శనివారం, మే 02, 2009

వేషం తప్పిపోయింది...

నాలో ఓ నటుడున్నాడన్న విషయాన్ని మొదట గుర్తించినవాడు ఆనంద భూపతి. మా ఊళ్ళో అడుసు తొక్కి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. నిజానికి అతని అసలు పేరు 'ఆనంద భూపతి' కాదు.. ఏమిటో కూడా నాకు తెలియదు. నాలోని నటుడిని గుర్తించాడన్న కృతజ్ఞత లేనట్టయితే అతన్ని ఎప్పుడో మర్చిపోయే వాడిని. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఓ యువజన సంఘం ఉండేది. దేవుడి కళ్యాణానికి ఈ సంఘం వాళ్ళు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఓ యేడాది మా సంఘం వాళ్ళంతా కలసి నాటకం వేయాలని నిర్ణయించుకున్నారు.

అవి పౌరాణికాల రోజులు. ఐతే మా వాళ్లకి పౌరాణిక నాటకం పద్యాలు నేర్చుకునేంత ఓపిక, తీరిక లేవు. అందువల్ల కొంచం భిన్నంగా సాంఘిక నాటకం వెయ్యాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు ఓ ఇద్దరు రాజమండ్రి వెళ్లి దొరికిన నాటకాల పుస్తకాలు ఓ నాలుగైదు పట్టుకొచ్చారు. నేను చాలా రోజులపాటు రాజమండ్రిలో కేవలం నాటకాల పుస్తకాలు మాత్రమే దొరుకుతాయనీ, ఎవరికి నాటకం కావల్సొచ్చినా రాజమండ్రి వెళ్ళాల్సిందేననీ అనుకునే వాడిని.

మొత్తానికి అందరూ కలిసి ప్రేమ, పగ ఇతివృత్తంతో ఉన్న ఓ నాటకాన్ని ఎంపిక చేశారు. నాటకానికి ఏం ఉన్నా, లేకపోయినా రిహార్సల్సూ, అవి వేయడానికి ఓ గదీ అవసరం. మా ఇంటి పక్కనే మా బంధువుల ఇల్లొకటి ఖాళీగా ఉండేది. తాళాలు కూడా మా దగ్గరే ఉండేవి. యువజన సంఘానికి నాన్న సలహాదారు కూడా కావడంతో సంఘం వాళ్ళు రిహార్సల్సు కోసం ఆ ఇల్లు అడగడమూ, ఈయన ఒప్పుకోవడమూ జరిగింది. పాత్రధారుల ఎంపిక కూడా మా పక్కింట్లోనే జరగడంతో దగ్గరుండి చూసే అవకాశం దొరికింది నాకు, వాళ్ళందరికీ మంచినీళ్ళూ అవీ తీసుకెళ్ళి ఇచ్చే నెపం మీద.

పొరుగూరినుంచి హీరోయిన్ని తీసుకురావాలని నిర్ణయించడంతో కుర్రాళ్ళంతా హీరో వేషం కోసం పోటీలు పడడం మొదలెట్టారు. సంఘ సభ్యులంతా కూర్చుని అందరికన్నా ఎక్కువ జతల కొత్త బట్టలూ, బూటీలూ (షూస్) ఉన్న కుర్రాడిని హీరోగా ఎంపిక చేశారు. పులిగోరు పతకం ఉందన్న ఏకైక కారణంతో మా ఆనంద భూపతిని జమీందారు ఆనంద భూపతి వేషానికి ఎంపిక చేసేశారు. మొత్తం బృందంలో అతనే పెద్దవాడు కావడం తో అందరినీ అదిలిస్తో పెత్తనం చేస్తూ ఉండేవాడు. నాటకంలో హీరోకి ఓ కొడుకు ఉంటాడు, ఆరేడేళ్ళ వాడు. ఆ పాత్ర కి నటుడి ఎంపిక ఇంకా పూర్తవలేదు.

