శుక్రవారం, ఫిబ్రవరి 19, 2010

ప్రణతి..ప్రణతి..ప్రణతి...

నలుగురూ నడిచే దారిలో నడవడం సులభం.. కానీ ఓ కొత్త మార్గాన్ని వేయడం కష్టం. ఎన్నో ఆటుపోట్లని, కష్టనష్టాలనీ ఎదుర్కోవాలి. ఆత్మవిశ్వాసం తో పాటు, సాహసమూ కావాలి. అన్నింటికీ మించి నడుస్తున్న దారిమీద స్పష్టత ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కొత్త బాటలో ప్రయాణం సాధ్యమవుతుంది.. ఆ బాటలో ప్రయాణం చేసిన తొలి బాటసారి వెనుక వచ్చే వారికి మార్గదర్శి కాగలుగుతాడు. తెలుగు సినిమా గతిని మార్చి, తమకంటూ సొంత మార్గాన్ని నిర్మించుకుని తమదైన శైలిలో ప్రయాణం కొనసాగించిన అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరైన కాశీనాధుని విశ్వనాధ్ కి ఎనభయ్యో జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగు సినిమా పరిశ్రమలో సౌండ్ రికార్డింగ్ ఇంజనీర్ గా ప్రవేశించి, ఆదుర్తి దగ్గర శిష్యరికం చేసి, 'ఆత్మ గౌరవం' సినిమాతో దర్శకుడిగా మారిన విశ్వనాధ్ కెరీర్ తొలినాళ్ళలో తీసిన సినిమాల్లో చాలా వరకూ సాధారణ చిత్రాలే. దర్శకత్వం మొదలు పెట్టిన పుష్కర కాలం తర్వాత, ఇరవైరెండు సినిమాలు పూర్తి చేశాక, అప్పుడు చేపట్టగలిగారు తన మార్కు సినిమా. విశ్వనాధ్ సినిమాల్లో 'శంకరాభరణం' ని ఒక మైలు రాయిగా చెబుతారు చాలామంది. నిజానికి ఆయన సినిమాలని 'సిరిసిరిమువ్వ' కి ముందు 'సిరిసిరిమువ్వ' కి తర్వాత అని విభజించాలి. ఎందుకంటే 'సిరిసిరిమువ్వ' విజయం ఇచ్చిన ధైర్యమే 'శంకరాభరణం' కి పునాది వేసింది కాబట్టి.

ఇలా విభజించడంలో నా ఉద్దేశం 'సిరిసిరిమువ్వ' కి ముందు విశ్వనాధ్ మంచి సినిమాలు తీయలేదనీ, ఆ తర్వాత అన్నీ అద్భుతమైన సినిమాలే తీశారనీ ఎంత మాత్రమూ కాదు. కానీ తెలుగు సినిమాలో 'విశ్వనాధ్' శకం మొదలయ్యింది మాత్రం 'సిరిసిరిమువ్వ' తోనే. రొటీన్ కి భిన్నంగా సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆ సినిమా నిరూపిస్తే, అలాంటి వైవిధ్య భరితమైన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగా ముఖం వాచారో ఆ తర్వాతి సినిమాలు నిరూపించాయి. విశ్వనాధ్ సినిమాలో ఏముంటాయి? సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సంస్కారం.. అందుకేనేమో ఆయన సినిమాలు చాలా వరకూ ఆంగ్ల అక్షరం 'ఎస్' తోనే మొదలవుతాయి.విశ్వనాధ్ మెజారిటీ సినిమాల్లో పాత్రలు నేల మీదే నడుస్తాయి. నటుడు/హీరో ని పాత్ర డామినేట్ చేస్తుంది. నటీనటుల ఇమేజ్ కన్నా, పాత్ర బలమే సినిమాని నడిపిస్తుంది. తను సృష్టించిన పాత్రల మీద విశ్వనాధ్ కి యెంతో నమ్మకం. ఆ నమ్మకమే లేకపొతే టాప్ హీరోస్థాయిలో ఉన్న చిరంజీవి చేత చెప్పులు కుట్టే వ్యక్తి, పాలమ్ముకునే మాధవుడు పాత్రలు వేయించగలరా? జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ని జాలరిగా చూపించగలరా? సినిమా గ్రామర్ ని మార్చడమే కాకుండా, గ్లామర్ కీ కొత్త అర్ధం చెప్పారు విశ్వనాధ్. ఆయన సినిమాల్లో హీరోయిన్ ఇంటి పెరట్లో తులసికోటలా పవిత్రంగా కనిపిస్తుంది. చూడగలగాలే కానీ, కొత్త చిగుళ్ళు వేసే తులసి మొక్కలో ఎన్ని అందాలు??

విశ్వనాధ్ సినిమాల మీద వినిపించే తొలి విమర్శ 'బ్రాహ్మినికల్ మూవీస్' అని. బలంగా ఏర్పరిచేసుకున్న అభిప్రాయాలని మార్చడం కష్టం. నిజం చెప్పాలంటే విశ్వనాధ్ కులతత్వాన్ని సమర్ధించింది ఎక్కడ? జనాదరణ పొందిన ఆయన ఏ సినిమాలో నాయికా నాయకులు ఒకే కులానికి చెందిన వాళ్ళు? విమర్శ నిజమే అనుకున్నా, దానివల్ల సమాజానికి కలిగిన నష్టం ఎంత? ఏ రూపంలో జరిగింది? విశ్వనాధ్ సినిమాల్లో పొరపాట్లు ఉండవనీ, జరగలేదనీ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. 'స్వాతికిరణం' ముగింపు మార్చి ఉంటే సినిమా విజయవంతమై ఉండేది అంటారు చాలామంది. కానీ, అప్పుడు సినిమాకి అర్ధమే లేకుండా పోయేది. విశ్వనాధ్ మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు, 'స్వాతికిరణం' ఒక్కటీ ఒక ఎత్తు అనిపిస్తుంది నాకు.

విశ్వనాధ్ సినిమాల్లో 'సిరిమువ్వల సింహనాదం' ఇప్పటికీ విడుదలకి నోచుకోక పోగా, 'స్వాతిముత్యం' ఆస్కార్ అవార్డ్ కి నామినేషన్ గా పంపబడింది. తెలుగమ్మాయి జయప్రదని హిందీ పరిశ్రమ కి పరిచయం చేసింది విశ్వనాధుడే. విశ్వనాధ్ గత రెండు సినిమాలు 'చిన్నబ్బాయి' 'స్వరాభిషేకం' తీవ్రంగా నిరాశ పరిచాయి. తన పద్ధతికి భిన్నంగా 'చిన్నబ్బాయి' సినిమాని హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చేశారని అనిపించింది. కాగా, అప్పటికే నటుడిగా మారిన విశ్వనాధ్ 'స్వరాభిషేకం' లో తను పోషించిన ఇంటి పెద్ద పాత్ర మీద పెంచుకున్న మమకారం ఆ సినిమాకి చేటు చేసిందని అనిపిస్తుంది నాకు. గతం గతః అన్నారు కాబట్టి, భవిష్యత్తు వైపు చూద్దాం. రాబోతున్న 'సుమధురం' విశ్వనాధ్ కి మరో మైలురాయి సినిమా కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, విశ్వనాధ్ కి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు.

22 వ్యాఖ్యలు:

 1. బాగా వ్రాశారు. చాలా balanced గాఉంది మీ రచన. విశ్వనాధ్ గారు నటుడుగా తనవయసుకు తగినపాత్ర వేయకుండా శ్రీకాంత్ అన్నయ్యగా వేయటం ఏమాత్రం నప్పలేదు. అయితే, తెలుగుసినీ సంగీతాన్ని మహర్దశకు తీసుకువెళ్ళినందుకు తెలుగువారు ఆయనకు రుణపడిఉన్నాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కాశీనాధునివారికి జన్మదిన శుభాకాంక్షలు. సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సంస్కారంతో పాటు ఆయన సినిమాల్లో సామాజిక స్పృహ కూడా ఉంటుందనడానికి నిదర్శనం శుభలేఖ, సప్తపది సినిమాలు. ఆయనే కనుక కులతత్వాన్ని సమర్ధించేవారైతే సప్తపది లాంటి సినిమా తీసుండేవారు కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. విశ్వనాధ్ గారి డైరెక్షన్ అంటేనే క్లాసికల్ మూవీ అని నా అభిప్రాయం.ఇంక ఏ మూవీ అయినా పాటలు, నృత్యాలు ఐతే మనసుకి హత్తుకు పోతాయి.అసలు ఆయన ముఖమే ఆనందానికి నిలయం అనిపిస్తుంది.మురళీ గారు మీరు చాలా బాగా రాస్తున్నారు.

  సుధ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కాశీనాధుని విశ్వనాథునికి మీ బ్లాగ్ ద్వారా శుభాకాంక్షలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. విశ్వనాధ్ గారు తీసే ప్రతి సినిమాలోను సామాజిక స్పృహ తో పాటు లలితకళల ప్రాధాన్యత కూడా ఒక ముఖ్య అంశంగా ఉంటుంది. శంకరాభరణం, సిరివెన్నెల, స్వర్ణకమలం, సప్తపది, సిరిసిరిమువ్వ,స్వాతికిరణం అబ్బో ఎన్నని చెప్పగలం. ప్రతి సినిమా ఒక కళాఖండం. మీ వివరణ చాలా బాగుంది మురళి గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మొత్తానికి మీరు భలే గుర్తుపెట్టుకుని జన్మదినమని గుర్తుచేస్తున్నారు .విశ్వనాధునికి శుభాకాంక్షలు.రెండేళ్ళ క్రితం మా క్లబ్ వార్షికోత్సవానికి వచ్చినపుడు ఆయనతో కలసి బోల్డన్ని ఫోటోలు తీసుకున్నాను ,తీసిన నా స్నేహితులు ఇంతవరకు ఇవ్వనేలేదు -:)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సిరిసిరిమువ్వ గురించి చాలా బాగా చెప్పారు. నిజమే ఆయన పాత సినిమాలు కొన్ని చూసి ఇవి తను తీసిన సినిమాలేనా అని ఆశ్చర్యపోయిన సంథర్బాలున్నాయి. టపా చాలా బాగా రాశారు మురళి గారు.

  విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. గంధము పుయ్యరుగా,పన్నీరు గంధము పుయ్యరుగా,
  అందమయిన యదునందనుకై కుందరదన లిరువందన పరిమళ,
  గంధము పుయ్యరుగా,పన్నీరు గంధము పుయ్యరుగా,
  తిలకము దిద్దరుగా, కస్తూరి తిలకము దిద్దరుగా,
  తిలకము దిద్దరుగా, కస్తూరి తిలకము దిద్దరుగా,
  మాలిమితో ఆ విశ్వనాధునికి, మాలిమితో ఆ విశ్వనాధునికి
  శుభములతో మా అభినందన మందారమాలలుగా...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మురళీ గారూ " S " కి మీరిచ్చిన కొత్త అర్ధం బావుంది .
  విశ్వనాధ్ హీరోయిన్ ని పెరట్లో తులసి మొక్కతో పోల్చటం ఇంకా ఇంకా బావుంది.
  మొత్తానికి మీ టపా చాలా చాలా బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నిజమేనండి ఆయనసినిమాలను ,సిరిసిరిమువ్వకు ముందు సిరిసిరిమువ్వ తరువాత అని విభజించవచ్చు.దానితరువాతనుండి విశ్వనాధ్ గారికి ఇటువంటి సినిమాలను కూడా జనాలు ఆదరిస్తారని ధైర్యమొచ్చి ఉంటుంది . శంకరాభరణం కానీ,సప్తపదికానీ ,సాగరసంగమం ,స్వర్ణకమలం ఇటివంటి మంచి సినిమాలను ఆయన తప్ప ఎవరు తీయగలరు .ఆయ త్వరలోనే ఒక మంచి సినిమాను మనకందిస్తారని ఆశిస్తున్నాను .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. బాగా రాసారండి...ఆయన కొన్ని సినిమాలు నిజంగా కళాఖండాలు...ఎన్ని సార్లు వాటిని చూసిన అదేంటో కొంచెం కూడా బోర్ కొట్టదు. ఆయన నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. విశ్వనాద్ గారి సినిమా అంటే వేరే ఏమీ ఆలోచించకుండా చూసేస్తానండీ ...ఏవో ఈమధ్య వచ్చిన ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావి ఏవీ నన్ను నిరాశ పరచలేదు .హిట్టు ,ప్లాపులకతీతంగా చూడాలి ఆయన సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగిన అతి కొద్ది చిత్రాల్లో ఆయనవి ముందుంటాయి.కాస్త ఆలస్యంగాఅయినా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే అవకాశం మీనెమలికన్ను ద్వారా కలిగినందుకు ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నాకుమాత్రం ఆయన సినిమాల్లో బాగానచ్చేది సాగరసంగమం. నిజంగా అద్భుతమైన సినిమా అది. దాన్నిచూశాకే ఆయనసినిమాల్లో మిస్స్‌అయినవి పూర్తిచేశా. అందులో ఇన్విటేషన్‌లో తనపేరు చూసుకున్నాక ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లో కమల్‌కి పోటీగా నటించింది రాజమండ్రి అమ్మాయి. ఈసినిమా గురించి ఎప్పుడూ రాస్తారాఅనిచూస్తున్నా పోయినమేనెల నుంచి.

  ఇక స్వరాభిషేకంలో జంధ్యాలలేని లోటూ బాగాకనిపించింది. ముఖ్యమైనసీన్లలో పట్టులేక తేలిపోయాయి. అందులోనూ నటీనటులంతా విశ్వనాథ్‌పైన ఉన్న అపారగౌరవంవల్ల చొరవ తీసుకోలేదనిపించింది. అందరూ సబార్డినేట్స్ లాగా కనిపించారేతప్ప ప్రొఫెషనలిజం లేదు. ఇక ఆయన కారెక్టరు విషయానికొస్తే శుభసంకల్పంలో ఆయనచేసిన పాత్ర దీనికి ఉసిగొల్పి ఉంటుంది అనిపిస్తుందినాకు. శ్రీకాంత్‌కూడా పోటీపడలేకపోయాడు.
  ఈటపాకి మొదటవ్యాఖ్య రాసిందినేనే. కానీ ఎందుకో ఎర్రర్‌ వచ్చింది. నాబ్లాగులో బ్లాగ్మిత్రుల్లో పెట్టానుకదా. అక్కడ కనిపించింది. అప్పటికి కూడలిలోకూడా రాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నా అభిమాన దర్శకులలో ఒకరైన విశ్వనాథ్ గారి సినిమాల గురించి ఎంతైనా వ్రాయవచ్చు.
  ఆయన సినిమాలలో సంగీతం అద్భుతంగా ఉంటుంది. అది మహదేవన్ అయినా ఇళయరాజా అయినా.
  జంధ్యాల, మహదేవన్ లతో ఆయన కళాఖండాలు సృష్టించారు.
  ఎటువంటి నటుల చేతైనా తనకు కావలసినిది రాబట్టుకోవడంలో ఆయనని మించిన దర్శకుడు ఎవరూ ఉండరు.
  చాలా యేళ్ళ క్రితం ఒక కేరళ మిత్రుడు శంకరాభరణం పాటలు వింటుంటే తెలుగు పాటలు కదా నీకు అర్ధమవుతాయా అంటే సంగీతానికి భాషాభేదం లేదని చెప్పాడతను.
  నేను ఆయనకి ఎంత అభిమానినంటే మా అమ్మాయికి 'శ్రీ ప్రణతి' అని పేరు పెట్టుకున్నాను. మరో విధంగా కూడా ఆ పేరు కలిసిందనుకోండి.
  అదే కాదు మా అమ్మాయి పుట్టిన మర్నాడు నేను మా అమ్మాయికి పెట్టుకున్న ముద్దు పేరు 'లాలి'.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. బాగారాసారండి . ఫ్లాప్ ఐనా స్వాతికిరణం నాకు చాలా నచ్చిన సినిమా .

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @తెలుగు అభిమాని: నిజమేనండీ.. తండ్రీ కొడుకులు గా చేస్తే కొంచం బాగుండేది.. సంగీతం విషయంలో మీరు చెప్పింది నిజం.. ధన్యవాదాలు.
  @శిశిర: నిజమేనండీ.. కానీ ఎవరి వాదం వాళ్ళది.. ధన్యవాదాలు.
  @సుధ: ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకూ క్లాసికల్ మూవేసేనండీ.. స్పందనకి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
  @జయ: జాబితా చెప్పడం కష్టమనే నేనూ పేర్లు రాయలేదండీ :-) ..ధన్యవాదాలు.
  @చిన్ని: డెబ్భై, ఎనభై ఏళ్ళ గొప్ప వ్యక్తుల గురించి ఓసారి వెనక్కి తిరిగి చూస్తె వాళ్ళు సాధించింది కనిపిస్తుంది కదండీ.. అందుకని ఒకసారి తలచుకోవడం.. ఫోటోలు వచ్చాక బ్లాగులో పెడతారా? ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @వేణూ శ్రీకాంత్: నాకెప్పుడూ అనిపిస్తుందండీ, 'సిరిసిరిమువ్వ' విజయం సాధించాక పొతే మనకి 'విశ్వనాధ్ మార్కు' సినిమాలు దొరికేవా? అని.. అదే ఇక్కడ రాశాను.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: మీతో పాటు చేయి కలుపుతున్నామండీ, గంధము పూయడానికీ, తిలకము దిద్దడానికీ.. ధన్యవాదాలు.
  @లలిత: విశ్వనాధ్ గారి మీద మీకున్న అభిమానం మీ చేత ఇలా పలికించిందనీ, ఇక్కడ నేను కేవలం నిమిత్త మాత్రుడిని అనీ అర్ధం చేసుకుంటూ.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @రాధిక: 'అల్లరి' నరేష్, మంజరి జంటగా ఒక సినిమా తీస్తున్నారండీ.. షూటింగ్ జరుగుతోంది.. మనందరి కోరికా త్వరలోనే నెరవేర బోతోంది.. ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలండీ..
  @పరిమళం: నిజమేనండీ.. కుటుంబ సమేతంగా నిర్భయంగా చూడొచ్చు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. @సుబ్రహ్మణ్య చైతన్య: గత మే నుంచీ ఐదారు సార్లు చూశానండీ 'సాగర సంగమం' ..రాద్దామా అంటే "ఏం రాయాలి? ఒక్క టపాలో అవుతుందా?" అని ఆలోచన.. ఎప్పుడో ధైర్యం చేసేయాలి.. 'జంధ్యాల లేని లోటు..' నిజమేనండీ.. ఈసారి హరనాధ రావు చేత రాయిస్తున్నారు సంభాషణలు. విశ్వనాధ్ నటించడం లేదనుకుంటా కూడా.. మరో మంచి సినిమా కోసం ఎదురు చూద్దాం.. ధన్యవాదాలు.
  @బోనగిరి: చాలా చక్కని పేరు ఎంపిక చేశారండీ మీ అమ్మాయికి, అభినందనలు.. ఎవరైనా పేరు కోసం సలహా అడిగితే నేను విశ్వనాధ్ సినిమాల్లో పాటలన్నీ గుర్తు చేసుకుంటాను.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: చాలా గొప్ప సినిమా అండీ.. నాక్కూడా బాగా ఇష్టం.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. ఆ మధ్య విశ్వనాధ్ గారు తరిగొండ వెంగమాంబ మీద సినిమా తీస్తారని వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆయన తియ్యలేదు అది. ఇంకెవరో తీసినట్టు ఉన్నారు తరువాత.

  నాకైతే విశ్వనాధ్, బాపు వీళ్ళు సినిమాలు తియ్యకుండా ఉంటేనే బావుంటుంది. నాకు వీళ్ళంటే చాలా చాలా ఇష్టం. పట్టు కోల్పోతున్నా సినిమాలు తీసి అనవసరంగా అభిమానులని నిరాశ పరుస్తున్నారని పిస్తుంది. స్వరాభిషేకం సినిమా నిరాశ పరిచినా పాటలు అద్భుతంగా ఉంటాయి. ఇంక ఈ వయసులో ఆయన సుఖంగా విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది వచ్చిన ప్రతీ పాత్ర నటించకుండా.

  ఔను మురళిగారు మీరు కలిశారా విశ్వనాధ్ గారిని. నేనొకసారి కలిశా (చెర్మాస్ లో అనుకోండి) కానీ మాట్లాడలేదు సరిగ్గా. విశ్వనాధ్, వేటూరి, ఎస్ పీ బీ, సిరివెన్నెల - వీళ్ళని ఎప్పటికన్నా కలవాలని నా కల.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. @వాసు: విశ్వనాధ్ ని కలిసే అవకాశం రెండు సార్లు 'జస్ట్ మిస్' అండీ.. చూడాలి, ఎప్పటికైనా కుదురుతుందేమో.. 'స్వరాభిషేకం' చూశాక నాకూ అలాగే అనిపించింది కానీ 'సుమధురం' తెర వెనుక టీం బాగుందండీ.. మంచి సినిమా అవుతుందేమో.. ఎదురు చూద్దాం.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు