గురువారం, ఫిబ్రవరి 25, 2010

మా 'స్వాతి' కథ

ఆవేళ ఉదయాన్నే ఆకాశం మబ్బు పట్టింది. వాతావరణం వర్షం వచ్చేలా ఉంది. సెలవు రోజు కాదు కాబట్టి బడికెళ్ళడం తప్పదు. నేనా సన్నాహాల్లో ఉండగానే "గేదీతకొచ్చిందమ్మా.." అన్న శ్రీరాములు కేక వినిపించింది పెరట్లోనుంచి. మేమందరం పెరట్లోకి పరిగెత్తాం. పాకలో కట్టేసిన కొమ్ముల గేదె రాట చుట్టూ తిరుగుతోంది. "ఉలవలుడకపెడతాను" అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమ్మ. "ఇక్కడ నీకేం పని.. లోపలికి నడు" అని నాన్న అనడంతో నేను అమ్మ వెనుకే వెళ్లాను.

మామూలుగా ఐతే పెరట్లో నీళ్ళపొయ్యి మీద ఉడకపెడతాం ఉలవలు. కానీ వర్షం వచ్చేలా ఉందికదా. అందుకని వంట పొయ్యి మీదే ఉలవల గిన్నె పెట్టేసింది అమ్మ. "నువ్వు స్నానం చేసి ప్రదక్షిణాలు చేసిరా అమ్మా.. ఉలవలు నేను చూస్తాలే.." అన్నాను అమ్మతో. నాన్న పిలిచే వరకూ ఎలాగూ పెరట్లోకి వెళ్ళడానికి ఉండదు కదా. ఏడాది క్రితం తెల్లావు ఈనేటప్పుడు అమ్మ చెర్లో మునిగి, ఆ తడి చీరతోనే ఆవు చుట్టూ ప్రదిక్షిణాలు చేసింది.

"ఆవుకైతేనే చెయ్యాలి.. గేదెకి చెయ్యరు" అని చెప్పింది అమ్మ. గేదె ఈనుతోందని తెలిసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు పాక దగ్గరికి వచ్చారు. నాన్న గోనె సంచులూ అవీ సిద్ధం చేసుకుంటున్నారు. ఉలవలు సగం ఉడికాయో లేదో "పెయ్య దూడనేసిందమ్మా.." అన్న శ్రీరాములు కేక, ఆవెనుకే "నువ్విలా రారా.." అని నాన్న పిలుపు. పెరట్లోకి చూసేసరికి నాన్న చేతుల్లో బుజ్జి గేద్దూడ. చలికో ఏమో వణికిపోతోంది. గోనె సంచితో దానిని తుడుస్తున్నారు నాన్న.

ఆ బుజ్జి దూడని పట్టుకునే పని నాకిచ్చి, గబగబా దాని గోళ్ళు గిల్లేసి గేదెకి పెట్టేశారు నాన్న. అలా చేయకపోతే గేదె బాగా పాలివ్వదుట. అమ్మేమో వేడి వేడి ఉలవలని త్వర త్వరగా చల్లారపెట్టి గేదెకి తినిపించేసింది. శ్రీరాములు వాళ్ళూ పాక శుభ్రం చేసే పనిలో పడ్డారు. అమ్మ ఇంట్లోకి వచ్చి కేలండర్ చూసి "స్వాతి నక్షత్రం.. వర్జాలు లేవు" అంది సంతోషంగా. "బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ.." అంటారు కదా మరి. "అయితే దీని పేరు స్వాతి" అన్నాన్నేను.


ఆవేళ బళ్ళో అందరికీ మా స్వాతి గురించి వర్ణించి వర్ణించి చెప్పాను. పొద్దున్న బడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురైదుగురు నాతో వచ్చారు, స్వాతిని చూడడానికి. "సాయంత్రం రండమ్మా.. జున్ను తిని వెళ్దురు గాని.." అంది అమ్మ వాళ్ళతో. అది మొదలు మూడు రోజులు మా ఇంటికి ఎవరొచ్చినా వాళ్లకి జున్నే. రెండు పూటలా నీళ్ళు కాచుకునే డేశా లో వండేది అమ్మ జున్ను. వేళ్ళు నలగగొట్టుకోకుండా ఏలకులు, మిరియాలు పొడి కొట్టిచ్చే డ్యూటీ నాది.

మొదటి రోజు సాయంత్రానికే పెరడంతా గంతులేసింది స్వాతి. రెండో రోజుకి మట్టి తినడం మొదలు పెట్టేసింది. నాన్న తాటాకుతో ఓ చిన్న బుట్ట అల్లి, స్వాతి మూతికి కట్టేశారు. స్వాతికి గడ్డి తినడం అలవాటు చేయాలి కదా. అందుకోసం లేత గరిక సంపాదించే డ్యూటీ కూడా నాదే. సన్న రకం గడ్డి చిగుళ్ళు వెతికి కోసి పట్టుకొచ్చి, ఆ చిన్న బుట్టలో పెట్టి మూతికి కట్టేస్తే స్వాతికి ఆకలేసినప్పుడల్లా తింటుందన్న మాట.

అంతేనా.. నాన్న పాలు పితికేటప్పుడు స్వాతిని పట్టుకునే డ్యూటీ కూడా నాదే. అప్పుడు మాత్రం నాక్కొంచం కష్టంగా ఉండేది. స్వాతి బాగా గింజుకునేది. వాళ్ళమ్మ దగ్గర తను తాగాల్సిన పాలు మేము తీసేసుకుంటున్నాం కదా అనిపించేది. అమ్మకి చెబితే, "అన్ని పాలూ తాగించేస్తే దూడకి జబ్బు చేస్తుంది" అని చెప్పింది. రాను రాను స్వాతి నాకు మంచి కాలక్షేపం అయిపోయింది. నాన్న తెచ్చిన దిష్టి తాడులో మువ్వలు గుచ్చి మెళ్ళో కట్టామేమో, స్వాతి గంతులేసినప్పుడల్లా ఘల్లు ఘల్లుమని చప్పుడయ్యేది.

చూస్తుండగానే స్వాతి పచ్చి గడ్డి నుంచి ఎండు గడ్డికి ప్రమోటయ్యింది. కుడితి ఇష్టంగా తాగేది. ఉలవలు పెట్టమని గొడవ పెట్టేది. పాలు పితికేటప్పుడైతే అసలు పట్టుకోనిచ్చేది కాదు. ఎవరైనా 'గేద్దూడ' అంటే నేను కరిచినంత పని చేసి 'స్వాతి' అని సరిచేసేవాడిని. చూస్తుండగానే నెత్తిమీద రెండు బుడిపెలు మొలవడం, అవి కొమ్ములుగా మారడం జరిగిపోయింది. ముట్టి తాడు, కాళ్ళకి బంధం పడ్డాయి. మునుపటి గారాలు కొంచం తగ్గాయి.


వేసంకాలం సెలవులు అయిపోయి నేను ఐదో తరగతిలోకి వచ్చేశాను. ఓ రోజు సాయంత్రం బడి అయిపోగానే మా హెడ్మాష్టారు మా ఇంటికి వచ్చారు. భలే భయపడ్డాను. కాసేపు నాన్నతో మాట్లాడి "గేద్దూడని పెంచుకుందామని ఉందండీ.. మీ దూడ బాగుంది" అన్నారు. ఆయన స్వాతిని అడుగుతున్నారని అర్ధమైపోయింది. నాన్న సరే అనేశారు. "పెద్దాయన నోరు తెరిచి అడిగితే కాదని ఎలా చెప్పను?" అన్నారు అమ్మతో. నాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. రెండు రోజుల్లో మేష్టారి తాలూకు మనిషి వచ్చి పొరుగూళ్లో ఉండే మేష్టారింటికి స్వాతిని తీసుకెళ్ళి పోయారు.