రిహార్సల్ గదిలో ఓ రోజు అందరూ మాట్లాడుకుంటుండగా ఆనంద భూపతి నన్ను చూపించి నాన్నతో "కుర్రాడేసం అబ్బాయిగారిసేత కట్టిద్దారండి" అన్నాడు. నాన్నేమీ మాట్లాడలా.. మౌనం అంగీకారం అన్నమాట. అప్పటివరకు పొరుగూరి హీరోయిన్తో నటించడం గురించి ఊహల్లో మునిగి తేలుతున్న నా నాటక జనకుడు (దుష్ట సమాసం! నాటకం లో నా తండ్రి అన్నమాట) కళ్ళు తేలేశాడు. అతికొద్ది ముద్దుగా, అత్యంత బొద్దుగా ఉన్న నన్నెత్తుకుని డైలాగులు చెప్పడం అంటే మాటలా? అలా అని వేషం వదులుకోలేడు. నాకు మాత్రం భలే గర్వంగా అనిపించింది. ఆనంద భూపతి నా కళ్ళకి దేవుడిలా కనిపించాడు. నాటకం లో వేషం అంటే మాటలా మరి?

నిజం దేవుడు మాత్రం మా కథానాయకుడి పక్షాన ఉన్నాడు. లేకపొతే నా నోటితో నేనే వేషం వద్దని చెప్పేలా ఎందుకు చేస్తాడు? అదెలా జరిగిందంటే, వేషాలన్నీ ఫైనలైజ్ అయ్యాక, టెక్నికల్ డిపార్ట్మెంట్ల గురించి చర్చ వచ్చింది. మేకప్పులు మాత్రం సత్యమే చేయాలని మా వాళ్ళు ఏకగ్రీవంగా నిర్ణయించేశారు. 'పొరుగూర్లో పౌరానికాలకి కూడా మనోన్నే పిలుత్తున్నారు.. మనం మేకప్పేయించుకోపోతే ఎలాగా?' అనేశారు. సత్యం మేకప్ వేస్తాడన్న మాట వినగానే నేను వేషం వదులుకోడానికి నిర్ణయించేసు కున్నాను.

"మాకు బళ్ళో పరీక్షలు పెడతామంటున్నారు. వేషం ఇంకెవరిచేతైనా వేయించండి.." అని నిండు సభలో బుద్ధిగా ప్రకటించాను. నా నిజ జనకుడి (నాన్న) కళ్ళలో సంతోషం. (నిజంగా చదువు మీద శ్రద్ధ అనుకుని). నాటక జనకుడు కూడా చాలా సంబర పడ్డాడు. బక్కగా ఉండే మా ఫ్రెండు దొరబాబు ఆ వేషం వేశాడు. ఇంతకీ అతనికి మేకప్ వెయ్యనే లేదు! ఆనంద భూపతికి హీరోతో ఏవో మాట పట్టింపులు ఉన్నాయనీ, అతన్ని ఇరికించడం కోసం నన్ను బాల నటుడిగా సూచించాడనీ తర్వాత తెలిసింది.

ఎప్పుడైనా కుర్చీలో వెనక్కి వాలి గతంలోకి వెళ్ళినప్పుడు ఆరోజు నేనెంత తప్పు చేశానో అర్ధమై బాధ పడుతూ ఉంటాను. ఏమో ఎవరికి తెలుసు? నేను ఆ వేషం వేస్తే...నెమ్మదిగా నాటకాలలోనూ ఆపై సినిమాలలోనూ వేషాలు వచ్చేవేమో.. నేనూ, నా తర్వాత కొన్ని తరాల పాటు నా వారసులూ తెలుగు ప్రజలకు కళాసేవ చేసుకునే వాళ్ళమేమో.. ప్చ్..

16 కామెంట్‌లు:

  1. >> అత్యంత బొద్దుగా ఉన్న..

    అప్పటి మాట సరేనండీ, ఇప్పటి సంగతేమిటీ ? ;)

    రిప్లయితొలగించండి
  2. అవునవును అలా అలా కళా సేవ చేస్తూ ఆ పైన మన రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా అయ్యేవారేమో? అబ ఛా ఎంత పెద్ద చాన్సు పోయింది మురళీ,సర్లే ఏమి చేస్తాము...ఈ సారికి ఇలా కానిచ్చెయ్యి మరి ఏతంతావ్..

    రిప్లయితొలగించండి
  3. అరే మంచి చాన్స్ మిస్స్ అయ్యాం కదండి....

    రిప్లయితొలగించండి
  4. !!!!!!!అంధ్రదేశం ఒక గొప్ప నటుణ్ణి కోల్పోయిందన్నమాట.

    రిప్లయితొలగించండి
  5. ప్చ్ ....ఒక మంచి నటుడ్ని కోల్పోయామన్న మాట! పోనీ లెండి మురళి గారూ ! అలా మీరు నటుడైతే ఒక మంచి బ్లాగర్ని కోల్పోయేవాళ్ళం కదూ ! :) :)

    రిప్లయితొలగించండి
  6. తెలుగు ప్రజలకు కళాసేవ చేసుకునే వాళ్ళమేమో..... ప్రజల డబ్బులతో ప్రజా సేవ కూడా మిస్ అయ్యాము.

    రిప్లయితొలగించండి
  7. "ఇప్పటికైనా మించిపోయినదేమీ లేదు" అనే లైన్లో ఏమైనా ఆలోచించారా? :)

    రిప్లయితొలగించండి
  8. బాగున్నాయ్ మురళి గారు కబుర్లు, ఉమాశంకర్ గారిదే నామాట కూడానూ... ఇప్పటికీ మించి పోయినదేమీ లేదు ప్రయత్నించి చూడండి.

    రిప్లయితొలగించండి
  9. @ఉష: మీ ఊహకే వదిలేస్తున్నాను :) ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: ఏతంతాను? అందరేతంతే నానూ అదే అంతాను. జనం కోరితే రాజకీయాల్లోకి రావాల్సిందే, వాళ్ళు అవ్వమంటే ముఖ్యమంత్రి అవ్వాల్సిందే.. ఒక్క సారి జనం మనిషయ్యాక వ్యక్తిగత ఇష్టాలు ఉండవు కదా :) ధన్యవాదాలు.
    @పద్మార్పిత: అంతే అంటారా? కానివ్వండి :) ధన్యవాదాలు.
    @సునీత (నాబ్లాగు): ఇదేదో కొంచం సంతాప సందేశం లా వినిపిస్తోందండి :) మీ భావం నాకు అర్ధమైంది..సరదాగా అలా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @పరిమళం : అదేం మాటండీ? అమితాబ్ బచ్చన్ వాళ్ళూ బ్లాగులు రాయడం లేదూ? :) :) ధన్యవాదాలు.
    @జల్లిపల్లి కృష్ణారావు: నిజమేనండి.. చాలా మిస్ అయ్యాం, నేనూ, నా వారసులూ... :) ధన్యవాదాలు
    @ఉమాశంకర్, వేణూ శ్రీకాంత్: ప్చ్.. లాభం లేదండి..ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కదా.. అందులోనూ ఇప్పుడంతా టీనేజ్ హీరోలు, దర్శకులు.. ఇలా బ్లాగులు రాసుకుంటూ శేష జీవితం గడిపేస్తా :) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. ప్చ్ .. తెలుగు కళామతల్లికి ఇంతటి ద్రోహం జరిగిపోయిందా? ఘోరం.

    రిప్లయితొలగించండి
  12. @కొత్తపాళీ: నిజమేనండి.. ఏం చేద్దాం? :)

    రిప్లయితొలగించండి
  13. అయ్యయ్యో మురళీ గారూ.. ఎంత పని జరిగింది :-(
    ఒక శివ, ఒక ఖైదీ, ఒక పోకిరి, ఒక ఆది, ఒక ఛత్రపతి, ఒక ఆర్య, ఒక చిరుత.. ఇంకా ఎన్ని మిస్ అయిపోయామండీ బాబూ..! కానీ, అలా జరగడం వల్లే మంచి మంచి పోస్టులు రాయడానికి మీకు తీరిక దొరుకుతుంది. మాకు ఆనందం దొరుకుతుంది. ఇది కూడా కళా సేవే లెండి :-)

    రిప్లయితొలగించండి
  14. @మధురవాణి: ఏమిటో మీ అభిమానం :) :) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. దేశం గొప్ప కళాకారుడ్ని కోల్పోయింది అని రాధ్ధమంటే దాని అర్ధం మారిపోతుంది.మీది తొడలు కొట్టే వంశమా లేక బావ-బావమరిది ప్రొడక్షనా?

    రిప్లయితొలగించండి
  16. @Subrahmanya Chaithanya Mamidipudi: ప్చ్.. రెండూ కాదండి..అందుకే స్టెప్ బై స్టెప్ గా కష్టపడి పైకి వచ్చేవాడినేమో అనే ఆలోచించా.. ఇప్పుడింక ఎంననుకుని ఏం లాభం లెండి :-) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి