సోమవారం, మే 02, 2011

రాఘవులుగారి కొండమ్మ

కొందరు వ్యక్తులనీ, కొన్ని సంఘటనల్నీ ఓపట్టాన అర్ధం చేసుకోలేం. ముఖ్యంగా వాళ్ళు మనకి ప్రత్యక్షంగా తెలియనప్పుడూ, ఆ సంఘటనలు మన కళ్ళ ముందర జరగనప్పుడూ ఈ సమస్య కొంచం ఎక్కువ. రాఘవులుగారి కొండమ్మ గురించి మొదటిసారి విన్నప్పుడు నాకు ఏదో నవలలాగో, సినిమా కథలాగో అనిపించింది. కానీ కొండమ్మ గురించి నాకు తెలిసింది అమ్మ ద్వారా కావడం వల్ల కొంత సమయం తీసుకుని "ఇది నిజంగా జరిగింది" అన్న కంక్లూజన్ కి రాగలిగాను.

అమ్మకప్పుడు పదేళ్ళ వయసు. ఓరోజు మధ్యాహ్నం అమ్మమ్మ వంట పూర్తి చేసి, తోటకి వెళ్లి అరిటాకులు కోసుకొచ్చే పని అమ్మకి అప్పగించింది. వీళ్ళ తోటలో అమ్మకి అందే ఎత్తులో అరిటాకులు లేకపోవడంతో, సరిహద్దులో ఉన్న పక్క తోటమీద దృష్టి పెట్టింది అమ్మ. చుట్టూ అప్పుడే చిగుళ్ళు తొడుగుతున్న అరిటి మొక్కలు, వాటి మధ్యలో కొత్తగా కట్టిన ఓ చిన్న పెంకుటిల్లు. జాగ్రత్తగా కంచె దాటి, లేత అరిటాకులు కోసుకుంటున్న అమ్మని గట్టిగా కేకలేసింది ఓ కొత్త ఆడమనిషి.

తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్న ఆవిడకి పెద్ద కళ్ళూ, బారెడు జెడా ప్రత్యేక ఆకర్షణలు. అప్పటివరకూ ఊళ్ళో ఎవరిచేతా పల్లెత్తు మాట అనిపించుకొని అమ్మకి అవమానం. "సాయంత్రం మా అమ్మని తీసుకొస్తాను. మాట్లాడు" అని చెప్పి, కోసుకున్న అరిటాకులతో ఇంటికి వచ్చేసింది. లేత అరిటాకులని చూసి, జరిగింది తెలుసుకున్న అమ్మమ్మ, అమ్మనే కోప్పడింది, అలా చిన్న మొక్కల ఆకులు కోయకూడదని. ఆవిడే సాయంత్రం తోటకి వెళ్లి ఆ కొత్త మనిషికి సర్ది చెప్పింది కూడా. ఆ కొత్తావిడ గురించి ఊరంతా కొంచం వింతగా చెప్పుకోవడంతో పాటు, ఎవరూ ఆవిడతో మాట్లాడేవాళ్ళు కాదు.

అమ్మకి అప్పటికే పరిచయం అయిపోయింది కదా. నెమ్మదిగా స్నేహం కుదిరింది. ఆమె పేరు కొండమ్మ. తర్వాత ఎప్పుడూ అమ్మని కేకలేయక పోగా, తోటకి వెళ్ళినప్పుడల్లా చాలా ప్రేమగా మాట్లాడేది. అది కూడా, 'రాఘవులు గారు' ఇంట్లో లేని సమయంలో. అదే 'స్వామి' ఇంట్లో ఉన్నా ఆవిడ పెద్దగా పట్టించుకునేది కాదు. ఇంట్లో ఎవరూ లేనట్టుగానే వ్యవహరించేది. చుట్టుపక్కల వాళ్లకి అమ్మ, కొండమ్మల స్నేహం చేయడం నచ్చలేదు. "పరువు తక్కువ" అని అమ్మమ్మకి ఫిర్యాదు చేశారు కూడా.

కొండమ్మ గురించి అమ్మకి పూర్తిగా తెలియడానికి మరో నాలుగైదేళ్ళు పట్టింది. అదికూడా ఊళ్లోవాళ్ళ ద్వారా. రాఘవులు గారు ఊళ్ళో పెద్దమనిషి. తాతగారిని 'గురువుగారూ' అని గౌరవించే శిష్యులలో ఒకడు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. ఓసారి ఏదో పనిమీద పొరుగూరు వెళ్ళిన రాఘవులు గారికి కొండమ్మ తారసపడింది. ఇద్దరిదీ ఒకే కులం, ఆమెకి పెళ్ళికాలేదు. పరిచయం పెంచుకుని, రెండో పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన పెట్టాడు రాఘవులు గారు. ఇందుకు కొండమ్మ ఒప్పుకోలేదు. రాఘవులు పట్టుపడితే అతని కూడా రావడానికి కొన్ని షరతులు పెట్టింది.

కొండమ్మ షరతుల్లో మొదటిది ఆవిడకి ఒక ఇల్లు, కొంత భూమి ఏర్పాటు చేయాలి. రెండు, ఓ కుర్రాడిని చూసి పెళ్లి చేయాలి. మూడు, జీవితాంతమూ ఆవిడ బాగోగులు చూసుకోవాలి. మొదటి, మూడో షరతులు రాఘవులుగారికి అసాధ్యాలేవీ కాదు. కొండమ్మ మీద తనకున్న ఆకర్షణ/ప్రేమ ఎంతటిది అంటే వినడానికే అసాధ్యంగా అనిపించే రెండో షరతుని కూడా సుసాధ్యం చేసేశాడు, కులమింటి కుర్రాడు స్వామిని వెతికి తేవడం ద్వారా. తనకంటూ ఎవరూ లేని స్వామిని కొండమ్మతో పెళ్ళికి రాఘవులుగారు ఎలా ఒప్పించారన్నది ఓ అంతు చిక్కని రహస్యం.

తోటలో కట్టించిన కొత్త ఇంట్లో కొండమ్మ-స్వామిల కాపురం మొదలయ్యింది. రాఘవులుగారు వస్తూ పోతూ ఉండేవారు. కాలక్షేపానికి అరిటి తోట పెంచడం కొండమ్మ కల్పించుకున్న వ్యాపకం. స్వామి వృత్తి పెంకుటిళ్ళు నేయడం. అదే కొనసాగించాడు. కాలక్రమంలో కొండమ్మగారికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు, రాఘవులు గారి ఆధ్వర్యంలో వాళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా జరిగాయి. కొంత కాలానికి కొండమ్మకి అనారోగ్యం. రాఘవులు గారి సమక్షంలో రాఘవులుగారి కొండమ్మ గానే వెళ్లిపోయిందావిడ. "కొండమ్మ, రాఘవులు, స్వామి...వీళ్ళు ముగ్గురూ నాకు అర్ధం అవ్వలేదు. ఇంక ఎప్పటికీ అర్ధం అవ్వరేమో..." ఇది అమ్మ చాలాసార్లు అన్నమాట.

6 కామెంట్‌లు:

  1. నమస్కారమండీ !
    టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
    మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
    సంకలిని

    " మీ ముందుకు తెచ్చాము.
    ఈ సంకలినిలో ప్రత్యేకతలు
    1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
    2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
    ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
    ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

    ఇట్లు
    సంకలిని బృందం

    రిప్లయితొలగించండి
  2. కొందరు వ్యక్తులనీ, కొన్ని సంఘటనల్నీ ఓపట్టాన అర్ధం చేసుకోలేం.
    హ్మ్.. నిజం కదా.

    రిప్లయితొలగించండి
  3. ఎటువంటి విషయాన్ని అన్నా చదివించగలిగేలా రాయటం లో మీ నైపుణ్యానికి ఈ పోస్టు మంచి ఉదాహరణ. మీరు రాసిన ఇలాంటి (అంటే అచ్చు ఇలానే అని కాదు కొద్ది పోలికలతో ) నా చిన్నతనం లో చూసిన గుర్తుంది . అప్పుడు అంత అర్ధం చేసుకోలేక ఒక వింత గా ఉండేది , పైగా ఎవరినన్నా అడిగినా సమాధానం దొరకని పశ్నలు చాలా ఉండేవి .

    రిప్లయితొలగించండి
  4. @సంకలిని: ధన్యవాదాలండీ..

    @శిశిర:నిజమేనండీ.. ధన్యవాదాలు.

    @శ్రావ్య వట్టికూటి: మీ అభిమానం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. కొందరు వ్యక్తులనీ, కొన్ని సంఘటనల్నీ ఓపట్టాన అర్ధం చేసుకోలేం.
    మీ అమ్మగారు ఏమి అనేవారో రాస్తే కూడా బావుండేది. అంటే ఆవిడా కొండమ్మ గారిని ఎలా అర్ధం చేసుకున్నారు అని ??

    రిప్లయితొలగించండి
  6. @కల్లూరి శైలబాల: అమ్మెప్పుడూ జడ్జిమెంట్లు ఇవ్వలేదండీ.. విషయాన్ని ఉన్నదున్నట్టు చెప్పడం, అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి