సోమవారం, నవంబర్ 22, 2010

అన్వేషణ

సృష్టిలో క్రూరమైన మృగం పులి అనుకుంటారు చాలామంది. కానీ, మనిషికన్నా క్రూరమైన మృగం మరొకటి లేదంటుంది పాతికేళ్ళ క్రితం వంశీ తీసిన 'అన్వేషణ' సినిమా. ఈ సినిమా ద్వారా మర్డర్ మిస్టరీని తెరకెక్కించడంలో వంశీ చేసిన ప్రయోగాలు తర్వాత ఎంతోమంది దర్శకులకి మార్గదర్శకం అయ్యాయి.. వాళ్ళెవరూ కూడా 'అన్వేషణ' స్థాయి విజయాన్ని సాధించలేకపోయారు. వంశీ తీసిన మంచి సినిమాల జాబితాలో స్థిరమైన చోటు సంపాదించుకున్న ఈ సినిమా అప్పట్లో వంద రోజుల పండుగ జరుపుకుంది.


మద్రాస్ మ్యూజిక్ కాలేజీలో చదివిన హేమ (భానుప్రియ), ఫారెస్ట్ కాంట్రాక్టర్ రావు గారి (కైకాల సత్యనారాయణ) ఆహ్వానం మేరకి ఆయన ఉంటున్న అటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీతాన్ని యెంతో ఇష్టపడే రావుగారికి ఉన్నది ఒకటే కోరిక, పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని నిరూపిస్తూ ఓ పుస్తకం రాయాలని. ఇందుకోసం ఆయన స్వయంగా పరిశోధన మొదలు పెట్టినప్పటికీ, వృద్ధాప్యం కారణంగా మొదలైన మతిమరుపు ఆయన చేత ఆ పనిని పూర్తి చేయనివ్వదు.

రావుగారి జీప్ డ్రైవర్ (రాళ్ళపల్లి) భార్యే ఆ ఇంట్లో వంట మనిషి కూడా. అక్కడ పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజర్ జేమ్స్ (శరత్ బాబు) రావుగారికి మంచి స్నేహితుడు. ఊరి సర్పంచ్ పులిరాజు (మల్లికార్జున రావు), అతని భార్య నాగలక్ష్మి (వై.విజయ), వాళ్ళ కొడుకు చంటోడు (శుభలేఖ సుధాకర్), పులిరాజు బావమరిది (బాలాజీ)... ఇలా రావుగారితో మసిలే ప్రతి ఒక్కరూ చిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడం అర్ధం కాదు, రావుగారి స్నేహితుడి కూతురైన హేమకి.

హేమ కన్నా ముందు అదే అంశం మీద పరిశోధన కోసం రావుగారు రప్పించిన సుమతి అనే అమ్మాయిని అడవిలో పులి దారుణంగా చంపేసిందని తెలిసినా ఏమాత్రమూ భయపడని ధైర్యస్తురాలు హేమ. ఎవరి మాటలూ పట్టించుకోకుండా అడవిలో తిరుగుతూ తన పరిశోధన తాను చేసుకుంటూ ఉంటుంది. ఓ ముగ్గురు ముసుగు మనుషులు తనని వెంబడించడం, వాళ్ళని మరో ముసుగు మనిషి వెంబడించడం గమనిస్తుంది హేమ. రావుగారి సహాయకుడు గోఖలేని పులి చంపేయడంతో ఊరి జనంలో మళ్ళీ భయం మొదలవుతుంది.

గోఖలే స్థానంలో పనిచేయడం కోసం పట్నం నుంచి వస్తాడు అమర్ (తర్వాతికాలంలో కార్తిక్ గా మారిన తమిళ నటుడు, 'సీతాకోకచిలక' ఫేం మురళి). ఉద్యోగంలో చేరకుండా పులి ఆనుపానులమీద ఎంక్వయిరీలు చేసే అమర్ ప్రవర్తన కూడా చిత్రంగానే ఉంటుంది. ఇంతలో ఊళ్ళో బండివాడిని (ధమ్) పులి చంపేయడంతో ప్రజల్లో మళ్ళీ భయభ్రాంతులు మొదలవుతాయి. పులిని చంపేయమని కలెక్టర్ నుంచి ఉత్తర్వులు కూడా ఉంటాయి. నిజానికి అప్పటివరకూ పులిని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. జనం చూసిందల్లా పులిచేతిలో మరణించిన వాళ్ళ శవాలనే.

హేమకీ అమర్ కీ స్నేహం కలవడం, అమర్ పోలిస్ అధికారి అనీ, పులి చేతిలో మరణించిన వారిగా చెబుతున్న వారంతా నిజానికి మనుషుల చేతిలోనే హతమయ్యారనే దిశగా అతను పరిశోధన సాగిస్తున్నాదనీ తెలియడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. హేమని వెంటాడుతున్నవాళ్ళు ఎవరు? వాళ్ళని వెంబడిస్తున్న వ్యక్తి ఎవరు? పులి పేరుతో హత్యలు ఎందుకు జరిగాయి? రావుగారి పుస్తక రచన పూర్తయ్యిందా? లాంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ సినిమా ముగుస్తుంది.

నిజానికి ఈ 'అన్వేషణ' సాంకేతిక నిపుణుల సినిమా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వంశీతో పాటు, చాయాగ్రాహకుడు ఎమ్వీ రఘు, ఎడిటింగ్ చేసిన జి.ఆర్. అనిల్ మర్నాడ్, సంగీతం సమకూర్చిన ఇళయరాజాల ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా తలకోనలో చిత్రీకరించిన ఈ సినిమా కథ శ్రీకారం నుంచి శుభం కార్డు వరకూ అడవిలోనే జరుగుతుంది. ప్రతి పాత్ర ప్రవర్తనా అనుమానాస్పదంగానే అనిపించడంతో ముగింపు ఊహకందదు. అడవిని ఎంత అందంగా చూపించారో, అంతగానూ కెమేరాతో భయపెట్టేశారు రఘు. ఏ సన్నివేశం నిడివి ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండడం ఈ సినిమా ఎడిటింగ్ ప్రత్యేకత.

వాయిద్యాలతో మాత్రమే కాదు, అవసరమైన చోట్ల నిశ్శబ్దంతోనూ అద్భుతమైన మూడ్ క్రియేట్ చేశాడు ఇళయరాజా. 'కీరవాణి' 'ఏకాంతవేళ' 'యెదలో లయ' 'ఇలలో కలిసే..' ప్రతిపాటా దేనికదే ప్రత్యేకమైనది. వేటూరి చక్కని సాహిత్యం అందించారు. పక్షుల గొంతులను సంగీత వాద్యాల మీద ఇళయరాజా ఎంత సహజంగా పలికించాడో, అంటే సహజంగా ఆ గొంతులకి తన గొంతుని పోటీగా నిలిపారు జానకి. 'ఇలలో కలిసే..' ట్యూన్ 'అభినందన' లో 'ఎదుట నీవే..' ట్యూన్ ఒకటే. నిజానికి ఈ ట్యూన్ మాతృక ఇళయరాజా తమిళం లో చేసిన ఒక పాట అని వంశీ ఆ మధ్యనెప్పుడో ఓ టీవీ చానెల్లో చెప్పిన కబురు.

నటీనటుల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాల్సింది హేమ గా నటించిన భానుప్రియ గురించే. గత చిత్రం 'సితార' లో పూర్తి సంప్రదాయ బద్ధంగా కనిపిస్తే, ఈ సినిమాలో ఫ్యాంటు షర్టులు, సల్వార్ కమీజుల్లో కనిపించింది. ధైర్యస్తురాలైన పట్నం అమ్మాయిగానూ, తన చుట్టూ జరుగుతున్న సంఘటనలకి చలించే సన్నివేశాల్లోనూ చక్కని నటనని ప్రదర్శించింది. సత్యనారాయణ, మురళి, శరత్ బాబు, రాళ్ళపల్లి, మల్లికార్జున రావు, వై.విజయ, సుధాకర్.. ఇలా అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.

