లయితొలగించండి
  2. ఆదివారం పూట మంచిపనే పెట్టుకున్నారు! ఈ రోజు మిత్రులు కొందరి మధ్య కూడా ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చే కథల గురించి వచ్చిన కథలే మళ్లీ మళ్లీ రావటం గురించి చర్చ జరిగింది:)

    ఒకసారి తప్పకుండా మీ ఇంటికి రావలసిందే!

    రిప్లయితొలగించండి
  3. అయితే ఇంక మాకు బోలెడన్ని విషయాలు తెలియబోతున్నాయన్నమాట!!!!
    ఆ కటింగ్స్ లోని విషయాలన్ని వివరిస్తారని ఆశిస్తూ!!!!!:)

    రిప్లయితొలగించండి
  4. వీటిలో ఆమె చెప్పిన ఒక కబురూ, దానిపై మిత్రులు పేల్చిన జోకులూ గుర్తొచ్చి నవ్వుకున్నా. em kaburu???

    రిప్లయితొలగించండి
  5. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త వరకు ఆన్లైన్ వి చదివి, స్వాతి వార, మాస పత్రికలు తెప్పిస్తాను. ఈ బ్లాగుల పుణ్యమాని వాతికి కేటాయింపు తగ్గిపోయింది. కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం మీరన్న ఫెయిల్యూర్ స్టోరీ, వివిధ, కథలు చదివినవి కొన్ని నచ్చినవి మళ్ళీ చదవటం, లేదా చదవనివి కొన్ని లాగిస్తా. ఈ రోజు నేను కూడా వాయిదా వేసిన వేరే పనులింకా చేస్తూనే వున్నాను. నా మీద నాకు నమ్మకం కలగాలంటే అనుకున్నవి పూర్తిచేయాలి అని ముందే సంకల్పించుకున్నాను కనుక ఇంకా కనీసం 6 గంటల సమయం వుంది కనుక నా పని వాయిదాకి తక్కువే మిగలొచ్చు. అన్నట్లు వంశీవి "మా పసలపూడి కథలు" చదివేవుంటారు. ఆంధ్రజ్యోతిలో కథలు కొన్ని బాగున్నాయి చూడండి. స్వాతి లో "పాలెగత్తె" ఒకటి వార పత్రికలోను, మాస పత్రికలో "దేవభూమి" గత 2-5 సం. లలో నన్ను ఆకట్టుకున్న నవలలు. ప్రస్తుతానికి సెలవిక.

    రిప్లయితొలగించండి
  6. ఇలా కత్తిరించి దాచే అలవాటు మీకూ ఉందాండి?భలే.సాక్షిలో నేను చదివిన సీరియల్స్ కూడా ఆ రెండే నండి.తాడంకి.. నిజంగా చాలా నిరాశ పరిచింది. ఫెయిల్యూర్ స్టోరీస్,కధలూ బాగున్నాయనిపించినవి నేను దాచాను కొన్ని..!
    ఈ మధ్య మాత్రం ఆదివారం పుస్తకాలూ,పేపర్లూ చదివి చాలా రోజులైంది..!

    రిప్లయితొలగించండి
  7. చేతి లో పుస్తకం ఉండటం వల్ల ఈ సౌలబ్యమ్ ఉంది .. నేను ఈ పేపర్ ఎప్పుడు దాచుడం అనుకుంట .. బద్ధకం వల్ల చెయ్యను .. మళ్ళా వెతికితే దొరకవు కదా ... అల చాలా పోయాయి...

    రిప్లయితొలగించండి
  8. పోయిన వారం నేను ఇదే పని చేశా.. :) పేపర్లో అయితే మాత్రం కట్ చేసి పెట్టుకుంటా.. అదే పుస్తకమైతే, అలానే ఉంచేస్తా.. ఇంకోసారి చదివేటప్పుడు మిగతావి కూడా చదవచ్చని..

    రిప్లయితొలగించండి
  9. @శేఖర్ పెద్దగోపు:వ్యాఖ్య కి ధన్యవాదాలు. 'మనసులో వాన' నాకు చాలా నచ్చిన కథండీ.. యెంత నచ్చిందంటే నా బ్లాగులో నేను కథల గురించి రాయడం మొదలు పెట్టింది ఆ కథతోనే.. ఈ లింక్ చూడండి..
    http://nemalikannu.blogspot.com/2009/02/blog-post_07.html

    రిప్లయితొలగించండి
  10. @సిరిసిరిమువ్వ: రోజంతా ఖాళీ దొరికితే బాగుండుననిపించిందండీ.. మద్యాహ్నం నుంచి వేరే పని.. దానివల్ల మిత్రులని కలవడం మిస్సయ్యాను నేను.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
    @స్వాతి: మళ్ళీ ఓసారి ఆ కబుర్లు చదవండి :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @ఉష: 'మా పసలపూడి కథలు' చదివాను, చదువుతున్నాను, చదువుతాను :-) ఈమధ్య వార పత్రికలు చదవడం తగ్గిందండీ..నా వరకు వీక్లీ లలో కన్నా ఈ ఆదివారం అనుబంధాల్లోనే మంచి కథలు వస్తున్నాయనిపిస్తోంది, అప్పుడప్పుడు పత్రికలు తిరగేస్తుంటే.. వారపత్రికలు రెగ్యులర్ గా చదివే మిత్రులు మంచి కథలు వచ్చినప్పుడు సూచిస్తూ ఉంటారు.. అలా వాటిని కవర్ చేస్తూ ఉంటాను.. కథా సంపుటాలు ఉండనే ఉన్నాయి కదా.. మీరు చెప్పిన నవలలు చదువుతానండీ.. ఇప్పుడే వేట మొదలు పెడతాను :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. "manasulo vaana" kadha nEnu chadivaanamDi,gurtumdi..memorable story..!!mI review maatram ippuDE chUsaanu.baagaa raasaaru!

    రిప్లయితొలగించండి
  13. @తృష్ణ: 'ఫెయిల్యూర్ స్టోరీ' సంకలనం వస్తుందని ఎదురు చూశానండి.. ఎందుకో మరి తేలేదు వాళ్ళు. ఈ అలవాటు ఎప్పటినుంచో ఉందండీ.. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే అలవాటు :-) ..ధన్యవాదాలు.
    @శ్రీ: 'సాక్షి' ఫండే ఫైల్ చేసేటప్పుడు కూడా, లింక్స్ దాచుకుంటే పోలా అనిపించిందండి.. నామీద నాకు నమ్మకం లేక కటింగ్స్ దాచాను :-) ధన్యవాదాలు.
    @మేధ: నాకూ పుస్తకాలు దాచాలనే ఉంటుందండి...కానీ చాలా సమస్యలు..ప్చ్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఇంతకముందు తెలుగు ఇండియా టుడే లో కూడా మంచి మంచి కధలు వచ్చేవి.
    అన్నట్టు -
    మా నాన్న, లెక్కలు మరియూ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. ఆయన వద్ద ఇలాంటి కలెక్షను ఓ బీరువా నిండా ఉన్నాయ్. ది హిందూ మంగళావారం స్పెషల్ నుండి కత్తిరించిన "నో యువర్ ఇంగ్లీష్" ఓ ఐదు సమచ్చరాలవి ఉన్నాయ్.
    నా దగ్గర చాలా కాలం వరకు పది సంవత్సరాలవి "ఫ్రంట్లైన్" సెంటర్ స్ప్రెడ్స్ ఉండేవి. ఆకాలంలో ఫ్రెంట్లైన్ వాడి మధ్యపుట చాలా మంచి మంచి పోటోలతో వచ్చేది. అలానే చివరి మూడూ పేజీలు, గదేన్వయా క్రికెట్ బొమ్మలు.

    రిప్లయితొలగించండి
  15. Murali Gaaru,
    I like your Posts. I regularly read your posts and every time think of posting a comment but since I'am not comfortable yet to type in telugu, I will hezitate to post a comment. But today after reading AAdivaaram anubandalu I wanted to share my opinion.
    Even I used to have the same habit of saving all the stories I liked. since now I'am reading web versions I'am not able to do.
    Any way good posts.

    రిప్లయితొలగించండి
  16. చాలా మంచి పని పెట్టుకున్నారు మురళి.. ఆ కధలు చదువుతూ ఆ ఙ్ఞాపకాల వెంట పయనం చాలా బాగుంటుంది. సునీత గారి కబుర్లు, జోకులు మాకు కూడా చెప్తే మేంకూడా నవ్వుకుంటాం కదండీ.. అలా సగం చెప్పి ఊరిస్తే ఎలా :-)

    రిప్లయితొలగించండి
  17. మురళి గారు శుభోదయం..
    ముందుగా నా ధన్యవాదాలు..తెలుగు అక్షరాభ్యాసం చేయింఛినందుకు..
    అలాగే తెలుగు (బ్లాగ్) బడి లో చేర్పించి విద్యా(బ్లాగ్) బుద్దులు నేర్పించి..
    మంచి బ్లాగర్నయ్యేoదుకు మీ సహాయ సహకారాలు అందించవలసినదిగా మనవి..!!


    పుస్తకాల్లోంచి కధలు, కబుర్లు కట్ చేసి దాచుకోవడం అమ్మ నేర్పింది నాకు.
    కేవలం కట్ చేసి ఫైల్ చేసుకోవడం కాదు సుమా..
    తనే స్వయంగా బైన్డింగ్ కూడా చేసుకుని దాచుకునేది..
    తన అలవాటు నాకూ నేర్పింది..
    కానీ..
    పుస్తకం, వనితా, విత్తం పరహస్తం గతం గతః ..
    అని..
    మొహమాటానికి పోయి
    అడిగిన వారందరికీ కాదనకుండా ఇచ్చి చాల పుస్తకాలు పోగుట్టుకున్నా..
    ఇప్పుడు మళ్ళి కొత్తగా కలెక్షన్ మొదలు పెట్టా..
    బుధిగా.. ఎవరికి ఇవ్వకుండా..
    ఇచ్చినా మళ్ళి అడిగి తీసేసుకుంటున్నా..!!

    రిప్లయితొలగించండి
  18. మురళి గారు, ఇప్పుడే మీరు ఆ కధ మీద రాసిన టపా చదివాను. బాగా రాశారు. అసలు ఆ కధ మొదటిసారి చదివినప్పుడు అయితే తెగ నచ్చేసింది. అలా ఎన్నిసార్లు ఆ కధ చదివానో లెక్కేలేదు. నా బుక్కు మీద పచ్చడి మరకలు, ఆక్వేరియం నీళ్ళు పడి ఇంచుమించుగా జీర్ణావస్థలో ఉంది. కావున మీరు దయచేసి నాకు మీ దగ్గర ఉన్న స్కాన్ చేసి ఉన్న కాపీ పంపగలరు.
    ముందుగా మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @భాస్కర్ రామరాజు: ఒకప్పటి తెలుగు 'ఇండియా టుడే' అభిమానుల్లో నేనూ ఒకడిని.. చాలా మంచి కథలు వచ్చేవి.. కొన్నాళ్ళకి కథ బదులు సీరియల్ మొదలు పెట్టారు.. నెమ్మదిగా కథలు వెనక్కి వెళ్ళిపోయాయి.. ...ధన్యవాదాలు.
    @సురభి: ఇప్పుడైనా యూఆరెల్స్ దాచుకోవచ్చు కదండీ.. అప్పుడప్పుడూ చదువుకోడానికి.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: రాసేవైతే నేను రాయకుండా ఉంటానా చెప్పండి? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @ప్రణీత: ప్చ్.. నేను కూడా చాలా పుస్తకాలు పోగొట్టుకున్నానండీ.. మీ బ్లాగు కోసం ఎదురు చూస్తున్నాం.. మీదే ఆలస్యం.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: నాక్కూడా మొదటిసారి చదివినప్పటి అనుభూతి ఇంకా తాజాగా ఉందండీ.. మీ మెయిల్ ఐడీ ప్లీజ్...

    రిప్లయితొలగించండి
  21. నాకుకూడా ఈ అలవాటు చాలాకాలం ఉండేది. ఈనాడు ఆదివారంలో వచ్చే కవర్‌స్టోరీలను విడిగా పెట్టుకొనేవాడిని. ఇక క్రికెటర్ల ఫోటోలు, గణాంకాలూ( రాకేష్‌కుమార్ శ్రీవాస్తవ- ఈనాడుకు థాంక్స్ చెప్పాలి.) కత్తిరించి ఒకబైండునోట్సులో అంటించేవాడిని. ఈమద్య వైజాగ్‌లో కొంతకాలం ఉన్నాను ఎన్నికలముందు. రోజూ ఒక ఆదర్శప్రతినిథి గురించి రాసేవాళ్లు. వాటిని విడిగా భద్రపరుద్దాం అంటే కుదరలేదు. అలా జాగ్రత్తచేస్కొందాం అనుకొన్న వాటిలో చాలా మిస్స్ అయ్యాయి. ఒకసారి ఆదిశంకరాచార్యుల గురించి శంకరజయంతి సందర్భంగా ఆంధ్రజ్యోతిలొ వచ్చిన ఆర్టికల్ ఒకటి మిస్స్ అయింది. ఇప్పటికీ చాలాబాధేస్తుంది. చాలా గుర్తొచ్చేస్తున్నాయి. ఇక ఇంతటితో ఆపుతా.

    రిప్లయితొలగించండి
  22. ఈనాడు లొ వచ్చిన గొల్లపూడీ వారి కధ కురింజి కూడా దాచుకోదగినదే
    ఇంతకీ గాయని సునీత చెప్పిన ఆ ఊసేమిటో

    రిప్లయితొలగించండి
  23. @సుబ్రహ్మణ్య చైతన్య: మనిద్దరికీ కొన్ని కొన్ని పోలికలు కనిపిస్తున్నాయండీ.. నా అనుభవంలో తెలుసుకున్నది ఏమిటంటే, ఏదైనా కత్తిరించి దాచాలి అనుకుంటే ఆపని వెంటనే చేయాలి, లేదా ఆ పుస్తకాన్నైనా వేరేగా దాచాలి.. లేకపోతె అంతే... ధన్యవాదాలు.
    @వూకదంపుడు: నిజమేనండీ..'కురింజి' మంచి కథ.. మొన్న వెతుకుతుంటే నాకు కనిపించలేదు ఎందుకో.. మళ్ళీ వెతుకుతా.. సునీత కబురు నేను చెప్పడం కన్నా మీరు చదివితేనే బాగుంటుందండీ... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. is there any way to get the story Manasulo vaana by Ajay shanthi............. please please please......... i have read that story long back and i regret for not saving that copy..... i would like to read that again..... can any body let me now if i can read that.......Now i am not in india, so i cont get that copy.. had i been in india , certailnly i would have searched for old copies of eenadu weekely in libraries.......

    రిప్లయితొలగించండి