ఆదివారం, మే 22, 2011

మల్లెపూలు-మామిడిపళ్ళు

నాకు అస్సలు నచ్చని కాలం ఎండాకాలం. ఇప్పుడనే కాదు, చిన్నప్పటినుంచీ అంతే.. వర్షాకాలమైతే చక్కగా వర్షం వస్తుంది.. యెంతో బాగుంటుంది. ఇంక చలి కాలమైతే చెప్పక్కర్లేదు. వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకోడం.. బోల్డన్ని టీలూ కాఫీలూ తాగుతూ రోజులు గడిపేయడం.. అసలా చలి రోజులే వేరు. ఇంక ఈ వేసవి కాలం వచ్చిందంటే ఒకటే వేడి, ఉక్క, చెమట, వడదెబ్బ... అబ్బబ్బ అన్ని అవలక్షణాలూ ఈకాలానికే.

చిన్నప్పటి బడి సెలవుల ఆనందాన్ని మినహాయిస్తే, ఇప్పటికీ కేవలం రెండంటే రెండే కారణాల వల్ల వేసవిని క్షమించేస్తాను నేను. నేనంటే నేననే కాదు, చాలామంది కూడా ఇందుకే క్షమించేస్తారని నా అబ్బిప్పిరాయం. ఆ రెంటిలో మొదటిది మల్లెపూలు కాగా రెండోది మామిడిపళ్ళు. అసలు మల్లెపూలు అని పలకడంతోటే మనసు 'మనసున మల్లెల మాలలూగెనే' అని పాడేసుకుంటోంది.. ఇంకోపక్క 'మల్లెలు పూసే..వెన్నెల కాసే..' పాట నేనున్నానంటోంది.

నా చిన్నతనంలో మా వీధిలో ఓ మల్లె చెట్టు ఉండేది.. 'మల్లంటు' అనేవాళ్ళం. ఉగాది పండుగ వెళ్ళడంతోనే మల్లంటు ఆకులన్నీ దూసేసి, రోజూ సాయంత్రాలు బోల్డు బోల్డు నీళ్ళు పోసేస్తే చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చేసి, మొగ్గ తొడిగేసేది. అసలు మల్లెమొగ్గలు కోయడం ఓ కళ. చెట్టు చుట్టూ ఓ నాలుగైదు సార్లు తిరిగి, పెద్ద మొగ్గల్ని కళ్ళతో గుర్తు పట్టి, ఆ తర్వాత నూతి దగ్గరకి వెళ్లి చేతులు బాగా కడుక్కొచ్చి, అప్పుడు ఒక్కో మొగ్గనీ కోసి గిన్నెలో వెయ్యాలి.

ఒక్కోసారి మా మల్లంటు ఎన్ని మొగ్గలేసేదంటే, చూడ్డానికి మల్లె చెట్టుకి తెల్ల చీర కట్టినట్టు ఉండేది. అన్నట్టు మా ఊరి రికార్డింగు డేన్సులో వన్స్ మోరేసిన "ఇదిగో తెల్ల చీర..ఇవిగో మల్లెపూలు" పాటకి విజిలేయడం నేనున్నానంటూ జ్ఞాపకానికి వచ్చేసింది. అసలు యవ్వనానికీ మల్లెపూలకీ అవినాభావ సంబంధం. ఆడ-మగ అన్న భేదం లేకుండా యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడే పువ్వు మల్లెపువ్వేనని నా మరో అబ్బిప్పిరాయం. కేవలం మల్లెల కోసమన్నా వేసవిలోనే పెళ్లి చేసుకోవాలని తీర్మానించేసుకున్నరోజులున్నాయి మరి.

పైకంత అందంగా కనిపించే మల్లెపూలు ఎంత మోసకారులో పెళ్ళైన ఏ మగవాడినడిగినా చెబుతాడు. జాయి జాయిగా జరిగిపోయే జీవితంలోకి ఒక్కసారిగా బాధ్యతలు వచ్చి పడిపోవడం వెనుక జరిగే కుట్రలో మల్లెల పాత్ర తక్కువదేమిటి? ఇంక చేసేదేముంది.. మల్లెల్ని తిట్టడానికి మనసు రాదు. "మగాడన్నాక..." అనుకుని నిట్టూర్చేయడమే. అదర్ వైజ్, 'మల్లియలారా.. మాలికలారా..' అని మూగగా పాడుకునే అవకాశం కూడా ఉంది.

మామిడిపళ్ళ విషయానికి వస్తే చిన్నప్పుడు వీటిమీద నాకు ప్రత్యేకమైన ఇష్టం ఏమీ ఉండేది కాదు. వేసవి వస్తే చాలు ఇంట్లో ఏ మూల చూసినా ఇవే కనిపించేవి. అదీకాక, "అమ్మా... ఆకలి" అనడం పాపం, అమ్మ వెంటనే ఓ పండు చేతిలో పడేసేది, ఉదారంగా. ఇంటి పక్కన కలక్టర్ మావిడి చెట్టు ఉండేది.. కావలసినన్ని కాయలు, తిన్నన్ని పళ్ళు. అందుకేనేమో, చిన్నపిల్లలు చేసే మామిడికాయల దొంగతనాలు వింతగా అనిపించేవి నాకు. మామిడి పళ్ళ తాలూకు రకరకాల రుచులని గ్రహించడానికి కుంచం పెద్దయ్యేవరకూ ఆగాల్సి వచ్చింది. రసాలా? బంగినపల్లా? ఏదిష్టం? అనే ప్రశ్నకి ఇప్పటికీ నాదగ్గర జవాబు లేదు. దేనికదే సాటి మరి.

అసలయితే, కొత్తావకాయ అన్నంతో బంగినపల్లి ముక్కలు మాంచి కాంబినేషన్. అలాగే గేదె పెరుగు, మాగాయ, రసం పండు కూడా. మనింట్లో మనం స్వేచ్చగా తినడానికి రసానికి మించిన పండు లేదు. అదే ఎక్కడైనా షోగ్గా తినాలంటే మాత్రం బంగినపల్లికీ జై అనాల్సిందే. మార్కెట్ కి వెళ్ళామంటే మనం ఎప్పుడూ వినని కొత్త పేర్లు పెట్టిన పళ్ళు మనకి అమ్మేస్తారు. బంగినపల్లిలో పద్నాలుగు రకాలు, తోతాపురి లో ఏడెనిమిది రకాలు...ఒకటా, రెండా.. మామిడిపళ్ళు-సినిమా పాటలు అనగానే మొదట గుర్తొచ్చేది అన్నగారు దుమ్మురేపిన "మావిళ్ళ తోపుకాడ పండిస్తే.."

నా అదృష్టం ఏమిటో కానీ, ప్రతి సంవత్సరం అస్సలు ఊహించని వారినుంచి మామిడిపళ్ళు కానుకగా అందుకుంటూ ఉంటాను. వీటిలో ఎక్కువగా సొంత తోటల్లో పండించినవే. ఇక, కొనడం అంటే ఎప్పుడూ లాటరీనే. ఎంత జాగ్రత్తగా ఎంచినా మన కళ్ళు మనల్ని మోసం చేసేస్తూ ఉంటాయి. భోజనాల దగ్గర నిట్టూర్పులు వినాల్సి ఉంటుంది. అయినప్పటికీ మళ్ళీ మామిడిపళ్ళు చూస్తే మనసాగదు. అందుచేత, మల్లెపూలు, మామిడిపళ్ళు ఉన్న కారణంగానే వేసవిని భరిస్తున్నామన్న మాట.

15 కామెంట్‌లు:

  1. sir baga chepparu but a padhala vaduka chusi edhi kuda edho kadha parichayam anukunna
    nice imba awesome inka emmo +1 in fb +l in fb slang

    రిప్లయితొలగించండి
  2. sir baga chepparu but mee padhala vaduka chusi edhi kuda edho kadha parichayam anukunna but well written article

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు ఒక చిన్న అవిడియా, మీ బ్లాగ్ ని monitize చేసి ఆ వచ్చిన డబ్బులు ఏదైనా సేవా కార్యక్రమానికి (అనాధ పిల్లలకి చదువు చెప్పించే ఫౌండేషన్ కి డొనేషన్ లాగా) ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? ఎలాగూ మీ బ్లాగ్ కి ట్రాఫిక్ చాలా బాగుంటుంది, so వర్కౌట్ అవుతుందని నా నమ్మకం. నేను నా బ్లాగ్ ని monitize చేశా కాని ఇంకా స్టార్టింగ్ స్టేజి లోనే ఉంది. :)

    ఏదో చిన్న అవిడియా అంటే నో offense . ఈరోజు సీమ టపాకాయ సినిమా చూసా, పైన చెప్పిన అవిడియా ఆ సినిమా స్పూర్తి తోనే..
    Read my review on Seema Tapakai
    http://creative-oracle.blogspot.com/

    రిప్లయితొలగించండి
  4. naku nachinde enda kalam. chinnappudu summer holidays kosam eduru chuse vaanni kada

    రిప్లయితొలగించండి
  5. >>>అందుచేత, మల్లెపూలు, మామిడిపళ్ళు ఉన్న కారణంగానే వేసవిని భరిస్తున్నామన్న మాట.

    నిజం. అందుకే వేసవి అంటే నాకు ఇష్టం. మామిడి పళ్ళు ముఖ్యం గా రసాలు తినడం కూడా ఒక కళ. రకరకాలుగా తింటారు. వీటిమీద కూడా ఒక టపా వేయండి.

    రిప్లయితొలగించండి
  6. నేను కూడా ఇదే కారణానికి భరిస్తున్నాను...లేదంటే వేసవి అంటే నాకు.. యాక్....ఆ ఉక్కపోత, చెమటలు...కరంట్ ఉండేది కాదు (చిన్నప్పుడు) ఎక్కడకీ వెళ్ళలేము, రాలేము.

    మామిడిపళ్ళ కోసం, మల్లెపూల కోసం, కొత్తవకాయ కోసం వేసవి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేదాన్ని. అవి తనివితీరా తినేసాక, తల్లో పెట్టేసుకున్నాక ఈ ఎండలు ఎప్పుడు పోతాయా అని ఎదురుచూసేదాన్ని.

    రిప్లయితొలగించండి
  7. మురళిగారూ....చాలాబాగా వ్రాశారు!! మీరు చెప్పినది నిజం! కానీ వీటితోపాటు మీరు ఇంకోటి మర్చిపోయారు....తాటిముంజెలు! :) నాకైతే...వేసవంటే వెంటనే ఇవీ గుర్తొచ్చేస్తాయ్! ఊరికెళ్ళినప్పుడు...బోలెడు తినొచ్చు...చలవ అనే పేరుతో ఇంకో రెండు ఎక్కువే తినొచ్చు ;) ఇక మామిడిపళ్ళ గురించి ఏంచెబుతాం? కొబ్బరి మామిడితో మొదలు....కుక్కమూతిపిందెలు వచ్చేవరకు...తింటూనే ఉంటాం కదా! ఇంక వేసవిసాయంత్రాలు...ఆహా...వెన్నెలతో పోటీపడే మల్లెలు...ఇంటిముందు ఆరుబయట చుక్కలు లెక్కబెడుతూ పడుకోవడం...ఓహ్! వేసవి ఉపయోగాలు బోలెడులేండీ...చిన్నప్పుడు..ఇప్పుడు కాదు :))

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు, మీకు మల్లెపూలు...మామిడిపళ్ళు ఎందుకంత ఇష్టమో చెప్పనా!!! ఒకటి వెండి, ఇంకోటి బంగారము:)అంతేలెండి, ఎవరైనా విలువైనవే ఇష్టపడ్తారు.

    రిప్లయితొలగించండి
  9. భలే గుర్తు చేసారు :-) నాకెప్పుడూ రసాలే ఇస్టం. నూజివీడు చిన్న రసాలంటే మరీను. ఇప్పుడు డబ్బా (మాంగో పల్ప్) మాత్రమే అనుకొండి ...
    జయగారి కామెంట్ సూపర్ లైక్ ;-)

    రిప్లయితొలగించండి
  10. ఇక్కద అందరూ రసాలంటున్నారుగానీ...సువర్ణరేఖ కి మించిన పండు లేదు. రసాల కంటే ఎంతో మధురంగా ఉంటాయి. నాకు రసాలు కూడా ఇష్టమే, కానీ సువర్ణరేక ఇంకా తియ్యగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  11. @బాలు: ధన్యవాదాలండీ..
    @Creative Oracle: ఆలోచన బాగుందండీ.. ఆలోచించాలి.. ధన్యవాదాలు.
    @మిర్చి: నాకు మాత్రం చిన్నప్పుడు కూడా అంతగా నచ్చేది కాదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @బులుసు సుబ్రహ్మణ్యం: నిజమేనండీ.. రకరకాల పద్ధతులున్నాయ్.. కానీ అవన్నీ రాయడం కుదురుతుందంటారా? ..ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య; హమ్మయ్య! నేను మైనారిటీ కాదన్న మాట!! 'సువర్ణ రేఖ' ..నిజమేనండోయ్... ధన్యవాదాలు.
    @ఇందు: ప్చ్.. నేను ముంజలు తినలేదండీ.. తినలేదు... :(( ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  13. @జయ: భలేగా చెప్పారండీ.. ఇప్పుడు రేట్ల ప్రకారం చూసినా అలాగే ఉంది పరిస్థితి :)) ..ధన్యవాదాలు.
    @శిశిర: ధన్యవాదాలండీ..
    @మంచు: నాకెందుకో డబ్బా పల్ప్ కి పండు రుచి రాదనిపిస్తుందండీ.. నిలవుండడానికి ఏవేవో కలుపుతారు కదా.. అందుకేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. బాగుందండి.మున్జులు మర్చిపోయారు...

    రిప్లయితొలగించండి