నాకు మేష్టారి మీదా, నాన్న మీదా బోల్డంత కోపం వచ్చింది. కానీ ఏం చేయడానికీ లేదు. అప్పుడప్పుడూ స్వాతి గురించి మేష్టారిని అడగాలని అనిపించేది. కానీ అడిగే ధైర్యం ఉండేది కాదు. అప్పుడప్పుడూ ఆయనే నాన్నకి చెప్పేవారు, స్వాతి యోగ క్షేమాలు. రెండు మూడు నెలలకి స్వాతి మీద బెంగ కొంచం తగ్గింది. చదువు, ఆటపాటలు.. ఎక్కడైనా గేద్దూడ కనిపిస్తే మాత్రం వెంటనే స్వాతి గుర్తొచ్చేసేది. కొమ్ముల గేదె కి మరో దూడ పుట్టినా, అప్పుడప్పుడూ స్వాతి గుర్తొస్తూనే ఉంది.

ఆరోతరగతి మా పక్కూరి హైస్కూల్లో. మా ఊరినుంచి మొత్తం ఐదుగురం. మొదటిరోజు భయం భయంగా బయలుదేరాం బడికి. పైకేవో కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ, కొత్త ఊరు, కొత్త స్కూలు అంటే లోపల అందరికీ భయంగానే ఉంది. హైస్కూలు కట్టనందుకు మా ఊరి వాళ్ళని తిట్టుకుంటూ, కొత్త స్కూలు ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నడుస్తున్నాం. చాలా దూరం నడిచాక ఒక చోట కొబ్బరి తోటలోనుంచి 'ఓంయ్..' అని వినబడింది. తలతిప్పి చూస్తే మా స్వాతి. మా ఫ్రెండ్స్ కూడా గుర్తు పట్టారు.

పుస్తకాల సంచీ రోడ్డు మీద పడేసి తోటలోకి పరుగెత్తాను. కొంచం గడ్డి తీసి తినిపించి, కాసేపు తల మీద రాసి మళ్ళీ వెనక్కి పరిగెత్తాను, మా వాళ్ళని అందుకోడం కోసం. ఆ పక్కన ఉన్న ఇల్లు మా హెడ్మాష్టారిదిట. ఇంటి పక్క తోటలో స్వాతి కోసం చిన్న పాక వేశారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక అమ్మకి చెబితే చాలా సంతోషించింది. "మనుషులు మర్చిపోయినా, మూగజీవం మరచిపోదు" అంది. అలా కొత్తూర్లో పాత నేస్తం దొరికింది నాకు. అది మొదలు, హైస్కూల్లో చదివిన ఐదేళ్లూ స్కూలికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ స్వాతి కనిపించేది, తన పరివారంతో.

39 వ్యాఖ్యలు:

 1. బాగుందండీ మీ స్వాతి .నాకు అలాటి బుజ్జాయిలంటే ఇష్టం . మీ జ్ఞాపకాలతో నేను అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళి పోయాను .మా ఆట స్థలం గేదెల చావిడే ,మా కార్లు మా సైజుల్లో వున్నా బుజ్జాయిలే పెద్దవాళ్ళు వస్తుంటే గమ్మున కిందకి దుకేసేవాళ్ళం. ఆ రోజులు రమ్మన్న రావు .ప్చ్ .మీ జ్ఞాపకాలు బాగున్నాయి
  .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగంది మీ బుజ్జి స్వాతి ని మాక్కూడా చూపించేరు.. నిజంగా పల్లెటూరి బాల్యాలు ఎంత స్సుసంపన్నమైనవో కదా అనిపిస్తోంది మిమ్ములను చూస్తుంటే.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బావుందండి మీ స్వాతి కథ.
  మొన్న ఇండియాలో తిన్న జున్ను గుర్తు తెప్పించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పొట్టి నిక్కరేసుకున్న చిన్నారి మురళీ తనతోపాటే నన్ను వాళ్ళ ఊళ్ళో తిప్పుతూ 'స్వాతి' కథంతా చెప్పినట్టుంది :-)
  'స్వాతి'తో స్నేహం మీకెంత మధురమైన జ్ఞాపకమో మీ మాటల్లో తెలుస్తోంది :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అన్నట్టు.. దూడ ఫోటోలు భలే సంపాదించారు.!
  cute ones!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. బాగా రాసారు ... నిజం గా ఇలానే వుండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో .... ఒక్క సారి ఆ జ్ఞాపకాలు మళ్ళి గుర్తు చేసారు ధన్యావాదాలు .....

  ప్రత్యుత్తరంతొలగించు
 7. bagundi sir....palletoori pilla gadu entha baga rasaadooochhhhh....nenu koooda vyasaya kutumbam nunchi vachaanu...so vinagane back ground lo "GURTHU KOSTHUNNAYE"......really nice

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా బాగా చెప్పారు....మీ స్వాతి గురించి చదువుతూ ఉంటె మా అమ్మ చిన్నప్పుడు చెప్పిన కొన్ని మాటలు గుర్తు వచ్చాయే. మా అమ్మ పెళ్లి అయ్యే ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే చిన్న దూడ ఉండేదిట. మా అమ్మ కి అది అన్నా....దానికి మా అమ్మ అన్నా చాలా ఇష్టంత. మా అమ్మ పెళ్లి అయిన కొత్త లో మళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగానే....అది మా అమ్మ గొంతు గుర్తు పట్టి అరిచేదట బాగా.....అంటే దానికి గొంతు గుర్తుపట్టే శక్తి ఉంటుందో లేదో తెలియదు కానీ, ఆ ఆత్మీయత అలాంటిది అనుకునేదాన్ని.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. "మనుషులు మర్చిపోయినా, మూగజీవం మరచిపోదు" అమ్మ చద్దిమూటలాంటి చక్కటి మాట చెప్పారు(వాటికి గుర్తుపట్టడానికి బంధుమూర్తి అవసరంలేదు కదూ).
  రెండు పూటలా నీళ్ళు కాచుకునే "డేశా" లో వండేది అమ్మ జున్ను...డేగేశా కదూ?(అప్పుతచ్చా?)
  "జున్ను" నా ప్రియమయిన వాటిల్లో ఒకటి. (హైదరబాదులో ఉన్నవారికయితే వనస్థలిపురం వెళ్ళే దారిలో ప్రతిరోజూ దొరుకుతుంది)
  స్వాతి కబుర్లు బావున్నాయి మురళిగారూ.మనుషుల అనుబంధాలకి మనుషులే అక్కర్లేదు అన్నమాట సత్యమే స్వాతి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ టపాలలో ఏదో మహత్తు ఉంది. ఏది మొదలెట్టినా ఆపాలనిపించదు. ఏదీ వదలాలనిపించాడు. చాలా బావుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నిజంగా చాలా బాగా రాసారు. అటువంటి బాల్యం నాకు లేనందుకు, మీ మీద ఈర్ష్య కలుగుతుంది.....కనీసం ఇలా బ్లాగుల ద్వారా, మీలాంటి వాళ్ళ వాళ్ళ మన పల్లెటూళ్ళ విషయాలు తెలుసుకున్తున్నందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. చాలా చాలా బాగుంది మీ స్వాతి కధ.నేను నా ఇదీ సంగతి లో ఇది రాసాను ఇంకా పబ్లిష్ చెయ్యలేదు. ఇప్పుడు నేను రాసేసిన పార్ట్ డిలీట్ చేస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మురళీ గారూ కొంచం...కాదు కాదు కొంచం ఎక్కువే ఈర్ష్యగా వుంది మీ బాల్యం చూస్తోంటే (చదువుతోంటే). ఎంత మంచి పేరు పెట్టారండీ గేద్దూడకి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఎండీ ఇదేం బాలేదండి. ఏదో వర్క్ తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి మీ బ్లాగ్ చూసా! అంతే అతుక్కుపోయా! రోజూ మీ బ్లాగు చదివి పని పూర్తి చేసుకుని వెళ్ళేటప్పటికి పోద్దుగునికి పోతోంది. ఇంత బాగా రాస్తే ఎలా అండి... ఆయ్!!!
  అదృష్టం కొద్దీ నాకు కూడా ఈ అనుభవం ఉందండి. మాకు అన్నీ ఆవులే ఉండేవి ఆవు ఈనడం చుస్తే మంచిదని మా అమ్మ నన్ను పని గట్టుకుని పంపేది అంతే అప్పటి నుంచి దూడ బయటికి వచ్చేవరకు వేచి చూడడం తర్వాత రాత్రిళ్ళు ఆవు మాయ వేసే వరకు తాతయ్యతో పాటు కూర్చుని దాన్ని దూరం గా పట్టుకెళ్ళి చెట్టుకు కట్టడం చేయడం. అంతే కాదు తర్వాత జున్నుని అందరికి పంచడం అంతా ఒక 4 రోజుల పాటు సరిపోయేది...
  ఓహ్ ఏమి అనుకోకండి ఇంత రాసేనని ! ఏదో అలా సాగిపోయింది ఆ సంగతులు గుర్తొచ్చి ....

  ప్రత్యుత్తరంతొలగించు
 15. మీ బుజ్జి తువ్వాయి స్వాతి చాలా బాగుందండి. శ్రీదేవి వసంత కోకిలలో కుక్కపిల్లకి సుబ్రహ్మణ్యం పేరు పెట్టటం గుర్తుకొచ్చింది. చెంగు చెంగు న గెంతే ఆ స్వాతితో ఎంత బాగా ఆడుకున్నారో, ఆ గుర్తులని ఎంతగా అభిమానానించారో కదా! అందుకే మీకు మళ్ళీ కనిపించి దిగులు తీర్చేసింది. ఈ బుజ్జమ్మ ఫొటోలు గూగులమ్మ ఫొటోలని మాత్రం దయచేసి చెప్పకండి. నాకు మాత్రం బుజ్జి మురళి చిన్నారి నేస్తంగానే ఉంది మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మీ స్వాతి కబుర్లు బాగున్నాయండి . ఫొటోలలో తెగ ముద్దొచ్చేస్తొంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ఈరోజు ఈనేస్తాదిరా అనిమావయ్య చెప్పాడంటే
  దానిముందు కుడితితొట్టిమీద గొంతుక్కూచుని ఆ..అని నోరుతెరిచి చూస్తూఉండె స్టిల్ ఇప్పటికీ ఇంట్లో గుర్తుకు తెచ్చుకుని తవ్వుతుంటారు.
  గ్లాసులో కాఫీపక్కన పెట్టుకుని తాగుతూ మూతి తుడుచుకోవడం కూడా మర్చిపోయేవాడిని.అమ్మమ్మ వచ్చి తుడిచెల్లేది. ఎవరైనా చిన్నపిల్లలని కుర్రదూడ(మగ), పడ్డదూడ(ఆడది) అనిపిలిచేటోళ్ళం. అబ్బా అన్నీగుర్తొచ్చేశాయి.
  ఇక జున్నయితే చెప్పనక్కర్లా. ఇప్పటికీ నేనున్నచోట లోకల్‌వాళ్ళని అడిగిపెడతా. ఎక్కడైనా దొరికితే తెచ్చిస్తారు. ఇంకాచాలారాయలి. :(

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఈసారి మీ జ్ఞాపకాలలో మమ్మల్ని కూడా స్వాతితో పాటు చెంగుచెంగున దూకించారుగా! చాలా బావున్నాయి మీ స్వాతి కబుర్లు... జయగారు అన్నట్టు ఆ ఫోటోలు స్వాతివే అయి ఉంటాయనిపిస్తోంది.. మురళి గారి ఫ్రెండ్ పోలికలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి మరి :))

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మీ హెడ్ మాస్టర్ మీద చాల కోపం వచ్చింది .... బాధగా అన్పించినది .

  ప్రత్యుత్తరంతొలగించు
 20. చాలా బాగా రాసారు. అటువంటి బాల్యం నాకు లేదుగా:(

  ప్రత్యుత్తరంతొలగించు
 21. మళ్ళీ ఆరోజులు రీళ్ళు రీళ్ళులా కళ్ళముంది మెదిలాయి సోదరా.
  మిరియాలు బెల్లం వేసిన జున్ను.
  వానలు పడే రోజులు
  ఎర్రటి నీళ్ళు
  తడిసిముద్దైన మట్టిగోడలు
  జమ్ముపుల్లల్లోంచి కారే నీటి బొట్లు

  ప్రత్యుత్తరంతొలగించు
 22. అచ్చం స్వాతి ఇలానే ఉంటుందేమో అన్నంత ముద్దుగా ఉంది మొదటి ఫోటోలో ఉన్న బుజ్జి గేద్దూడ. అందుకే దానికి నా ముద్దులు. అది మీ వద్దనే ఉండుంటే ఇంకెన్ని అనుభూతులు మీ సొంతమయ్యేవో...ప్చ్..ఈ విషయంలో మీ హెడ్మాష్టర్ మీద నాకు పీకల దాక కోపం వచ్చింది. అబ్బబ్బ..ఇలాంటి మెమొరీస్ లోకి వెళ్ళిపోతే ఓ పట్టాన ఇటువైపు రాబుద్ది కాదు...అంత బలంగా మనసుని దోచుకుంటాయి...ఎనీవేస్ ఇంకోసారి స్వాతి గాడికి నా ముద్దులు...

  ప్రత్యుత్తరంతొలగించు
 23. మీ"స్వాతి "అంటే ఏమా కథ అనుకుంటూ చదివానండీ ...ఈ స్వాతీ బావుంది మీ జ్ఞాపకాల్లాగే ...జున్ను ...భలే గుర్తుచేశారు.గేదె ఈనితే కారేజీ గిన్నెల్లో వండి తెలిసిన వాళ్ళందరికీ పంపించేవారు మా అత్తమ్మగారు !నాక్కూడా భలే ఇష్టమండీ బాబూ ....ఇప్పుడు గుర్తుచేశారు నాకు !
  నాగురించి మావారొక సామెత చెప్తారు "తేగలా ఉన్నాడు పిల్లోడంటే తెగ కావాలన్నాడంట "అని :) :) ఇప్పుడు అర్ధమైందాండి ...మీరెంత పని చేశారో ...:) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 24. నిషిగంధ గారు చంపేశారండి బాబోయ్! స్వాతి గారు మురళి గారి నేస్తం అన్నాను గాని పోలికలు నాకేం తెలుసండి. ఇప్పుడు మురళి గారు నన్నేమన్న అంటే మాత్రం మీరే బాధ్యులు. దేవుడా! దేవుడా!

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @చిన్న: మేము చిన్న దూడల మీద విహరించే వాళ్ళం కాదండీ.. అప్పటి నా పర్సనాలిటీని అవి మోయలేవన్నది ఒక కారణం కావొచ్చు :) ..ధన్యవాదాలు.
  @భావన: మా స్వాతి నచ్చినందుకు ధన్యవాదాలండీ.
  @మా ఊరు: అప్పుడే ఇండియా రావడం, వెళ్ళడం కూడా అయిపోయిందా..?!! మరి ఊరి కబుర్లతో టపాలేవండీ?? ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @మధురవాణి: స్వాతి తో పాటు మా ఊరంతా చూసేశారన్న మాట!! ..ధన్యవాదాలండీ..
  @ఫణి యలమంచిలి: దాదాపు అందరి ఇళ్ళలోనూ ఇలాగే ఉంటుందండీ.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 27. @లక్ష్మి నరేష్: అయితే మీకు మొత్తం దృశ్యం కనిపించి ఉండాలి!! ..ధన్యవాదాలు.
  @వల్లి దత్తా: లేదండీ, గుర్తు పడతాయి.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: బహుశా 'డేగిశా' నే కరెక్టై ఉండొచ్చండీ.. మా ఇంట్లో 'డేశా' గా మారిపోయి ఉంటుంది. 'ముక్కాలి పీట' 'మొక్కల పీట' అయినట్టు!! నాకు బాగా నచ్చేది మా ఊరి జున్నేనండీ.. "వాటికి గుర్తుపట్టడానికి బంధుమూర్తి అవసరంలేదు కదూ.." ఎక్కడో తగిలింది నాకు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @వాసు: ధన్యవాదాలండీ..
  @శ్రీకర్ బాబు: ఇలాంటివే కాకపోయినా గుర్తు చేసుకుంటే మీకూ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదండీ.. ధన్యవాదాలు.
  @సునీత: అయ్యో.. మీరు డిలీట్ చేయకండి.. అమ్మాయి ఏమనుకుందో మేమందరం చదవాలి.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 29. @బోనగిరి: ధన్యవాదాలండీ..
  @ప్రణీత స్వాతి: అబ్బే.. నాదేమీ లేదండీ.. ఏ శతభిషం నక్షత్రమో అయితే 'శతభిషం' ని పెట్టేసే వాడినేమో :-) ..ధన్యవాదాలు.
  @వీరేంద్ర సుంకవల్లి: ఆయ్.. మీరేటండీ.. బ్లాక్కి పేరెట్టి ఒదిలేశారు? తవరి సంగతులు ఎప్పుడు రాస్తారని.. ఆయ్?? ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 30. @జయ: అలాగేనండీ.. గప్ చుప్.. మిమ్మల్ని ఎందుకంటానండీ.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ధన్యవాదాలండీ..
  @సుబ్రహ్మణ్య చైతన్య: త్వరలో 'స్వర్ణముఖి' లో చదవబోతున్నామన్న మాట!! ..ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 31. @నిషిగంధ: "మురళి గారి ఫ్రెండ్ పోలికలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి" .. అయ్యో.. ఫ్రెండ్ పోలికలు కాదండీ.. మేమిద్దరం ఒకటే పోలిక.. అప్పట్లో మా ఇద్దర్నీ చూసి అందరూ 'కవల పిల్లలా..?' అని అడిగే వాళ్ళు :-) :-) ...ధన్యవాదాలండీ.
  @అనఘ: ఆయనకీ తెలీదు కదండీ, మేమింత ఇష్టంగా పెంచుకున్నామని.. ఆయన నోరు తెరిచి అడిగాక కాదనడం బాగోదని నాన్నగారు చెప్పలేదు.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ఉండి ఉంటే మరిన్ని కవితలు అల్లేసే వారుగా!! ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. @భాస్కర్ రామరాజు: వానల గురించి ఇంకా బోల్డన్ని కబుర్లు ఉన్నాయండీ, నేను చెప్పాల్సినవి కూడా.. ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: మీ ముద్దులు అందజేశానండి.. హెడ్మాష్టారికి తెలీదు కదండీ, మాకూ స్వాతికీ ఉన్న అనుబంధం.. ఆయన కావాలని చేసింది కాదు కదా.. ఆయన కూడా చాలా గారంగానే పెంచుకున్నారు.. ధన్యవాదాలండీ..
  @పరిమళం: దయచేసి మీ వారికి నా బ్లాగు గురించి చెప్పకండి :-) :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. చాలా బాగుంది మురళి గారు. టపా, ఫోటోలు బోలెడన్ని ఙ్ఞాపకాలను కదిలించాయి. మిరియాలు వేసి చేసిన జున్ను వాహ్ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 34. calf ki "Swathi" ane peru pedatharani vinadam ide first time !!you hvae wonderful childhood memories to cherish for a life time.I remember "malgudi days" stories when I read your childhood stories.

  Annattu,naa peru story same to same. nenu swathi nakshatram lo puttanani aa peru pettaru.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. ""ఆయ్.. మీరేటండీ.. బ్లాక్కి పేరెట్టి ఒదిలేశారు? తవరి సంగతులు ఎప్పుడు రాస్తారని.. ఆయ్?? ..ధన్యవాదాలండీ..""

  మీ బ్లాగు చూశాక నేను ఏమైనా రాయాలంటే ఏదో తెలీని భయం వేస్తోంది అండి. అందుకే మొదలు పెట్టలేక పోతున్నా :(

  ప్రత్యుత్తరంతొలగించు
 36. @వేణూ శ్రీకాంత్: ఓహ్.. మీకూ జున్ను ఇష్టమేనా? ..ధన్యవాదాలండీ..
  @స్వాతి: 'మాల్గుడి' హమ్మో.. చాలా పెద్ద పోలికండీ.. మంచి పేరున్న నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి పెట్టడానికి వేరే పేరు కోసం వెతుక్కోనసవరం లేదు కదండీ :-) ..ధన్యవాదాలు.
  @వీరేంద్ర సుంకవల్లి: బలేటోరే.. అలాగంటే ఎలాగండీ బాబో.. తవరు రాయాల, మేం సదవాల.. ఆయ్.. ఈసారికిల్లా కానిచ్చెయ్యండి మరి..

  ప్రత్యుత్తరంతొలగించు
 37. బాగున్నాయండీ మీ స్వాతి కబుర్లు.
  "మనుషులు మర్చిపోయినా, మూగజీవం మరచిపోదు".....నిజం!!

  ప్రత్యుత్తరంతొలగించు