వంశీ రాసుకున్న కథకి యండమూరి వీరేంద్ర నాథ్ చేత ఒక వెర్షన్ రాయించారు సినిమాని నిర్మించిన రాంకుమార్ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆ వెర్షన్ వంశీకి నచ్చకపోవడంతో తనే మరో వెర్షన్ రాసుకున్నారు. ఇళయరాజా ట్యూన్స్ ఇచ్చిన తర్వాత, వాటికి అనుగుణంగా కథలో మార్పులు చేశారట. రెండుమూడు ఆంగ్ల సినిమాల స్పూర్తితో ఈ కథ రాసుకున్నారట వంశీ. అప్పట్లో సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది ఈ సినిమాకి. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఆసాంతమూ ఉత్కంఠభరితంగా అనిపించడం 'అన్వేషణ' ప్రత్యేకత.

19 కామెంట్‌లు:

 1. మురళి గారు, చాలా మంచి చిత్రాన్ని గుర్తు చేసారు.. నాకు ఈ చిత్రంలో పాటలు చాలా చాలా ఇష్టం..:) ధన్యవాదాలు :))

  రిప్లయితొలగించు
 2. ఈ సినిమాకు వంశీ ఒక లైన్ స్టోరీ మాత్రమే రాసుకున్నారట.. ఇళయరాజ గారు సంగీతం ఇచ్చాక దాని ఆధారంగా మిగతా కథ డెవెలప్ చేశారట.. హాసం పత్రిక కోసం వంశీగారే ఈ విషయం చెప్పారు..

  రిప్లయితొలగించు
 3. ఈ సినిమా టి,వి లో వస్తుంది అని తెలిస్తే, తప్పకుండా,ఎన్ని పనులు వున్నా మానుకుని చూస్తాను నేను.ఒక సారి కాలేజి మానేసి చూసాను కూడా.మంచి సినిమాని మళ్ళీ గుర్తు చేసారు. ఇప్పటి వంశీ సినిమాలు చూస్తూ ఉంటే,అప్పటి వంశీ ఏనా అనిపిస్తుంది.

  కానీ,కొన్ని సినిమాలలో కొన్ని డైలాగులు కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయి.ఉదా:డిటెక్టివ్ నారద.(నా వ్యక్తి గత అభిప్రాయం)

  మహర్షి అతని సినిమాలలో నా ఫేవరెట్.

  రిప్లయితొలగించు
 4. మంచి సినిమా. పాటలు చాలా చాలా బావుంతాయి..

  రిప్లయితొలగించు
 5. >>వాళ్ళెవరూ కూడా 'అన్వేషణ' స్థాయి విజయాన్ని సాధించలేకపోయారు

  అవును చాలా మంచి సినిమా
  తర్వాత వంశీ త్రిల్లెర్ లు ట్రై చేసాడు ఈ మధ్య కూడా ఆర్యన్ రాజేష్ హీరో గా ఒక సినిమా వచ్చింది లేటెస్ట్ గా..అనుమానాస్పదం అనుకుంటా

  రిప్లయితొలగించు
 6. చాలా మంచి సినిమా గుర్తు చేశారు మురళి గారు. ఈ సినిమాకు నేపధ్యసంగీతం ప్రాణం, పాటలు కూడా అన్నీ బాగుంటయ్.

  రిప్లయితొలగించు
 7. మంచి సినిమా గుర్తుకు చేసారు మురళిగారు. దీంట్లో ఒకదానిని మించి ఒకటి. సంగీతం పాటలు ఫోటోగ్రఫి భాను ప్రియ నటన, మిగత పాత్రల నటన సినిమా లో అడుగడుగునా సస్పెన్సే, దర్శకత్వం అన్ని సుపర్బ్ . పాటలు ఎంత కాలమయిన గుర్తుంటాయి. మళ్ళీ అన్నీ ఒకసారి గుర్తుకు తెప్పించినందుకు ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 8. ఈ సినిమాలో సస్పెన్స్ చాలా బాగుంటుంది. ఇంక పాటలు నాకు చాలా చాలా ఇష్టం. అసలే నేను వేటూరి వీర ఫాన్ ని.

  రిప్లయితొలగించు
 9. @మనసు పలికే: ధన్యవాదాలండీ..
  @కార్తిక్: అవునండీ.. సంగీతమే హీరో ఈ సినిమాకి.. ధన్యవాదాలు.
  @విశ్వనాధ్: నిజమేనండీ వంశీ ఇప్పటి సినిమాలు బాగా నిరాశ పరుస్తున్నాయి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. @మనసు పలికే: ధన్యవాదాలండీ..
  @కార్తిక్: అవునండీ.. సంగీతమే హీరో ఈ సినిమాకి.. ధన్యవాదాలు.
  @విశ్వనాధ్: నిజమేనండీ వంశీ ఇప్పటి సినిమాలు బాగా నిరాశ పరుస్తున్నాయి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. @ప్రసీద: నిజమేనండీ.. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాటలు.. ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: 'అనుమానాస్పదం' అండీ.. అంతగా ఆడలేదు కానీ 'ప్రతిక్షణం నీ దర్శనం..' పాట బాగుంటుంది. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: నేపధ్య సంగీతం, కెమెరా, ఎడిటింగ్.. వీటి తర్వాతే నటీనటుల నటన ఈ సినిమాకి.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 12. @భాను: పాటలు నేను తరచూ వింటూ ఉంటానండీ. ముఖ్యంగా 'కీరవాణి..' పాట.. ధన్యవాదాలు.
  @జయ: వేటూరిని ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరేమోనండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. నాకూ చాలా ఇష్టమైన సినిమా.టివిలో వస్తే కొంచెం కూడా మిస్సవకుండా చుసేస్తాము.అలాగే ఈ సినిమాలో పాటలు మా బాబుకి ,నాకూ చాలాచాలాఇష్టం.

  రిప్లయితొలగించు
 14. మురళీ గారు మౌనరాగం సినిమా గురించి ఎప్పుడు రాస్తారు????

  రిప్లయితొలగించు
 15. @రాధిక (నాని); ధన్యవాదాలండీ.. నేను రాయాలనుకుంటున్న జాబితాలో ఉందండీ.. త్వరలోనే...

  రిప్లయితొలగించు
 16. నేను చూసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో అన్నింటికన్నా బాగా నచ్చిన సినిమా అన్వేషణ. సాధారణంగా ఒకసారి సస్పెన్స్ తెలిసిపోతే మళ్ళీ చూడలేను. కానీ ఈ సినిమా అలా కాదు. ఎన్ని సార్లు చూసినా ఏదో ఒక కొత్త విషయం తగుల్తుంది.

  యూట్యూబులో దిలీపు (user name - sx2004?) అనే అతను ఈ సినిమాలో ఇళయరాజా రికార్డింగు అదరగొట్టిన ముఖ్యసన్నివేశాలు అన్వేషణ హార్రర్ థీమ్ అని పెట్టాడు. తెలుగువన్ ధర్మమా అని అతని ఎకౌంటు పీకివేసినా, అంతకు ముందే అవి దింపుకోవడం నా అదృష్టం. రోజూ నా జెన్‌‌లో ఆ థీంలు మోగుతుంటాయి.


  హమ్మయ్య, ఆఫీసులో ఎప్పుడో చదివిన ఈ వ్యాసానికి ఇంట్లోంచి వ్యాఖ్య పెట్టడానికి ఇప్పటికి కుదిరింది.

  రిప్లయితొలగించు
 17. జేబీ: నిజమేనండీ.. రికార్డింగ్ ప్రాణం ఈ సినిమాకి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, నాక్కూడా. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. ఈ సినిమాని థియేటర్లో ఎంత ఉత్కంటతో చూశామో నాకు బాగా గుర్తుంది ..ఇంటర్వెల్ లో అసలు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ...అంత సస్పెన్స్ మైన్టేన్ చేశారు వంశీ ...పాటలు ఎప్పటికీ హైలెట్ ముఖ్యంగా కీరవాణి పాటైతే నాకు మరీ ఇష్టం! గుర్తుచేసినందుకు ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించు
 19. @పరిమళం: 'కీరవాణి..' పాట నాక్కూడా ఇష్టమండీ.. తరచూ వింటూ ఉంటాను.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు