ఆదివారం, మే 17, 2009

నిశ్శబ్ద సాక్షి

రాష్ట్రంలో ఐదేళ్ళ పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ విజయానికీ, ప్రతిపక్షాల మహా కూటమి, కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం పార్టీల ఓటమికీ కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. వీటిల్లో చెప్పుకో వలసిందీ, నిశ్శబ్దంగా తన పని తానూ చేసుకుపోయిందీ ఒకటి ఉంది. అది యేడాది క్రితం పుట్టిన 'సాక్షి' దిన పత్రిక.

పేపరు చదివే అలవాటు ఉన్న తెలుగు వాళ్లకి 'సాక్షి' పుట్టుకకి దారి తీసిన పరిస్థితులేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని రెండు ప్రధాన తెలుగు పత్రికలతో పాటు, వాటిలో ఓ పత్రిక యాజమాన్యంలోనే నడుస్తున్న ఓ టీవీ చానల్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని అజెండా గా చేపట్టినప్పుడు అధికార కాంగ్రెస్ కి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం తనకంటూ ఓ పేపర్ ని ప్రారంభించుకోవడం.

అధికారం లో ఉన్న పార్టీ ప్రాపగాండా కోసం ఓ పత్రికను ప్రారంభించు కోవచ్చా? అన్న ప్రశ్నలు చాలా వినిపించాయి. మరి ఏ పార్టీకీ చెందని పత్రికలుగా తమని తామూ అభివర్ణించుకునే 'ఆ రెండు' పత్రికలూ ప్రభుత్వ వ్యతిరేకతని పెంచి పోషించడమే ఎజెండా గా పెట్టుకోవచ్చా? ఈ ప్రశ్నకి మేధావులెవరి నుంచీ సరైన సమాధానం రాలేదు. ఇది 'సాక్షి' ఆరంభాన్ని సమర్ధించడం కాదు, అందుకు అనివార్యమైన నేపధ్యాన్ని వివరించడమే.

నిజానికి రాజకీయ పార్టీలకి సొంత పత్రికలు ఉండడం 'సాక్షి' తోనే మొదలు కాలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు 'నేషనల్ హెరాల్డ్' అనే పత్రిక ఉండేది. నెహ్రూ మానస పుత్రిక ఐన ఈ పత్రిక ఉద్దేశ్యం పార్టీని ప్రమోట్ చేయడం కానే కాదు. నిజానికి ఈ పత్రిక చాలా సందర్భాలలో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టే, నెహ్రూని ఇరుకున పెట్టే రాతలు రాసింది. వామపక్ష పార్టీలకి, బీజేపీ అనుబంధ సంఘాలకీ కూడా సొంత పత్రికలు ఉన్నాయి. అవి పూర్తిగా పార్టీ పత్రికలు.

ఐతే 'సాక్షి' మాత్రం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కోసం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పత్రిక. గడిచిన యేడాది కాలం లో ముఖ్యమంత్రి సమస్యను ఎదుర్కొన్న ప్రతిసారీ ఆయనకి అండగా నిలిచింది 'సాక్షి.' ప్రతి అంశంలోనూ ముఖ్యమంత్రి వాదనను బలంగా వినిపించింది. 'ఆ రెండు పత్రికలకి' ధాటీగా సమాధానాలు చెప్పడమే కాదు, గీత దాటి రాస్తే వాటి బండారాలని బయట పెడతానని బెదిరించడానికీ వెనుకాడ లేదు.

'సాక్షి' రాతలని జనం పూర్తిగా నమ్మేశారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఆ పత్రిక వాళ్ళు కూడా ఇలా భావించక పోవచ్చు. ఐతే పత్రికా ముఖంగా జరుగుతున్న దాడుల నుంచి ముఖ్యమంత్రిని రక్షించడంలో, ఎదురుదాడుల ద్వారా ప్రత్యర్దులని నిలువరించడం లోనూ విజయం సాధించిందని చెప్పక తప్పదు. యేడాది క్రితం వాతావరణాన్ని గుర్తు చేసుకుంటే, 'సాక్షి' పత్రికే లేకపొతే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండేది? ముఖ్యమంత్రికి తన వాదన వినిపించే 'గొంతు' ఉండేది కాదు. ఏకపక్షంగా ఆరోపణలు సాగిపోతూ ఉండేవి. వాటి ప్రభావం ఎంతోకొంత వోటర్ల పై పడి ఉండేది.

ఇదే సమయంలో మరో ఆలోచన కలుగుతోంది. 'ప్రజారాజ్యం' పార్టీకి సొంతంగా ఓ పత్రిక ఉండి ఉంటే అ పార్టీ మరికొన్ని స్థానాలు సంపాదించి ఉండేదేమో.. ఒకప్పుడు పత్రిక కరదీపిక. ఇప్పుడు కరపత్రం. సొంత వ్యాపారాలకి, రాజకీయ వ్యవహారాలకి రక్షణ చక్రం. 'సాక్షి' ఈ ట్రెండ్ ని ప్రారంభించ లేదు, వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఏమిటో సామాన్య పాఠకులకి కూడా అయ్యేలా చేసింది. అంతిమంగా తన లక్ష్యాన్ని సాధించింది.

8 కామెంట్‌లు:

  1. "ఒకప్పుడు పత్రిక కరదీపిక. ఇప్పుడు కరపత్రం. సొంత వ్యాపారాలకి, రాజకీయ వ్యవహారాలకి రక్షణ చక్రం."ఇది మాత్రం అక్షరాలా నిజమండీ ..

    రిప్లయితొలగించండి
  2. అవును ఎప్పటినుంచో పత్రికలు ఒక పక్షం వైపు మొగ్గు చూపించటం మాములే ఐనా పరిమితి అనేది లేకుండా పోయింది కాలం గడిచే కొద్ది. అది ఒక్కటే కారణం కాక పోయినా ఈనాడు కూడా ప్రముఖ పాత్ర పోషించలేదా NTR గారు గెలవటానికి అప్పట్లో. " ఒకప్పుడు పత్రిక కరదీపిక. ఇప్పుడు కరపత్రం" చాలా నిజం మీరు చెప్పింది.. చిరంజీవి గారు పార్టీ కి కూడా ఒక సొంత గొంతు వున్నా కష్టమేలెండి.. ఆరభించిన మొదటి క్షణం నుంచి ఆయన చాలా సార్లు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేదు..

    రిప్లయితొలగించండి
  3. అయ్యో మురళి గారు, హెంత హమాయకులండి? ఈ మాట టి.డి.పి వారినడగండి... ఈనాడు ముందు సాక్షీ ఒక పత్రికేనా అంటారు. అప్పటికి ఈనాడు పత్రికైనట్టు. ఈ సంస్థల యజమానుల భాగోతాలు సాక్షి రాకముందు ఎంతమందికి తెలుసు? గురివింద గింజ పైభాగమే అందంగా అందరికి కనిపించేది. ఈ పేపరు రాకతో అప్పడిదాకా కనిపించని మరో రూపంకూడా తెలిసింది.

    మంచి విశ్లేషణ చేశారు.. పత్రికలు వ్యాపార కరపత్రాలు.

    రిప్లయితొలగించండి
  4. @పరిమళం, భావన, భాస్కరరామిరెడ్డి, కృష్ణ: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. సాక్షి గురించి ముందుగానే తెలియటం ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈనాడు గురించి మాత్రం ఈ ఎన్నికలప్పుడు బాగా అర్ధమయ్యింది. ఇప్పుడు ఈనాడు చదవాలంటేనే చిరాకొస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. @పరిమళం
    మీరు చెప్పింది అక్షరాల నిజం

    రిప్లయితొలగించండి