బుధవారం, ఫిబ్రవరి 03, 2010

నెత్తురోడని గాయం

మనకి తగిలే గాయాలు రెండు రకాలు. శరీరానికి తగిలేవి, మనసుకి తగిలేవి. శరీరానికి తగిలే గాయాలకి చికిత్స ఉంది. కొన్నాళ్ళు బాధ పడ్డా మచ్చతో సహా మాయం చేసుకునే వైద్య సౌకర్యం ఉంది. శరీరంలో సున్నిత భాగాలకి తగిలిన గాయం నయమవ్వడానికి కొంచం ఎక్కువ సమయం పట్టొచ్చు, కానీ నయమవ్వక పోదు. ఇందుకు విరుద్ధంగా మనసుకి తగిలిన గాయం ఎవ్వరికీ కనిపించదు. నయం చేసే వైద్యం ఏదీ ఇప్పటివరకూ అందుబాటులో లేదు.

శరీరానికి తగిలే గాయాన్ని చూసి, గాయం తీవ్రతని, నయమవ్వడానికి పట్టే సమయాన్ని, అందించాల్సిన చికిత్సనీ అంచనా వేయొచ్చు. కానీ మనసుకి తగిలిన దెబ్బ తీవ్రత యెంతో గాయపడ్డ వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. శరీరంలో మిగిలిన ప్రాంతాల్లో తగిలే గాయం కన్నా, సున్నితమైన చోట తగిలే గాయం ఎక్కువగా బాధిస్తుంది. నయం కాడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

మనసంతా సున్నితమైనదే కాబట్టి ఎంత చిన్న దెబ్బైనా తీవ్రంగానే బాధిస్తుంది. అదే పెద్ద దెబ్బైతే..? వంశీ సినిమా 'సితార' లో 'సితార ఆత్మకథ' పుస్తకం త్వరలో విడుదల అన్న ప్రకటన పేపర్లో చూసి, 'సితార' గా భానుప్రియ అభినయం గుర్తుందా? మనసు గాయపడ్డానికి పరాకాష్ట ఆ సన్నివేశం. ఏమాటకామాటే చెప్పుకోవాలి, రెండో సినిమానే అయినా అద్భుతంగా అభినయించింది భానుప్రియ.

కొందరు అదృష్టవంతులు ఉంటారు. వాళ్ళ మనసు రాటుదేలిపోయి ఉంటుంది. ఎలాంటి గాయమూ వాళ్ళ మనసుని చలింపజేయదు. ఇంకొందరు దురదృష్టవంతులు.. ఎన్ని దెబ్బలు తగిలినా వీళ్ళ మనసులు గట్టిపడవు. పైగా మనసు గాయ పడ్డ ప్రతిసారీ పాతగాయాలు రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడే మరుపనేది లేకపోవడమో, తక్కువగా ఉండడమో అన్నది బాధ పడాల్సిన విషయం అని తెలుస్తూ ఉంటుంది.

మనకెంతో ప్రియమైన వ్యక్తి నుంచి మనమో గాజుబొమ్మని కానుకగా అందుకున్నాం అనుకుందాం. మన మిత్రులొకరు ఆ బొమ్మని పరిశీలనగా చూడాలనే కుతూహలంతో అందుకుని చేయి జార్చారనుకుందాం. అదృష్టమో, దురదృష్టమో ఆ బొమ్మ పగిలిపోలేదు. కానీ బీట తీసింది. అది మనకి కానుకిచ్చిన వ్యక్తి కంట పడింది. మనం చేయగలిగింది ఏమిటి?

మచ్చలేకుండా బీటని అతకగలిగే సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, మనసుకి తగిలిన గాయాలని మరక కూడా మిగల్చకుండా పూర్తిగా రూపుమాపగలిగే సాధనమేదీ కూడా ఇంకా కనుగొనబడినట్టు లేదు. కొన్ని సమస్యలకి కాలం మాత్రమే జవాబు చెప్పగలదు. మనం చేయగలిగేదల్లా వేచి చూడడమే.

19 వ్యాఖ్యలు:

 1. ఆ దురదృష్టవంతులలో ముందు ప్లేస్ నాదే-:):) ఇంత బరువుగా రాస్తే వేళాకోళంగా వుందా అని కోపగించుకోకండీ ,ఏదో మిమ్మల్ని లైట్ చేద్దామని .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిజమేనండీ మనసుకి తగిలే గాయాన్ని మాన్పగల వైద్యం ఇంకా రాలేదు కాని మనం చిరునవ్వులేపనం పూసి ధైర్యమనే బాన్డేజ్ తో ఫస్ట్-ఎయిడ్ చేసుకోగలిగితే ఆ తర్వాత కాలమనే వైద్యుడు మాన్పగలిగే ప్రయత్నం చేస్తాడేమో ...ఒకవేళ పూర్తిగా కాకపోయినా ...చాలావరకూ !మంచిటపా ...బావుందండీ !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను దేనినీ మరువలేక పోవటము అందరూ అదృష్టము అంటారు కాని , నాకైతే ఎంత దురదృష్టము అనిపిస్తుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మనసుకైన గాయానికి కాలమే మందని ఎంత చక్కగా చెప్పారండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బాగుందండి. ఆత్రేయ గారన్నట్లు ’గాయమైతే మాసి పోదు పగిలి పోతే అతుకు పడదు.. మనసు గతి అంతే మనిషి బ్రతుకింతే’ అని. కాలానికి వదిలి వేయటమే మన పని.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. "మనసుకి తగిలిన గాయం ఎవ్వరికీ కనిపించదు. నయం చేసే వైద్యం ఏదీ ఇప్పటివరకూ అందుబాటులో లేదు."

  ఇది పాత మాట. ఇప్పుడు చాలా చికిత్సలూ, మందులూ, విధానాలూ అందుబాటులో వున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఒకరికిస్తే మరలిరాదు,
  ఓడిపోతే మరిచిపోదు,
  గాయమైతే మాసిపోదూ,
  పగిలిపోతే అతుకుపడదూ...
  మనసు గతి ఇంతే,మనిషి బ్రతుకింతే,
  మనసున్న మనిషికీ సుఖము లేదంతేఏఏఏ...
  (ఆత్రేయ గారికి మనస్సులతో)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అవును నిజంగా మనసుకు తగిలిన గాయం నెత్తురోడనిది...అందుకేనేమో ఆ పెయిన్ చాలా ఎక్కువ కాలం ఉంటుంది...
  @చిన్నిగారు,
  మీరు చెప్పిన లిస్టులో రెండో ప్లేస్లో నా పేరు ఉంది..చూడలేదా? :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఎన్నిసార్లు, ఎంతలా గాయపడి ఉంటే మనసు రాటుదేలిపోయుంటుందోనండి ఆ అదృష్టవంతులకి. బాగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ పోస్ట్ చదువుతుంటే....."తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా, మనసుకొక్క గాయమైనా" అనే పాట గుర్తుకొచ్చిందండి!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నాది భావనగారి మాటే...
  ’గాయమైతే మాసి పోదు పగిలి పోతే అతుకు పడదు.. మనసు గతి అంతే మనిషి బ్రతుకింతే’

  ఒకరి ముఖంలో పైకి కనిపించే నవ్వు వెనక... ఎన్ని కనపడని గాయాలు ఉన్నాయో ఇన్కెవ్వరికీ తెలీదు!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మురళీ, టైటిల్ తో సహా ఈసారి టపా ఇంత బరువుగా ఉందేంటండి :( ఎప్పుడూ ఆశావహమైన టపాలు రాసే మీరు ఒక్కసారిగా ఫిలాసఫీలోకి వెళ్ళిపోయారేమిటో?! దొరికిందే సందని మన మిత్రులందరూ 'మనసు ' పాటలు గుర్తు చేసేసుకుంటున్నారు చూడండి! :-)

  ఈ సందర్భంలో ఒకసారి మావారు నామీద వేసిన జోక్ చెప్పాలి (పాతదే అనుకోండి).. ఒకరోజు, "భయంకరంగా తల నొప్పి ఉందండీ" అంటే ఆయన నావంక సీరియస్ గా చూసి, "నీకు తలనొప్పి రావడమేమిటి మరీను.. తల ఉన్నవాళ్ళకి కదా తలనొప్పి వచ్చేది " అనేసి తెగ నవ్వేసుకున్నారు.. తర్వాత జరిగిన పరిణామాల గురించి చెప్పడం అనవసరం కానీ విషయం ఏమిటంటే మనసంటూ ఉంటే అది గాయపడక మానదు.. శరీరానికి తగిలిన గాయాన్ని కేవలం దాని తీవ్రత అంచనా వేసేసి వదిలేయం కదా.. నయం చేసుకోవాలని ఆయింట్మెంట్లుపూస్తాం.. బ్యాండేజీలు కడతాం.. మందులు మింగుతాం.. మనసు విషయమూ అంతే! ఆ బాధ తీవ్రత మనకు తెలుసు కాబట్టే భారం అంతా కాలం మీదే వదిలేయకుండా ఉపశమన చర్యలు తీసుకోక తప్పదు! ఇక్కడ కాస్త తల వెనక్కి వాల్చి, కళ్ళు మూసుకుని "ఆగదు ఏ నిమిషము నీ కోసము..." పాట వేసుకోండి :))

  ప్రత్యుత్తరంతొలగించు
 13. చెప్పడం మర్చాను, మీ కొత్త చొక్కా చాలా బావుందండి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @శేఖర్
  మీది రెండో ప్లేస్ ఏంటి .....మొదటి ప్లేస్ కోసం నాతో కొట్లాడుతారనుకుంటే -:)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. హుం చాలా బరువుగా ఉందండీ టపా...

  నిజమే కొన్ని సమస్యలకు కాలం మాత్రమే జవాబు చెప్పగలదు. దానికోసం వేచి చూస్తూనే, మన మనసుకు తగిలిన గాయం బయటికి కనిపించదు కనుక మనమే వైద్యుని అవతారం ఎత్తి, గాయం పై మరుపు అనే లేపనాన్ని పూసి, నవ్వు అనే టానిక్ తాగేసి, గాయామవడానికి కారణం/కారకుల ను అర్ధం చేసుకుని ఆపై క్షమ అనే కట్టు కట్టి చికిత్స చేసుకునే ప్రయత్నం చేయాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మురళిగారూ,
  బాగా రాశారు. మీ బాధ అర్థం చేసుకోగలుగుతున్నాను. మిత్రుల నుంచి స్పందన కూడా ఓదార్చేలా ఉంది.

  టపా మళ్ళీ మళ్ళీ చదివాక ఒక మాట చెప్దామనుకుంటున్నాను. "గాజుబొమ్మ విలువ ఎంతైనా అది మనకు అమూల్యం కాబట్టి, అది ఎంతటి మిత్రులకైనా సరే, మొహమాటం లేకుండా అందకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే!ఒకసారి చేయి జారినా కష్టమే! బీట వేసినా బాధే!"

  మనసుకు తగిలే గాయాలు ఏ మనిషికీ కొత్త కాదు. కొందరు వ్యక్తపరిస్తే కొందరు ఓదార్పును కూడా భరించలేరు కాబట్టి అవ్యక్తంగా ఉంచుకుంటారు. శిశిర చెప్పినట్లు ఎన్నిసార్లు, ఎంతలా గాయపడి ఉంటే మనసు రాటుదేలిపోయుంటుందో!

  నా వరకూ కొన్ని విషయాల్లో నేను నేర్చుకున్న పాఠమేమిటంటే పరిస్థితుల్ని భూతద్దంలోంచి చూసి బెంబేలు పడకుండా చూసీ చూడనట్లు వదిలేయడం. అప్పుడు వాటిని మనల్ని భయపెట్టే ధైర్యం ఉండదు. సమస్య దానికదే పరిష్కారం అయిపోతుంది.

  మీరు కోరుకున్నట్లే జరగాలని ఆశిస్తున్నాను(ఏదైనా సమస్య మీద ఈ టపా రాసి ఉంటే )!

  ప్రత్యుత్తరంతొలగించు
 17. నా రెండు పైసలు

  "గాయాన్నైన మాన నీవు
  హృదయాన్నైనా వీడి పోవు
  కాలం నాకు సాయం రాదు
  మరణం నన్ను చేర నీదు"

  @ నిషిగంధా - శరీరానికి తగిలిన గాయాన్ని.... నయం చేసుకోవాలని .... మందులు మింగుతాం.. మనసు విషయమూ అంతే!

  అంటే ..
  "శరీరానికి గాయాలైతే మందు ఉంది
  మనసుకు గాయాలైనా మందే (:D) ఉంది"  -- వాసు

  ప్రత్యుత్తరంతొలగించు
 18. మురళి గారు ,
  మనసు గాయానికి కాలమే అసలైన మందు ,ఇంకా త్వరగా తగ్గటానికి ఈ రోజుల్లో మందులు ఉన్నాయి .మగవాళ్ళు ఎంతగాయన్నయిన తట్టుకుని బయటకు కనిపించరు (పలగాని ప్రభాకర్ లాంటి వాళ్ళుతక్కువ). అదే ఆడవారి మనసుగాయమయితే తట్టుకోలేరు,వాళ్ళు కోలుకోవడానికి చాల కాలం పడుతుంది .అవునంటారా!

  ప్రత్యుత్తరంతొలగించు
 19. స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. నేనిప్పుడు జరిగిపోయిన దానిని గురించి ఆలోచించడం లేదు.. ఆలోచించినా ప్రయోజనం లేదు కాబట్టి. నేను ఆలోచిస్తున్నది నా స్నేహితుడికీ, నాకూ మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చుకోడం ఎలా? మూడో వ్యక్తి మీద కోపంతో ఉన్న నా స్నేహితుడి వల్ల ఆ వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చేయడం ఎలా? అని మాత్రమే.. బహుశా ఇవి 'కాలం' మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్నలు. అందరికీ మరో మారు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు